ఒలింపస్: కెమెరా వ్యాపారంలో 84 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి స్వస్తి

ఒలింపస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒలింపస్‌ - 35 ఈసీఆర్ రేంజిన్ఫర్ కెమెరా

ఒలింపస్.. ఒకప్పుడు ప్రపంచంలో అతి పెద్ద కెమెరా బ్రాండ్‌లలో ఒకటి. గత 84 ఏళ్లుగా కొనసాగిస్తున్న కెమెరా వ్యాపారాన్ని ఇప్పుడు అమ్మేస్తోంది.

తాము శాయశక్తులా కృషి చేస్తున్నప్పటికీ.. ‘‘అత్యంత తీవ్రంగా ఉన్న డిజిటల్ కెమెరా మార్కెట్’’ ఇక ఏమాత్రం లాభదాయకంగా లేదని ఆ సంస్థ పేర్కొంది.

ప్రత్యేక కెమెరాల మార్కెట్ కుదించుకుపోవటానికి స్మార్ట్‌ఫోన్ల రాక ఒక పెద్ద కారణమని ఒలింపస్ చెప్పింది.

జపాన్‌కు చెందిన ఈ సంస్థ గత మూడేళ్లుగా నష్టాలు చవిచూస్తోంది.

ఏళ్ల తరబడి మైక్రోస్కోపులు తయారుచేసిన ఒలింపస్ 1936లో తన తొలి కెమెరాను తయారు చేసింది. అది సెమీ-ఒలింపస్ 1 కెమెరా. దాని ఖరీదు అప్పట్లో జపాన్‌లో ఒక నెల జీతం కన్నా ఎక్కువ ఉండేది.

అప్పటి నుంచీ దశాబ్దాల పాటు కెమెరా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చింది. మార్కెట్ వాటాలో అగ్రస్థాయి కంపెనీల్లో ఒకటిగా నిలిచింది.

‘‘ఒలింపస్ పట్ల జనంలో మొదటి నుంచీ ఎంతో అభిమానం ఉంది’’ అని ‘అమెచ్యూర్ ఫొటోగ్రాఫర్’ మేగజీన్ ఎడిటర్ నైగెల్ ఆథర్టన్ పేర్కొన్నారు.

1970వ దశకంలో ఒలింపస్ కెమెరాలు అగ్రస్థానంలో ఉండేవి. డేవిడ్ బెయిలీ, లార్డ్ లిచ్‌ఫీల్డ్ వంటి ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్లు టెలివిజన్లలో ఈ సంస్థ కెమెరాల తరఫున ప్రచారం చేసేవారు.

‘‘అవి విప్లవాత్మక కెమెరాలు. చాలా చిన్నగా తేలికగా ఉండేవి. అందంగా డిజైన్ చేశారు. చాలా మంది నాణ్యమైన లెన్సులు ఉండేవి’’ అని ఆథర్టన్ వివరించారు.

ఒలింపస్ కెమెరాలను ఇష్టపడే అభిమానులు.. ఆటోఫోకస్ వంటి కొత్త టెక్నాలజీల విషయంలో ఆరంభంలో సమస్యలు ఎదురైనా కానీ వీటినే అంటిపెట్టకుని ఉన్నారు. డిజిటల్ కెమెరాలతో ఈ కంపెనీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. మొదటిగా డిజిటల్ టెక్నాలజీని ప్రారంభించిన సంస్థల్లో వాటిలో ఒలింపస్ ఒకటి.

కానీ ఆ తర్వాతి దశలో మిర్రర్‌లెస్ కెమెరాల శ్రేణిని మధ్యశ్రేణి మార్కెట్ లక్ష్యంగా ఉత్పత్తి చేసింది. ‘‘సీరియస్ ఫొటోగ్రాఫర్లు కాని వారు పాయింట్ అండ్ షూట్ కెమెరా కన్నా మెరుగైనది కావాలని కోరుకున్నారు. అలాగని వారు డీఎస్ఎల్ఆర్ కెమెరాలను కూడా కావాలనుకోలేదు’’.

ఒలింపస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ 2-మెగాపిక్సెల్ కెమెరాను మొబైల్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని ఫోటోలు షేర్ చేసుకోవచ్చు.

‘‘ఆ మార్కెట్‌ను స్మార్ట్‌పోన్లు శరవేగంగా మింగేశాయి. అసలు ఆ మార్కెట్టే లేకుండా పోయింది’’ అని ఆథర్టన్ విశ్లేషించారు.

ప్రత్యేక కెమెరాల మార్కెట్ నాటకీయంగా కుప్పకూలిపోయింది. ఒక అంచనా ప్రకారం.. 2010 – 2018 మధ్య 84 శాతం పడిపోయింది.

‘‘ఒలింపస్ గత కొన్నేళ్లుగా పొరపాట్లు చేస్తూ వచ్చిందని నేను అనుకుంటున్నాను. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. తప్పు దారిలో వెళ్లారు. ముందుకెళ్లే దారిలేని మార్గంలో నడిచారు’’ అంటారు ఆథర్టన్.

వీడియో పెర్ఫార్మెన్స్‌లో పురోగతి లేకపోవటం ఒక ఉదాహరణగా ఆయన చూపారు. ఈ విషయంలో ఒలింపస్ ప్రత్యర్థి సంస్థలు ఎంతో ముందుకు వెళ్లాయి.

అంతేకాదు, 2011లో ఈ సంస్థలో భారీ ఆర్థిక కుంభకోణం జరిగింది. అందులో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల ప్రమేయం ఉంది.

ఒలింపస్ ఇప్పుడు తన వ్యాపారంలో కెమెరా భాగాన్ని విడదీసి విక్రయిస్తోంది. తద్వారా జూకో లెన్సెస్ వంటి తన బ్రాండ్లను జపాన్ ఇండస్ట్రియల్ పార్టనర్స్ అనే సంస్థ కొత్త ఉత్పత్తుల్లో ఉపయోగించేలా చూడాలన్నది ప్రణాళిక.

ఆ ఒప్పందం కుదిరే వరకూ వ్యాపారం యథావిధిగా సాగుతుందని ఒలింపస్ ఒక ప్రకటనలో పేర్కొంది.

‘‘మా బ్రాండ్ కీర్తి వారసత్వాన్ని పరిరక్షించటానికి ఇది సరైన చర్య అని మేం నమ్ముతున్నాం’’ అని చెప్పింది.

అయితే.. అభిమానుల్లో ‘‘చాలా ప్రశ్నలు ఉండొచ్చు’’ అని ఒలింపస్ బ్రిటన్ బృందం సోషల్ మీడియాలో అంగీకరించింది.

‘‘సహనంగా ఉండాలని మేం కోరుతున్నాం. మా ఇమేజింగ్ బిజినెస్ పెరగటానికి, పాత, కొత్త ఫొటోగ్రఫీ అభిమానులకు ఆనందం కలిగించటానికి ఈ బదిలీని ఒక అవకాశంగా ఒలింపస్ భావిస్తోంది’’ అని ఆ బృందం పేర్కొంది.

కెమెరా వ్యాపారాన్ని విక్రయించినప్పటికీ ఒలింపస్ కార్పొరేషన్ కొనసాగుతుంది.

ఈ సంస్థ ఇప్పటివరకూ మైక్రోస్కోపుల తయారీని నిలిపివేయలేదు. తన ఆప్టికల్ టెక్నాలజీని ఎండోస్కోపుల వంటి ఇతర సైన్స్, వైద్య పరికరాల వైపు కూడా మళ్లించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)