కోరమండల్ ఎక్స్‌ప్రెస్: ‘కవచ్’ అంటే ఏంటి, ఈ ఘోర ప్రమాదాన్ని అది ఆపగలిగేదా?

రైలు ప్రమాదం

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, వెంకట కిషన్ ప్రసాద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒడిషాలోని బాలాసోర్ జిల్లా, బాహానగా రైల్వేస్టేషన్ సమీపంలో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఒక గూడ్స్ రైలు మధ్య జరిగిన భారీ ప్రమాదంలో మృతుల సంఖ్య 288 దాటింది. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చు.

దీన్ని ఈ శతాబ్దంలోనే అతి పెద్ద రైలు ప్రమాదంగా చెబుతున్నారు.

బాహానగా స్టేషన్ సమీపిస్తుండగా కోరమండల్ ఎక్స్‌ప్రెస్ మెయిన్ లైన్‌కు బదులు లూప్ లైన్‌లోకి మళ్లింది. ఆ లైన్‌లో నిలబడి ఉన్న గూడ్స్ రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. దాంతో 12 బోగీలు పట్టాలు తప్పాయి. వీటిలో కొన్ని పక్కనున్న ట్రాక్‌ మీదికి దొర్లాయి.

అదే సమయంలో ఆ ట్రాక్ మీద వెళ్తున్న యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ చివరి భాగాన్ని ఈ బోగీలు ఢీకొట్టాయి. అలా మూడు రైళ్ల మధ్య ఈ ఘోర ప్రమాదం జరిగింది.

అయితే, ఈ రైలు మార్గంలో ‘కవచ్’ అనే రక్షణ వ్యవస్థ ఉండి ఉంటే ప్రమాదం జరగకపోయి ఉండేదనే చర్చ ఇప్పుడు చాలా జరుగుతోంది.

అసలేమిటీ ‘కవచ్’ వ్యవస్థ? అది ఎలా పని చేస్తుంది? ముఖ్యమైన 8 ప్రశ్నలకు సమాధానాలు ఇవి...

1. ఆ మార్గంలో ‘కవచ్’ ఉందా?

డిసెంబర్ 2022లో కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, దక్షిణ మధ్య రైల్వేలోని 1,455 కిలోమీటర్ల మార్గంలో, 77 రైళ్లలో ‘కవచ్’ వ్యవస్థను చేశారు. ప్రస్తుతం దిల్లీ-ముంబయి, దిల్లీ-హౌరాల మధ్య 3,000 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గంలో ఏర్పాటు చేస్తున్నారు.

దీనిపై మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, ఈ రూట్లో కవచ్ వ్యవస్థ లేదని, ప్రస్తుతం దిల్లీ-ముంబయి, దిల్లీ-హౌరాల మధ్య దాన్ని ఏర్పాటు చేస్తున్నామని అమితాబ్ శర్మ వివరించారు.

రైలు ప్రమాదాలు

ఫొటో సోర్స్, IndianRailways

2. అసలు ‘కవచ్’ అంటే ఏంటి?

ట్రెయిన్ కొలీజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (టీసీఏసీ)ని 2011-12లో అమలులోకి తెచ్చారు. ఆ తర్వాత 2014లో నరేంద్ర మోదీ అధికారం చేపట్టాక, 2019లో దానికి ‘కవచ్’ అనే పేరు పెట్టారు. జీరో ఆక్సిడెంట్స్, అంటే ప్రమాదాలను పూర్తిగా నివారించడం ఈ సిస్టమ్ లక్ష్యం.

దేశంలో అభివృద్ధి చేసిన టీసీఏసీలో యూరోపియన్ ట్రెయిన్ ప్రొటెక్షన్ అండ్ వార్నింగ్ సిస్టమ్, దేశంలో రూపొందించిన యాంటీ కొలీజన్ డివైస్ వంటి ముందు నుంచే అమల్లో ఉన్న వ్యవస్థలు భాగంగా ఉంటాయి.

భద్రత, విశ్వసనీయత ప్రమాణాల్లో ఇది సేఫ్టీ ఇంటిగ్రిటీ లెవల్ 4, అంటే అత్యున్నత స్థానంలో ఉంటుంది. లెవల్ 4 అంటే 10 వేల సంవత్సరాల్లో ఒక్క పొరపాటు మాత్రమే జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

రైలు ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

3. ఇందులో ముఖ్యమైన ఫీచర్స్ ఏంటి?

‘కవచ్’ వ్యవస్థలో కీలకమైన ఫీచర్స్ ఇవి:

  • రెడ్ పాసింగ్ ఎట్ డేంజర్, అంటే రెడ్ సిగ్నల్ పడినప్పుడు రైలు ముందుకు వెళ్లకుండా నిరోధించడం.
  • అతి వేగాన్ని నిరోధించడం కోసం ఆటోమెటిక్‌గా బ్రేక్స్ వేయడం.
  • లెవల్ క్రాసింగ్ సమీపించినప్పుడు ఆటోమెటిక్‌గా హార్న్ మోగించడం.
  • కవచ్ వ్యవస్థలు కలిగి ఉన్న రెండు రైళ్లు ఢీకొనకుండా నివారించడం.
  • అత్యవసర పరిస్థితిలో ఎస్ఓఎస్ మెసేజెస్ పంపించడం.
  • నెట్‌వర్క్ మానిటర్ సిస్టమ్ ద్వారా రైళ్ల కదలికలన్నింటిపైనా కేంద్రీకృత పర్యవేక్షణ

4. ‘కవచ్’ ఎలా పని చేస్తుంది?

ఇందులో భాగంగా రైళ్లు, సిగ్నలింగ్ వ్యవస్థలతో పాటు రైలు పట్టాల్లో కూడా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరికరాలను అమర్చుతారు. అల్ట్రా హై రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఇవి ఒక దాంతో ఒకటి సంభాషించుకుంటూ, రైళ్లలోని బ్రేక్స్‌ను నియంత్రిస్తాయి. అలాగే డ్రైవర్లను కూడా ఇవి అప్రమత్తం చేస్తాయి. ఇదంతా ఇందులో ప్రోగ్రామ్ చేసిన లాజిక్ ప్రకారమే నడుస్తుంది.

ఇందులో ట్రెయిన్ కదలికల సమాచారం ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ట్రెయిన్ డ్రైవర్ ఎప్పుడైనా సిగ్నల్ జంప్ చేస్తే ఇది అత్యవసర హెచ్చరికను ప్రసారం చేస్తుంది. ఇలా సిగ్నల్ జంప్ చేయడాన్ని రైల్వేశాఖలో తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. రైళ్లు ఢీకొనే ఘటనలకు చాలా వరకు ఇదే కారణం అవుతుంది.

పొగమంచు ఉన్నప్పుడు సరిగా కనిపించకపోయినా, ఈ వ్యవస్థ పూర్తి కచ్చితత్వంతో పని చేస్తుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

రైలు ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

5. ‘కవచ్’ ఖర్చెంత?

కవచ్ ఏర్పాటుకు కిలోమీటరుకు రూ. 54 లక్షలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇలాంటి వ్యవస్థకు ప్రపంచంలో అవుతున్న సగటు ఖర్చు కిలోమీటరుకు రూ. 2 కోట్లు.

అందుకే ‘కవచ్’ను చౌకగా ఏర్పాటవుతున్న వ్యవస్థ అని కూడా చెబుతున్నారు.

6. ‘కవచ్’ పరీక్షలు ఎక్కడ జరిగాయి?

2022 మార్చి 4న సికింద్రాబాద్ డివిజన్‌లోని గుల్లగూడ, చిట్టిగిద్ద రైల్వేస్టేషన్ల మధ్య దీన్ని తొలిసారి పరీక్షించారు.

ఒకవైపు నుంచి బయలుదేరిన రైలులో రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కూర్చొని ఉండగా, అదే ట్రాక్‌పై మరో వైపు నుంచి మరో ట్రెయిన్‌ను నడిపించారు. అతి వేగంగా ప్రయాణిస్తున్న రెండు ట్రెయిన్లకు సరిగ్గా 400 మీటర్ల దూరంలో, డ్రైవర్ల ప్రమేయం లేకుండానే ఆటోమెటిక్‌గా బ్రేక్స్ అప్లై అయ్యాయి.

అలా ఈ ప్రయోగం విజయవంతమైందని రైల్వే మంత్రి ప్రకటించారు.

రైలు ప్రమాదం

ఫొటో సోర్స్, @narendramodi

ఫొటో క్యాప్షన్, రైలు ప్రమాదం పై సమీక్షలో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ.

7. ‘కవచ్’ కవర్ చేస్తున్న రైలు మార్గం ఎంత?

దేశంలోని రైలు మార్గాల మొత్తం పొడవు 68 వేల కిలోమీటర్లు. ఇందులో ఇప్పటికి కవచ్ వ్యవస్థ ఏర్పాటైన దూరం 1455 కిలోమీటర్లు మాత్రమే. 3,000 కిలోమీటర్ల రైలు మార్గంలో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి.

అన్నీ కలిపినా మొత్తం రైలు మార్గాల్లో 5 శాతం కూడా కాదు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే మార్గాలన్నింట్లో ‘కవచ్’ సిస్టమ్ అమల్లోకి రావాలంటే ఇంకా చాలా ఏళ్లే పట్టొచ్చు.

అందుకే, ‘కవచ్’ నత్తనడక నడుస్తోందని విమర్శలు కూడా ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, ఒడిశా రైలు ప్రమాదాన్ని ‘కవచ్’ ఆపగలిగేదా?

8.‘కవచ్’ నిజంగానే ఈ ప్రమాదాన్ని నివారించగలిగేదా?

‘కవచ్’ సిస్టమ్ గురించి రైల్వేశాఖ, రైల్వే మంత్రి వెల్లడించిన వివరాల ఆధారంగా చూసినప్పుడు, ఈ ప్రమాదం నివారించగలిగేదే అనుకోవచ్చు.

ఎందుకంటే, రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వెళ్లకుండా ‘కవచ్’ నివారించగలిగేది. ఒకవేళ పొరపాటున వెళ్లినా కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో బ్రేక్స్ అప్లయి అయ్యేవి.

కానీ పక్క ట్రాక్‌పైకి పడిపోయిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న ఘటన పూర్తిగా కాకతాళీయంగా జరిగినట్టుగా అనిపిస్తోంది.

వీడియో క్యాప్షన్, కోరమండల్ ప్రమాద ఘటనను చూసిన స్థానికుడు ఏం చెప్పారంటే....

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)