రష్యా విక్టరీ డే పరేడ్‌లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏం చెప్పారు? ‘కీలక ప్రసంగం’లో ఏం ఉంది?

విక్టరీ పరేడ్‌లో పుతిన్

ఫొటో సోర్స్, EPA/MAXIM SHIPENKOV

యుక్రెయిన్‌లో తమ మాతృభూమి భవిష్యత్ కోసం రష్యా పోరాడుతోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. నాజీ జర్మనీపై రెండో ప్రపంచ యుద్ధంలో విజయానికి ప్రతీకగా నిర్వహించే విక్టరీ డే వార్షిక వేడుకలో పుతిన్ ప్రసంగించారు.

ఆయన ఈ ప్రసంగంలో కీలకమైన ప్రకటన చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే, యుక్రెయిన్‌పై దాడిని సమర్థించుకుంటూ ఆయన ప్రసంగం సాగింది. ఎలాంటి కీలకమైన ప్రకటనలూ ఆయన చేయలేదు.

విక్టరీ పరేడ్‌లో రష్యా ట్యాంకులు

ఫొటో సోర్స్, EPA

యుక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని 1945లో జర్మనీతో జరిగిన యుద్ధంతో ఆయన పోల్చారు. ప్రస్తుత యుద్ధానికి పశ్చిమ దేశాలు, నాటోనే కారణమని ఆయన ఆరోపించారు.

యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టి పది వారాలకుపైనే గడుస్తోంది. ఈ యుద్ధంలో మరణిస్తున్న పౌరుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

తూర్పు యుక్రెయిన్‌లోని బిలోహోరివ్కా నగరంలో పౌరులు తలదాచుకున్న ఓ స్కూల్‌పై రష్యా బలగాలు దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ దాడిలో దాదాపు 60 మంది పౌరులు మరణించినట్లు వార్తా సంస్థలు చెబుతున్నాయి.

యుక్రెయిన్

ఫొటో సోర్స్, Getty Images

పుతిన్ ప్రసంగ సమయంలో రష్యా ప్రధాన సైనిక నాయకులు అక్కడే ఉన్నారు. యుక్రేనియన్లను ఫాసిస్టులుగా పుతిన్ చెప్పారు. కీయెవ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నియో నాజీ ప్రభుత్వంగా ఆయన విమర్శించారు.

తూర్పు యుక్రెయిన్ ప్రాంతం గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మా మాతృభూమి ఎంతో పవిత్రమైనది’’అని ఆయన అన్నారు. ‘‘దోన్బస్‌లో మన ప్రజల కోసం మీరు పోరాడుతున్నారు. రష్యా భద్రత, మాతృభూమి కోసం మీరు యుద్ధం చేస్తున్నారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

యుక్రెయిన్

ఫొటో సోర్స్, Getty Images

మరోవైపు నాటో, యుక్రెయిన్‌లపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. ‘‘దోన్బస్‌లోని మన ప్రాంతాల్లోకి చొరబడేందుకు వారు ప్రత్యేక ఆపరేషన్ కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. కీయెవ్‌లో అణ్వాయుధాల గురించి వారు మాట్లాడుతున్నారు. మరోవైపు మన మాతృభూమికి సమీపంలోని ప్రాంతాల్లో నాటో గస్తీ కాస్తోంది. ఇది మన సరిహద్దులకు చాలా పెద్ద ముప్పు’’అని ఆయన అన్నారు.

రష్యా అధ్యక్షుడు తమ సైనిక వ్యూహాన్ని మారుస్తారని ఊహాగానాలు వచ్చాయి. ఆయన పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటిస్తారని లేదా మరింత మంది సైనికులను సమీకరిస్తారని కూడా అంచనాలు ఉన్నాయి. అయితే, పుతిన్ వాటి గురించి ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. యుక్రెయిన్‌లో మరణించిన తమ సైనికుల కుటుంబాలకు ఆయన సాయం ప్రకటించారు.

వీడియో క్యాప్షన్, నరమేధం అంటే ఏంటి?

యుక్రెయిన్‌లో మరణించిన తమ సైనికుల కోసం ఒక నిమిషం మౌనం పాటించారు. ‘‘మన సైనిక బలగాలకు మరింత శక్తి దేవుడు అందించాలి. విజయం వరించాలి’’అంటూ పుతిన్ తన 11 నిమిషాల ప్రసంగాన్ని ముగించారు.

విక్టరీ డేలో 11,000 మంది సైనికులు, 131 సాయుధ వాహనాలు పాల్గొన్నాయని రష్యా వార్తా సంస్థలు వెల్లడించాయి. మరోవైపు రష్యాలోని భిన్న ప్రాంతాల్లోనూ చిన్నచిన్న పరేడ్‌లు ఏర్పాటుచేశారు.

అయితే, కొన్నిచోట్ల వేడుకలను రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం నడుమ ఎయిర్‌ఫోర్స్ తమ ఫ్లైపాస్ట్‌ను కూడా రద్దు చేసింది.

విక్టరీ డేకు ముందుగా మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో యుద్ధ విమానాలు ప్రత్యేక విన్యాసాలు చేశాయి. యెకెటెరిన్‌బర్గ్, నోవోసిబిరిస్క్ నగరాల్లోనూ పరేడ్‌ను రద్దు చేశారు.

వీడియో క్యాప్షన్, 2,000 కి.మీ. కఠిన ప్రయాణం చేసిన యుక్రెయిన్ యువతి కథ

మరోవైపు యుక్రెయిన్‌లో పూర్తిగా ఆక్రమించినట్లు భావిస్తున్న ఖేర్సన్ నగరంలోనూ రష్యా విక్టరీ డే వేడుకలు జరిగాయి. దీనికి సంబంధించిన దృశ్యాలను రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ రియా నోవోస్టిలో ప్రసారం చేశారు. ఇక్కడి పరేడ్‌కు రష్యా మద్దతున్న స్థానిక నాయకుడు వొలోదిమీర్ సాల్డో నేతృత్వం వహించారు. ఈయనపై యుక్రెయిన్ దేశద్రోహం ఆరోపణలు మోపింది.

రెండో ప్రపంచ యుద్ధంలో అప్పటి సోవియట్ యూనియన్‌కు చెందిన దాదాపు 2.7 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 80 లక్షల మంది యుక్రెయిన్ పౌరులు ఉన్నారు.

యుక్రెయిన్

ఫొటో సోర్స్, Getty Images

విక్టరీ డేను ఉద్దేశించి యుక్రెయిన్ ప్రజలకు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమీర్ జెలియెన్‌స్కీ కూడా ప్రత్యేక సందేశం పంపించారు. ‘‘1945లో నాజీలను మనం తరిమికొట్టాం. మన భూభాగాన్ని ఎవరు ఆక్రమించినా మనం వదిలిపెట్టం. త్వరలో మనకు రెండు విక్టరీ డేలు ఉంటాయి. ప్రస్తుత ఆక్రమణలను కూడా మనం తరిమికొడతాం’’అని ఆయన చెప్పారు.

విక్టరీ డే సమయంలో రష్యాలో కొన్నిచోట్ల నిరసనలు చోటుచేసుకున్నాయి. కొన్ని వార్తా సంస్థల్లో ‘‘యుక్రెయిన్ వాసుల రక్తంతో మన చేతులు తడిచాయి’’అంటూ యుద్ధ వ్యతిరేక వార్తలు ప్రసారం అయ్యాయి. న్యూస్ వెబ్‌సైట్ లెంటాలోనూ ప్రభుత్వ వ్యతిరేక శీర్షికలతో కథనాలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)