సర్కారువారి పాట సినిమా రివ్యూ: శ్రుతి, లయ, తాళం తప్పిన పాట
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
`గత నాలుగేళ్లుగా నేనేం పట్టుకున్నా బ్లాక్ బ్లస్టరే` అని మహేశ్ బాబు ఓ సందర్భంలో అన్నారు.
అది నిజమే.
భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు... ఇవన్నీ ఒకదాన్ని మించి మరోటి హిట్ అయ్యాయి.
అటు గీత గోవిందంతో పరశురామ్ కూడా వంద కోట్ల సినిమా తీసి పెట్టారు.
మరి వీరిద్దరూ కలిస్తే..?
ఆ ఊహే ఆకాశమంత ఎత్తులో ఉంది. దానికి తోడు సర్కారు వారి పాట టైటిల్, కళావతీ.. పాట, మొన్నామధ్య విడుదల చేసిన ట్రైలర్... ఇలా ప్రతీదీ అంచనాల్ని వెయ్యింతలు చేసుకుంటూ వెళ్లింది. మరి. ఇన్ని ఆశల్ని మోసుకుంటూ వచ్చిన `సర్కారు వారి పాట` ఎలా ఉంది? `గంట` గట్టిగా మోగిందా? లేదా?
కథలోకెళ్తాం. మహేశ్ (మహేష్ బాబు) చిన్నప్పటి సంగతి నుంచి కథ మొదలవుతుంది. తండ్రి (నాగబాబు) బ్యాంకులోను తీర్చలేక... భార్య (పవిత్రా లోకేష్)తో సహా ఆత్మహత్య చేసుకుంటాడు. అమ్మానాన్న లేకపోవడంతో.. గురువు (తనికెళ్ల భరణి) సహాయంతో చదువుకొని, అమెరికా వెళ్లిపోతాడు. అక్కడ ఓ ఫైనాన్స్ కంపెనీ పెట్టి, అందరికీ అప్పులిస్తుంటాడు. రూపాయి విషయంలో మహేష్ చాలా స్ట్రిక్టు. ప్రతీ పైసా వడ్డీతో సహా వసూలు చేస్తుంటాడు.

ఫొటో సోర్స్, GMBEntertainment/FB
అమెరికాలోనే జూదానికి బానిసైపోయి.. వేలాది డాలర్లు అప్పులు చేస్తుంటుంది కళావతి (కీర్తి సురేష్). ఉన్న బాకీలన్నీ తీర్చడానికి మరో పెద్ద బాకీ చేయాల్సివస్తుంది. ఈసారి మహేశ్ దగ్గరకు వెళ్తుంది. తన చదువుల కోసం అప్పు ఇవ్వాలని మహేశ్‌ని ప్రాధేయ పడుతుంది. కళావతి గెటప్పు, సెటప్పు చూసి... ఆమెని నమ్మేస్తాడు మహేష్. ఓసారి పది వేల డాలర్లు, మరోసారి పాతిక వేల డాలర్లు అప్పుగా ఇస్తాడు. తనని ప్రేమిస్తాడు కూడా. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. అయితే ఆ తరువాత.. కళావతి అసలు స్వరూపం బయట పడుతుంది. దాంతో, `నా అప్పు వడ్డీతో సహా తీర్చేయ్` అంటాడు. కానీ, అప్పుడు కళావతి ఒప్పుకోదు. `మా నాన్న ఎవరో తెలుసా? నేను నీకు పైసా కూడా ఇవ్వను` అని రెచ్చగొడుతుంది. కళావతి నాన్న రాజేంద్రనాథ్ (సముద్రఖని) రాజ్యసభ సభ్యుడు. తనకు అమెరికాలో సైతం పలుకుబడి ఉంది. ఆ అప్పేదో... రాజేంద్రనాథ్ దగ్గరే వసూలు చేస్తానని, అతడి కోసం విశాఖపట్నం వెళ్తాడు మహేశ్. మరి అక్కడ కళావతి చేసిన అప్పు వసూలు చేసుకోగలిగాడా, లేదా? అసలు మహేష్ విశాఖపట్నం రావడం వెనుక ఉన్న మరో బలమైన కారణం ఏమిటి? అనేది మిగిలిన కథ.
కమర్షియల్ లెక్కలతో వేసుకున్న కథ ఇదని స్పష్టంగా అర్థమైపోతోంది. కథలో కొత్తదనం అంటూ ఏమీ ఉండదు.కేవలం హీరో, హీరోయిజం, బాకీలు వసూలు చేయడంలో తనకున్న తెగింపు... ఇంతే కనిపిస్తుంది. లాజిక్కులను కూడా దర్శకుడు మర్చిపోయాడు. కేవలం మహేశ్‌ను చూపిస్తే చాలు.. ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయితే చాలు.. అనుకుంటూ సీన్లు రాసుకుని వెళ్లాడు. అవన్నీ మహేశ్ అభిమానుల్ని సంతృప్తి పరిచి ఉండొచ్చు గాక... కానీ కథలో, కథనంలో కొత్తదనాన్ని ఇవ్వలేదు. ఈ సినిమా చూడాలన్న ఉత్సాహాన్ని సగటు ప్రేక్షకుడిలో కల్పించలేదు. కొన్ని సన్నివేశాలు, సంభాషణలు అయితే బలవంతంగా ఇరికించినట్టే ఉంటాయి.
ఉదాహరణకు మహేశ్ తండ్రి (నాగబాబు) ఓ సందర్భంలో.. `అప్పు చేయని వాడు గొప్పవాడు.. ఇచ్చిన అప్పు వసూలు చేసుకొనే వాడు ఇంకా గొప్పవాడు` అంటాడు. అప్పు తీర్చలేక సతమతమవుతున్నవాడు.. అప్పు చేయని వాడు గొప్పోడు అనడంలో అర్థం ఉంది. అప్పు వసూలు చేసేవాడు ఇంకా గొప్పోడు అనడం ఏమిటి? అంటే, హీరో ఫైనాన్స్ బిజినెస్ చేయడానికి ఆ డైలాగ్ మార్గం చూపిందని ప్రేక్షకులు భావించాలని దర్శకుడు తాపత్రయపడి ఉంటాడు. అందుకే అవసరం లేకపోయినా ఆ డైలాగ్ అక్కడ ఇరికించాడు.

ఫొటో సోర్స్, GMBEntertainment/FB
అమెరికాలో అప్పులిస్తుంటాడు హీరో. దానికి పెద్ద సెటప్పే పెట్టారు. హీరో ఆఫీసు చూస్తే కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది.చుట్టూ బోలెడంత మంది పనోళ్లు. కానీ, అప్పులు వసూలు చేయడానికి హీరోనే అందరి దగ్గరా హ్యాండ్ బ్యాగేసుకుని తిరుగుతుంటాడు. అప్పటి వరకూ హీరోని తెలివైన వాడిగా చూపించిన దర్శకుడు, హీరోయిన్ కనిపించి, అప్పు అడగ్గానే... లాజిక్కులు వదిలేసిన సగటు మనిషిగా మార్చేశాడు. కాకపోతే, హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కాస్త ఫ్రెష్ గా ఉండడం కలిసొచ్చింది. ఈసినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ పండించడానికి ఆ ట్రాకే బాగా ఉపయోగపడింది. ఎప్పుడైతే కళావతి నిజ స్వరూపం పూర్తిగా బయటపడిపోయిందో, అప్పుడు మళ్లీ ఆ ట్రాక్ గాడి తప్పేసింది. ఓ సందర్భంలో హీరో - హీరోయిన్లు తిట్టుకోవడం, కీర్తిపై మహేష్ చేయి చేసుకోవడం... అతికి పరాకాష్టలా అనిపిస్తుంది.
కళావతి మహేశ్ దగ్గర తీసుకొన్న అప్పు 35 వేల డాలర్లు. అయితే... హీరో మాత్రం `నా పదివేల డాలర్లు... పదివేల డాలర్లు` అని తిరుగుతుంటాడు. అదేం లాజిక్కో అర్థం కాదు. బహుశా మిగిలిన పాతిక వేల డాలర్లూ రిబేటు ఇచ్చేశాడా?
ఏ సినిమా కథైనా కొన్ని ప్రాథమిక సూత్రాలకు లోబడి ఉండాలి. కథలో ప్రధాన సంఘర్షణలో హీరో ప్రత్యక్షంగా భాగస్వామి కావాలి. సమస్య తనవైపు నుంచి ఉండాలి. కానీ, ఈ సినిమాలో సూత్రాన్ని పక్కన పెట్టారు. సముద్రఖని చేసిన పది వేల కోట్ల అప్పుకూ, హీరోకూ, ఆ అప్పు ఇచ్చిన బ్యాంకుకూ, బ్యాంకు అధికారి(నదియా)కీ ఏమాత్రం సంబంధం లేదు. తనది కాని సమస్యని తన నెత్తి మీద వేసుకుని హీరో పోరాటం చేస్తుంటే, ఆ పాత్రని ఫాలో అవ్వలేకపోతాడు ప్రేక్షకుడు.
ఈ కథలో కథానాయకుడు ఎత్తుకున్న పాయింట్ లో నిజాయతీ ఉంది. కానీ, దాన్ని చూపించే పద్ధతి ఇది కాదనిపిస్తుంది. హీరో అప్పులిస్తాడు. దాన్ని వసూలు చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. అలాంటిది బ్యాంకులు అప్పులిచ్చి... వడ్డీ వసూలు చేసుకోవడానికి ఇంటి వరకూ రావొద్దు... అని మళ్లీ హీరోనే అనడంలో పాయింటే కనిపించదు. హీరో తల్లి దండ్రుల మరణానికీ, సముద్రఖని చేసిన పది వేల కోట్ల బ్యాంకు అప్పుకు కనీసం పరోక్షంగానైనా సంబంధం ఉందని చూపిస్తే ఈ కథ వేరేలా ఉండేది.
తండ్రి గురించి తెలుసుకుని `నువ్వు బ్యాంకులో అప్పు చేసి తీర్చలేదా నాన్నా..` అని హీరోయిన్ అడగడం మరింత కామెడీ. ఎందుకంటే, పదివేల డాలర్లు అప్పు తీసుకొని, `నేను బాకీ తీర్చను పో` అని చెప్పిన హీరోయిన్ తన తండ్రికి మాత్రం నీతి పాఠాలు ఎలా చెబుతుంది? హీరోయిన్ పాత్ర మారిన విధానం, చివర్లో విలన్ కూడా మారిన పద్ధతీ.. కృతకంగానే అనిపిస్తాయి తప్ప కథలో భాగంగా వచ్చినట్టు అనిపించవు.
మహేశ్ అందగాడు. ఈ సినిమాలో మరింత అందంగా కనిపించాడు. ఖరీదైన దుస్తుల్లో మరింత మెరిసిపోతూ కనిపించాడు. కానీ కొన్ని చోట్ల.. క్లోజప్‌లలో పీలగా కనిపించడం అభిమానులకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే మహేశ్ డాన్సులు కొత్తగా అనిపిస్తాయి. మహేశ్ ఇంత బాగా డాన్సులు చేయగలడా? అని ఆశ్చర్యం కలిగిస్తాయి.

ఫొటో సోర్స్, GMBEntertainment/FB
పెర్‌ఫార్మెన్స్ విషయంలో ఇక చెప్పక్కర్లెద్దు. కీర్తి బాగానే చేసినా.. ఆ పాత్రని సరిగా డిజైన్ చేయలేదు. సెకండాఫ్‌లో ఆ పాత్ర రాకపోయినా వచ్చే ఇబ్బందేం లేదు. సముద్రఖని విలన్ గా విశ్వరూపం చూపించాడు. తన నటన.. ఈ సినిమాలో ఓ ప్రధాన ఆకర్షణ. వెన్నెల కిశోర్ ఉన్నా, సరిగా వాడుకోలేదు. సెకండాఫ్‌లో అసలు ఆ పాత్రే ఉండదు. నదియా, నాగబాబు చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు.
సాంకేతికంగా ఈసినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా, కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. తమన్ పాటలు విడుదలకు ముందే హిట్టు. అయితే ఆర్.ఆర్ విషయంలో నిరాశ పరిచాడు.చాలా సందర్భాల్లో సన్నివేశాన్ని తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. సీజీ వర్కులు కొన్ని చోట్ల పేలవంగా ఉన్నాయి. సీజీ అనే సంగతి తెలిసిపోతున్నాయి.
పరశురామ్ బేసిగ్గా మంచి రచయిత. తన డైలాగులు బాగుంటాయి. అయితే ట్రైలర్లో చూపించిన డైలాగులు తప్ప... కొత్తగా సినిమాలో మెరిసినవి ఏం లేవు. చాలా చోట్ల బూతులు వాడాడు. అవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇబ్బంది పెడతాయి. బ్యాంకులు - వాటిని దోచుకుంటున్న వైట్ కాలర్ నేరగాళ్లు అనే పాయింట్ బాగానే ఉన్నా, దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో తేడా కొట్టింది. ఆశయం మంచిదే అయినా.. దాన్ని చూపించే వైనం సరిగా నప్పలేదు. మహేశ్ నటన, తన బాడీ లాంగ్వేజ్, డైలాగులు, చేసిన డాన్సులు... వీటిని నమ్ముకుని తీసిన సినిమా ఇది. అది మాత్రమే ఈసినిమాని కాపాడగలగాలి.
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- మహేశ్ బాబు: బాలీవుడ్ తనను 'అఫర్డ్' చేయలేదని ఎందుకన్నారు?
- బిట్ కాయిన్ ధర ఆరు నెలల్లో ఎందుకు సగానికి పడిపోయింది... క్రిప్టోవింటర్ అంటే ఏంటి?
- మాస్టర్జీ ఫోటో ఎగ్జిబిషన్: బ్రిటన్‌కు వలస వెళ్లిన తొలి తరం భారతీయుల అరుదైన చిత్రాలు
- ప్రజాందోళనకు భయపడి పారిపోయిన నియంత కుమారుడు దేశాధ్యక్షుడు ఎలా అయ్యారు?
- యుక్రెయిన్ యుద్ధం: వ్లాదిమిర్ పుతిన్‌కు మద్దతు తెలిపేందుకు నకిలీ అకౌంట్లు ఉపయోగిస్తున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














