కేంద్ర విద్యుత్ బిల్లులో ఏముంది? కేసీఆర్, కేజ్రీవాల్ వంటి వారు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

ఫొటో సోర్స్, TSCMO/GettyImages
- రచయిత, వరికూటి రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇంట్లో ఎంతకూ మొబైల్ సిగ్నల్స్ దొరక్కపోతే చాలా చిరాకు వస్తుంది.
ఇంటి బయటకు పోతాం, ఇంటిపైకి ఎక్కుతాం.
కానీ, ఇలా ఎన్ని రోజులు... ఏదో ఒకరోజు, ఇక చాలురా! బాబు అనిపిస్తుంది. వెంటనే మరొక నెట్‌వర్క్‌కు మారిపోతాం.
మరి రోజూ విద్యుత్ కోతలు, సరఫరాలో అంతరాయాలు ఎదురవుతూ ఉంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ఎందుకు మార్చకూడదు?
అర్థం కాలేదా? సరే, కాస్త వివరంగా చూద్దాం.
మీరు తెలంగాణలోని ఖమ్మంలో ఉంటున్నారని అనుకుందాం. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మీ ఇంటికి విద్యుత్ సరఫరా చేస్తూ ఉంటుంది.
సరే, ఇప్పుడు మీకు విద్యుత్ కనెక్షన్ సంబంధించి ఇబ్బందులు ఉన్నాయనుకోండి. అంటే తరచూ కోతలు, మీ ప్రాంతంలో ఏదో ఒక కారణం వల్ల విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం, లోడ్, కేటగిరీ, లొకేషన్ మార్పు వంటి సేవల్లోనూ మీకు సమస్యలున్నాయి.
ఇలాంటప్పుడు కావాలనుకుంటే నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి బదులు మీకు నచ్చిన మరొక పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కనెక్షన్ తీసుకోవచ్చు. అంటే దీన్ని ఒకరకంగా పవర్ పోర్టబిలిటీ అనుకోవచ్చు.
ఇలా చేయడం ఇప్పుడు సాధ్యం కాదు. కానీ విద్యుత్ (సవరణ) బిల్లు-2022 చట్టంగా మారితే అప్పుడు నచ్చిన పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ఎంచుకోవచ్చు.

ఫొటో సోర్స్, BBC/Getty Images
విద్యుత్ (సవరణ) బిల్లు-2022 అంటే?
విద్యుత్ పంపిణీ రంగంలో తీసుకురావడానికి ఉద్దేశించిందే విద్యుత్ (సవరణ) బిల్లు-2022. విద్యుత్ రంగంలో పోటీ పెంచడం, నియంత్రణ సంస్థలను మరింత బలోపేతం చేయడం, డబ్బులు చెల్లింపు వ్యవస్థను గాడిలో పెట్టడం వంటి కీలకాంశాలు ఇందులో ఉన్నాయి.
పర్యావరణ మార్పుల నియంత్రణకు అనుకూలంగా కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలంటే విద్యుత్ రంగాన్ని సంస్కరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

బిల్లులోని కీలక అంశాలు

డి-లైసెన్స్: విద్యుత్ పంపిణీ వ్యాపారాన్ని 'డి-లైసెన్స్' చేస్తారు. అంటే ఇకపై విద్యుత్ పంపిణీ చేయాలంటే లైసెన్స్ అవసరం లేదు.
డిస్ట్రిబ్యూషన్ కంపెనీ: 'డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ'కి బదులుగా 'డిస్ట్రిబ్యూషన్ కంపెనీ' అనే కాన్సెప్ట్‌ను తీసుకొస్తారు. విద్యుత్ నియంత్రణ కమిషన్(ఈఆర్‌సీ) వద్ద నమోదు చేసుకోవడం ద్వారా డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా మారొచ్చు.
ఫ్రాంచైజీ: పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తమ ప్రాంత పరిధిలో ఫ్రాంచైజీలు ఇవ్వొచ్చు. అంటే కేఎఫ్‌సీ వంటి రెస్టారెంట్ల మాదిరిగా ఎవరైనా పంపిణీ సంస్థల నుంచి ఫ్రాంచైజీలు తీసుకోవచ్చు.
టారిఫ్ సీలింగ్: సంస్థలు మోనోపలీకి పాల్పడకుండా మినిమం టారిఫ్‌ను నిర్ణయిస్తారు. అలాగే వినియోగదారులకు నష్టం కలగకుండా గరిష్ట టారిఫ్ మీద సీలింగ్ పెడతారు.
రెన్యూవబుల్ పవర్ పర్‌చేజ్ ఆబ్లిగేషన్(ఆర్‌పీపీఓ): దీని కింద విద్యుత్ పంపిణీ సంస్థలు తప్పకుండా కనీసం కొంత మొత్తం పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాలి.
క్రాస్ సబ్సిడీ: ఒక ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ విద్యుత్ పంపిణీ సంస్థలు సేవలు అందిస్తూ ఉంటే యూనివర్సల్ సప్లై ఆబ్లిగేషన్(యూఎస్‌ఓ) ఫండ్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వమే దీన్ని మేనేజ్ చేస్తుంది.
విద్యుత్ నిలుపుదల: ఒప్పందాల ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థలు డబ్బులు చెల్లించకపోతే రీజియనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్లు, స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్లు ఇకపై విద్యుత్ సరఫరా చేయవు.

కలిగే మార్పులు, వచ్చే ప్రయోజనాలు ఏంటి?
- 'డి-లైసెన్స్' చేయడం వల్ల ప్రైవేటు కంపెనీలు కూడా విద్యుత్ పంపిణీ వ్యాపారంలోకి అడుగుపెట్టొచ్చు.
- ఒకటి కంటే ఎక్కువ కంపెనీలు మార్కెట్‌లో ఉంటాయి కనుక వినియోగదారులు నచ్చిన పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ఎంచుకోవచ్చు.
- ఎక్కువ సంస్థల రాకతో మార్కెట్‌లో పోటీ పెరిగి వినియోగదారులకు సరసమైన ధరలో విద్యుత్ లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.
- కంపెనీల మధ్య పోటీ వల్ల కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు లభిస్తాయని కేంద్రం అంటోంది.

ఫొటో సోర్స్, BBC/Getty Images
బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన
కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ (సవరణ) బిల్లు-2022ను ప్రతిపక్షాలు, విద్యుత్ సంస్థల ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సోమవారం (అగస్ట్ 8న) దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు నిరసనలు చేపట్టాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వంటి వాళ్లు ఈ విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారు.
మాజీ ఐఏఎస్ అధికారులు, విద్యావేత్తలు, నిపుణులు ఉండే పీపుల్స్ కమిషన్ ఆన్ పబ్లిక్ సెక్టార్ అండ్ సర్వీసెస్(పీసీపీఎస్ఎస్) కూడా ఈ సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకించింది.
ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్(ఏఐపీఈఎఫ్) కూడా ఈ బిల్లు మీద ఆందోళన వ్యక్తం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
అభ్యంతరాలు ఏమిటి?
విద్యుత్ (సవరణ) బిల్లు-2022 మీద ప్రతిపక్షాలు, ఉద్యోగసంఘాలు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
సమాఖ్యస్ఫూర్తి: విద్యుత్ అనేది రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలోని అంశం. కానీ 1996 నుంచి కేంద్రం మెల్లగా రాష్ట్రాల అధికారాలను పరిమితం చేస్తూ వస్తోందని పీసీపీఎస్ఎస్ ఆరోపించింది. విద్యుత్ (సవరణ) బిల్లు-2022తో రాష్ట్రాలకు చెందిన విద్యుత్ పంపిణీ సంస్థలు ఆర్థికంగా బలహీనపడతాయని తెలిపింది. రాష్ట్రాలతో తగిన రీతిలో చర్చించకుండా బిల్లు తీసుకురావడం ఫెడరలిజం స్ఫూర్తిని దెబ్బతీస్తోందని చెప్పుకొచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ఉచిత విద్యుత్: సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రజలకు 200 యూనిట్లలోపు బిల్లు వసూలు చేయడం లేదు. విద్యుత్ (సవరణ) బిల్లు-2022 అమలులోకి వస్తే ఇది సాధ్యం కాదనేది రాష్ట్రాల వాదన.
ఈ బిల్లు ప్రకారం ఒక ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ విద్యుత్ పంపిణీ సంస్థలు ఉంటే యూనివర్సల్ సప్లై ఆబ్లిగేషన్(యూఎస్‌ఓ) పేరిట ఒక ఫండ్ ఏర్పాటు చేస్తారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే మేనేజ్ చేస్తుంది.
రాయితీలు ఉండని వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు ప్రైవేటు కంపెనీలకు వెళ్తారని, రాయితీలు పొందే వ్యవసాయ వినియోగదారుల బాధ్యత ప్రభుత్వ సంస్థల మీదనే పడుతుందని పీసీపీఎస్ఎస్ చెబుతోంది.

ఫొటో సోర్స్, BBC/Getty Images
ప్రజలకు ఇబ్బందులు: డబ్బు చెల్లించని విద్యుత్ పంపిణీ సంస్థలకు డిస్పాచ్ సెంటర్లు విద్యుత్ సరఫరా చేయకూడదని బిల్లు చెబుతోంది. ఇది అమల్లోకి వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని పీసీపీఎస్ఎస్ ఆరోపించింది. ఏదైనా పంపిణీ సంస్థ డబ్బు చెల్లించలేకపోతే విద్యుత్ సరఫరా ఆపివేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేసింది.
కార్పొరేట్ సంస్థలకు లబ్ధి: రెన్యూవబుల్ పవర్ పర్‌చేజ్ ఆబ్లిగేషన్స్(ఆర్‌పీపీఓ) కింద విద్యుత్ పంపిణీ సంస్థలు తప్పనిసరిగా కొంత మేరకు పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాలి. అలా చేయకపోతే భారీ పెనాల్టీలు విధిస్తారు.
దేశంలో ప్రస్తుతం పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు భారీ స్థాయిలో సోలార్ పవర్ ప్లాంట్స్ నడుపుతున్నాయి. వీటికి మేలు చేకూర్చడానికే ఈ నిబంధన తీసుకొచ్చారని పీసీపీఎస్ఎస్ ఆరోపించింది.

ఫొటో సోర్స్, BBC/Getty Images
ఈ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టిన వారిలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.రత్నాకర్ రావుతో బీబీసీ మాట్లాడింది. ఆయన ఏమన్నారంటే...

పి.రత్నాకర్ రావు
అధ్యక్షుడు, తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్

పెట్టుబడి లేకుండా లాభాలు
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కూడా ప్రైవేటు సంస్థలు విద్యుత్‌ను పంపిణీ చేయొచ్చు. పెట్టుబడి, కొత్త లైన్లు వేయడం, నెట్‌వర్క్ నిర్వహణ, ట్రాన్స్‌ఫార్మర్లు వంటివి అన్నీ ప్రైవేటు కంపెనీలే చేపట్టాలి.
కానీ ఇప్పుడు తీసుకొస్తున్న బిల్లులోని నిబంధనల ప్రకారం ప్రైవేటు కంపెనీలు పెట్టుబడి పెట్టనక్కర్లేదు. కొత్త లైన్లు వేయనక్కర్లేదు. ఆ బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలే చూసుకోవాలి.
అంటే ప్రభుత్వ పంపిణీ సంస్థలు తమ ఖర్చుతో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే ప్రైవేటు కంపెనీలు వాటిని వాడుకొని లాభాలు ఆర్జిస్తాయి. అవి రూపాయి కూడా పెట్టుబడి పెట్టవు.
విద్యుత్ టారిఫ్‌లు పెంచాల్సి వస్తుంది
ప్రైవేటు కంపెనీలకు లాభాలు తెచ్చే వినియోగదారులు పోతే వ్యవసాయ, నివాస వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ పంపిణీ సంస్థల మీద పడుతుంది.
ప్రభుత్వం మీద ఆర్థికంగా భారం పడుతుంది కాబట్టి దాన్ని తట్టుకునేందుకు టారిఫ్‌లు పెంచాల్సి వస్తుంది. తద్వారా భారం ప్రజల మీద పడుతుంది.
నిబంధనల్లో స్పష్టత లేదు
కేంద్రం తీసుకొచ్చిన బిల్లులో నిబంధనలపై స్పష్టత లేదు. చాలా క్లాజులకు 'యాజ్ ప్రిస్‌క్రైబ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్' అని రాశారు. పూర్తిగా నిబంధన గురించి ఇలా రాయడం సరికాదు.
ఎందుకంటే ఇదొక గ్రే ఏరియా. కేంద్రం రేపు ఎలా కావాలంటే అలా నిబంధనలు రూపొందించుకుంటుంది. అది రాష్ట్రాల అధికారాలు హరించుకుపోతాయి.
థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి?
తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్‌ను కొనాలనే నిబంధన తెచ్చారు. 20-30శాతం అంటే సరే. కానీ కొన్నేళ్లు పోయాక 50శాతం కొనమంటే ఇప్పటికే ఉన్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? రుణాలు తీసుకొని కొన్ని ప్రాజెక్టులు కడుతున్నారు. మరి వాటి సంగతి ఏంటి? రెన్యూవబుల్ ఎనర్జీని ఎంత కొనాలనేది రాష్ట్రాలకు వదిలేయాలి.
స్మార్ట్ మీటర్లు భారం
స్మార్ట్ మీటర్లు పెట్టాలని కూడా బిల్లు చెబుతోంది. ఒక్కో మీటరు ఖర్చు రూ.6,000 అవుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రూ.900. మిగతా ఖర్చు విద్యుత్ పంపిణీ సంస్థలే వినియోగదారుల వద్ద వసూలు చేయాల్సి వస్తుంది.
ఈ స్మార్ట్ మీటర్లు తయారు చేసేది, నిర్వహించేది ప్రైవేటు కంపెనీలు. తద్వారా ఈ డేటా అంతా ప్రైవేటు కంపెనీల చేతిలోకి పోతుంది.
సమస్య వస్తే ఎవరు తీరుస్తారు?
మౌలిక వసతులు రాష్ట్ర ప్రభుత్వ పంపిణీ సంస్థలు చేపడతాయి. ప్రైవేటు కంపెనీలు సరఫరా చేస్తాయి. బిల్లు కలెక్ట్ చేసుకుంటాయి. మరి ఏదైనా సమస్య వస్తే వినియోగదారులు ఎవరిని సంప్రదించాలి? బిల్లింగ్ చేసే ప్రైవేటు కంపెనీనా? లేక ప్రభుత్వ పంపిణీ సంస్థనా? దీని మీద బిల్లులో ఎటువంటి స్పష్టత లేదు.
కంపెనీ ఏదైనా లైను ఒక్కటే
వినియోగదారులు నచ్చిన పవర్ డిస్ట్రిబ్యూటర్‌ను ఎంచుకోవచ్చు. కానీ కంపెనీ ఏదైనా విద్యుత్ సరఫరా చేసే నెట్‌వర్క్ మారదు. మొబైల్ పోర్టబిలిటీ అంత సులభం కాదు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లను మార్చడం. మారిన ప్రతిసారీ వైరింగ్, కనెక్షన్ వంటివి మార్చాల్సి వస్తుంది.
ఉద్యోగుల పైనా ప్రభావం
ప్రైవేటు కంపెనీ రాకతో ప్రభుత్వ పంపిణీ సంస్థలు బలహీనపడితే ఆ ప్రభావం ఉద్యోగుల మీద పడుతుంది. జీతాలు, ఇతర ప్రయోజనాలు ఇబ్బందుల్లో పడతాయి. రీడింగ్, బిల్లింగ్, కలెక్షన్ విభాగాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.


ప్రభుత్వం ఏం చెబుతోంది?
విద్యుత్ (సవరణ) బిల్లు-2022 మీద ప్రతిపక్షాల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం తప్పు పడుతోంది. ఇది ప్రజల ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన బిల్లు అని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ అన్నారు.
ప్రైవేటు కంపెనీలు పరిశ్రమలకే కాకుండా వ్యవసాయ వినియోగదారులకు కూడా తప్పనిసరిగా సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది.
ప్రైవేటు కంపెనీ సేవలు అందించే ప్రాంతంలో అర్బన్, రూరల్ ప్రాంతాలు తగిన నిష్పత్తిలో ఉండేలా చూస్తామని తెలిపింది.
రైతులకు ఉచిత విద్యుత్ వంటివి ఆగిపోవని వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలే విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి. దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ప్రభుత్వ-ప్రైవేటు, ప్రైవేటు విధానంలో విద్యుత్ పంపిణీ జరుగుతోంది.
దేశంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు భారీగా రుణాల్లో కూరుకుపోయి ఉన్నాయి. నష్టాలను చవి చూస్తున్నాయి. దేశంలో విద్యుత్ తయారీ కంపెనీలకు రూ.లక్ష కోట్లకుపైగా విద్యుత్ పంపిణీ సంస్థలు బకాయిలు పడ్డాయి. రాష్ట్రాలు రూ.60 వేల కోట్లు పంపిణీ సంస్థలకు, ప్రజలకు ఇచ్చిన రాయితీల రూపంలో మరొక రూ.75 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి.
ఎన్నికల్లో ఓట్ల కోసం రాష్ట్రాలు ఉచిత విద్యుత్ వంటి హామీలు ఇవ్వడం వల్లే ఇలా బకాయిలు పెరుగుతున్నాయని ఈ బిల్లును సమర్థించేవారు అంటున్నారు.
ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే విద్యుత్ రంగాన్ని సంస్కరించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపించారు.
ఇవి కూడా చదవండి:
- అమ్మాయి ట్రాక్టర్‌తో పొలం దున్నితే ఊరికి అరిష్టమా, గ్రామబహిష్కరణ చేస్తామని యువతిని ఎందుకు బెదిరిస్తున్నారు
- వారెన్ బఫెట్, రాకేశ్ ఝుంఝున్వాలా ఎలా స్టాక్ మార్కెట్స్‌లో కోట్లు సంపాదించారు?
- హిందుత్వ జెండాను మోస్తున్నవారు ఎవరు, హిందూ దేశ నిర్మాణానికి సైనికులు సిద్ధమవుతున్నారా
- చీరాల – పేరాల: 100 ఏళ్ళ కిందటి ఈ ఉద్యమం 11 నెలలకే ఎందుకు కుప్పకూలింది?
- ఉబర్: 30 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.2,414...ఇది కొత్త తరహా మోసమా లేక సాంకేతిక సమస్యా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













