క్యాసినో అంటే ఏంటి, అందులో ఏం చేస్తారు... చట్టాలు ఏం చెబుతున్నాయి?

గోవాలోని బిగ్ డాడీ క్యాసినో

ఫొటో సోర్స్, Facebook/BigDaddy

    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చికోటి ప్రవీణ్... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బాగా ట్రెండ్ అవుతున్న పేరు. ఇక ఆయన నడిపే క్యాసినోల మీద అంతకంటే ఎక్కువగా చర్చ నడుస్తోంది.

క్యాసినో... గ్యాంబ్లింగ్... పేకాట ప్యాకేజీలు... విమానాల్లో ప్రయాణం... కోట్ల కొద్దీ డబ్బు... ఇలా ఎన్నో వినిపిస్తున్నాయి.

ఇలా క్యాసినోల చుట్టూ వివాదాలు అలుముకోవడం తెలుగు వారికి కొత్తేమీ కాదు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో గుడివాడలో క్యాసినో పెట్టారంటూ పెద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

ఈ వివాదాలు పక్కన పెడితే... క్యాసినో అనే మాట విన్నప్పుడల్లా ఒక అనుమానం వస్తూ ఉంటుంది.

అసలు ఏంటి ఈ క్యాసినో..? దీనికి ఎందుకు ఇంత క్రేజ్..? వీటి కోసం నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ వంటి దేశాలకు సైతం ఎందుకు వెళ్తున్నారు? మన దగ్గర క్యాసినోలకు అనుమతి లేదా? అనే సందేహాలు మాటిమాటికి వస్తూ ఉంటాయి.

క్యాసినో అంటే?

హాలీవుడ్ సినిమాలు... ముఖ్యంగా జేమ్స్ బాండ్‌ చూసే వాళ్లకు, ఈ క్యాసినోలు తెలిసే ఉండొచ్చు. శత్రువులను వెతుక్కుంటూ తిరిగే జేమ్స్ బాండ్, తరచూ వెళ్లే ప్లేసుల్లో క్యాసినో ఒకటి.

ఒక పెద్ద హాలు... కళ్లు జిగేల్ మనే లైటింగ్... మధ్యలో పెద్ద గ్రీన్ కలర్ టేబుల్... టేబుల్ మీద రకరకాల రంగుల్లో కాయిన్స్, కార్డులు... టేబుల్ చుట్టూ మనుషులు... ఒక చేతిలో గ్లాసు... మరొక చేతిలో కాలుతున్న సిగరెట్...

ఇది సినిమాల్లో కనిపించే క్యాసినో సెటప్. రీల్ లైఫ్ అంత ఆడంబరంగా కాకపోయినా రియల్ లైఫ్‌లోనూ క్యాసినో సెటప్ ఇలాగే ఉంటుంది.

క్యాసినో అంటే డబ్బు కోసం ఆటలు ఆడే ఒక ప్లేస్. ఇక్కడ ప్రధానంగా జరిగేది గ్యాంబ్లింగ్. కాసా(ఇల్లు) అనే ఇటాలియన్ పదం నుంచి వచ్చిందే క్యాసినో.

ఇక్కడ డబ్బుల కోసం ఆటలు ఆడతారు. కాకపోతే ఇవి మనుషుల స్కిల్ మీద కన్నా చాన్సెస్ మీద ఆధారపడి ఉంటాయి. క్రికెట్ ఆడటం ఒక స్కిల్. ఆ నైపుణ్యాలు నేర్చుకుంటూనే బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా చేయగలరు. కానీ ఒక క్రికెటర్ సెంచరీ కొడతారని బెట్ కట్టడం గ్యాంబ్లింగ్.

ఇక్కడ చాన్స్ మాత్రమే ఉంటుంది. స్కిల్‌తో పని లేదు. సెంచరీ కొడితే డబ్బులు వస్తాయి. లేదంటూ పెట్టినవి పోతాయి.

గోవాలోని కాసినో ప్రైడ్

ఫొటో సోర్స్, Facebook/Casino Pride

క్యాసినోలో ఏం చేయొచ్చు?

క్యాసినోలలో పందెం కాసే గ్యాంబ్లింగ్ ఆటలు ఉంటాయి. అలాగే రెస్టారెంట్, బార్, కచేరీలు, డ్యాన్స్ షోలు వంటి ఇతర వినోదాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు. బెట్టింగ్, లాటరీ గేమ్స్ ఆడే మెషీన్లు కూడా ఉంటాయ్.

ప్రధానమైన ఆటలు:

  • పోకర్
  • బ్లాక్‌జాక్
  • రూలెట్
  • బాక్రా
  • క్రాప్
  • తీన్‌పత్తి
  • అందర్ బాహర్
  • టైగర్ డ్రాగన్

కొందరు డబ్బులు సంపాదించడానికైతే మరికొందరు వినోదం కోసం క్యాసినోలకు వెళ్తుంటారు. ఇంకొందరికి అదొక అలవాటు కూడా. క్యాసినోలకు వచ్చే వారిని అలరించడానికి పాట కచేరీలు, పోల్ డ్యాన్స్, డ్యాన్స్ షో వంటివి ఉంటాయి. అన్ని రకాల మద్యం అందుబాటులో ఉంటుంది.

మొత్తానికి క్యాసినోలో ఆటలు ఆడొచ్చు... తినొచ్చు, తాగొచ్చు... మ్యూజిక్, డ్యాన్స్ షోలు చూసి ఆనందించొచ్చు... అలసిపోతే మసాజ్ చేయించుకుంటూ రిలాక్స్ కావొచ్చు.

ప్రపంచ క్యాసినో మార్కెట్ విలువ

క్యాసినోలు ఎక్కడ ఉంటాయి?

హోటళ్లు, నైట్ క్లబ్బులు, రెస్టారెంట్లు, స్పాలు, రిసార్టులు, షాపింగ్ సెంటర్లు వంటి చోట్ల క్యాసినోలను ఏర్పాటు చేస్తుంటారు.

ఈవెంట్స్, వేడుకలు, ఉత్సవాల్లో కూడా క్యాసినోలను టెంపరరీగా నిర్వహిస్తుంటారు.

గ్యాంబ్లింగ్ కోసమే విదేశాలకు

క్యాసినోల కోసమే చాలా మంది భారతీయులు ఏటా విదేశాలకు వెళ్తుంటారు. చికోటి ప్రవీణ్ వంటి వారు ప్రత్యేకంగా విమానాలు నడుపుతున్నారంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా క్యాసినోలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉందని అర్థం చేసుకోవచ్చు.

మకావు, సింగపూర్, లాస్ వెగాస్, మాంటే కార్లో వంటి ప్రాంతాలకు ఎక్కువగా భారతీయులు క్యాసినోల కోసం వెళ్తుంటారు.

గోవాలోని బిగ్ డాడీ క్యాసినో

ఫొటో సోర్స్, Facebook/BigDaddy

భారత్‌లో క్యాసినోలు లేవా?

భారత్‌లో క్యాసినోలు ఉన్నాయి. వాటిలో గ్యాంబ్లింగ్ ఆటలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే అవి గోవా, సిక్కిం, డామన్ డయ్యూలలో మాత్రమే ఉన్నాయి.

ఇక్కడ బెట్టింగ్ అనేది చట్టబద్ధమే.

ప్రపంచ క్యాసినో మార్కెట్ గణాంకాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో క్యాసినో పెట్టొచ్చా?

బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అనే వాటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నిషేధించాయి. కాబట్టి క్యాసినోలను పెట్టడం అనేది ప్రస్తుతానికి ఇక్కడ సాధ్యం కాదు.

అందువల్లే బెట్టింగ్ గేమ్స్ ఆడాలనుకునే తెలుగు వాళ్లు గోవా లేదా నేపాల్, శ్రీలంక వంటి ప్రాంతాలకు వెళ్తుంటారు.

అయితే ఆదాయం పెంచుకునేందుకు విశాఖపట్నంలో ఫ్లోటింగ్ క్యాసినోలకు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ భావిస్తున్నట్లుగా గతంలో వార్తా పత్రిక మింట్ రిపోర్ట్ చేసింది.

క్యాసినోలోని కార్డులు

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయి?

ఇండియాలో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అనేవి రాష్ట్ర జాబితాలో ఉంటాయి. వాటిని అనుమతించాలా? లేక నిషేధించాలా? అనేది రాష్ట్రాలే నిర్ణయిస్తాయి. గోవాలో 21 ఏళ్లు నిండిన వారే క్యాసినో గేమ్స్ ఆడటానికి అర్హులు.

సిక్కింలో 18 ఏళ్లు నిండిన వారిని అనుమతిస్తారు.

భారత్‌లో గ్యాంబ్లింగ్‌ను 'గేమ్ ఆఫ్ చాన్స్', 'గేమ్ ఆఫ్ స్కిల్'గా విడతీసి చూస్తారు.

గేమ్ ఆఫ్ చాన్స్: అదృష్టం మీద ఆధారపడి ఆడే ఆటలు ఈ కేటగిరిలోకి వస్తాయి. ఈ ఆటలు ఆడాలంటే స్కిల్ పెద్దగా అవసరం లేదు. ఫలితం పూర్తిగా చాన్స్ మీద ఆధారపడి ఉంటుంది.

గేమ్ ఆఫ్ స్కిల్: ఈ ఆటలు ఆడాలంటే నైపుణ్యం కావాలి. వీటిని ఆడేవాళ్లకు ఒక వ్యూహం అంటూ ఉంటుంది. ప్లేయర్స్‌కు లాజికల్ థింకింగ్, ఎనలిటిక్ స్కిల్స్ వంటివి కావాలి.

క్యాసినో ఆదాయం

భారత్‌లో చాలా వరకు రాష్ట్రాలు, స్కిల్ ఆధారంగా నడిచే ఆటలను అనుమతిస్తున్నాయి. అదృష్టం మీద ఆధారపడి ఉండే ఆటలను నిషేధిస్తున్నాయి.

అయితే ఒక ఆట 'గేమ్ ఆఫ్ చాన్స్' పరిధిలోకి వస్తుందా? లేక 'గేమ్ ఆఫ్ స్కిల్' పరిధిలోకి వస్తుందా? అనేది నిర్ణయించడానికి స్పష్టమైన నిబంధనలు లేవు. అందువల్ల ఒక్కో రాష్ట్రం ఒక్కోలా వ్యవహరిస్తోంది.

ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్‌లో రమ్మీని నిషేధించారు. కానీ తమిళనాడులో అది లీగల్. ఇలా ఒకే ఆట విషయంలోనూ రాష్ట్రాల మధ్య భిన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి.

2012లో మద్రాస్ హైకోర్టు గ్యాంబ్లింగ్ ఆటగా పరిగణిస్తూ ఆన్‌లైన్ రమ్మీని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని సంబంధిత కంపెనీలు సుప్రీం కోర్టులో సవాలు చేశాయి. చివరకు రమ్మీని 'గేమ్ ఆఫ్ స్కిల్'గా పరిగణిస్తూ ఆ నిషేధాన్ని ఎత్తి వేసింది సుప్రీం కోర్టు.

పోకర్ విషయంలోనూ ఇదే వివాదం ఉంది. దీన్ని 'గేమ్ ఆఫ్ స్కిల్'‌గా చూడాలని కొందరు 'గేమ్ ఆఫ్ చాన్స్‌'గా చూడాలని మరికొందరు వాదిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, క్యాసినో పెట్టాలంటే ఏయే అనుమతులు కావాలి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో క్యాసినో పెట్టొచ్చా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)