మాస్టర్జీ ఫోటో ఎగ్జిబిషన్: బ్రిటన్‌కు వలస వెళ్లిన తొలి తరం భారతీయుల అరుదైన చిత్రాలు

- రచయిత, గగన్ సబర్వాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బ్రిటన్‌లో ఓ కొత్త ఎగ్జిబిషన్ పెట్టారు. 1950లలో బ్రిటన్‌కు వలసవెళ్లిన తొలితరం భారతీయుల ఫొటోలను ఒక భారతీయ ఫొటోగ్రాఫర్ తీశారు. ఆయనను అందరూ "మాస్టర్జీ" అని పిలిచేవారు. మాస్టర్జీ తీసిన ఆనాటి ఫొటోలతో ఇప్పుడు ఒక ప్రదర్శనకు పెట్టారు.
మాస్టర్జీగా పేరు పొందిన మగన్‌భాయ్ పటేల్, ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని కోవెంట్రీ నగరానికి వలస వచ్చిన భారతీయుల ఫొటోలు తీస్తూ ఉండేవారు.
కోవెంట్రీలోని భారతీయ సమాజానికి మాస్టర్జీ బాగా పరిచయమైన వ్యక్తి. ఆ నగరంలో తొలి భారతీయ ఫొటోగ్రాఫర్‌గా కూడా.
ఇప్పుడు, వార్విక్‌షైర్‌లోని కాంప్టన్ వెర్నీ ఆర్ట్ గ్యాలరీలో "త్రూ ది లెన్స్ ఆఫ్ మాస్టర్‌జీ" పేరుతో ఆయన తీసిన చిత్రాలను ప్రదర్శనకు పెట్టారు. అప్పటి భారతీయుల జీవితాలను, మాస్టర్జీ పనితనాన్ని ఆ ఫొటోలలో చూడవచ్చు.
"అప్పట్లో ఎవరికైనా మొదటిసారి బిడ్డ పుట్టగానే మా నాన్నని ఆస్పత్రికి పిలిపించుకుని ఫొటో తీయించుకునేవారని అమ్మ చెప్పడం నాకు గుర్తుంది" అంటూ మాస్టర్జీ కుమార్తె తర్లా పటేల్ చెప్పారు.

మాస్టర్జీ ఇంగ్లండ్ ప్రయాణం
పటేల్ 1924 జనవరి 1న గుజరాత్‌లోని సూరత్‌లో దేద్వాసన్ అనే చిన్న గ్రామంలో జన్మించారు. అక్కడే చదువుకున్నారు. ఒక స్థానిక స్కూల్లో హెడ్‌మాస్టర్‌గా పనిచేసేవారు. కానీ, ఆయనకు అంతకన్నా పెద్ద కలలు, లక్ష్యాలు ఉండేవి.
ఆయన స్నేహితులు కొందరు అప్పటికే ఇంగ్లండ్ వెళ్లి ఉండడం, అక్కడి జీవితాల గురించి వివరించి చెప్పడంతో, ఆయనకూ ఇంగ్లడ్ వెళ్లి స్థిరపడాలనే కోరిక కలిగింది.
వెంటనే పెట్టె సర్దుకుని బయలుదేరారు. ముంబై పోర్టులో జల్‌జవహర్ అనే స్టీమర్ ఎక్కి ఇంగ్లండ్ ప్రయాణమయ్యారు. పెట్టెలో బట్టలతో పాటు, తన తల్లి ఫొటో ఒకటి పెట్టుకున్నారు. ఆయనకు అది చాలా అమూల్యమైన వస్తువు.
స్టీమరులో 21 రోజులు ప్రయాణం చేసి, 1950 జనవరిలో ఇంగ్లండ్‌లో కాలు పెట్టారు.

యుద్ధానంతర బ్రిటన్‌కు వలస వెళ్లినవారికి చాలావరకు శారీరక శ్రమ ఉండే పనులే దొరికేవి. పటేల్‌కు కోవెంట్రీలోని జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ (జీఈసీ)లో ఫ్యాక్టరీ వర్కర్ పని దొరికింది. ఆయన అక్కడ త్వరగానే నిలదొక్కుకున్నారు. స్నేహితులను సంపాదించుకోగలిగారు. జీఈసీ ఫొటోగ్రఫీక్ సొసైటీలో కూడా చేరారు.
భారత్‌లో ఉన్నప్పుడే ఆయనకు ఫొటోగ్రఫీ మీద మక్కువ కలిగింది. తన మిత్రుడి కెమేరా తెచ్చుకుని చుట్టుపక్కల దృశ్యాల ఫొటోలు తీస్తుండేవారు.

జీఈసీలో పనిచేస్తూ సంపాదించిన డబ్బులో కొంత దాచుకుని, కొడాక్ బాక్స్ బ్రౌనీ కెమెరాను కొనుక్కున్నారు.
దాంతో, ఆయన స్నేహితులు ఫొటోలు తీయమంటూ వచ్చేవారు. ఆ ఫొటోలను భారతదేశంలో తమ కుటుంబానికి పంపించేవారు.
గతంలో భారత్‌లో పటేల్ హెడ్‌మాస్ట్‌గా పనిచేస్తుండేవారు కాబట్టి, ఇంగ్లండ్‌లో ఆయన స్నేహితులు గౌరవంగా, అభిమానంగా "మాస్టర్" అని పిలిచేవారు. కొన్నేళ్ల తరువాత ఆ పిలుపు "మాస్టర్జీ"గా మారిపోయింది.

'మాస్టర్స్ ఆర్ట్ స్టూడియో'
మొదట్లో కోవెంట్రీకి ఉద్యోగ నిమిత్తం మగవాళ్లు ఒంటరిగా వెళ్లేవారు. క్రమగా వాళ్లు స్థిరపడి తమ కుటుంబాలను కూడా తీసుకెళ్లేవారు.
తొలిరోజుల్లో మాస్టర్జీ ఒంటరి మగవారి ఫొటోలు ఎక్కువగా తీసేవారు. తరువాత కుటుంబాల ఫొటోలు తీయడం మొదలుపెట్టారు.
మొదట్లో తన ఇంట్లోనే ఫొటోలు తీసేవారు. ఫొటోగ్రాఫర్‌గా పాపులర్ అయ్యాక వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, పార్టీలకు కూడా ఆయన్ను పిలవడం మొదలుపెట్టారు.
క్రమంగా మాస్టర్జీ పేరు మారుమోగిపోయింది. ఆయనకు డిమాండ్ పెరిగింది. దాంతో, ఆయన జీఈసీలో ఉద్యోగం వదిలేసి పూర్తిగా ఫొటోగ్రఫీకి అంకితమైపోయారు.

1969లో 'మాస్టర్స్ ఆర్ట్ స్టూడియో'ను తెరిచారు. రెండస్తుల భవనంలో కింద స్టూడియో, పైన మాస్టర్జీ కుటుంబం నివసించేవారు.
మాస్టర్జీకి పని ఎక్కువగా ఉన్నప్పుడు, ఆయన భార్య, కూతురు కూడా సాయం పట్టేవారు. అవి "అద్భుతమైన రోజులని" తర్లా పటేల్ గుర్తుచేసుకున్నారు. తన తండ్రి స్టూడియో అభివృద్ధి చెందడం చూస్తూ పెరిగారు ఆమె.
మాస్టర్జీ స్టూడియోకు రకరకాల మనుషులు వస్తుండేవారు.
"రకరకాల యాసలు వినిపించేవి. ఆల్బంస్ తయారుచేయడంలో మేం సాయం చేసేవాళ్లం. నేను కొంచం పెద్దయ్యాక స్టూడియోలో ఫొటోలు తీయడం మొదలుపెట్టాను. అలాగే, వివాహ వేడుకలకు ఫొటోలు తీయడంలో కూడా సాయపడేదాన్ని" అని ఆమె చెప్పారు.

'మా అమ్మ కృషిని గుర్తించారు'
ప్రస్తుతం మాస్టర్జీ ఆర్ట్ స్టూడియోను ఆయన పెద్ద కొడుకు రవీంద్ర పటేల్ నిర్వహిస్తున్నారు.
మాస్టర్జీ స్టూడియో విజయవంతం కావడంలో ఆయన భార్య రమాబెన్ పటేల్ పెద్ద పాత్ర పోషించారు. ఫొటోలు డెవలప్ చేయడం, కస్టమర్లతో మాట్లాడడం లాంటి విషయాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు.
ఆమె కూడా ఫొటోగ్రాఫరే. ఫ్యామిలీ ఫొటోలు తీసేవారు. తన పిల్లలకు ఫొటోగ్రఫీ నేర్పించారు.

"కొన్నాళ్లకు నాకు కూడా ఫొటోలు తీయడంలో అనుభవం వచ్చేసింది. లైటింగ్ ఎక్కడ ఎలా ఉండాలి అనే విషయంలో అవగాహన వచ్చింది. సులువుగానే నేర్చుకున్నా. ఫొటో తీయడం కష్టం కాదు. కానీ, అది బాగా వచ్చేట్టు చూడాలి. మనుషుల ఫొటోలు తీయడం చాలా సరదాగా ఉండేది. నేనొక ఫొటోగ్రాఫర్‌ను అయినందుకు గర్వపడేదాన్ని" అని ఆమె బీబీసీతో చెప్పారు.
ఆరోజుల్లో మహిళా ఫొటోగ్రాఫర్లు తక్కువే. అందుకని, రమాబెన్ ఫొటోలు తీస్తుంటే కస్టమర్లు ఇబ్బంది పడేవారు. క్రమంగా ఆమె వారి నమ్మకాన్ని గెలుచుకున్నారు. ప్రస్తుత ప్రదర్శనలో ఆమె తీసిన ఫొటోలు కూడా ఉన్నాయి.
"నేను, నా భర్త చాలా సంవత్సరాలు కష్టపడి పనిచేశాం. ఇప్పుడు మేం తీసిన ఫొటోలు ప్రదర్శనకు పెట్టడం ఆనందంగా ఉంది" అని ఆమె అన్నారు.
తన తండ్రి విజయం వెనుక తన తల్లి కృషిని ఇప్పటికైనా గుర్తించినందుకు తర్లా పటేల్ సంతోషిస్తున్నారు.

"మా నాన్న కోవెంట్రీలో జనాలకు ఫొటోగ్రఫీలో ట్రైనింగ్ ఇచ్చేవారు. ఈ పనిపై ఆయన బయటకి వెళ్లినప్పుడు మా అమ్మ స్టూడియో చూసుకునేవారు. ఫొటోలు తీస్తూ, కొంతవరకు డెవలప్ చేస్తుండేవారు. కానీ, ఆమె పాత్రను ఎప్పుడూ, ఎవరూ గుర్తించలేదు. ఇప్పుడు ఆమె పేరును ప్రింట్‌లో చూడడం చాలా బావుంది" అని తర్లా పటేల్ అన్నారు.
మాస్టర్జీ చిత్రాలు, అప్పటి వలసదారుల జీవితాలకు అద్దం పడతాయి. వారి చరిత్రకు, సామాజిక నేపథ్యానికి రికార్డులుగా నిలిచాయి. అలాగే, ఫొటోగ్రఫీలో వచ్చిన మార్పులను కూడా తెలియజేస్తాయి.
తొలినాళ్లలో బ్లాక్ & వైట్ చిత్రాలు తీసేవారు. క్రమంగా కలర్ ఫొటోలు వచ్చాయి. కోవెంట్రీకి వలస వెళ్లిన భారతీయుల తరువాతి తరానికి మాస్టర్జీ కలర్ ఫొటోలు తీశారు.
2018లో మాస్టర్జీ చనిపోయారు. ప్రస్తుత ప్రదర్శన, తన తండ్రి జ్ఞాపకాలను, వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించడంలో సహాయపడుతుందని తర్లా పటేల్ ఆశిస్తున్నారు.
ఫొటోల క్రెడిట్: మాస్టర్జీ ఎస్టేట్
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్ యుద్ధం: వ్లాదిమిర్ పుతిన్‌కు మద్దతు తెలిపేందుకు నకిలీ అకౌంట్లు ఉపయోగిస్తున్నారా?
- కశ్మీర్లో 1200ఏళ్ల ప్రాచీన హిందూ దేవాలయంలో పూజలు ఎందుకు వివాదాస్పదం అయ్యాయి?
- ఆంధ్రప్రదేశ్: టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్.. ఏ కేసులో అరెస్ట్ చేశారు.. తెరవెనుక ఏం జరిగింది?
- 'ముస్లింలలో బహుభార్యత్వం అరుదు, అదొక సమస్య కాదు'.. 'అలాగైతే, రద్దు చేయొచ్చుగా, ఏం నష్టం?'
- ఎండలు పెరగడంతో మండిపోతున్న గోదుమ పిండి ధర
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











