పాంబన్-ధనుష్కోడి: 130 మంది ప్రయాణిస్తున్న రైలు సముద్రంలో ఎలా మునిగిపోయింది?

ఫొటో సోర్స్, Getty Images
60 ఏళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో ఏకంగా రైలు మొత్తం సముద్రంలో మునిగిపోయింది.
ఈ దుర్ఘటన మానవ తప్పిదం వల్ల జరగలేదు, ప్రకృతి విపత్తు కారణంగా సంభవించింది.
బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో అండమాన్‌కు దక్షిణాన తుపాను ఏర్పడే అవకాశం ఉందని 1964 డిసెంబర్ 15న వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే రోజు నుంచి బలమైన గాలులు వీచడం, వర్షాలు పడటం మొదలయ్యాయి.
తర్వాత, ఈ తుపాను దక్షిణ భారతదేశం వైపు కదిలింది. సరిగ్గా ఏడో రోజు అంటే డిసెంబర్ 22న తుపాను గంటకు 110 కి.మీ వేగంతో శ్రీలంక నుంచి భారత్‌ను సమీపించింది.

ఫొటో సోర్స్, Getty Images
దాదాపు గంటకు 200 కి.మీ వేగంతో తమిళనాడులోని పాంబన్ ద్వీపాన్ని తుపాను తాకింది. రాత్రికిరాత్రే తుపాను మరింత తీవ్రంగా మారింది.
కానీ, ఈ తుపాను తాకిడికి ముందే పాంబన్ ద్వీపంలోని ధనుష్కోడి రైల్వే స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారింది.
తుపాను హెచ్చరికల నేపథ్యంలో కొంతమంది ప్రజలు పాంబన్ ద్వీపాన్ని వదిలి వేరే ప్రాంతంలోని తమ ఇళ్లకు వెళుతుండగా, మరికొంతమంది పాంబన్‌లోని తమ ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు బయల్దేరారు.
అది1964వ సంవత్సరం. ఆ సమయంలో పాంబన్ ద్వీపం నుంచి తీర ప్రాంత నగరాలకు చేరుకోవడానికి రైలు తప్ప మరో రవాణా మార్గం లేదు.
తుపాను సూచన నేపథ్యంలో చాలా మంది ప్రజలు పగటి పూట రైలులో సముద్రాన్ని దాటారు.
కానీ, డిసెంబర్ 22వ తేదీ రాత్రి చివరి రైలును ఎక్కినవారికి కాసేపట్లో తమకు ఏం జరుగనుందనే దానిపై ఎలాంటి అవగాహన లేదు.

ఫొటో సోర్స్, Getty Images
సురక్షితం కాదన్న పాంబన్ బ్రిడ్జి ఆపరేటర్
పాంబన్ ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో కలిపే 2 కి.మీ పొడవైన ‘‘పాంబన్ వంతెన’’ను సముద్ర ప్రేమికులు ఇప్పటికీ ఎంతో ఇష్టపడతారు.
ఈ వంతెన పాంబన్ ద్వీపాన్ని తమిళనాడులోని మండపం రైల్వే స్టేషన్‌తో కలుపుతుంది.
ధనుష్కోడి నుంచి మండపం రైల్వేస్టేషన్‌కు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు పైలట్ రాత్రి 8:30 గంటలకు మండపం కంట్రోల్ రూమ్‌కు సందేశాన్ని పంపారు.
‘‘ధనుష్కోడి-రామేశ్వరం రోడ్ సెక్షన్‌లో విపరీతమైన దుమ్ముమేఘం కమ్ముకుంది. పట్టాలపై కూడా దట్టంగా దుమ్ము పేరుకుపోయింది. రైలు కదలడం కష్టంగా ఉంది’’ అంటూ ఆయన మండపం కంట్రోల్ రూమ్‌కు నివేదించారు.
పైలట్ సందేశం అందిన వెంటనే, బ్రిడ్జ్ ఇన్‌స్పెక్టర్ కొంత మంది సెయిలర్లతో కలిసి ఆ మార్గాన్ని క్లియర్ చేసేందుకు వెళ్లారు.
ఎందుకంటే పాంబన్-ధనుష్కోడి ప్యాసింజర్ రైలు రాత్రి పూట ఆ మార్గం గుండానే వెళ్లాల్సి ఉంది.
పాంబన్ బ్రిడ్జ్ ఆపరేటర్ రాత్రి 9 గంటల సమయంలో కంట్రోల్ రూమ్‌కు మరో సందేశాన్ని పంపారు. గంటకు 64 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయని, ఈ సమయంలో ప్యాసింజర్ రైళ్లు ప్రయాణించడం సురక్షితం కాదని అని ఆయన ఆ సందేశంలో చెప్పారు.
దీని తర్వాత అక్కడ గాలుల వేగం పెరగడంతో పాటు జోరున వర్షం మొదలైంది. అంతలోగా రాత్రి 11:10 గంటలకు ఆరు బోగీలున్న ప్యాసింజర్ రైలు దాదాపు 130 మంది ప్రయాణికులతో పాంబన్ రైల్వే స్టేషన్ నుంచి ధనుష్కోడికి బయల్దేరింది. అందులో 18 మంది రైల్వే సిబ్బంది కూడా ఉన్నారు.
ఆ రైలు షెడ్యూల్ సమయానికే రామేశ్వరం రోడ్ స్టేషన్‌కు చేరుకుంది. కానీ, సిగ్నల్ ఆలస్యం కావడంతో 15 నిమిషాలు లేటుగా బయల్దేరింది. తదుపరి స్టేషన్ ధనుష్కోడి.
ఆ రైలు ధనుష్కోడి రైల్వే స్టేషన్‌కు రాత్రి 12:30 గంటలకు చేరుకోవాల్సి ఉంది. ధనుష్కోడి స్టేషన్ సమీపంలోని క్యాబిన్‌లో ఉన్న రైల్వే సిబ్బంది ఆ రైలు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ, ఆ రైలు ఎప్పటికీ ధనుష్కోడికి చేరుకోలేదు.

ఫొటో సోర్స్, Getty Images
వర్షం కారణంగా వెదకడానికి ఎవరూ వెళ్లలేదు
రాత్రి 12:30 గంటల సమయంలో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ కారణంగా కంట్రోల్ రూమ్‌కు, రైలు సిగ్నల్ క్యాబిన్‌కు కమ్యూనికేషన్ తెగిపోయింది.
అప్పుడు పరిస్థితి అధ్వానంగా మారింది. ధనుష్కోడి రైల్వే స్టేషన్ నీట మునిగింది.
పైగా, షెడ్యూల్ సమయానికి రావాల్సిన రైలు ఇంకా స్టేషన్‌కు రాకపోవడంతో ప్రతికూల వాతావరణం కారణంగా ఆ రైలు తిరిగి రామేశ్వరం రోడ్ స్టేషన్‌కు వెళ్లి ఉంటుందని ధనుష్కోడి రైల్వే సిబ్బంది భావించారు.
రామేశ్వరం రోడ్ రైల్వే స్టేషన్ సిబ్బందేమో రైలు సురక్షితంగా ధనుష్కోడికి చేరి ఉంటుందనుకున్నారు.
బలమైన ఈదురు గాలులు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా ఈ రెండు రైల్వే స్టేషన్లకు చెందిన సిబ్బంది రైలు జాడ కనుక్కోవడానికి బయటకు వెళ్లలేకపోయారు. అలాగే తెల్లవారిపోయింది.
డిసెంబర్ 23న తుపాను కాస్త శాంతించింది. కానీ, ధనుష్కోడి దాదాపుగా స్తంభించిపోయింది.
రైలు జాడపై ఉదయాన రామేశ్వరం, ధనుష్కోడి స్టేషన్లకు చెందిన రైల్వే అధికారులు సంప్రదింపులు జరిపారు. రైలు ప్రయాణించిన దారి మొత్తం వెదికారు. కానీ, ఎక్కడా రైలు కనిపించలేదు.
ఆ దారి అంతటా సముద్రం ఉండటం, ఆ కాలంలో సముద్రంలో సహాయక చర్యలు చేపట్టడం దాదాపు అసాధ్యం కావడంతో రైలును కనిపెట్టడం పెద్ద సవాలుగా మారింది.
ఒక రోజు మొత్తం గడిచిపోయింది. కానీ, ఎక్కడా రైలు జాడ తెలియలేదు. అందులో 130 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
24 గంటల తర్వాత సముద్రంలో ఏదో కనిపించింది...
డిసెంబర్ 24వ తేదీకి తుపాను ప్రభావం పూర్తిగా తగ్గింది. కానీ, చుట్టూ ఎక్కడ చూసినా తుపాను సృష్టించిన విధ్వంసక దృశ్యాలే కనిపిస్తున్నాయి. వందల మంది చనిపోయారు. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఆ నగరం అంతా తుపాను విలయానికి బలైంది.
ఇంతలో రైల్వే ఉద్యోగి ఒకరు బీచ్‌లో ఏదో అనుమానాస్పద వస్తువును చూశారు. తుపాను కారణంగా ఎన్నో వస్తువులు నేలపై నుంచి ఎగురుతూ వెళ్లి సముద్రంలో కలిశాయి. కానీ, ఆ అనుమానాస్పద వస్తువును చూసిన వెంటనే ఆయనకు అదేంటో పూర్తిగా అర్థమైపోయింది.
వెంటనే తాను చూసిన విషయాన్నంతా ఆయన ఉన్నతాధికారులకు చెప్పారు. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అది కనిపించకుండాపోయిన రైలు భాగమని తేలింది.
అప్పటికే 24 గంటలు గడిచిపోయి ఉండటంతో ఆ రైలులో ప్రయాణించిన 130 మంది ప్రయాణికుల్లో ఒక్కరైనా ప్రాణాలతో ఉండి ఉంటారని నమ్మలేని పరిస్థితి.
రైలు శిథిలాలను గుర్తించిన తర్వాత, తుపాను కారణంగా రైలు మొత్తం సముద్రంలో బోల్తా కొట్టిందని, అందులో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని భావించారు.

ఫొటో సోర్స్, INDIAN EXPRESS
వారి ప్రాణాలను కాపాడగలిగేవారా?
ఆ రాత్రి రైలు బయల్దేరే ముందు పాంబన్-ధనుష్కోడి ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తున్న వారి సంఖ్యను లెక్కించే పనిని పాంబన్ రైల్వే స్టేషన్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్‌కు అప్పగించారు.
‘‘మామూలుగా రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్యను మేం లెక్కించం. కానీ, ఆ రోజు ఆ పని చేయమని మాకు చెప్పారు’’ అని దర్యాప్తు కమిటీకి స్టేషన్ మాస్టర్ చెప్పారు.
ఈ ఘటనపై దర్యాప్తు కమిటీని కేంద్ర రవాణ, విమానయానశాఖ ఏర్పాటు చేసింది.
‘‘ఆ రోజు ప్రయాణికుల సంఖ్యను ఎందుకు లెక్కపెట్టమన్నారంటే, ఒకవేళ ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటే రైలు రద్దు చేయాలని అనుకున్నారు’’ అని స్టేషన్ మాస్టర్ చెప్పారు.
కానీ, రైలు నడపడానికి తగిన సంఖ్యలో ప్రయాణికులు ఆ రైలులోని ఆరు బోగీల్లో ఎక్కారు.
ఈ విషాద ఘటనలో మరణించిన వారి సంఖ్య కచ్చితంగా ఎవరికీ తెలియదని దర్యాప్తు కమిటీ నివేదిక చెప్పింది. రైలులో ప్రయాణిస్తున్న 110 మంది ప్రయాణికులు, 18 మంది రైల్వే సిబ్బంది మరణించినట్లు నివేదికలో రాశారు.
‘‘సముద్రపు అలల్లో రైలు కొట్టుకుపోయింది’’ అని ఈ ప్రమాద ఘటన గురించి నివేదించారు.
ఈ ప్రమాదానికి ఎవర్నీ బాధ్యులుగా తేల్చకుండా, దీనిని ప్రకృతి విపత్తుగా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- రష్యా - యుక్రెయిన్ యుద్ధం: భారీ డ్యామ్ ధ్వంసం.. ప్రమాదంలో వేల మంది ప్రాణాలు
- చైనా 11 కి.మీ. లోతైన గొయ్యి తవ్వుతోంది, అక్కడ ఏముంది?
- ఒడిశా రైలు ప్రమాదం: ఒక అబ్బాయి శవాన్ని తమదే అంటున్న రెండు కుటుంబాలు.. ఎలా తేలుస్తారు?
- యాపిల్ - విజన్ ప్రో: కొత్తగా విడుదలైన ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్సెట్ ఎలా పని చేస్తుంది?
- యోగి ఆదిత్యనాథ్ 'యూపీ మోడల్' వచ్చే ఎన్నికల్లో బీజేపీని నడిపిస్తుందా... ఆయనే మోదీ వారసుడా?














