నరేంద్ర మోదీ 75 ఏళ్లకు రాజకీయాల నుంచి రిటైర్ అవ్వరా? మూడోసారి కూడా ప్రధాని కావాలనుకుంటున్నారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రధాని మోదీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడతారు. పదాలను ఎంచుకుని మాట్లాడతారు. కొన్ని ఘటనలను చాలా జాగ్రత్తగా ప్రస్తావిస్తారు. ఆయన రాజకీయ జీవితాన్ని నిశితంగా పరిశీలించిన చాలామంది ఈ విషయం నిజమని ఒప్పుకుంటారు.
ఇటీవల భరూచ్‌లో మోదీ చేసిన ప్రసంగంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. భరూచ్‌లో జరిగిన 'ఉత్కర్ష్ సమరోహ్' సందర్భంగా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, అందులో ఒక ఉదంతాన్ని ప్రస్తావించారు.
"నేను ఒకరోజు ఒక పెద్ద నాయకుడిని కలిశాను. ఆయన చాలా సీనియర్ నేత. ఆయన మా విధానాలను నిత్యం వ్యతిరేకిస్తుంటారు. నేను ఆయన్ను గౌరవిస్తాను. ఆయన కొన్ని విషయాలలో నాపై కోపంగా ఉన్నారు. ఒకసారి నన్ను కలవడానికి వచ్చిన ఆయన, ''మోదీజీ, దేశానికి రెండుసార్లు ప్రధాని అయ్యారు. ఇంకా ఏం కావాలి'' అని అడిగారు.
‘‘రెండుసార్లు ప్రధాని కావడం చాలా గొప్ప విషయం అని ఆయన అనుకుంటారు. మోదీ ఒక ప్రత్యేక ప్రాంతానికి చెందిన వారన్న విషయాన్ని ఆయన అర్థం చేసుకోరు. ఈ గుజరాత్ భూమి నన్ను తయారు చేసింది. ఇంత మంచి జరిగింది కాబట్టి విశ్రాంతి తీసుకోవాలా? లేదు. శాచ్యురేషన్ అనేది నా కల. ముందు రోజుల్లో నూటికి నూరు శాతం లక్ష్యాన్ని సాధించాలి'' అని మోదీ వ్యాఖ్యానించారు.
శాచ్యురేషన్(సంతృప్త స్థాయి) అంటే ప్రధాని ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చూడటం.

ఫొటో సోర్స్, ANI
ప్రసంగంలోని ఈ భాగాన్ని అర్థం చేసుకోవడానికి, కొన్ని ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఆయన ఈ ప్రసంగం చేశారు. అక్కడ 27 ఏళ్లుగా బీజేపీ పాలన కొనసాగుతోంది. ఈ ఏడాది చివర్లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
గుజరాత్‌లోని భరూచ్ ముస్లిం జనాభా గణనీయంగా ఉన్న ప్రాంతం. ఏడాది తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి.
అటువంటి పరిస్థితిలో, వర్చువల్ ర్యాలీలో తన సొంత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, ప్రతిపక్షానికి చెందిన సీనియర్ నాయకుడు మాట్లాడిన మాటను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారంటే, అది కేవలం యాదృచ్చికం కాదు.
అది కూడా తనను ఎవరూ ఆ విషయం అడగకపోయినా ప్రస్తావించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం.

ఫొటో సోర్స్, ANI
ప్రశ్న లేకుండానే జవాబు ఎందుకు?
''ఈ ప్రసంగం నుంచి ఒక సందేశాన్ని తీసుకోవచ్చు. ప్రధానమంత్రి పదవి ఇంకా ఖాళీగా లేదు. ఇక నుంచి తదుపరి ప్రధాని ఎవరు అంటూ ప్రజలు ఊహాగానాలు చేయాల్సిన పని లేదు'' అని సీనియర్ జర్నలిస్ట్ విజయ్ త్రివేది అన్నారు. ఆయన ‘బీజేపీ: కల్ ఆజ్ ఔర్ కల్’ అనే పుస్తకం రాశారు.
ప్రధానమంత్రి 2024 సంవత్సరాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధాని పదవి ఖాళీ లేదు అనేది బీజేపీకీ, ప్రతిపక్ష పార్టీకి సందేశం. ప్రధానమంత్రి పదవి తమకు దక్కుతుందని భావిస్తున్న బీజేపీ నేతలు కూడా తమ ఆలోచనల గుర్రాలకు కళ్లేలు వేయాల్సిందే. అదే సమయంలో ప్రతిపక్షాలకు కూడా ఇది ఒక సందేశమేనని త్రివేది అన్నారు.
''ఈ ప్రకటన ఉద్దేశం, మన్మోహన్ సింగ్‌లా రెండుసార్లు ప్రధానమంత్రి కావడమే మోదీ లక్ష్యం కాదు. ఆయనకంటే ఒక అడుగు ముందుకేయాలి'' అని విజయ్ త్రివేది అన్నారు.
''మోదీ చిన్న సమావేశంలో ఈ మాట అని ఉండొచ్చు. కానీ, ఇది అందరికీ అర్థమవుతుంది. ఆయన దాన్ని వ్యూహాత్మకంగా చెప్పారని నేను అనుకోవడం లేదు. కానీ, తాను మూడోసారి ప్రధాని పదవి రేసులో ఉన్నానని సూచనప్రాయంగా చెప్పారు'' అని సీనియర్ జర్నలిస్ట్, రచయిత కింగ్‌షుక్ నాగ్ అన్నారు.
వయో పరిమితి
ప్రస్తుతం ప్రధాని మోదీ వయసు 71 ఏళ్లు. బీజేపీలో 75 ఏళ్లకు పైబడ్డ వారికి పదవులు నిర్వహించే అవకాశం లేదు. ఇది ఆ పార్టీ విధించుకున్న అప్రకటిత నిబంధన.
ఆ కోణంలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని అర్థం చేసుకుంటే, 2024 నాటికి ప్రధాని మోదీకి 73 ఏళ్లు నిండుతాయి. మూడోసారి గెలిస్తే ఆయనకు ఇంకా రెండు సంవత్సరాలు సమయం ఉంటుంది.
ఒకవేళ మోదీని కూడా ఈ అప్రకటిత మార్గదర్శకాలలో చేరిస్తే, ఆయన తర్వాత ప్రధానమంత్రి పదవిని అందుకోవడానికి పార్టీలోని రెండో శ్రేణికి చెందిన నాయకులు చాలామంది ఉన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/JANKI MANDIR
ఈ ప్రసంగం అలాంటి బీజేపీ నేతల కోసమేనా?
మోదీ ప్రసంగం 2024 నాటికి సన్నాహకమని సీనియర్ జర్నలిస్ట్ రామ్ బహదూర్ రాయ్ అన్నారు.
"2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీలో నాయకత్వ మార్పు అనే ప్రశ్నే లేదని ప్రధాని మోదీ చేసిన ప్రకటన ద్వారా స్పష్టమైంది. నరేంద్ర మోదీ నాయకత్వంలోనే బీజేపీ ఎన్నికలకు వెళ్లడం ఖాయం. ఆయన ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. మంత్రులలో ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడు. అత్యధిక సమయం కూడా ఇస్తున్నారు. ఆయన పాపులారిటీ కూడా పెరిగింది. బీజేపీని 1920-1947 మధ్య కాంగ్రెస్ స్థాయికి తీసుకెళ్లారు'' అని రాయ్ అన్నారు.
బీజేపీలో కూడా ప్రధానమంత్రి పదవిలో ఆయనను తప్ప వేరొకరిని ఊహించలేని పరిస్థితి ఉందని రాయ్ అభిప్రాయపడ్డారు. బీజేపీలో ఉంటూ ప్రధానమంత్రి కావాలనుకున్న వారెవరైనా ఆయన తర్వాత ప్రధాని కావడం గురించే ఆలోచిస్తున్నారని రాయ్ అభిప్రాయపడ్డారు.
జన్ కళ్యాణ్ యోజన 100 శాతం శాచ్యురేషన్ సాధించడం వల్ల ప్రజల్లో కూడా అనేక మానసిక మార్పులు సంభవిస్తాయని భరూచ్ ప్రసంగంలో ప్రధాని మోదీ అన్నారు.
''ఈ కార్యక్రమాన్ని గుజరాత్ ప్రభుత్వం నిర్వహించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, ప్రధాని మోదీ గుజరాత్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దిగారు. ఈ ప్రసంగాన్ని ఆ కోణంలోనే చూడాలి’’ అని నీలాంజన్ ముఖోపాధ్యాయ అన్నారు. ఆయన 'నరేంద్ర మోదీ: ది మ్యాన్, ది టైమ్స్' అనే పేరుతో మోదీపై పుస్తకం రాశారు.

ఫొటో సోర్స్, @NARENDRAMODI
బీబీసీతో మాట్లాడుతూ ఆయన కొన్ని విషయాలు చెప్పారు:
2014లో మోదీ దిల్లీకి వెళ్లిన తర్వాత గుజరాత్‌లో ఖాళీ ఏర్పడిందన్న విషయం మోదీకి తెలుసు. కానీ, ప్రజల ముందు అంగీకరించడానికి ఆయన సిద్ధంగా లేరన్నది ఈ ప్రసంగంలోని సందేశాలలో ఒకటి. అందుకే ఆయన నేనున్నాను అన్నట్లు మాట్లాడుతున్నారు. కానీ, ఈ ఎనిమిదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చాల్సి వచ్చిందన్న నిజం కూడా కళ్ల ముందు కనిపిస్తోంది.
రెండవ సందేశం ఏమిటంటే, 2024 సంవత్సరం దగ్గరికొస్తోంది. ప్రభుత్వ పథకాలు '100 శాతం శాచ్యురేషన్ స్థాయికి చేరే వరకు ఆయన పోటీలోనే ఉంటారు. భరూచ్, లేదా గుజరాత్‌లలో మాత్రమే కాదు. దేశం మొత్తం మీద 100% లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారు. ఆయన ప్రధానంగా నాలుగు పథకాలలో శాచ్యురేషన్ గురించి మాట్లాడుతున్నారు. అవి మరుగుదొడ్లు, విద్యుత్, బ్యాంకు ఖాతా ఇంకా టీకా.
రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని, రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని కోర్టులు కొన్నిసార్లు ఎనిమిదేళ్ల మోదీ ప్రభుత్వ కాలాన్ని వేలెత్తి చూపించాయి. ఉచిత రేషన్ వంటి సంక్షేమ పథకాల ద్వారా హక్కుల గురించి మాట్లాడకుండా చేయాలని, ప్రజల నోళ్లు మూయించాలని, షాహీన్‌బాగ్ వంటివి ఉండవని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ మధ్య ప్రధాని మోదీ కూడా 'బుజ్జగింపు రాజకీయాలు' గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ పదాల ఉపయోగం బీజేపీ సంప్రదాయ డిక్షనరీలో భాగం. తన పాలనా కాలంలో ముస్లింలు తలెత్తలేరని ఆయన తన మద్ధతుదారులకు సందేశం పంపుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- Bra ఎంపికలో మహిళలు చేసే పొరపాట్లు ఇవే.. ‘బ్రా’ సరైన కొలతను తెలుసుకోవాలంటే ఇలా చేయండి..
- రాజపక్స సోదరులు: జనం దృష్టిలో యుద్ధ వీరులు అకస్మాత్తుగా విలన్లు ఎలా అయ్యారు?
- దక్షిణాది రాష్ట్రాలను భయపెడుతున్న మరో వైరస్, తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఏంటి?
- కురుక్షేత్ర: శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన ప్రదేశంలో ముస్లింలు సమాధి నిర్మించారా? బీబీసీ పరిశోధనలో ఏం తెలిసిందంటే...
- కళ్లు ఎందుకు అదురుతాయి? మీ ఆరోగ్యం గురించి మీ కళ్లు ఏం చెప్తున్నాయో తెలుసుకోండి...
- మన పాలపుంతలో మహా కాల బిలం ఫొటోకు చిక్కింది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














