అశ్విని వైష్ణవ్: ఐఏఎస్ అధికారి నుంచి రైల్వే మంత్రిగా ఎలా ఎదిగారు? ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు ఎందుకు పట్టుపడుతున్నాయి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
బాలాసోర్ సమీపంలోని బహానాగ బజార్ స్టేషన్ ఒకే సమయంలో మూడు ట్రైన్‌లు ప్రమాదానికి గురైన ఘటనలో భారీ సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. వందలాది మంది గాయాలు పాలయ్యారు.
ప్రమాద స్థలాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని అసలు వదిలిపెట్టేది లేదని చెప్పారు.
కోల్‌కతా-చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్, మరో ట్రైన్ సర్. ఎం.విశ్వేశ్వరయ్య-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలుకి మధ్యలో బాలాసోర్‌లోని బహానాగ బజార్ రైల్వే స్టేషన్‌లో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం తర్వాత, భారతీయ రైల్వే భద్రతా వ్యవస్థపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దీంతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, TWITTER/ANILJAIN
ఐఏఎస్ అధికారి నుంచి రైల్వే మంత్రిగా ఎదిగిన అశ్విని వైష్ణవ్
ప్రస్తుతం నరేంద్ర మోదీ కేబినెట్‌లో ఉన్నత విద్యావంతుడిగా అశ్విని వైష్ణవ్‌కి మంచి పేరుంది.
మాజీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి జై శంకర్‌ను తన కొత్త కేబినెట్‌లోకి తీసుకుని 2019లో ప్రతి ఒక్కర్ని ఆశ్చర్యపరిచిన తర్వాత, 2021లో కేబినెట్ విస్తరణలో భాగంగా అశ్విని వైష్ణవ్ పేరును ప్రకటిస్తూ కూడా అలాగే అందరినీ ఆశ్చర్యపరిచారు ప్రధాని మోదీ.
1970 జూలై 18న జోధ్‌పూర్‌లో పుట్టిన అశ్విని వైష్ణవ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో జోధ్‌పూర్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పొందారు.
ఆ తర్వాత ఐఐటీ కాన్పూర్ నుంచి ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్‌లో తన ఎంటెక్ పూర్తిచేశారు.
అదే ఏడాది 1994లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా 27వ ర్యాంకు పొంది ఐఏఎస్ సర్వీస్‌కు ఎంపికయ్యారు.
భారతీయ సివిల్ సర్వీస్‌లో చేరిన తర్వాత, ఒడిశా పరిధిలో పలు విభాగాల్లో పనిచేశారు. బాలాసోర్ జిల్లా కలెక్టర్‌గా కూడా పనిచేసిన అనుభవం కూడా అశ్విని వైష్ణవ్‌కి ఉంది.
ఇదే స్థలంలో శుక్రవారం ఈ ఘోర రైలు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం తర్వాత ఘటన స్థలానికి వెళ్లిన అశ్విని వైష్ణవ్, సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు.
అశ్విని వైష్ణవ్ పనితీరును గుర్తించి, అప్పటి అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వంలో ప్రధాన మంత్రి కార్యాలయంలో ఆయన్ను నియమించారు.
2004లో జరిగిన ఎన్నికల్లో అటల్ బిహారి వాజ్‌పేయి ఓడిపోవడంతో, ఆయన ప్రధాన మంత్రి కార్యాలయ విధుల నుంచి తప్పుకొన్నారు.
2006లో గోవాలోని ముర్గావ్ పోర్ట్ ట్రస్ట్‌కి మేనేజర్‌గా పనిచేశారు. పోర్ట్ ట్రస్ట్‌లో పనిచేసిన తర్వాత 2008లో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఆ తర్వాత అమెరికాలోని పెన్సీల్వేనియా విశ్వవిద్యాలయం, వార్టన్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చేసేందుకు అకడమిక్ లీవ్ తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐఏఎస్ నుంచి వ్యాపారవేత్తగా..
అమెరికా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసి తిరిగి స్వదేశానికి వచ్చిన తర్వాత, తన ప్రభుత్వ ఉద్యోగానికి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేశారు.
వ్యాపారవేత్తగా తనని తాను నిరూపించుకోవాలని అశ్విని వైష్ణవ్‌కి కల ఉండేది. 2011లో తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి, కెరీర్ కోసం భిన్న మార్గాన్ని ఎంచుకున్నారు.
ఎలాంటి అనుభవం లేకుండానే ఈ రంగంలో తనని తాను నిరూపించుకునేందుకు అశ్విని వైష్ణవ్ శ్రమించారు.
జనరల్ ఎలక్ట్రిక్ ట్రాన్స్‌పోర్టేషన్ సౌత్ ఏసియా మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత సీమెన్స్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డివిజన్‌కి హెడ్‌గా పనిచేశారు.
గుజరాత్‌లోని ఆటోమొబైల్ రంగంలో పలు మార్పులు తీసుకొచ్చారు. సుజుకి, హోండా, హీరో వంటి కంపెనీలతో కలిసి పనిచేశారు.
ఒడిశాలో ఐరన్-ఆక్సైడ్ పెల్లెట్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. కొంత కాలం తర్వాత ఈ వ్యాపారాలను ఆయన మూసివేశారు.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ నుంచి రాజ్యసభకు, రెండేళ్లలోనే మంత్రి పదవి
నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 2019లో అశ్విని వైష్ణవ్ బీజేపీలో చేరారు.
బీజేపీలో చేరిన ఆరు రోజుల్లోనే రాజ్యసభ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం.
ఒడిశాలో ఆయన చేసిన కృషిని గుర్తించిన బీజేపీ, ఆయన్ను అదే రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపింది.
2021 జూలైలో జరిగిన కేబినెట్ విస్తరణలో భాగంగా రైల్వే మంత్రిగా అశ్విని వైష్ణవ్ పేరును ప్రకటించింది మోదీ ప్రభుత్వం.
రైల్వే మంత్రిత్వ శాఖతో పాటు, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను కూడా ఆయనకు అప్పజెప్పింది.
అశ్విని వైష్ణవ్ - వివాదాలు
ఒడిశాలో పనిచేస్తున్న సమయంలో అధికార బిజు జనతా దళ్‌తో అశ్విని వైష్ణవ్‌కి సన్నిహిత సంబంధాలు ఉండేవని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చేసింది.
అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్‌పేయితో పరిచయం తర్వాత, ఆయన్ను నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయంలో పర్సనల్ అసిస్టెంట్‌గా నియమించారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ పనిచేస్తున్నప్పుడు, ఎన్నో సాంకేతిక సంబంధిత విషయాలకు అశ్విని వైష్ణవ్‌ను సంప్రదించే వారు. మోదీ ప్రధాని అయిన తర్వాత కూడా వీరిద్దరి మధ్య సంబంధాలు కొనసాగాయి.
2019లో రాజ్యసభకు వైష్ణవ్‌ను బీజేపీ నామినేట్ చేసిన తర్వాత, బిజ జనతా దళ్ కూడా ఆయనకు మద్దతు ఇచ్చింది. కానీ, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది.
మైనింగ్ మాఫియాలతో వైష్ణవ్‌కి సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి.
2013లో ఒడిశాలో ప్రభాకరన్ మైనింగ్ స్కామ్‌తో ఆయనకు సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి..
కానీ, ఈ ఆరోపణలను వైష్ణవ్ కొట్టిపారేశారు. ఎలాంటి విచారణకు అయినా తాను సిద్ధమని, నిజం బయటికి వస్తుందని అన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK
వందే భారత్ ఎక్స్‌ప్రెస్..
బాలాసోర్‌లో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం తర్వాత, అశ్విని వైష్ణవ్ పనితీరుపై పలు ప్రశ్నలు వస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా వైష్ణవ్ పూర్తిగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పైనే దృష్టిపెట్టారని విమర్శలు వస్తున్నాయి.
వందే భారత్ లాంటి ఖరీదైన ట్రైన్లను తెచ్చే బదులు, ప్రస్తుత రైల్వే వ్యవస్థను మెరుగుపర్చాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
‘‘మీరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తున్నారు. కేవలం వందే భారత్‌ను నడపడంతోనే అయిపోదు. ఈ ప్రమాదానికి మీరు తప్పనిసరిగా బాధ్యత వహించాలి. వైష్ణవ్ ఆయన పదవికి రాజీనామా చేయాలి’’ అని తృణమూల్ కాంగ్రెస్ నేత సౌగతా రాయ్ డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, ANI
రాజీనామా చేయాలని డిమాండ్
ఈ ప్రమాదం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ పలు విమర్శలు లేవనెత్తారు.
‘‘విపక్ష నేతలపై గూఢాచార్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోంది. కానీ, ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు మాత్రం రైళ్లలో యాంటీ-కొలీజన్ డివైజ్‌లను ఏర్పాటు చేయడాన్ని విస్మరిస్తోంది.
ప్రభుత్వం వందే భారత్ ఎక్స్‌ప్రెస్, కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్ల గురించి చెప్పుకుంటూ రాజకీయ మద్దతు పొందాలని చూస్తోంది. కానీ, రైల్వే భద్రతా చర్యలను విస్మరిస్తోంది. ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి రాజీనామా చేయాలి’’ అని అభిషేక్ బెనర్జీ డిమాండ్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ప్రశ్నలు సంధిస్తున్న కాంగ్రెస్
కాంగ్రెస్ నేత అధిరంజన్ చౌదరి కూడా ఈ ప్రమాద విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
‘‘భారతీయ రైల్వే ద్వారా నిత్యం సగటున 25 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లలో పెట్టుబడి పెడుతోంది. కానీ, రైల్వే ప్రయాణికుల సురక్షితపై తక్కువ దృష్టి పెడుతోంది. కింద స్థాయిలో కూడా ప్రభుత్వం దృష్టిసారించాల్సి ఉంది’’ అని అన్నారు.
ప్రధాన మంత్రిని, రైల్వే మంత్రిని అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయని, కానీ ఇది సహాయక చర్యలు అందించే సమయమని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు.
రైల్వే వ్యవస్థను నాశనం చేస్తోన్న వారిని వదిలిపెట్టకూడదని మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోరారు.
‘‘కోరమండల్ చాలా వేగవంతంగా ప్రయాణించే రైలు. ఇది చెన్నై వరకు వెళ్తుంది. మేం కూడా ఈ ట్రైన్‌లో ప్రయాణించాం. ఇలాంటి భారీ ప్రమాదానికి కారణమవుతూ అలా ఎలా అలసత్వం ప్రదర్శించారు. దీనిపై విచారణ జరపాలి. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. ఈ ప్రమాదంలో కోరమండల్ రైలు పూర్తిగా ధ్వంసమైంది’’ అని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.
ఒడిశా రైలు ప్రమాదం తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో పలు ప్రశ్నలు వేస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు రైల్వే మంత్రి రాజీనామాను కోరుతున్నాయి.
భారత్‌లో అంతకుముందు ఇలాంటి ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేసిన రైల్వే మంత్రులను ఉదహరిస్తూ.. రైల్వే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ప్రమాదం తర్వాత, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం రాత్రినే ప్రమాద స్థలానికి బయలు దేరి వెళ్లారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా తాము చర్యలు తీసుకుంటామని ప్రమాద స్థలంలో మీడియాతో మాట్లాడిన మంత్రి చెప్పారు.

మహబూబ్‌నగర్‌లో ప్రమాదం జరిగితే అప్పటి రైల్వే మంత్రి ఏం చేశారంటే..
1956- లాల్ బహాదుర్ శాస్త్రి
1956 ఆగస్ట్‌లో అప్పటి ఏపీలోని మహబూబ్‌నగర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో 112 మంది మరణించడంతో, రైల్వే మంత్రిగా పనిచేస్తున్న లాల్ బహాదుర్ శాస్త్రి తన పదవికి చేశారు. కానీ, ఆయన రాజీనామాను ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తిరస్కరించారు.
ఆ తర్వాత కొన్ని నెలలకు 1956 నవంబర్‌లో తమిళనాడులో జరిగిన రైలు ప్రమాదంలో 144 మంది మరణించారు. ఈ సమయంలో లాల్ బహాదుర్ శాస్త్రి రాజీనామాను ఆమోదించారు. భారతీయ రాజకీయాల్లో నైతిక బాధ్యతకు మంచి ఉదాహరణగా లాల్ బహాదుర్ శాస్త్రి రాజీనామాను పరిగణిస్తారు.
1999-నితీష్ కుమార్
రైలు ప్రమాదాల్లో ఆ తర్వాత దశాబ్దాలలో కూడా జరుగుతూనే వచ్చాయి. కానీ, ఏ మంత్రి లాల్ బహాదుర్ శాస్త్రి తర్వాత రాజీనామా చేయలేదు.
ఆ తర్వాత 43 ఏళ్లకి 1999లో అసోంలోని గసల్‌లో జరిగిన రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఈ ప్రమాదంలో 290 మంది తమ ప్రాణాలు కోల్పోయారు.
2000-మమతా బెనర్జీ
2000 ఏడాదిలో ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేసినప్పుడు మమతా బెనర్జీ కూడా, పంజాబ్‌లో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. కానీ, ఈ రాజీనామాను ప్రధాన మంత్రి ఆమోదించలేదు.
2017-సురేష్ బాబు
2017లో ఐదు రోజుల్లో రెండు రైలు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో, ఈ ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి సురేష్ బాబు కూడా తన పదవికి రాజీనామా చేశారు. కానీ, ఈ రాజీనామాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తిరస్కరించారు.
ఇవి కూడా చదవండి:
- లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్...ఈ పదాల మధ్య తేడా ఏంటి?
- రాహుల్ గాంధీ: భారతీయ నేతలపై ప్రవాస భారతీయులకు ఎందుకంత ఆసక్తి?
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య: ట్రైన్ శబ్దంలో తేడాను గుర్తించి యాక్సిడెంట్ జరగబోతుందని ఊహించి చైన్ లాగి రైలు ఆపిన ఇంజినీర్
- ‘ది కేరళ స్టోరీ’: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎన్ని వేల మంది మహిళలు కనిపించకుండా పోయారు?
- కాలిఫోర్నియా: కుల వివక్ష నిషేధ చట్టాన్ని అమెరికాలో హిందూ సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














