వుహాన్ ల్యాబ్: చైనాలో ప్రమాదకర రీసెర్చ్ కోసం అమెరికా నిధులిచ్చిందా

డాక్టర్ ఫౌచీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రియాలిటీ చెక్ టీం
    • హోదా, బీబీసీ న్యూస్

కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన చర్చ ఇంకా కొనసాగుతుండగానే అమెరికా నిధులను ఉపయోగించి చైనాలో వైరస్‌పై అధ్యయనం చేశారంటూ కొత్త వివాదమొకటి మొదలైంది.

వుహాన్‌లోని ఒక ల్యాబ్ నుంచి వైరస్ లీకయి ఉండొచ్చన్న నిరూపణ కాని ఒక సిద్ధాంతానికి ఈ అధ్యయనానికి సంబంధం ఉంది.

ప్రపంచంలోని మొట్టమొదటి కరోనా కేసు ఈ వుహాన్ నగరంలోనే నమోదైంది.

అమెరికా నిధులను ఉపయోగించి చేసిన 'గెయిన్ ఆఫ్ ఫంక్షన్' అధ్యయనాలు కొన్ని వైరస్‌లను(కరోనా వైరస్ కాదు) తయారుచేశాయని రిపబ్లికన్ పార్టీ సెనేటర్ రేండ్ పాల్ ఆరోపించారు.

అయితే, ఆ ఆరోపణలను అమెరికా సాంక్రమిక వ్యాధుల చీఫ్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీ తీవ్రంగా ఖండించారు.

దోమ

ఫొటో సోర్స్, Getty Images

'గెయిన్ ఆఫ్ ఫంక్షన్' రీసెర్చ్ అంటే ఏమిటి?

ఒక జీవి కొత్త సామర్థ్యాలను సంతరించుకోవడాన్ని 'గెయిన్ ఆఫ్ ఫంక్షన్' అంటారు.

ఇది ప్రకృతి సహజంగా జరగొచ్చు, లేదంటే ప్రయోగశాలలో ఈ సామర్థ్యాలను సాధించొచ్చు.

జీవుల జెనెటిక్ కోడ్ మార్చడం ద్వారా కానీ, భిన్నమైన వాతావరణం, పరిసరాలలో జీవులను ఉంచడం ద్వారా కానీ సైంటిస్టులు ఈ మార్పులు కలిగేలా చేస్తారు.

కరోనావైరస్ సోకిన మానవ కణం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కరోనావైరస్ సోకిన మానవ కణం

కరవుకాటకాలను తట్టుకునే వంగడాలను సృష్టించడం, దోమలను వ్యాధులను వ్యాపింపజేసే గుణాన్ని తగ్గించేలా చేయడం వంటివి దీనికి ఉదాహరణలు.

ఇలాంటి అధ్యయనాలతో ముప్పు ఎక్కువే అయినప్పటికీ వైరస్‌లు ఎలా అభివృద్ధి చెందుతాయో తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో ప్రబలే మహమ్మారులను ఎదుర్కోవడానికి, వ్యాక్సీన్‌లు కనిపెట్టడానికి అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వుహన్ ల్యాబ్

ఫొటో సోర్స్, Reuters

చైనాలో వైరస్ రీసెర్చ్ కోసం అమెరికా ఖర్చు చేసిందా?

అవును, అమెరికా ఈ రీసెర్చ్‌కు కొంత కంట్రిబ్యూట్ చేసిందని డాక్టర్ ఫౌచీ అన్నారు.

డాక్టర్ ఫౌచీ అమెరికా ప్రభుత్వానికి చెందిన 'నేషనల్ ఇనిస్టిట్యూ ఆఫ్ హెల్త్'(ఎన్ఐహెచ్) అనుబంధ 'అలర్జీలు, సాంక్రమిక వ్యాధుల జాతీయ సంస్థ, అమెరికా'(ఎన్ఐఏఐడీ)కు డైరెక్టర్ మాత్రమే కాదు ఆ దేశాధ్యక్షుడు బైడెన్ సలహాదారు కూడా.

వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసిపనిచేసే సంస్థ 'ఎకో హెల్త్ అలయన్స్'కు ఎన్ఐహెచ్ నిధులిచ్చింది.

గబ్బిలాల నుంచి కరోనావైరస్ వస్తుందా అనేది కనుగొనేందుకు అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎకో హెల్త్ అలయన్స్‌కు 2014లో నిధులు మంజూరు చేసింది ఎన్ఐహెచ్.

ఎకో హెల్త్‌కు ఎన్ఐహెచ్ నుంచి 37 లక్షల డాలర్ల నిధులు అందాయి.

2019లో ఈ ప్రాజెక్టును పొడిగించారు. అయితే, కరోనావైరస్ ప్రబలిన తరువాత అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వం 2020 ఏప్రిల్‌లో దీన్ని నిలిపివేసింది.

సెనేటర్ రేండ్ పాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెనేటర్ రేండ్ పాల్

'గెయిన్ ఆఫ్ ఫంక్షన్' కోసం అమెరికా నిధులనే వెచ్చించారా?

అయితే, వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో 'గెయిన్ ఆఫ్ ఫంక్షన్' ప్రయోగాల కోసం ఎన్ఐహెచ్ నిధులివ్వలేదని డాక్టర్ ఫౌచీ మే నెలలో చెప్పారు.

'కాంగ్రెస్‌కు అబద్ధం చెప్పడం నేరం. మీరు మీ ప్రకటనను ఉపసంహరించుకుంటున్నారా?' అని కొద్దిరోజుల కిందట సెనేటర్ రేండ్ పాల్ డాక్టర్ ఫౌచీని అడిగారు.

ఆ రీసెర్చ్ 'గెయిన్ ఆఫ్ ఫంక్షన్' కిందకే వస్తుందని రేండ్ పాల్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ 2015, 2017లో ప్రచురించిన రెండు పత్రాలను కూడా ఆయన ప్రస్తావించారు.

రేండ్ పాల్ అభిప్రాయానికి ప్రముఖ సైంటిస్ట్ ప్రొఫెసర్ రిచర్డ్ ఎబ్రైట్ నుంచి మద్దతు లభించింది.

'పాల్ ప్రస్తావించిన రెండు రీసెర్చ్ పేపర్లలో కొత్త వైరస్‌లు(అంతకుముందు సహజసిద్ధంగా ఉనికిలో లేనివి) తయారైనట్లు ఉంది. మరింత సాంక్రమిక శక్తి గల వ్యాధికారక క్రిములను సృష్టించడంలో రిస్క్ చేసినట్లు ఆ పత్రాలలో ఉంద''ని ప్రొఫెసర్ రిచర్డ్ ఎబ్రైట్ 'బీబీసీ'తో చెప్పారు.

ఆ పత్రాలలో పేర్కొన్న అధ్యయనం అంతా 'గెయిన్ ఆఫ్ ఫంక్షన్' కిందకే వస్తుందని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)