పోర్న్ వీడియోలను కొందరు పబ్లిగ్గా ఎందుకు చూస్తారు?

ఫొటో సోర్స్, Emma Hermansson
- రచయిత, మనీష్ పాండే, రాచెల్ స్టోన్‌హౌస్
- హోదా, న్యూస్‌బీట్ రిపోర్టలు
బ్రోన్‌వెన్ రీడ్ లైబ్రరీకి వెళ్లి చదువుకోవాలనుకున్నారు. అక్కడ, లైబ్రరీ కంప్యూటర్‌లో పోర్న్ వీడియోలు చూస్తూ కనిపించాడో వ్యక్తి.
"నేను షాక్ అయిపోయా. ఏం చేయాలో అర్థం కాలేదు" అని ఆమె బీబీసీతో చెప్పారు.
21 ఏళ్ల బ్రోన్‌వెన్ రీడ్ ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో ఉంటారు. ఆరోజు అలా జరిగిందిగానీ, సాధారణంగా పోర్న్ ఎవరూ పబ్లిగ్గా చూడరు అనుకున్నారామె.
కానీ, కొన్ని వారాల తరువాత అదే వ్యక్తి అదే లైబ్రరీ కంప్యూటర్‌లో మళ్లీ పోర్న్ చూస్తూ కనిపించాడు.
బ్రోన్‌వెన్‌కు కలిగిన అనుభవం లాంటిదే చాలామందికి కలిగింది. బస్సుల్లో, లోకల్ ట్రైన్లలో బహిరంగంగా పోర్న్ వీడియోలు చూసేవారు ఉన్నారని కొంతమంది తమ అనుభవాలను వెల్లడించారు.
ఈమధ్యే, కన్సర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ ఒకరు బ్రిటన్ పార్లమెంటులో కూర్చుని ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూస్తూ పట్టుబడడంతో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
అయితే, ఒక ట్రాక్టర్ వెబ్‌సైట్ కోసం వెతుకుతూ ఉంటే పొరపాటున పోర్న్ వెబ్‌సైట్ పైకి వచ్చిందని, తనకు అశ్లీల చిత్రాల మీద ఆసక్తి లేదని ఆయన బీబీసీతో చెప్పారు.
బ్రిటన్‌లో సగం మంది పెద్దలు పోర్న్ చూస్తారని ఆఫ్‌కాం అనే సంస్థ ఒక రిపోర్టులో వెల్లడించింది.
అసలు జనాలు పబ్లిగ్గా పోర్న్ ఎందుకు చూస్తారు? అందులో కలిగే ఆనందమేమిటి?
దీని గురించి లారెన్ సెంటర్‌లో పనిచేస్తున్న సైకోథెరపిస్ట్ డాక్టర్ పౌలా హాల్‌తో మాట్లాడాం. సెక్స్, పోర్నోగ్రఫీ వ్యసనానికి గురైన వారికి థెరపీ అందిస్తారామె.

ఫొటో సోర్స్, Bronwen Reed
'అదొక వ్యసనం'
కొందరికి పోర్న్ చూడడం ఒక వ్యసనంగా మారుతుంది. అందువల్లే మొహమాటం లేకుండా పబ్లిక్‌లో కూడా అశ్లీల చిత్రాలు చూస్తుంటారని డాక్టర్ హాల్ అన్నారు. తన కెరీర్‌లో ఇలాంటి వ్యసనానికి బానిసలైనవాళ్లను చాలామందిని చూశానని ఆమె చెప్పారు.
"ఏదైనా వ్యసనానికి బానిసగా మారితే, ఇక నియంత్రణ అనే మాటే ఉండదు. పేకాట, తాగుడు, గేమింగ్ ఇలా ఏదైనా సరే, ఆ పని చేయకుండా ఉండలేని స్థితికి వచ్చేస్తారు" అంటూ ఆమె వివరించారు.
"ఇంటికెళ్లి చూద్దాం" అనే విచక్షణ కన్నా "పోర్న్ చూసే వ్యసనం" బలంగా ఉంటుంది. ఆ కోరికను నియంత్రించుకోలేరని హాల్ అన్నారు.
"వ్యసనం అంటూ మొదలైతే, మెదడులో ఆలోచనలు మాయమైపోతాయి" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అవగాహన లేకపోవడం, పురుషాధిక్యత
19 ఏళ్ల కల్లమ్ సింగిల్టన్ గ్లాస్గోలో బస్సులో ప్రయాణిస్తుండగా ఒక వ్యక్తి పోర్న్ వీడియోలు చూస్తూ కనిపించారు.
వెంటనే కల్లమ్‌కు "జుగుప్స, కంగారు" కలిగింది. పబ్లిక్‌లో ఎందుకు అలాంటి వీడియోలు చూస్తారో అతడికి అర్థం కాలేదు.
"ఇదో పెద్ద సమస్యగా కనిపిస్తోంది. ఇది వారి రోజువారీ జీవితంలో భాగం. కానీ, అలా ఉండకూడదు కదా" అంటాడు కల్లమ్.
జనాలు పబ్లిగ్గా అశ్లీల చిత్రాలు చూడడానికి మరొక కారణం "అవగాహాన లేమి" అని డాక్టర్ హాల్ అంటారు.
"ఫోన్‌లో ఫేస్‌బుక్ లేదా ఈబే చూస్తారు. అక్కడేదో లింక్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తారు. అలా పోర్న్ వీడియోలకు వెళ్లిపోతారు" అని ఆమె వివరించారు.
అంతేకాకుండా, ప్రధాన స్రవంతిలో అశ్లీత చిత్రాలను "సాధారణీకరించాలనే" ప్రయత్నాలు కూడా కొందరిని ప్రభావితం చేస్తున్నాయని ఆమె అంటారు.
గతంతో పోలిస్తే "పోర్నోగ్రఫీ ఇప్పుడు చాలా విస్తరించింది". ఏది అశ్లీలం, ఏది కాదు అనే దాని మధ్య "గీతలు కూడా చెరిగిపోతున్నాయి" అని డాక్టర్ హాల్ అన్నారు.
"పబ్లిక్‌లో పోర్న్ వీడియోలు చూస్తున్నవాళ్లకు, తమ చుట్టూ ఉన్నవాళ్లు కూడా అవే వీడియోలు చూస్తూ ఉంటారని అనిపిస్తుందేమో. పోర్న్ చూడడం అంత సాధారణం అయిపోయింది."
ఇందులో మరో కోణాన్ని కూడా ముందుకు తీసుకువచ్చారు డాక్టర్ హల్.
"కొద్దిమంది మగవాళ్లకు పబ్లిగ్గా అశ్లీల చిత్రాలు చూడడం ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కావచ్చు. ఇందులో కొంత పురుషాధిక్యత ఉంది.. 'నాకు ఇది చూసే హక్కు ఉంది' అని వారు భావిస్తారు. అది ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే, తమ తప్పు కాదని నమ్ముతారు" అని ఆమె విశ్లేషించారు.
అలవాటుగా మారడం
చిన్నవయసులోనే పోర్న్ చూడ్డానికి అలవాటు పడడం కూడా ఒక కారణం కావచ్చని డాక్టర్ హాల్ అన్నారు.
"చిన్నవయసులో మొదలయ్యే అలవాట్ల ప్రభావం జీవితంలో చాలాకాలం ఉంటుంది. వాటిని మానుకోవడం చాలా కష్టం. అదొక అలవాటు అని కూడా గుర్తించలేని స్థాయిలో సాధారణం అయిపోతుంది. చిన్నప్పుడే పోర్న్ చూడడం మొదలుపెడితే, పెద్దయ్యాక అది ఆటోమేటిక్ అయిపోతుంది."
అయితే, బహిరంగ ప్రదేశాలు అందరివీ. అక్కడ పోర్న్ చూడడం "నిజంగా ఆందోళన కలిగించే విషయమే" అంటారు డాక్టర్ హాల్.
"బహిరంగ ప్రదేశాలు, రవాణా వాహనాలు అందరికీ సురక్షితం, సౌకర్యం కావాలి. కానీ, అన్నిసార్లూ అలా జరగదు. పబ్లిక్‌లో పోర్న్ చూడడం కొంతమందికి చాలా ఇబ్బంది కలిగించవచ్చు."
"స్వీయ అవగాహన లేకపోవడం దీనికి ముఖ్య కారణం. ఇతరులకు ఎంత ఇబ్బంది కలిగిస్తుందో తెలియకపోవడం కూడా ఒక కారణం. ఇతరులకు జుగుప్స కలుగుతుందని లేదా కోపం తెప్పిస్తుందని వాళ్లు మరచిపోతారు" అని వివరించారు డాక్టర్ హాల్.
ఇవి కూడా చదవండి:
- ‘మూడేసి రోజులు గదిలోనే పెట్టి లాక్ చేసేవారు. తిండి కూడా పెట్టేవారు కాదు’ - పాకిస్తాన్ ఎంపీపై మూడో భార్య ఆరోపణలు
- ఇక్కడ ప్రతి ఆడపిల్లకూ మూడుసార్లు పెళ్లి చేస్తారు
- అసాని తుపాను: ఆంధ్రాలో11 జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక.. తీరం వెంబడి మొదలైన గాలులు, పలు ప్రాంతాల్లో చిరు జల్లులు
- రష్యా విక్టరీ డే పరేడ్‌లో వ్లాదిమిర్ పుతిన్ ఏం చెప్పారు? ‘కీలక ప్రసంగం’లో ఏం ఉంది?
- ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య కౌగిలింతలు, కరచాలనాలు ముగిశాయా? ఇకపై ఏం జరుగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















