RSS-BJP: ఆరెస్సెస్‌ను మాయల ఫకీరుతో పోల్చిన 64 పేజీల పుస్తకంలో ఏముంది, బీజేపీ స్పందన ఏంటి

ఆరెస్సెస్

ఫొటో సోర్స్, Imran Qureshi

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్‌)పై కన్నడ రచయిత దేవానురూ మహాదేవ రాసిన చిన్న పుస్తకం ‘‘ఆరెస్సెస్ అలా మట్టూ ఆగాలా (ఆరెస్సెస్ లోతుపాతులు)’’ వైరల్ అవుతోంది. దీనిపై ఆరెస్సెస్ స్పందించలేదు. కానీ, బీజేపీ మాత్రం ఈ పుస్తకాన్ని ‘‘చెత్తబుట్ట’’గా వ్యాఖ్యానించింది.

ఈ పుస్తకానికి డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. రచయితతో సంబంధం లేకుండానే ఆన్‌లైన్‌లో కాపీలు డౌన్‌లోడ్ చేసుకుని దీన్ని ముద్రించి అమ్ముతున్నారు. ఇప్పటికే హిందీ, తమిళ్, తెలుగు, ఆంగ్ల భాషల్లోకి దీన్ని అనువదించారు.

క్షేత్రస్థాయిలో మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు దీన్ని ప్రచురిస్తున్నాయి. కర్నాటక కలబుర్గీ జిల్లాలో పరిస్థితి దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేబీ హెడ్గేవార్, ప్రముఖ ఆరెస్సెస్ సర్‌సంఘ్‌చాలక్‌ ఎంఎస్ గోల్వాల్కర్ తో పాటు, హిందూ మహాసభ నేత వీడీ సావర్కర్‌ వ్యాఖ్యలను ఈ పుస్తకంలో ఉటంకించారు. బీజేపీ నాయకులు కూడా రహస్యంగా ఈ పుస్తకాన్ని పంపిణీ చేస్తున్నారని మహాదేవ అంటున్నారు.

వీడీ సావర్కర్

ఫొటో సోర్స్, SAVARKARSMARAK.COM

ఫొటో క్యాప్షన్, వీడీ సావర్కర్

‘‘ఆరెస్సెస్-ఒక మాయల ఫకీరు’’

ఈ పుస్తకంపై మైసూర్ యూనివర్సిటీకి చెందిన న్యాయ విద్యార్థి శ్రమ్ కుమార్ బీబీసీతో మాట్లాడారు.

‘‘చాలా మంది విద్యార్థులు ఈ పుస్తకాన్ని చదివారు. మేం 2,000 కాపీలు ముద్రించాం. నాలుగు రోజుల్లోనే చాలావరకు అమ్ముడు అయిపోయాయి. ప్రస్తుతం మా దగ్గర ఒక వంద కాపీలు మాత్రమే మిగిలాయి. మరిన్ని కాపీలు ముద్రించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. మాండ్యలోని షెడ్యూల్ కులాలు, షెడ్యూలు తెగల హాస్టళ్ల దగ్గర భారీగా కాపీలు అమ్ముడయ్యాయి. స్థానిక టీస్టాల్ దగ్గరకు మేం కొన్ని కాపీలు తీసుకెళ్లాం. అక్కడ ఒక్కొక్కటి రూ.30 పెట్టి అన్ని కాపీలు కొనేవారు’’అని ఆయన చెప్పారు.

మరోవైపు ఉత్తర కర్నాటకలోని కలబుర్గి జిల్లాలోని ప్రభుతా భారత్ సంఘర్ష సమితిగా పిలిచే మహిళా సంఘం కూడా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తోంది. ఈ సంఘానికి చెందిన అశ్వినీ మగాంకర్ బీబీసీతో మాట్లాడారు. ‘‘కొన్ని రోజుల్లోనే మా కాపీలన్నీ అమ్ముడు పోయాయి. కాపీలు కావాలని స్థానికులతోపాటు బీదర్ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. మేం మరికొన్ని కాపీలు కూడా ముద్రించబోతున్నాం’’అని ఆమె చెప్పారు.

దేవానురూ మహాదేవ

ఫొటో సోర్స్, Anurag Basavaraj

ఫొటో క్యాప్షన్, దేవానురూ మహాదేవ

కాల్పనిక రచనలు, విమర్శలకు మహాదేవ పెట్టింది పేరు. తాజా పుస్తకంలో ఆరెస్సెస్‌ను ‘‘మాయల ఫకీరు’’తో ఆయన పోల్చారు. ఆ మాయల ఫకీరు ప్రాణాలు సప్త సముద్రాల అవతల చిలుకలో ఉన్నాయని చెప్పారు. ఆ చిలుకను చంపితేనే మాయల ఫకీరు అంతం అవుతాడని వ్యాఖ్యానించారు.

మనుస్మృతిలో ప్రస్తావించిన వర్ణ వ్యవస్థను ప్రోత్సహించేందుకే అందరూ ‘‘భగవద్గీత’’ చదవాలని ఆరెస్సెస్ ఒత్తిడి చేస్తోందని మహాదేవ చెప్పారు. అందుకే మన రాజ్యాంగాన్ని కూడా వారు ‘‘కాపీ పేస్ట్’’గా విమర్శిస్తారని అన్నారు.

‘‘ఆరెస్సెస్‌కు రాజ్యాంగం ఒక పీడకల లాంటిది. ఎందుకంటే తల బ్రాహ్మణుడిగా.. భుజాలు క్షత్రియులుగా.. తొడలు వైశ్యులుగా.. పాదాలు దళితులుగా చెప్పుకునే వారి దేవుడిని మనపై రుద్దడానికి రాజ్యాంగం అడ్డుగా నిలుస్తోంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆరెస్సెస్

ఫొటో సోర్స్, FACEBOOK@RSSORG

ఎలా సమర్థిస్తారు?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఓబీసీ కులానికి చెందినవారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజన వ్యక్తి... ఇలాంటి పరిస్థితుల్లో మనుస్మృతిని ఆరెస్సెస్ రుద్దాలని చూస్తుందనే ఆరోపణలను ఎలా సమర్థించుకోగలరు? అని మహాదేవను బీబీసీ ప్రశ్నించింది.

‘‘ముందు మనం నిజాలను అర్థం చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఒక రాజ్యాంగం అంటూ లేదు. ఆరెస్సెస్ దీన్ని నడిపిస్తోంది. వీరి దేవుడు నాగ్‌పుర్‌లో కూర్చుంటాడు. ఆ దేవుడి ఆదేశాలతోనే బీజేపీ నాయకులంతా నడుచుకుంటారు. దేవుడి చేతిలో నుంచి ఒక పువ్వు పడినా దీన్ని వారు సంకేతంగా భావిస్తారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘అందుకే ఆరెస్సెస్ అధినాయకులను ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ నాయకులు పోటీపడుతుంటారు. అందుకే ఇలాంటి రాజ్యాంగంలేని పార్టీలో శక్తిమంతమైన నాయకులు మనుగడ సాగించలేరు. ఇప్పుడు మోదీని ఒక ఓబీసీ నాయకుడిగానే చూద్దాం. ఆయన ఓబీసీలకు ఏమైనా చేసారా? ఆయన హయాంలో ఓబీసీలు ఏమైనా ప్రత్యేక ప్రయోజనాలు పొందారా? వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ఏమైనా చేసారా? నాకైతే ఏమీ కనిపించడం లేదు. కానీ, కోటీశ్వరులపై ఆయన పన్నులు తగ్గించారు’’అని మహాదేవ అన్నారు.

ఆరెస్సెస్

ఫొటో సోర్స్, Getty Images

‘‘కోటీశ్వరులకు రుణ మాఫీ చేశారు. ప్రభుత్వ ఆస్తులను చవకగా అమ్మేస్తున్నారు. దీంతో కోటీశ్వరుల ఆస్తులు మరింత పెరుగుతున్నాయి. వారికే మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నారు. ఇదివరకు రాజులు, భూస్వాములు పాలించేటప్పుడు.. చతుర్వర్ణాశ్రమ వ్యవస్థకు పెద్దపీట వేసేవారు. దీనికి మద్దతు ఇచ్చినవారే పాలకులుగా కొనసాగారు. ఇప్పుడు మనల్ని ఎవరు పాలిస్తున్నారు? మనం ఎటు వెళ్తున్నాం? మనకు కనిపిస్తున్నది మాత్రమే మనం నమ్మకూడదు. ఇంకా చాలా జరుగుతున్నాయి’’అని ఆయన వ్యాఖ్యానించారు.

అంటే ఓబీసీ వ్యక్తి ప్రధాన మంత్రిగా, గిరిజన వ్యక్తి రాష్ట్రపతిగా ఉన్న పెద్ద ప్రయోజనం లేదని అంటారా? అని మహాదేవను బీబీసీ ప్రశ్నించింది.

ఈ ప్రశ్నపై ఆయన స్పందిస్తూ.. ‘‘నాకు చాలా బాధగా ఉంది. ఆదివాసీలు మాత్రమే ఇక్కడి నిజమైన ప్రజలు. వారిని మూలవాసులుగా పిలిచేవారు. కానీ, ఇప్పుడు ఆ పేరు నుంచి వారిని దూరం చేసి.. వనవాసులుగా పిలుస్తున్నారు. ఇక్కడ మనం గిరిజన ప్రాంతాల్లో సంఘ్ పరివార్ నడుపుతున్న వనవాసి కల్యాణ ఆశ్రమ్‌ల గురించి చెప్పుకోవాలి’’అని ఆయన వ్యాఖ్యానించారు.

మహాదేవ రాసిన పుస్తకాన్ని ‘‘చెత్తబుట్ట’’గా ఆరెస్సెస్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.

దేవానురూ ప్రాంతానికి చెందిన మహాదేవ.. తన పుస్తకంలో గోల్వాల్కర్, సావర్కర్, ఆరెస్సెస్ ప్రముఖుల సిద్ధాంతాలను ఉటంకించినట్లు చెబుతున్నారు.

‘‘ఈ పుస్తకాన్ని చెత్తబుట్టగా పిలిస్తే.. గోల్వాల్కర్, సావర్కర్‌ల సిద్ధాంతాలను కూడా వారు చెత్తబుట్టలుగానే పరిగణిస్తారా?’’అని ఆయన ప్రశ్నించారు.

దేవానురూ మహాదేవ

ఫొటో సోర్స్, Anurag Basavaraj

ఫొటో క్యాప్షన్, దేవానురూ మహాదేవ

ఎవరీ మహాదేవ?

విద్రోహి సాహిత్య ఆందోళన కు చెందిన ప్రముఖ రచయితల్లో మహాదేవ కూడా ఒకరు. సామాజిక, ఆర్థిక న్యాయం కోసం ఆయన తరచూ రచనలు చేస్తుంటారు.

ఆయన రెండో నవల ‘‘ఓడాలాలా’’ పది లక్షల కాపీల కంటే ఎక్కువే అమ్ముడుపోయింది.

మహాదేవ మూడో నవల ‘‘కుసుమాబల్లె’’ అత్యంత ప్రచారణ పొందిన కన్నడ నవలల్లో ఒకటి. దీనికిగాను ఆయనకు సాహిత్య అకాడమీ అవార్డు కూడా దక్కింది.

ఈ పుస్తకం రాసేటప్పుడు కనీసం వెయ్యి కాపీలు అమ్ముడుపోయినా చాలని మహాదేవ అనుకున్నారు. కానీ, లక్ష కంటే ఎక్కువ కాపీలు అమ్ముడయ్యాయి.

వీడియో క్యాప్షన్, కాళి: ఈ వివాదం ఎందుకు?

ప్రాథమిక విద్యాభ్యాసం కన్నడ భాషలో జరగడంలేదని 2010లో నృపతుంగ అవార్డును తీసుకునేందుకు ఆయన నిరాకరించారు.

2015లో పద్మశ్రీ, సాహిత్య అకాడమీ అవార్డులను కూడా ఆయన తిరిగి ఇచ్చేశారు.

రచయితల వర్గం నుంచి రాజ్యసభకు వెళ్లాలని 1990లలోనే మహాదేవకు ఆహ్వానం అందింది. అయితే, దాన్ని ఆయన తిరస్కరించారు.

అయితే, ఆయన రాసిన పుస్తకాన్ని ఎందుకు అంతమంది చదువుతున్నారు? అని ప్రశ్నించినప్పుడు.. ‘‘ఈ ప్రశ్నకు నేనేం సమాధానం చెబుతాను’’అని ఆయన అన్నారు.

ఆరెస్సెస్

ఫొటో సోర్స్, Getty Images

భగవద్గీత, రాజ్యాంగం మధ్య సంబంధమేంటి?

ఈ ప్రశ్నపై మహాదేవ స్పందిస్తూ.. ‘‘చతుర్వర్ణ వ్యవస్థను దేవుడు సృష్టించాడని అనుకోవడం నిజంగా ఒక విధ్వంసం లాంటిది. నిజానికి ఒరిజినల్ మహాభారతంలో అది లేకపోయి ఉండొచ్చు. మహాభారతంలోకి దీన్ని శంకరాచార్య చొప్పించినట్లు చెబుతుంటారు. ఇదేమీ నేను చెబుతున్నది కాదు. ఇవి స్వామి వివేకానంద మాటలు. వాటిని నిజమనే నేను కూడా నమ్ముతున్నాను’’అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, మోదీ పార్లమెంటు కొత్త భవనంపై మూడు సింహాల విగ్రహాన్ని ఆవిష్కరించడం రాజ్యాంగ విరుద్ధమా?

అయితే, భగవద్గీతను పూర్తిగా ఆయన తిరస్కరించడం లేదు. ‘‘దీన్ని చాలా తెలివైన వారు రాశారు. అయితే, దీనిలో చతుర్వర్ణ వ్యవస్థలాంటి వాటిని చొప్పించారు. ఇది నిజంగా దారుణం. ప్రస్తుతం దానిలో చాలా వివక్షాపూరిత అంశాలను కలిపేశారు’’అని మహాదేవ్ అన్నారు.

‘‘అయితే, నేటి పరిస్థితుల్లో మన ముందు ఒక ప్రశ్న తలెత్తుతుంది. హిందూ మతంలోని చతుర్వర్ణాశ్రమాన్ని ప్రోత్సహిస్తున్న భగవద్గీత.. రాజ్యాంగంపై ఎదురుదెబ్బ లాంటిది కాదా?’’అని ఆయన ప్రశ్నించారు.

‘‘ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు నిరుద్యోగంతో బాధపడుతున్నారు. కానీ, ఇస్లాం, క్రైస్తవమే అన్ని సమస్యలకూ మూలమని ఆరెస్సెస్ చెబుతోంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘నిరుద్యోగం ఇలా పెరిగినప్పుడు పేదలకు ఆహారం ఎలా దొరుకుతుంది? అప్పుడు విద్వేషమే ఆహారం అవుతుంది. ఆరెస్సెస్, సంఘ్ పరివార్ కలిసి ఇతర మతాలపై విద్వేషాన్ని పేదల్లో నింపుతున్నారు. గోల్వాల్కర్, సావర్కర్‌లు నాజీయిజంకు గట్టిమద్దతుదారులని స్పష్టంగా చెప్పగలను. ప్రస్తుతం అధికారంలోనున్న బీజేపీ కూడా అలానే పనిచేస్తోంది’’అని ఆయన అన్నారు.

ఆరెస్సెస్

ఫొటో సోర్స్, Thinkstock

సామాన్యులపై మనుస్మృతి ప్రభావం ఏమిటి?

ఒక్కసారిగా ఎకనమికల్లీ బ్యాక్‌వార్డ్ క్లాసెస్ (ఈడబ్ల్యూఎస్)లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పది శాతం రిజర్వేషన్లు కల్పించారని మహాదేవ అన్నారు.

‘‘ఇప్పటికే సామాజికంగా బలంగా ఉండే ఈ వర్గం.. విద్య, ఉద్యోగాల్లో మరింత ముందుకు వెళ్తుంది. కేవలం ఆ ఐదు, పది శాతం మంది కోసం ప్రధాని ఆ పని చేశారు’’అని మహాదేవ వ్యాఖ్యానించారు.

‘‘ఈ నిర్ణయం వల్ల సామాజిక న్యాయం అనే సిద్ధాంతమే నీరుగారిపోయింది. పైనుండే వారికే ఎక్కువ ఇవ్వాలనే సిద్ధాంతం నుంచి ఈ నిర్ణయం వచ్చుంటుంది. నిజానికి ఈ సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది. నాకెందుకో మను ధర్మశాస్త్రం వాసన వస్తోంది’’అని వ్యాఖ్యానించారు.

ఎందుకు తాజా పుస్తకం రాశారు? అని ప్రశ్నించినప్పుడు.. ‘‘ఇటీవల కాలంలో కొన్ని పరిణామాలు నన్ను చాలా బాధపెట్టాయి. వీటిలో మొదటిది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు. ఆ తర్వాత మత మార్పిడులను అడ్డుకునే చట్టం. ఆ తర్వాత పాఠ్య పుస్తకాల వివాదం రాజుకొంది. బసవన్న లాంటి గొప్ప వ్యక్తి బోధనలను వక్రీకరించడం నిజంగా దారుణం’’అని మహాదేవ వ్యాఖ్యానించారు.

కర్నాటక ప్రొటెక్షన్ ఆఫ్ రిలిజియస్ ఫ్రీడమ్ యాక్ట్ పేరుతో రాష్ట్రంలో ఆరెస్సెస్ మనుస్మృతిని అమలు చేయాలని చూస్తోందని మహాదేవ అన్నారు.

ఆరెస్సెస్

ఫొటో సోర్స్, Imran Qureshi

‘‘ఇలాంటివి కాంగ్రెస్సే రాయిస్తుంది’’

ఈ పుస్తకం వివాదంపై మైసూరుకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ.. బీబీసీతో మాట్లాడారు. ‘‘ఆయనలో ఇంకా కొంచెం సృజనాత్మక మిగిలి ఉందేమోనని సందేహం ఉండేది. ఈ పుస్తకంతో అలాంటిదేమీ లేదని తేలిపోయింది. ఇది చూడటానికి రాహుల్ గాంధీ మూసధోరణి ప్రసంగం నుంచి స్ఫూర్తి పొంది కాంగ్రెస్ కార్యకర్తలు వాట్సాప్‌లో రాసినట్లు కనిపిస్తోంది. ఏదో కొన్ని ఫేస్‌బుక్ పోస్టులను కలిపి ప్రచురించినట్లు ఉన్నారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు సీనియర్ విశ్లేషకుడు విశ్వేశ్ భట్ స్పందిస్తూ.. ‘‘ఇది ఆయన స్థాయి పుస్తకం కాదు. ఆయన మంచి పుస్తకాలు రాస్తారని అనుకున్నాను. కానీ, ఇది చాలా అసంతృప్తికి గురిచేసేలా ఉంది’’అని వ్యాఖ్యానించారు.

ఆరెస్సెస్

ఫొటో సోర్స్, MUJEEB FARUQUI/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ఈ వివాదంపై స్పందించాలని ఆరెస్సెస్‌ను బీబీసీ కోరింది. కానీ, వార్త రాసే సమయానికి ఎలాంటి స్పందనా రాలేదు.

మరోవైపు బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు దీనిపై మాట్లాడారు. ‘‘ఈ విషయంపై ఆరెస్సెస్‌కు చెందిన ఎవరూ స్పందించరు. ఎందుకంటే దీన్ని మేం చెత్తబుట్టగా చూస్తున్నాం’’అని వ్యాఖ్యానించారు.

అయితే, ఈ విమర్శలు తను ముందే ఊహించానని మహాదేవ అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)