HFMD: ‘టొమాటో ఫ్లూ’ కాదు.. టొమాటోలు తినడం వల్ల రాదు.. మరి, దక్షిణాది రాష్ట్రాలను భయపెడుతున్న ఈ వైరస్ ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రవి కుమార్ పాణంగిపల్లి
- హోదా, బీబీసీ ప్రతినిధి
దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుల్లో హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ (హెచ్ఎఫ్ఎండీ) అనే వైరస్ ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఈ కేసులు ఇప్పటి వరకు 80 దాకా నమోదయ్యాయి.
దీనిబారిన పడిన వారంతా ఐదు సంవత్సరాలలోపు పిల్లలే. వీరిలో చాలామంది ఇప్పటికే కోలుకున్నారు.
ఈ వైరస్ గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పనిలేదని పలువురు నిపుణులు బీబీసీతో అన్నారు. అధికారులు మాత్రం అలర్ట్ అయ్యారు.
''ఈ వ్యాధితో ప్రమాదం తక్కువగా ఉంటుంది. కానీ ఇది అరుదైన సందర్భాల్లో మెనింజైటిస్‌కు కారణమవుతుంది. అందువల్ల, వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి'' అని కేరళ ఆరోగ్య శాఖమంత్రి వీణా జార్జ్ అన్నారు.
కోక్స్‌సాకీ వైరస్-ఏ16, ఎంటరోవైరస్-17 అనే వైరస్‌ల కారణంగా ఈ సమస్య వస్తుందని వైరాలజిస్ట్ డాక్టర్ జాకబ్ జాన్ బీబీసీతో చెప్పారు.
కోక్స్‌సాకీ వైరస్-ఏ16 చాలా తక్కువ ప్రభావం చూపిస్తుందని, వ్యాపించడానికి చాలా సమయం తీసుకుంటుందని డాక్టర్ జాకబ్ అన్నారు.
కేరళలో ఈ వ్యాధి మొదలు కావడానికి కారణమేంటో ఇప్పటి వరకు తెలియరాలేదు.
''కోవిడ్ వైరస్ లాగానే దీనిని జినోమ్ సీక్వెన్సింగ్ ద్వారా అర్ధం చేసుకోవాల్సి ఉంది'' అని డాక్టర్ జాకబ్ జాన్ అన్నారు.
ఈ వైరస్ బారిన పడిన పిల్లలను వెంటనే క్వారంటైన్ చేయాల్సిన అవసరం ఉందని, 8-10 రోజుల్లో వీరు వ్యాధి నుంచి కోలుకుంటారని ఆయన అన్నారు.
కేరళకు ఎక్కువగా రాకపోకలు ఉంటాయి కాబట్టి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు తమ అధికారులను అప్రమత్తం చేశాయి. మీడియా కథనాల్లో ఈ సమస్యను 'టొమాటో ఫ్లూ' అని పేర్కొంటున్నారని, ఇది సరికాదని డాక్టర్ జాన్ జాకబ్ అన్నారు.
ఈ వైరస్ కేరళలో కనిపించడం ఇదేమీ కొత్త కాదు. 2012-2017 మధ్య కాలంలో కేరళలో 1150 కేసులు నమోదైనట్లు 2018లో విడుదలైన ఒక నివేదిక వెల్లడించింది.
''ఇది కొత్త వైరస్ కాదు. చైనా సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి'' అని ఈ నివేదికను రూపొందించిన డాక్టర్ టీఎస్ అనీష్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ ఫ్లూ లక్షణాలు?
మొట్టమొదట గుర్తుంచుకోవాల్సిన విషయం స్థానికంగానూ, మీడియాలోనూ 'టొమాటో' పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ వ్యాధి టొమాటోలు తినడం వల్ల రాదు. ఇదొక వైరల్ డిసీజ్ మాత్రమే.
ఈ వ్యాధి సోకిన వారిలో సాధారణంగా జ్వరం, చర్మంపై ఎర్రటి బొబ్బలు, దురద, డీ హైడ్రేషన్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని తమిళనాడు డిప్యూటీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ అరుణ మీడియాతో చెప్పారు.
అయితే కొందరిలో జాయింట్ పెయిన్స్, అలసట, కడుపులో తిప్పడం, వాంతులు, డయేరియా, దగ్గు, జలుబు, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని ఆమె తెలిపారు.
యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తన వెబ్‌సైట్లో పేర్కొన్న హ్యాండ్, ఫూట్ అండ్ మౌత్ డిసీజ్ లక్షణాలు కూడా దాదాపు ఇలాగే ఉన్నాయి.
ఈ ఫ్లూ అంటువ్యాధా?
అవును అనే అంటున్నారు హైదరాబాద్‌లోని ప్రముఖ చిన్న పిల్లల వ్యాధి నిపుణులు డాక్టర్ ఎం.ప్రదీప్ రెడ్డి. హ్యాండ్, ఫూట్ అండ్ మౌత్ డిసీజ్ వేరియంట్లో ఈ ఫ్లూ ఒకటి కావచ్చని ఆయన చెపారు. ఇది ఐదేళ్ల లోపు చిన్నారుల్లో ఒకరినుంచి ఒకరికి సోకుతోందని బీబీసీతో అన్నారు.
అలాగే చర్మంపై టొమెటో రంగులో బొబ్బలు వస్తున్నాయని, వాటి వల్ల కలిగే ఇరిటేషన్, జ్వరం తదితర లక్షణాల వల్ల పిల్లలు ఘన, ద్రవ ఆహార పదార్థాలను తీసుకోవడం కూడా తగ్గిపోతుందని, ఫలితంగా డీహైడ్రేషన్ తలెత్తే ప్రమాదం కూడా ఉంటోందని తెలిపారు.
సాధారణంగా వైరస్ సోకిన వ్యక్తుల్ని ఎలాగైతే ఐసోలేషన్ ఉంచుతామో అలాగే వీరిని కూడా వ్యాధి సోకని వారికి దూరంగా పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలని డాక్టర్ ప్రదీప్ రెడ్డి అన్నారు.
చికిత్స ఏంటి?
ఈ వ్యాధి సోకిందని ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. కాళ్లు, చేతులపై వచ్చే ఎర్రని బొబ్బలు దురద పెట్టినా ఏ మాత్రం గోకకూడదు. పూర్తి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. అలాగే రోగి వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి.
వాళ్లు వాడే బట్టలు, వస్తువుల్ని ఎప్పటికప్పుడు పూర్తిగా శానిటైజ్ చెయ్యాలి. ఇది అంటువ్యాధి కనుక వాటిని తాకడం వల్ల ఇతరులకు కూడా వ్యాధి వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ వ్యాధిలో డీ హైడ్రేషన్ మరో ప్రధాన లక్షణం కనుక వీలైనంత వరకు శక్తినిచ్చే ద్రవపదార్థాలను తీసుకోవాలి.
ఐసీఎంఆర్ నుంచి ఈ వ్యాధి విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని, వైద్యులు వ్యాధి లక్షణాలను గుర్తించి తగిన విధంగా చికిత్స చేస్తూ వ్యాధిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని డాక్టర్ ఎం.ప్రదీప్ రెడ్డి బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం ఎక్కడ ఎక్కువగా వ్యాపిస్తోంది ?
దేశంలో మొదటిసారిగా ఈ ఫ్లూ కేరళలో బయట పడింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడ్డ చిన్నారుల సంఖ్య 80కి పైగా ఉంది. కొల్లాం, నెడవత్తూర్, అంచెల్, ఆర్యన్‌కవు ప్రాంతాల్లోని ఐదేళ్ల లోపు పిల్లలు ఈ వ్యాధి బారిన పడినట్టు కేరళ వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు ఈ ఫ్లూ కలకలంతో కేరళ పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక సరిహద్దుల్లో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే తమిళనాడు సరిహద్దుల్లోని వాలయార్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు, వైద్య సిబ్బందిని ఆ రాష్ట్రం మోహరించింది. అనుమానం ఉన్న వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అటు కర్నాటక సరిహద్దుల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. అంగన్‌వాడీ సెంటర్లలో ఉన్న చిన్నారుల్ని పరీక్షించేందుకు 24 మంది సభ్యులతో కూడిన ఓ బృందాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది.
కేరళ సరిహద్దు ప్రాంతాలైన దక్షిణ కర్నాటకలోని ఉడిపి, కొడగు, చామరాజనగర్, మైసూరు ప్రాంతాల్లోని చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని కర్నాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ అధికారుల్ని ఆదేశించారు. అయితే ఈ ఫ్లూ విషయంలో ప్రజలు ఎక్కువ ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన మీడియాతో అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి?
తెలుగు రాష్ట్రాల పరిస్థితిపై రెండు రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులను బీబీసీ సంప్రదించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు ఆ వైరస్ జాడ లేదని, ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్తికేయ మిశ్రా బీబీసీకి చెప్పారు.
ఈ కేసుల విషయంలో ప్రస్తుతానికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి సమాచారం లేదు.
(బెంగళూరు నుంచి బీబీసీ ప్రతినిధి ఇమ్రాన్ ఖురేషీ అందించిన సమాచారంతో)
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: పెళ్లయిన నెల రోజులకే భర్త పీక పిసికి, పైట బిగించి హత్య చేసిన భార్య... ఏం జరిగిందంటే
- మన పాలపుంతలో మహా కాలబిలం ఫొటోకు చిక్కింది...
- సర్కారువారి పాట సినిమా రివ్యూ: శ్రుతి, లయ, తాళం తప్పిన పాట
- రణిల్ విక్రమసింఘే: గత ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేదు, కానీ దేశానికి ప్రధాని అయ్యారు
- ఇల్లు కొనడం మంచిదా లేక అద్దెకు ఉండటం మంచిదా.. సొంతిల్లు కొనే ముందు ఇవి తెలుసుకోండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












