ఆరోగ్యకర జీవనానికి 4 మార్గాలు

ఆరోగ్యకర జీవనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 12 గంటలు ఏమీ తినకుండా ఉంటే ఆరోగ్యానికి మంచిది అని సిఫార్సు చేస్తున్నారు

ఈ రోజుల్లో అందరూ ఆరోగ్యం పట్ల ఆందోళనగా కనిపిస్తున్నారు. నగరాల నుంచి గ్రామాల వరకు ఆరోగ్యంపై చర్చ సాధారణం అయింది.

ఆరోగ్యకర జీవనానికి వ్యాయామం ఎంత ముఖ్యమో డైట్, సరైన దినచర్య కూడా అంతే ముఖ్యమని డాక్టర్లు చెబుతున్నారు.

డైట్, వ్యాయామం లాంటి అలవాట్లను మార్చుకోవడం కష్టం కావొచ్చు. కానీ, ఇందుకు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు (ఏప్రిల్ 7) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.

ఈ సందర్భంగా, మన జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండగలమో తెలుసుకుందాం.

ఆరోగ్యకర జీవనానికి ఆహారం, వ్యాయామం, నిద్ర, విశ్రాంతి అనే నాలుగు పునాదులు ఉన్నాయని 'ద పిల్లర్ ప్లాన్', 'ద స్ట్రెస్ సొల్యూషన్' రచయిత డాక్టర్ రంగన్ ఛటర్జీ చెప్పారు.

ఈ నాలుగు అంశాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మన జీవితాలు మెరుగవుతాయని ఆయన అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆరోగ్యకర జీవనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు మీకోసం కేటాయించుకోవాలి
తినే విధానంలో మార్పులు

ఆహారానికి సంబంధించి డాక్టర్ రంగన్ ఛటర్జీ చాలా సులభమైన మార్గాలు చెప్పారు.

డైట్‌లో మార్పులు చేయడం, లేదా తగ్గించడం మీకు కష్టంగా అనిపిస్తే, మీరు ఒక రోజులో తీసుకునే భోజనాన్ని కేవలం 12 గంటల వ్యవధిలో తినాలని ఆయన చెబుతున్నారు.

''కఠినంగా ఈ విధానాన్ని పాటిస్తే ప్రయోజనం ఉంటుందా? అంటే ఉంటుందని చెబుతా. కొందరికి ఇలా చేయడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఇది చాలా సులభమైన మార్పు. దీనివల్ల చాలా గణనీయ మార్పులు రావడం నేను చూశాను'' అని రంగన్ తెలిపారు.

స్ట్రెంత్ ట్రైనింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వారంలో రెండుసార్లు అయిదు నిమిషాలు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం మంచిది
వారంతో పది నిమిషాలు స్ట్రెంత్ ట్రైనింగ్

తీరికలేని పనుల కారణంగా జిమ్‌కు వెళ్లడం, రన్నింగ్ చేయడం వంటి పనులకు పెద్దగా సమయం దొరకదు.

వారానికి రెండుసార్లు అయిదు నిమిషాల చొప్పున స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే చాలా మంచి ప్రభావం ఉంటుందని డాక్టర్ రంగన్, ఆయన బృందం సూచించింది.

''స్ట్రెంత్ ట్రైనింగ్‌కు చాలా తక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అందరూ రన్నింగ్ చేయడం, కార్డియో గురించి మాట్లాడుతుంటారు. కానీ, కండరాలను పటిష్టం చేయడాన్ని విస్మరిస్తారు. వయస్సు పెరిగిన కొద్ది మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో కండరాలు నిర్ణయిస్తాయి'' అని డాక్టర్ రంగన్ చెప్పారు.

ఆరోగ్యంగా ఉండటంలో కండరాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

30 ఏళ్లు దాటిన తర్వాత, ప్రతీ పదేళ్లకు మన శరీరంలో 3 నుంచి 5 శాతం కండర క్షీణత జరుగుతుందని డాక్టర్ రంగన్ తెలిపారు.

50 ఏళ్ల వయసు తర్వాత ఇది మరింత పెరుగుతుందన్నారు.

మంచి నిద్రకు సూర్యకాంతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతిరోజూ ఎండలో కనీసం 20 నిమిషాలు గడిపితే ఉత్సాహంగా ఉంటారు
మంచి నిద్రకు సూర్యకాంతి

మనం నిద్ర విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాం.

కానీ, మంచి నిద్ర మన జీవితాన్ని, ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరుస్తుంది. అందుకే తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.

మంచి నిద్ర కోసం డాక్టర్ రంగన్ ఛటర్జీ వద్ద చాలా చిట్కాలు ఉన్నాయి.

కానీ, ఒక రోజులో మీకు సరిపడినంత ఎండ తగులుతుందా లేదా అన్న విషయాన్ని చాలామంది పట్టించుకోరని ఆయన అన్నారు.

మన జీవగడియారం సరిగ్గా పని చేయడానికి మన శరీరానికి రాత్రీపగలు వివిధ స్థాయిల్లో కాంతి తగలాలి.

''చాలామంది చీకటిగా ఉన్నప్పుడే ఇంట్లో నుంచి బయల్దేరతారు. రోజంతా ఆఫీసు లోపల కూర్చుంటారు. చీకటి పడ్డాక ఇళ్లకు తిరిగొస్తారు. కొందరు రాత్రిపూట ఆఫీసులకు వెళ్తారు. ప్రతీ వ్యక్తి రోజుకు కనీసం 20 నిమిషాలు ఎండలో గడిపితే ఉత్సాహంగా ఉంటారు'' అని ఆయన వివరించారు.

ఆహారంలో చిన్న మార్పులు చేసుకుంటే ఆరోగ్యం చాలా మెరుగవుతుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆహారంలో చిన్న మార్పులు చేసుకుంటే ఆరోగ్యం చాలా మెరుగవుతుంది
మీ కోసం సమయం కేటాయించుకుంటే ఒత్తిడి తగ్గుతుంది

మన రోజువారీ జీవితంలో ఒత్తిడి భాగమైంది. దురదృష్టవశాత్తూ, టెక్నాలజీ కూడా దీనికి కొంతవరకు కారణం.

''మీరు ప్రశాంతమైన, మంచి నిద్ర నుంచి మేల్కొంటారు. లేవగానే ఫోన్ అలారమ్ మోగుతుంది. చేతిలోకి ఫోన్ తీసుకోగానే ఇతర నోటిఫికేషన్లు వస్తుంటాయి. చాలామందికి రోజంతా ఫోన్ చేతుల్లోనే ఉంటుంది. రాత్రి నిద్రపోయే వరకు కూడా ఇలాగే సాగుతుంది. కళ్లు నీలిరంగు కాంతికి ప్రభావితం అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీకు విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఉండదు'' అని డాక్టర్ రంగన్ వివరించారు.

ఒక రోజులో కనీసం 15 నిమిషాలు మీ కోసం కేటాయించుకోవాలని ఆయన సూచిస్తున్నారు.

ఆ సమయంలో మీకు నచ్చే లేదా మీకు ఇష్టమైన ఏదైనా పని చేయాలని, ఫోన్ అస్సలు వాడొద్దని ఆయన సూచించారు.

ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు మొదలైంది?

ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుతారు.

ఆరోగ్యానికి సంబంధించిన కీలక సమస్యలు, హక్కుల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడమే దీని లక్ష్యం.

1948 ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఏర్పాటైంది.

ఈ కారణంగానే, 1950 నుంచి ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ప్రతీ ఏటా వివిధ థీమ్‌లతో డబ్ల్యూహెచ్‌వో ఈ దినోత్సవాన్ని జరుపుతుంది.

ఈసారి ' హెల్తీ బిగినింగ్, హోప్‌ఫుల్ ఫ్యూచర్' అనే థీమ్‌ను ఎంచుకుంది.

ఇది తల్లులు, నవజాత శిశువుల ఆరోగ్యం, భద్రతపై దృష్టి సారిస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)