రైలు ప్రమాదాల్లో చనిపోయినా, గాయపడినా ఇన్సూరెన్స్ పొందడం ఎలా? 10 ప్రశ్నలు - సమాధానాలు

ఫొటో సోర్స్, ANI
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
విజయగనరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం తర్వాత, రైలు ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన ఇన్సూరెన్స్ మరోసారి చర్చలోకి వచ్చింది.
రైలు ప్రయాణాలకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?ప్రీమియం ఎంత చెల్లించాలి? ఏ సందర్భాల్లో ఇన్సూరెన్స్ వస్తుంది? ఎంత వస్తుంది?
పది పాయింట్లలో ఈ వివరాలు తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
1. ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి?
టికెట్ బుకింగ్ సమయంలోనే ఇన్సూరెన్స్ తీసుకోవాలి.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో టికెట్ బుక్ చేసుకునేప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఉంటుంది.
కన్ఫర్మ్ లేదా ఆర్ఏసీ టికెట్లకే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
ఈ ఇన్సూరెన్స్ పథకం కేవలం భారతీయ పౌరులకే వర్తిస్తుంది. విదేశీయులకు వర్తించదు.
బెర్త్ లేదా సీటు బుకింగ్ అవసరం లేకుండా ప్రయాణించే ఐదేళ్ల లోపు పిల్లలకు వర్తించదు.
2. ప్రీమియం అధికంగా ఉంటుందా?
టికెట్ ధరతోపాటు అదనంగా కేవలం 35 పైసలు చెల్లించాలి.
2021 నవంబరు 1 నుంచి ఈ ప్రీమియం అమలులో ఉంది.
ఒక పీఎన్ఆర్ సంఖ్య కింద ఎంత మంది ప్రయాణికులుంటే అంత మందికీ ప్రీమియం చెల్లించాలి.

ఫొటో సోర్స్, Getty Images
3. ఏ సందర్భాల్లో ఇన్సూరెన్స్ వస్తుంది? ఎంత వస్తుంది?
రైలు ప్రమాదాల్లో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రైల్వే బోర్డు 2023 సెప్టెంబరులో పది రెట్లు పెంచింది. ఈ మేరకు సెప్టెంబరు 18వ తేదీనే ఓ సర్క్యులర్ ఇచ్చినట్లు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. ఇది వెంటనే అమల్లోకి వచ్చింది. రైల్వే బోర్డు చివరిసారిగా 2012-13 సంవత్సరంలో పరిహారాన్ని పెంచింది. మళ్లీ పదేళ్ల తర్వాత ఆ పరిహారాన్ని సవరించింది.
సాధారణంగా ప్రమాదం జరిగిన నాలుగు నెలల్లోపు ఇన్సూరెన్స్ కంపెనీకి దరఖాస్తు చేసుకోవాలి.
బీమా సొమ్మును బాధిత కుటుంబానికి లేదా నామినీకి అందజేస్తారు.
పరిహారం చెల్లింపు ఇలా
కాపలాదారు ఉన్న (మ్యాన్డ్) లెవల్ క్రాసింగ్ వద్ద జరిగే ప్రమాదాలతోపాటు రైలు ప్రమాదాల్లో(1989 రైల్వే చట్టం సెక్షన్ 124 ప్రకారం) వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే, గతంలో రూ.50 వేల పరిహారం చెల్లించేవారు. దీన్ని రూ.5 లక్షలకు పెంచారు.
రైలు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడితే గతంలో రూ.25 వేలు ఇచ్చేవారు. అది రూ.2.5 లక్షలకు పెంచారు.
స్వల్ప గాయాలైతే రూ.5 వేలు ఇస్తుండగా, రూ.50 వేలకు పెంచారు.
అనుకోకుండా జరిగే ప్రమాదాలకు పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది.
‘‘ఉగ్రవాద దాడుల్లో బాధితులకు రూ.1.5 లక్షలు, హింసాత్మక ఘటనలకు గురైతే రూ.50 వేలు, దోపిడీకి గురైతే రూ.5 వేలు చొప్పున అందిస్తాం’’ అని రైల్వే శాఖ చెప్పింది.
‘‘ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసరంగా రూ.50 వేలు అందిస్తారు. మిగిలిన మొత్తాన్ని చెక్ లేదా ఆర్టీజీఎస్ లేదా నెఫ్ట్ లేదా ఇతర ఆన్‌లైన్ విధానాల్లో అందిస్తాం’’ అని రైల్వే శాఖ గత ఉత్తర్వుల్లో వివరించింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే రోజూవారీ పరిహారం
రైలు ప్రమాదాల్లో గాయపడి 30 రోజులకు మించి ఆసుపత్రిలో ఉంటే రోజుకు రూ.3 వేల చొప్పున పరిహారం అందిస్తారు. దీన్ని ప్రతి పది రోజులకోసారి లేదా డిశ్చార్జి అయ్యే సమయంలో అందిస్తారు.
అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే ఆరు నెలల కాలానికి రోజుకు రూ.1500 చొప్పున అందిస్తారు. దీన్ని పది రోజులకోసారి లేదా డిశ్చార్జి సమయంలో ఇస్తారు.
రోజూవారీ ప్రమాదాల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే, గరిష్ఠంగా ఐదు నెలల కాలానికి రోజుకు రూ.750 చొప్పున అందిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.
ఆయా ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు గరిష్ఠంగా 12 నెలల కాలానికి పరిహారం అందిస్తారు. గాయాల తీవ్రతను రైల్వే డాక్టర్ నిర్ధరించాల్సి ఉంటుంది.
కొన్ని అనుకోని పరిస్థితుల్లో జరిగే ప్రమాదాల బాధితులకు, ఇన్సూరెన్స్ తీసుకున్నారా, లేదా అనదానితో సంబంధం లేకుండా బీమా సొమ్మును రైల్వే శాఖ అందిస్తుంది.
ఒకవేళ నామినీ వివరాలు లేకపోతే, చట్టపరంగా ఎవరు అర్హులవుతారో వారికి చెల్లిస్తుంది.
4. ఇన్సూరెన్స్ పొందడానికి ఏం కావాలి?
ప్రయాణికులు ప్రమాదం జరిగిన తేదీల్లో కొనుగోలు చేసిన టికెట్ ఉంటే చాలు.
మృతదేహాన్ని సొంతూరికు తరలించడం లేదా అంత్యక్రియలకు ఖర్చుల కింద రూ. 10 వేలు అందిస్తారు.
ఆ సమయంలో ఎలాంటి పత్రాలూ చూపించాల్సిన అవసరం ఉండదు.
5. ఈ పాలసీ తీసుకోవడమెలా?
టికెట్ కన్ఫర్మ్ అయ్యాక ప్రయాణికులకు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి సమాచారం అందుతుంది.
వాళ్లు ఇచ్చే లింకును క్లిక్ చేసి నామినీ వివరాలు ఎంట్రీ చేయవచ్చు.
పాలసీ నెంబరు టికెట్ బుకింగ్ హిస్టరీలో కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
6. కేవలం రైలు ప్రమాదానికి గురైతేనే బీమా సొమ్ము చెల్లిస్తారా?
రైల్వే చట్టం 1989, సెక్షన్ 124లో ప్రమాదాలకు గురైనప్పుడు పరిహారం చెల్లించే అంశంపై సమాచారం ఉంది.
రైలు ప్రయాణంలో ఏదైనా అనుకోని ప్రమాదానికి గురై చనిపోతే పరిహారం చెల్లిస్తారు.
1994 ఆగస్టు 1వ తేదీన చట్టానికి కేంద్ర ప్రభుత్వం మరో సవరణ చేసింది.
దీని ప్రకారం, కేవలం ప్రమాదాలకు గురైనప్పుడే కాకుండా, మరికొన్ని సందర్భాల్లోనూ పరిహారం చెల్లించేందుకు వీలు కల్పించింది.
ఉగ్రవాద దాడి, హింసాత్మక ఘటనలు, దోపిడీలు, దొంగతనాలు, ఘర్షణలు, కాల్పుల వంటివి జరిగి ప్రయాణికులు చనిపోతే పరిహారం చెల్లిస్తారు.
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు లేదా రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ప్రమాదం లేక దాడి జరిగితేనే పరిహారం చెల్లించేందుకు వీలుంటుంది.
బుకింగ్ ఆఫీసు, వెయిటింగ్ హాలు, సామాన్లు పెట్టే గది, ప్లాట్ ఫారం వంటి ప్రదేశాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటే అందులో చనిపోయిన లేదా గాయపడిన ప్రయాణికులకు పరిహారం అందిస్తారు.
అలాగే 'వికల్ప్' పథకం కింద బుక్ చేసుకుని ఒక రైలుకు బదులుగా మరో రైలులో ప్రయాణించే ప్రయాణికులకూ వర్తిస్తుంది.
7. ఏ సందర్భాల్లో రైల్వే ఇన్సూరెన్స్ వర్తించదు?
సెక్షన్ 124-ఏ ప్రకారం కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు చనిపోయినా, పరిహారం చెల్లించేందుకు వీలుండదు.
ఒకే ప్రమాదంలో వేర్వేరు ప్రయోజనాలకు బీమా సొమ్ము ఇవ్వరు.
రైల్వే నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించి ప్రమాదానికి గురైతే పరిహారం ఇవ్వరు.
పట్టాలు దాటడం, ప్లాట్‌ఫామ్‌ల మధ్య దాటుకుని వెళ్లడం లాంటివి చేస్తూ ప్రమాదానికి గురైతే పరిహారం రాదు.
కాపలాదారులేని (అన్‌మ్యాన్డ్) క్రాసింగ్ వద్ద జరిగే ప్రమాదాలకు పరిహారం వర్తించదు.
రైల్వేలో ఉండే ఓవర్‌హెడ్ ఎక్విప్‌మెంట్ (ఓహెచ్ఈ) విద్యుత్తు వ్యవస్థ కారణంగా ప్రమాదానికి గురైతే పరిహారం ఇవ్వరు.
టికెట్ కన్ఫర్మ్ కాకుండా రైలు ప్రయాణం చేస్తూ ప్రమాదానికి గురైనా బీమా సొమ్ము ఇవ్వరు.
ప్రమాదం కాకుండా, ఆత్మహత్య చేసుకోవడం, స్వయంగా గాయపరుచుకోవడం, నేరపూరిత చర్యలకు పాల్పడటం, వ్యాధులతో చనిపోవడం జరిగితే పరిహారం ఇవ్వరు.
8. ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి?
రైల్వే చట్టం సెక్షన్ 125 ప్రకారం నాలుగు నెలల్లోపు ఇన్సూరెన్స్ కంపెనీకి దరఖాస్తు చేసుకోవాలి.
ప్రయాణికులు లేదా నామినీ లేక న్యాయపరమైన సంబధికులు దరఖాస్తు చేసుకోవచ్చు.
లిబర్టీ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యం ఉన్నట్లుగా ఐఆర్‌సీటీసీ చెబుతోంది.
ప్రయాణికులు టికెట్ బుకింగ్ సమయలో వచ్చిన ఎస్ఎంఎస్ ఆధారంగా ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం చెల్లింపు జరిగిందో తెలుసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
9. ఏ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి?
దరఖాస్తు సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీకి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలి.
ప్రమాదం జరిగినట్లుగా రైల్వే శాఖ అధికారులు ఇచ్చే నివేదిక, ప్రయాణికుడు చనిపోవడం లేదా గాయపడినట్లుగా చెప్పే నివేదిక సమర్పించాలి.
వీటితోపాటు, అదనపు ధ్రువీకరణపత్రాలు ఇవ్వాలి.
గాయాల పాలైన ప్రయాణికులు లేదా వారి తరపున బంధువులు లేక ఆధరైజడ్ ఏజెంట్ దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రమాదంలో వ్యక్తి చనిపోతే, అతనిపై ఆధారపడిన వ్యక్తి లేదా గార్డియన్ (మైనర్ అయితే ) దరఖాస్తు చేసుకోవాలి.
10. ఎప్పటిలోగా బీమా సొమ్ము అందుతుంది?
అన్ని డాక్యుమెంట్లు ఇచ్చిన తర్వాత 15 రోజుల్లోగా బీమా సొమ్మును ఇన్సూరెన్స్ కంపెనీ అందించాలి.
అయితే, రైలు ప్రమాదాల విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం రూపంలో భారీ మొత్తం వెళుతోంది. కానీ, క్లెయిమ్స్ మాత్రం ఏటా తక్కువగా కనిపిస్తున్నాయి.
ఎకనామిక్స్ టైమ్స్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం, మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ ఆర్‌టీఐ ద్వారా ఈ కింది సమాచారం సేకరించారు.
2018, 2019 సంవత్సరాలకు ఐఆర్‌సీటీసీ, ప్రయాణికుల నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలకు రూ.46.18 కోట్లు వెళ్లింది. క్లెయిమ్‌ల రూపంలో చెల్లించినది రూ.7 కోట్లు మాత్రమే.
ఇవి కూడా చదవండి:
- మేకప్ కిట్‌లో కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రలు, పెళ్లికి ముందు ప్రెగ్నెన్సీ టెస్టులు - ఏంటీ వివాదం?
- జీడిమెట్ల: ‘ఈ నీరు కింద పడితే నేల ఎర్రగా మారిపోతోంది’.. హైదరాబాద్ శివార్లలోని భూగర్భ జలాన్ని బీబీసీ టెస్ట్ చేయిస్తే బయటపడిన వాస్తవం ఇదీ
- రాహుల్ గాంధీ: భారతీయ నేతలపై ప్రవాస భారతీయులకు ఎందుకంత ఆసక్తి?
- తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు: పోరు గెలిచారు, పాలనలో గెలిచారా
- లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్...ఈ పదాల మధ్య తేడా ఏంటి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















