బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా: పబ్‌జీకి ప్రత్యామ్నాయంగా మారిన బీజీఎంఐ గేమ్‌ను భారత్ ఎందుకు బ్లాక్ చేసింది?

పబ్‌జీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మెర్లిన్ సెబాస్టియన్
    • హోదా, బీబీసీ న్యూస్

ప్లేయర్ అన్‌నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్ (పబ్‌జీ) తరహాలో పాపులర్ అయిన ఒక వీడియో గేమ్‌ను భారత్ బ్లాక్ చేసింది.

గూగుల్, యాపిల్ స్టోర్‌ల నుంచి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) గేమ్‌ను తొలగించారు.

ప్రభుత్వ ఆదేశాల వల్లే ఈ యాప్‌ను బ్లాక్ చేసినట్లు గూగుల్ స్పష్టంచేసింది. మరోవైపు తమ యాప్‌ను తొలగించారనే వార్తలను యాప్ డెవలపర్ క్రాఫ్టన్ ధ్రువీకరించింది. ఎందుకు చర్యలు తీసుకున్నారనే అంశంపై తాము అధికారులతో మాట్లాడుతున్నట్లు సంస్థ పేర్కొంది.

చైనాకు చెందిన కొన్ని యాప్‌లను 2020లో భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఆ యాప్‌లలో పబ్‌జీ కూడా ఒకటి. ప్రస్తుతం దాన్ని రీబ్రాండ్ చేసి బీజీఎంఐగా తీసుకొచ్చారు.

లద్దాఖ్ సరిహద్దుల్లో రెండు దేశాల మధ్య (భారత్-చైనా) ఘర్షణల నడుమ 2020లో భారత్ చర్యలు తీసుకుంది.

భిన్న దశల్లో వీచాట్, టిక్‌టాక్ లాంటి యాప్‌లను పూర్తిగా భారత్ నిషేధించింది.

‘‘భద్రతాపరమైన ఆందోళనలు, భారతీయుల డేటా విదేశాలకు వెళ్లిపోవడం లాంటి ముప్పుల నడుమ భారత్ చర్యలు తీసుకుంది. ముఖ్యంగా సరిహద్దుల్లో ఘర్షణల నడుమ చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ నిషేధం విధించింది’’అని టెక్ నిపుణుడు ప్రశాంత్ కే రాయ్ చెప్పారు.

పబ్‌జీ

ఫొటో సోర్స్, PUBG

దక్షిణ కొరియా టు చైనా..

దక్షిణ కొరియాకు చెందిన క్రాఫ్టన్ సంస్థ పబ్‌జీను డెవలప్ చేసింది. భారత్‌లో టెన్సెంట్ గేమ్స్ సంస్థ ద్వారా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సంస్థ చైనాకు చెందిన టెన్సెంట్ హోల్డింగ్స్‌లో భాగం.

అయితే, 2021లో టెన్సెంట్‌ గేమ్స్‌తో తెగదెంపులు చేసుకొని బీజీఎంఐను ఆవిష్కరిస్తున్నట్లు క్రాఫ్టన్ తెలిపింది. ఏడాదిలోనే ఈ గేమ్ యూజర్ల సంఖ్య 10 కోట్ల మందికి పెరిగింది.

గత జూన్‌లో మళ్లీ పబ్‌జీ వార్తల్లో నిలిచింది. నిషేధం అమలులో ఉన్నప్పటికీ, లఖ్‌నవూలో 16ఏళ్ల బాలుడు తనను పబ్‌జీ ఆడనివ్వలేదని తల్లిని తుపాకీతో కాల్చిచంపినట్లు వార్తలు వచ్చాయి.

దీనిపై పార్లమెంటులోనూ చర్చ జరిగింది. ఆ గేమ్‌లలో హింస గురించి కొందరు ఎంపీలు మాట్లాడారు.

ఈ యాప్‌లపై అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం స్పందిస్తూ.. ‘‘రీబ్రాండింగ్‌తోపాటు అలాంటి యాప్‌లపైనా దృష్టి సారిస్తున్నాం’’అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వీడియో క్యాప్షన్, భారత్, చైనా సరిహద్దుల్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఇదీ పరిస్థితి..

చైనానే లక్ష్యం..

బీజీఎంఐపై ప్రస్తుత నిషేధం.. చైనా యాప్‌లపై నిషేధాన్ని మళ్లీ గుర్తుచేసిందని రాయ్ అన్నారు.

‘‘2020 తర్వాత అలాంటి యాప్‌లను భారత్ జల్లెడపడుతూ వస్తోంది. మన దేశంతో సరిహద్దులున్న దేశం నుంచి వస్తున్న డబ్బులతో నడిచే యాప్‌లపైనా ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది’’అని ఆయన అన్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో అప్పులు ఇచ్చే కొన్ని యాప్‌లపై భారత్ ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు దృష్టి సారించాయి.

‘‘ఈ యాప్‌లలో నియంత్రణ లోపాలు ఉన్నాయి. పరిశీలనలో అవి బయటపడి ఉండొచ్చు. అయితే, ప్రధానమైన ఆందోళన మాత్రం చైనా మూలాల వల్లే’’అని రాయ్ అన్నారు.

ప్రస్తుతం బీజీఎంఐను దక్షిణ కొరియాకు చెందిన క్రాఫ్టన్ అందిస్తున్నప్పటికీ, టెన్సెంట్ హోల్డింగ్స్‌కు చెందిన ఫ్రేమ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు దీనిలో 13.6 శాతం షేర్ ఉంది.

‘‘ప్రస్తుతం మరింత కఠినంగా వ్యవహరిస్తుండటంతో చైనా మూలాలున్న, చైనా నుంచి పెట్టుబడులు వస్తున్న యాప్‌లు మనుగడ సాగించడం చాలా కష్టం’’అని రాయ్ అన్నారు.

వీడియో క్యాప్షన్, సరిహద్దుల్లో భారత సైనికులకు సాయం చేస్తున్న యాక్‌లు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)