ఆంధ్రప్రదేశ్: టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్... ఏ కేసులో అరెస్ట్ చేశారు, తెరవెనుక ఏం జరిగింది?

ఫొటో సోర్స్, facebook/Dr.PonguruNarayana
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లోని ఆయన ఇంటి వద్ద ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఏపీకి తరలిస్తున్నారు. కొండాపూర్ లోని ఆయన ఇంటివద్ద నారాయణను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏపీకి తరలించడం సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో నారాయణ మీద రెండు కేసులు నమోదయ్యాయి.
నారాయణ విద్యాసంస్థల పేరుతో గడిచిన కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు పొంగూరు నారాయణ. 2014లో ఏపీలో టీడీపీకి అధికారం దక్కిన తర్వాత నారాయణకు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. ఆ తర్వాత వెంటనే చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగానూ ఎంపికయ్యారు.
ఐదేళ్ల పాటు ఏపీ పట్టణాభివృద్ధి, మునిసిపల్ శాఖ మంత్రులుగా ఆయన వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయంగా క్రియాశీలకంగా కనిపించడం లేదు. కానీ అమరావతి కేసుల విషయంలో మాత్రం ఆయన పేరు పలుమార్లు వార్తల్లోకొచ్చింది. గతంలో కూడా సీఐడీ ఆయన మీద కేసు నమోదు చేసింది. కానీ న్యాయస్థానం ఆదేశాలతో విచారణ ముందుకు సాగలేదు. తాజాగా ఆయన అరెస్ట్ అటు విద్యారంగంలోనూ, ఇటు రాజకీయంగానూ సంచలనంగా మారింది.

ఫొటో సోర్స్, facebook/Dr.PonguruNarayana
ఆ రెండు కేసులు ఏంటి?
మాజీ మంత్రి నారాయణ మీద గత నెల 27వ తేదీన చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరిగిందనేది అభియోగం. నారాయణ విద్యాసంస్థ కేంద్రంగా పదో తరగతి పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారంటూ పోలీసులు పేర్కొన్నారు.
చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏప్రిల్ 27న ఎఫ్ ఐ ఆర్ నెం. 111/2022గా కేసు నమోదయ్యింది. చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
చిత్తూరు నగరంలోని గ్రీమ్స్ పేటలో ఉన్న నారాయణ కాలేజ్ లో అదే రోజు ఉదయం 9.30 నుంచి 12. 30 మధ్య పదో తరగతి పరీక్ష పేపర్లు లీకేజ్ చేసి, సర్క్యులేట్ చేశారని ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్నారు. ఈ కేసులో నారాయణ సంస్థ నిర్వాహకులతో పాటుగా యజమాని నారాయణ కూడా నిందితులుగా ఉన్నట్టు చిత్తూరు పోలీసులు తెలిపారు.
అమరావతి రాజధాని నగర నిర్మాణ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో అక్రమాలు జరిగాయంటూ మరో కేసు మంగళగిరిలో సీఐడీ అధికారులు నమోదు చేశారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో మే 9వ తేదీన ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, పట్టణాభివృద్ధి, మునిసిపల్ మంత్రిగా పనిచేసిన పి నారాయణతో పాటుగా లింగమనేని రమేష్ సహా పలువురిని నిందితులుగా పేర్కొన్నారు.
అమరావతి నగర నిర్మాణంలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇతర నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయనేది అభియోగం. కొందరికి మేలు చేసేలా మాస్టార్ ప్లాన్ మార్చేశారని ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్నారు. ఎఫ్ ఐ ఆర్ నెం. 16/2022గా ఈ కేసు నమోదయ్యింది.

ఫొటో సోర్స్, facebook/Dr.PonguruNarayana
ఏ కేసులో అరెస్ట్ చేశారు?
హైదరాబాద్ లోని కొండాపూర్ లో నారాయణని అదుపులోకి తీసుకున్న సమయంలో టెన్త్ క్లాస్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కేసు కింద అదుపులోకి తీసుకున్నట్టు ఏపీ పోలీసులు వెల్లడించారు.
ఆ తర్వాత తెలంగాణ పోలీసులకు అధికారిక సమాచారంలో మాత్రం అమరావతిలో సీఐడీ నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేసినట్టు అధికారికంగా వెల్లడించారు.
అయితే, నారాయణను టెన్త్ క్లాస్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీసు కేసులోనే అరెస్టు చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ రిషంత్ రెడ్డి స్పష్టంచేశారు. ''ఇన్విజిలేటర్‌లను లోబర్చుకుని టెన్త్ ప్రశ్నపత్రాలను లీక్ చేసిన కేసులో ఆయన్ను అరెస్టు చేశాం. సాయంత్రం జడ్జీ ముందు హాజరు పరుస్తాం. చిత్తూరు వన్‌టౌన్‌లో గత నెల 27న ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేశాం. ఏప్రిల్ 29న ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశాం''అని రిషంత్ రెడ్డి తెలిపారు.
''తిరుపతిలో నారాయణ విద్యా సంస్థల డీన్ బాబును కూడా అరెస్ట్ చేశాం. ఈ కేసులో శ్రీచైతన్య, ఎన్ఆర్ఐ, చైతన్య కృష్ణా రెడ్డి స్కూల్స్‌లో పనిచేస్తున్న సిబ్బంది ప్రమేయం ఉంది. వీరంతా 2008-2015 మధ్య నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసిన వారే. ఈ కేసులో విచారణ జరుగుతోంది. దీనిలో చాలా మంది పాత్ర ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం''అని రిషంత్ రెడ్డి చెప్పారు.
కాగా, నారాయణ భార్యను అరెస్ట్ చేయలేదని వెల్లడించారు.
టెన్త్ పరీక్షలపై రాజకీయంగానూ వివాదం
వరుసగా రెండేళ్ల పాటు ఏపీలో కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు జరగలేదు. కొంత విరామం తర్వాత ఈ ఏడాది పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకూ వాటిని నిర్వహించారు. చిత్తూరు జిల్లాతో పాటుగా ఏపీలోని 8 జిల్లాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణ గందగగోళంగా మారింది. పరీక్ష ప్రారంభమయిన కొన్ని నిమిషాలకే వాట్సాప్ లో పరీక్ష పేపర్ చక్కర్లు కొట్టింది. కొన్ని యూ ట్యూబ్ చానెళ్లలో కూడా దర్శనమిచ్చింది.
పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలమయ్యిందనే ఆరోపణలు వచ్చాయి. చివరకు ఈ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంపై విద్యాశాఖ స్పందించింది. పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులందాయి.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల సిబ్బందితో పాటుగా నారాయణ సంస్థల సిబ్బంది మీద కూడా కేసులు నమోదయ్యాయి. 69 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 35 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు.
పరీక్ష పేపర్ల లీకేజీ ప్రచారం, నిర్వహణలో లోపాల మీద విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. పలు చోట్ల విద్యార్థి సంఘాలు ఆందోళనకు పూనుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను బాధ్యులని చేస్తూ చర్యలు తీసుకోవడంపై కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా స్పందించాయి.
పదో తరగతి పరీక్షల్లో అస్తవ్యస్త పరిస్థితులకు టీడీపీ నేతలే కారణమంటూ అధికార వైసీపీ ఆరోపించింది. పదో తరగతి పరీక్ష పేపర్లు ఎక్కడా లీక్ కాలేదని, అదంతా దుష్ప్రచారం అంటూ తొలుత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ ప్రకటించారు. కానీ సీఎం జగన్ మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించడం, చివరకు సీఎం ఆరోపించినట్టు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకోవడం విశేషంగా మారింది.
తిరుపతిలో జరిగిన జగనన్న విద్యాదీవెన పథకం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ "విద్యాదీవెన పథకం ఈరోజు ప్రారంభమవుతందని తెలుసు కాబట్టి దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించారు. వాళ్లే ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు. వారికి సంబంధించిన వాళ్ల హయంలో మంత్రి పదవుల్లో ఉన్న వారి స్కూల్స్ నుంచే వాట్సాప్ ద్వారా వాళ్లంతకు వాళ్లే ఫోటోలు తీసుకుని, వాళ్లంతకు వాళ్లే లీక్ చేశారు. మళ్లీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆశ్చర్యం కలిగించే ఈ విషయాలు రెండు నారాయణ , మూడు చైతన్య స్కూల్స్ లో జరిగింది. ఎవరండీ నారాయణ.. ఇదే చంద్రబాబు హయంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి. స్కూల్, కాలేజీలు నడుపుతున్న వ్యక్తి. వాళ్ల కాలేజీల్లో ప్రశ్నాపత్రం బయటకు తీసి, వాట్సాప్ లో పెడతారు. వ్యవస్థను నాశనం చేస్తారు. మళ్లీ వాళ్లే ప్రభుత్వం మీద దుష్ప్రచారానికి దిగుతారు" అంటూ వ్యాఖ్యానించారు.
మే 5 వ తేదీన సీఎం బహిరంగసభ వేదికగా ఈ వ్యాఖ్యలు చేయగా 10వ తేదీన మాజీ మంత్రి నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులే తేల్చుతారు - మంత్రి బొత్స
"నారాయణ పాత్రపై పోలీసులు తేల్చుతారు. దర్యాప్తు జరుగుతోంది. చట్టం ప్రకారమే చర్యలుంటాయి. పరీక్ష పేపర్లు ఇచ్చిన తర్వాత, ఒకరో ఇద్దరో పరీక్షకు హాజరుకాని వారి పేపర్ నుంచి ఫోటోలు , ఫోటో స్టాట్ తీసి సర్క్యులేట్ చేశారు. ఆన్సర్లు తయారు చేయాలని చూశారు. మేము 15 నిమిషాలకే పట్టుకున్నాం. ప్రభుత్వ టీచర్లు కూడా ఉన్నారు. ప్రైవేటు టీచర్లలో నారాయణ వైస్ ప్రిన్సిపాల్, సిబ్బంది కూడా ఉన్నారు. ప్రిన్సిపాల్ స్టేట్ మెంట్ ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయ నాయకులయినంత మాత్రాన తప్పులు చేస్తే చెల్లుతుందా" అంటూ ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఏపీ చరిత్రలో మొదటిసారిగా నారాయణ వంటి సంస్థల అవకతవకలను అదుపుచేయగలిగామని ఆయన అన్నారు. ప్రతిపక్షాల విమర్శల్లో అర్థం లేదని, పేపర్ల లీకేజీలో ఎవరి పాత్ర ఉన్నా సహించబోమని మంత్రి బొత్స బీబీసీతో అన్నారు.
కక్షసాధింపు చర్యలే - టీడీపీ
"ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయ్యింది. ప్రజాగ్రహం కనిపిస్తోంది. దాని నుంచి పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్షాల మీద బురదజల్లుతోంది. తప్పుడు కేసులతో కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ రెడ్డి చేతగాని పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమే ఇది. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ ని ఖండిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం మీదనే దృష్టి పెట్టారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలకు వెనుకడుగు వేసేది లేదు" అని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
పదో తరగతి పరీక్షలు సజావుగా నడపలేని చేతగాని ప్రభుత్వమిది అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు. నారాయణ సంస్థల్లో సిబ్బంది తప్పు చేస్తే యజమానిని అరెస్ట్ చేసినప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా అరెస్ట్ చేశారు కాబట్టి విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం అన్నింటా విఫలం కావడంతో ప్రజల దృష్టిని మళ్లించే పని చేస్తోందని అచ్చెన్నాయుడు బీబీసీతో అన్నారు.
వైస్ ప్రిన్సిపాల్ అఫ్రూవర్ గా మారడంతోనే...
నారాయణ అరెస్టు వెనుక ఆయన సంస్థలో వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్ వాంగ్మూలం ఆధారమని పోలీసులు చెబుతున్నారు. నారాయణ ప్రోద్బలంతోనే పేపర్ లీక్ చేసినట్లు విచారణలో వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ ఒప్పకున్నట్టు తెలిపారు. గిరిధర్ వాంగ్మూలం ఆధారంగా నారాయణను అరెస్ట్ చేసినట్టు చిత్తూరు పోలీసులు చెబుతున్నారు.
ఈ కేసులో ఇప్పటి వరకూ చిత్తూరు ఏడుగురిని వన్ టౌన్ పోలీసులుఅరెస్ట్ చేశారని ఏపీ సీఐడీ అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు. ఇద్దరు ప్రభుత్వ టీచర్లు కాగా, మిగిలిన వారు నారాయణ, శ్రీ చైతన్య, చైతన్య కృష్ణ రెడ్డి, ఎన్ఆర్‌ఐ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది అని వివరించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














