Indian Railways: ఇరవై రూపాయలు ఎక్కువ చార్జి చేశారని కోర్టుకెళ్లాడు, 22 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది

20 రూపాయల కేసు కోసం తుంగనాథ్ వందసార్లకు పైగా కోర్టుకు వెళ్లారు
ఫొటో క్యాప్షన్, 20 రూపాయల కేసు కోసం తుంగనాథ్ వందసార్లకు పైగా కోర్టుకు వెళ్లారు
    • రచయిత, చెరిలన్ మోలన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తుంగనాథ్ చతుర్వేది 1999లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో రెండు టికెట్లు కొన్నారు. అయితే, టికెట్ల అసలు ధర కన్నా 20 రూపాయలు ఎక్కువ చార్జి వసూలు చేశారు.

22 ఏళ్ల విచారణ తర్వాత వినియోగదారుల కోర్టు గత వారంలో చతుర్వేదికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అధికంగా వసూలు చేసిన 20 రూపాయలను వడ్డీతో సహా తుంగనాథ్‌కు చెల్లించాలని రైల్వేశాఖను ఆదేశించింది.

''ఈ కేసుకు సంబంధించి 100 సార్లకు పైగా విచారణలకు హాజరయ్యాను'' అని బీబీసీతో చెప్పారు తుంగనాథ్. ఆయన వయసు ఇప్పుడు 66 సంవత్సరాలు.

''ఈ కేసులో పోరాడటం కోసం నేను ఖర్చు చేసిన శక్తిని, సమయానికి వెల కట్టలేరు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

భారతదేశంలో వినియోగదారుల కోర్టులు.. సేవలకు సంబంధించిన ఫిర్యాదులను విచారిస్తుంటాయి. కానీ ఈ కోర్టుల మీద కేసుల భారం విపరీతంగా ఉంటుంది. అందువల్ల చిన్న కేసులు, తేలికైన కేసులను పరిష్కరించటానికి కూడా సంవత్సరాల సమయం పడుతుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో నివసించే చతుర్వేది.. మధుర నుంచి మొరాదాబాద్ ప్రయాణించటానికి రెండు టికెట్లు కొన్నపుడు టికెట్ బుకింగ్ క్లర్క్ ఆయన వద్ద 20 రూపాయలు అదనంగా చార్జీ వసూలు చేశారు.

ఒక్కో టికెట్ ధర 35 రూపాయలు. రెండు టికెట్లకు కలిపి 70 రూపాయలు. చతుర్వేది సదరు క్లర్కుకు 100 రూపాయలు ఇచ్చారు. కానీ ఆ క్లర్కు 10 రూపాయలు మాత్రమే తిరిగి ఇచ్చారు. అంటే 20 రూపాయలు అదనంగా చార్జీ వసూలు చేశారు.

టికెట్ల ధర కన్నా ఎక్కువ చార్జీ తీసుకున్నారని ఆ క్లర్కుకు చతుర్వేది చెప్పారు. కానీ, క్లర్కు ఆ 20 రూపాయలు ఆయనకు ఇవ్వలేదు.

దీంతో నార్త్ ఈస్ట్ రైల్వే (గోరఖ్‌పూర్) మీద, సదరు బుకింగ్ క్లర్కు మీద మధురలోని వినియోగదారుల కోర్టులో కేసు వేయాలని చతుర్వేది నిర్ణయించుకున్నారు.

ఇండియన్ రైల్వే టికెట్ కౌంటర్ ( ప్రతీకాత్మక చిత్రం)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇండియన్ రైల్వే టికెట్ కౌంటర్ ( ప్రతీకాత్మక చిత్రం)

భారతదేశంలోని న్యాయవ్యవస్థ నెమ్మదిగా పనిచేస్తుండటం వల్ల తన కేసు పరిష్కారమవటానికి ఇన్నేళ్లు పట్టిందని చతుర్వేది అంటారు.

''రైల్వేశాఖ కూడా ఈ కేసును కొట్టివేయాలని చూసింది. రైల్వేల మీద ఫిర్యాదులను రైల్వే ట్రైబ్యునల్‌కు పంపించాలి. కానీ వినియోగదారుల కోర్టుకు పంపించరాదని రైల్వేశాఖ చెప్పింది'' అని ఆయన తెలిపారు.

భారతదేశంలో రైలు ప్రయాణాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించటానికి ఏర్పాటైన పాక్షిక న్యాయ విభాగం రైల్వే ట్రైబ్యునల్. ''అయితే 2021లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ఆదేశాన్ని మేం ఉపయోగించుకుని ఈ అంశాన్ని వినియోగదారుల కోర్టులో విచారించవచ్చునని నిరూపించాం'' అని చతుర్వేది వెల్లడించారు.

జడ్జ్‌లు ఏదో ఒక పేరుతో సెలవులో ఉండటం వల్ల విచారణ తరచుగా వాయిదా పడుతుండేదని ఆయన పేర్కొన్నారు. సుదీర్ఘ పోరాటం తర్వాత..రైల్వేశాఖ రూ.15,000లను చతర్వేదికి జరిమానాగా చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది.

న్యాయవివాదాలపై రైల్వే కోర్టులున్నా, విచారణలో ఆలస్యం జరుగుతుంది (భారతీయ రైల్వేలు ఫైల్ ఫొటో)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, న్యాయవివాదాలపై రైల్వే కోర్టులున్నా, విచారణలో ఆలస్యం జరుగుతుంది (భారతీయ రైల్వేలు ఫైల్ ఫొటో)

అలాగే, ఆయన వద్ద నుంచి అదనంగా వసూలు చేసిన 20 రూపాయలను 1999 నుంచి 2022 వరకూ ఏడాదికి 12 శాతం వడ్డీ చొప్పున లెక్కగట్టి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.

ఆ మొత్తాన్ని నిర్దేశించిన 30 రోజుల గడువులోగా చెల్లించకపోయినట్లయితే..వడ్డీ రేటు 15 శాతానికి పెరుగుతుందని కూడా కోర్టు స్పష్టంచేసింది. తనకు లభించిన పరిహారం చాలా స్వల్పమని, ఈ కేసు వల్ల తనకు కలిగిన మనోవేదనను అది భర్తీ చేయదని చతుర్వేది అన్నారు.

ఈ కేసును పట్టుకుని తిరగవద్దని, అది వృథా ప్రయాస అని ఆయనను వారిస్తూ ఆయన కుటుంబం చాలాసార్లు ఒత్తిడి చేసింది. కానీ ఆయన తన పోరాటం కొనసాగించారు. ''ఇక్కడ ముఖ్యమైన విషయం డబ్బు కాదు. ఇది న్యాయం కోసం పోరాటం. అవినీతి మీద పోరాటం. కాబట్టి ఈ పోరాటం చేయటం ఉపయోగకరమైనదే'' అంటారు చతుర్వేది.

''అదీగాక నేను స్వయంగా న్యాయవాదిని. కోర్టులో వాదించటానికి న్యాయవాదికి డబ్బులు, ఇతర ఖర్చులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా చెల్లించాల్సి వచ్చినట్లయితే ఖర్చు చాలా అయ్యేది'' అని ఆయన పేర్కొన్నారు. ఒక వ్యక్తి అధికారికంగా ఏ హోదాలో ఉన్నా కూడా.. వారిని ప్రశ్నించటానికి జనం సిద్ధంగా ఉన్నట్లయితే అలాంటి వారు తప్పుచేసి తప్పించుపోలేరని చతుర్వేది వ్యాఖ్యానించారు.

ఈ పోరాటం కఠినంగా ఉన్నట్లు కనిపించినా ఆపకుండా పోరాడవచ్చునని చాటడానికి..తన కేసు ఇతరులకు స్ఫూర్తినిస్తుందని తాను నమ్ముతున్నట్లు ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, కోనసీమ రైల్వే లైన్ కార్యరూపం దాల్చడం లేదెందుకు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)