‘రోజుకు ఒక గంట మాత్రమే’.. పిల్లల ఆన్‌లైన్ గేమింగ్‌పై చైనా కొత్త నిబంధన

ఫొటో సోర్స్, GETTY IMAGES
చైనాలో 18 ఏళ్ల లోపు పిల్లలకు ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడేందుకు ఒక్క గంట మాత్రమే అనుమతి ఉంటుందని, అది కూడా శుక్రవారాలు, వారాంతాలు, సెలవు దినాల్లో మాత్రమే ఆడాలని చైనా వీడియో గేమ్ రెగ్యులేటర్ తెలిపింది.
అంతే కాకుండా, ఉదయం 8.00 నుంచి రాత్రి 9.00 గంటల మధ్య మాత్రమే గేమ్స్ ఆడేందుకు అనుమతి ఉంటుందని ది నేషనల్ ప్రెస్, పబ్లికేషన్ అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వ మీడియా సంస్థ జిన్హువాకు తెలిపాయి.
ఈ నిర్ణీత సమయాల్లో కాక ఇతర సమయాల్లో పిల్లలు గేమ్స్ ఆడకుండా నిరోధించాలని గేమింగ్ కంపెనీలకు సూచించాయి.
ఆన్‌లైన్ గేమ్స్‌ను "ఆధ్యాత్మిక నల్లమందు" (స్పిరిచ్యువల్ ఓపియం)గా ఒక ప్రభుత్వ మీడియా సంస్థ ఈ నెల ప్రారంభంలో పేర్కొంది.
ఆన్‌లైన్ గేమ్స్‌పై విధించిన నిబంధనలన్నింటినీ గేమింగ్ కంపెనీలు అమలు చేస్తున్నాయో లేదో గమనించేందుకు తనిఖీలు కూడా పెరగనున్నాయని రెగ్యులేటర్ తెలిపింది.
ఇంతకుముందు, రోజుకు 90 నిముషాలపాటు ఆన్‌లైన్ గేమ్స్ ఆడేందుకు పిల్లలను అనుమతించేవారు. సెలవు దినాల్లో మూడు గంటలు పాటు ఆడుకునేందుకు అనుమతి ఉండేది.
ఆన్‌లైన్ గేమ్స్ అతిగా ఆడడం వల్ల చిన్నారులపై కలిగే దుష్ప్రభావాల గురించి చాలాకాలంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
చాలామంది టీనేజర్లు ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలు అవుతున్నారని, ఇది వారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని గతంలో ప్రభుత్వ మీడియా సంస్థ ఎకనామిక్ ఇన్‌ఫర్మేషన్ డైలీ ఒక కథనాన్ని ప్రచురించింది.
కొత్త నిబంధనలు ప్రకటించడానికి ఒక నెల ముందు ఈ కథనం వచ్చింది. అనంతరం, చైనాలోని కొన్ని పెద్ద పెద్ద ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీల షేర్ల విలువ గణనీయంగా పడిపోవడం ప్రారంభమైంది.

ఫొటో సోర్స్, Edwin Tan
రాత్రి 10.00 నుంచి ఉదయం 8.00 వరకు పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్ ఆడకుండా నిరోధించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) పద్ధతిని అమలు చేస్తున్నట్లు చైనా గేమింగ్ దిగ్గజం టెన్సెంట్ జూలైలో ప్రకటించింది.
పిల్లలు గేమ్స్ ఆడేందుకు పెద్దల ఐడీలు ఉపయోగించే అవకాశాలు ఉన్నాయనే సందేహాలు వ్యక్తం కావడంతో ఈ ముఖ గుర్తింపు పద్ధతిని ప్రవేశపెట్టారు.
"చైనాలో గేమింగ్ అడిక్షన్, దాని వలన యువతపై కలిగే దుష్ప్రభావల పట్ల చాలాకాలంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం విస్తరణ, యువతపై అది చూపించగలిగే ప్రతికూల ప్రభావాల పట్ల చైనాలో సందేహాలు పెరుగుతూ వస్తున్నాయి.
ఈ దిశలో చైనా అనేక సంస్కరణలను చేపట్టింది. వాటిలో భాగంగా పిల్లలకు ఆన్‌లైన్ గేమింగ్ సమయాన్ని తగ్గించాలనే నిర్ణయం తీసుకుంది.
దీని ద్వారా యువతలో ఓ "కొత్త ఉత్సాహాన్ని" తీసుకురావాలని, వారికి "సరైన విలువల"ను బోధించాలని చైనా భావిస్తోంది.
ఈ నిర్ణయాన్ని అనేకమంది పిల్లల తల్లిదండ్రులు ఆహ్వానించినప్పటికీ, చైనా సోషల్ మీడియా వీబోలో కొంతమంది విమర్శిస్తున్నారు.
ఈ రకమైన ప్రభుత్వ జోక్యం "అసమంజసమైనదని", ఏకపక్షంగా" ఉందని అంటున్నారు" అని బీబీసీ ప్రతినిధి జావోయిన్ ఫెంగ్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- చంద్రుడు లేకుంటే భూమికి మనుగడే లేదా... నేలకూ, జాబిలికీ ఉన్న బంధమేంటి?
- చైనాలోని వుహాన్ ల్యాబ్‌లో ప్రమాదకర రీసెర్చ్ కోసం అమెరికా నిధులిచ్చిందా
- అఫ్గానిస్తాన్: కాబుల్ విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఎన్నెన్నో గండాలు
- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ టిబెట్ పర్యటన భారత్‌కు ఇస్తున్న సందేశం ఏంటి?
- కాబుల్ విమానాశ్రయం బయట ఏడుగురు అఫ్గాన్ పౌరులు మృతి - బ్రిటన్ రక్షణ శాఖ
- #BeingDalit: హైదరాబాద్- 'ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నా కులంతో పనేంటి?'
- అమెరికా: బానిసత్వంలో మగ్గిన నల్ల జాతీయులకు పరిహారమే పరిష్కారమా?
- బ్రిటన్‌లోని భారతీయులు దైవభాష సంస్కృతం ఎందుకు నేర్చుకుంటున్నారు?
- బ్రిటన్, అమెరికాల్లో క్రిస్మస్ను నిషేధించినప్పుడు ఏం జరిగింది
- చైనాలో చర్చిలపై ఉక్కుపాదం... ప్రశ్నార్థకంగా మారిన మత స్వేచ్ఛ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








