కేరళ లాటరీ: అప్పుల బాధలు తట్టుకోలేక ఇల్లు అమ్మేస్తుంటే కోటి రూపాయల లాటరీ తగిలింది..

కేరళ కఠినమైన నిబంధనలు, సునిశిత పర్యవేక్షణతో లాటరీలను అనుమతిస్తుస్తుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేరళ కఠినమైన నిబంధనలు, సునిశిత పర్యవేక్షణతో లాటరీలను అనుమతిస్తుస్తుంది
    • రచయిత, చెరిలాన్ మొలాన్, మెరిల్ సెబాస్టియన్
    • హోదా, బీబీసీ న్యూస్

మహమ్మద్ బవా ఆశ్చర్యపోయే, ఊహించని ఒక వార్తను ఆయన స్నేహితుడు చెప్పారు. ఆ వార్త ఆయనకు ఎంతో సంతోషంతో పాటు చాలా ఉపశమనాన్ని కలిగించింది.

ఆయనకు అంత సంతోషం కలిగించిన అంశం ఏంటంటే... మహమ్మద్ బవా, కోటి రూపాయల లాటరీని గెలుచుకున్నారు. ఈ విషయాన్నే ఆయన స్నేహితుడు, బవాకు చెప్పారు. ఏడాది కాలంగా లాటరీ గెలిచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.

జులై 25న ఆయనకు కోటి రూపాయల లాటరీ తగిలింది. దీంతో నాలుగు రోజుల వ్యవధిలోనే కేరళలోని కసర్‌గడ్ పట్టణంలో ఆయన ఒక సెలెబ్రిటీగా మారిపోయారు.

భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో లాటరీ అనేది చట్టబద్ధమైనది కాదు. కానీ, కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం కఠినమైన నిబంధనలు, సునిశిత పర్యవేక్షణతో లాటరీలను అనుమతిస్తున్నాయి.

మహమ్మద్ బవా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. కొన్నేళ్లలో చేసిన అప్పులు ఆయనకు భారంగా మారాయి. వాటిని తిరిగి చెల్లించేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుల కారణంగా ఆయనతో పాటు వారి కుటుంబం కూడా ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

ఈ సమస్యకు చివరి పరిష్కారంగా, బాకీలు తీర్చడానికి ఇంటిని అమ్మేయాలని వారు నిర్ణయించుకున్నారు. లాటరీ తగిలిందని తెలియడానికి కొన్ని గంటల ముందే, ఒక కొనుగోలుదారుతో వారు ఇల్లు అమ్మకానికి సంబంధించి దాదాపుగా డీల్‌ను కుదుర్చుకున్నారు.

వీడియో క్యాప్షన్, మొత్తం రూపాయి కాయిన్లే ఇచ్చి, రూ.2.6 లక్షల బైక్ కొన్నారు

ఈ మేరకు ఇల్లు అమ్మకాన్ని ధ్రువీకరిస్తూ, అడ్వాన్స్ తీసుకోవడం కోసం జూలై 25వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు మహమ్మద్ బవా, కొనుగోలుదారును కలవాల్సి ఉంది.

అయితే, విధి ప్రణాళిక మరోలా ఉంది.

తన స్నేహితుడు గణేశ్, శుభవార్తను చెప్పిన క్షణాలను బవా గుర్తు పెట్టుకున్నారు.

మధ్యాహ్నం 3:20 గంటలకు గణేశ్ నుంచి బవాకు రోజూవారీ లాటరీ ఫలితాలకు సంబంధించిన వాట్సప్ మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే ఆయన నుంచి బవాకు ఫోన్ వచ్చింది.

''నాకు చాలా ఉపశమనం కలిగింది. మేమంతా ఆనందంలో మునిగిపోయాం. మా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను'' అని బీబీసీతో మహమ్మద్ బవా అన్నారు.

కోటి రూపాయల లాటరీలో పన్నులు పోగా, బవాకు రూ. 63 లక్షలు అందనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ డబ్బు ఆయన చేతికి ఎప్పుడు అందుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కానీ, ఆయన మాత్రం ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి వెంటనే అప్పులు తీర్చాలంటూ ఆయనను ఎవరూ వేధించట్లేదు.

''నేను లాటరీ గెలిచిన తర్వాత అప్పులు ఇచ్చిన వారు నెమ్మదించారు. మన దగ్గర ఏమీ లేనప్పుడు ప్రజలు మనల్ని వేధిస్తారు. నా దగ్గర తిరిగి చెల్లించడానికి డబ్బులు ఉన్నాయని ఒక్కసారి వారికి తెలిసిన తర్వాత వారంతా చల్లబడ్డారు'' అని మహమ్మద్ బవా చెప్పారు.

మహమ్మద్ బవాది మధ్యతరగతి కుటుంబం. ఒకప్పుడు వారికి ఎలాంటి అప్పులు లేవు. నిర్మాణ రంగంలో ఆయన కాంట్రాక్టర్‌గా పనిచేసేవారు. గత కొన్ని ఏళ్లుగా ఆయనకు చేతి నిండా పని దొరకలేదు. కరోనా మహమ్మారితో ఆయన పరిస్థితి మరింత దిగజారింది.

లాటరీ

ఫొటో సోర్స్, Getty Images

పని దొరక్క చాలా కష్టపడ్డారు. దానితో పాటు అప్పులు కూడా పెరుగుతూ పోయాయి. అప్పులతో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఆయనకు అయిదుగురు పిల్లలు. ఇటీవలే ఇద్దరికి పెళ్లి చేశారు. పిల్లల పెళ్లి ఖర్చుల కారణంగా ఆయన ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

ఖతర్‌లో మంచి ఉద్యోగం లభిస్తుందనే ఆశతో డబ్బులు కట్టి తన కుమారుడిని అక్కడికి పంపించారు. దీని కోసం కూడా అప్పు చేశారు.

ఎప్పటికైనా తన పని మళ్లీ పుంజుకుంటుందని, తిరిగి ఎలాగైనా అప్పులు చెల్లించగలనని ఆయన భావించారు. ఈ ఏడాది జూలై నాటికి ఆయన అప్పులు దాదాపు రూ. 50 లక్షలకు చేరాయి.

''పెళ్లి ఖర్చులే దాదాపు 10 నుంచి 15 లక్షలు అయ్యాయి. ఆదాయం లేదు. కానీ, అందరికీ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది'' అని ఆయన చెప్పారు.

పెరుగుతోన్న అప్పులతో కుటుంబసభ్యులు నిత్యం వేదనకు గురయ్యారు. మరో ఆదాయ మార్గం దొరకకపోవడంతో తీసుకున్న అప్పులు తీర్చేందుకు వారు ఇల్లు అమ్మేయాలనే కఠిన నిర్ణయానికి వచ్చారు.

ఈ మధ్యే వారు ఆ ఇంటిని కట్టుకున్నారు. కానీ, అప్పుల బాధతో దాన్ని అమ్మేయాలని అనుకున్నారు. అద్దెకు ఉండటానికి మరో ఇంటిని కూడా మహమ్మద్ బవా వెదికారు.

అయితే, ఏడాది కాలంగా లాటరీల రూపంలో తన అదృష్టాన్ని వెదుక్కుంటున్నారు మహమ్మద్ బవా. కానీ, ఆయన అందులో విజయం దక్కలేదు. లక్షల్లో ఒక్కరిని మాత్రమే అదృష్టం వరించే అవకాశం ఉండటంతో, లాటరీ తగలాలంటే అద్భుతం జరగాలనే సంగతి తనకూ తెలుసునని ఆయన చెప్పారు. ఇక చేసేదేం లేక ఇంటిని అమ్మకానికి పెట్టారు.

వీడియో క్యాప్షన్, రూ.500 పెట్టి టికెట్ కొంటే, రూ.2.5 కోట్ల లాటరీ తగిలింది..

తన స్నేహితుడు గణేశ్, లాటరీ టిక్కెట్లను విక్రయిస్తారు. ఆయన నుంచి మహమ్మద్ రోజూ లాటరీ టిక్కెట్లు కొనేవారు. కానీ, రోజూ ఆయనకు నిరాశే ఎదురయ్యేది. ఏడాది కాలంగా రోజూ ఇదే జరిగింది.

అయితే, మహమ్మద్ బవా లాటరీ గెలిచినట్లు తెలుసుకున్న గణేశ్ వెంటనే ఆయనకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు.

''నువ్వు బతికిపోయావ్ బవా' అంటూ గణేశ్ తనతో ఫోన్‌లో చెప్పినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. నిజంగానే ఆయనను ఈ లాటరీ కాపాడింది.

ఈ వార్త చెప్పడం కోసం గణేశ్ ఫోన్ చేసినప్పుడు బవాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు చాలా సంతోషపడ్డారు. ఆనందాన్ని వ్యక్తం చేయడానికి మాటలు రాలేదని అన్నారు.

లాటరీలో గెలుచుకున్న ప్రైజ్‌మనీ పెద్దమొత్తంగా కనిపించవచ్చు. కానీ, అప్పులు అన్నీ తీర్చాక అందులో కొంత మాత్రమే ఆయన వద్ద మిగులుతుంది. దాన్ని మంచి పనుల కోసం వినియోగించాలని బవా అనుకుంటున్నారు.

''గణేశ్‌కు సొంత ఇల్లు లేదు. ఆయన కూడా కష్టాలు పడుతున్నారు. ఆయన ఇల్లు కొనుగోలులో నేను సహాయం చేస్తా'' అని బవా చెప్పారు.

కొంత డబ్బును పేద ప్రజలకు ఇచ్చేస్తానని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)