మే 9 విక్టరీ డే ఉత్సవాలు రష్యాకు ఎందుకంత ముఖ్యం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పాల్ కిర్బీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
1945లో నాజీ జర్మనీపై సాధించిన విజయానికి గుర్తుగా ప్రతియేటా మే 9న మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో ఘనంగా ఉత్సవాలను నిర్వహించడం రష్యాలో ఆనవాయితీ. వీటిని విక్టరీ డే ఉత్సవాలని పిలుస్తారు.
పుతిన్ రష్యా పగ్గాలు చేపట్టాక ఈ ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికుల త్యాగాలను గుర్తు చేసుకోవడంతోపాటు, రష్యా ఆయుధ సామర్ధ్యాన్ని, సైనిక పాటవాన్ని ప్రదర్శిస్తుంటారు.
రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు రెండున్నర కోట్లమందికి పైగా రష్యన్లు మరణించారని అంచనా. ఈ యుద్ధాన్ని రష్యన్లు గ్రేట్ పేట్రియాటిక్ వార్ అని కూడా పిలుస్తుంటారు.
ఈ సంవత్సరం విక్టరీ డేకు మరింత ప్రత్యేకత ఉంది. గత కొద్ది నెలలుగా రష్యా యుక్రెయిన్ మీద దాడులు చేస్తోంది.
అయితే, ఈ ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించుకోవడానికి ఇప్పటి వరకు నిర్దిష్టమైన ఫలితాలను మాత్రం రష్యా సాధించలేకపోయింది.
మే 9 నాటి పరేడ్‌లో సైనికులు అధినేత ముందు కవాతు నిర్వహిస్తారు. రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందన్న దానిపై పుతిన్ ప్రకటనలు చేసే అవకాశం ఉంది.
సాధారణంగా తాము చేపట్టబోయే కార్యక్రమాల గురించి రష్యా నాయకులు ఇక్కడి నుంచే ప్రకటనలు చేస్తుంటారు.

ఫొటో సోర్స్, EPA
బోరిస్ ఎల్సిన్ కాలంలో విక్టరీ డేను నామమాత్రంగా నిర్వహించేవారు. 1995లో 50వ వార్షికోత్సవాన్ని మాత్రం ఘనంగా నిర్వహించారు.
అయితే 2008 నుంచి వ్లాదిమిర్ పుతిన్ ఈ పరేడ్‌లో సైనిక కవాతు, ఆయుధ సంపత్తిని ప్రదర్శించడం ప్రారంభించారు. ఈ ప్రదర్శనల్లో రష్యా స్వాభిమాన ప్రకటన ప్రధానాంశంగా మారింది. నాజీల నుంచి యూరప్‌ను విముక్తం చేసిన దేశంగా పాఠ్యపుస్తకాల్లో రష్యాను అభివర్ణించారు.
''పుతిన్ పాలనాకాలం వచ్చాక ఈ పరేడ్‌లో రష్యా శక్తి ప్రదర్శన ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం భారీ ఎత్తున ఆయుధాలను, సైనిక శక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ సంవత్సరం అది ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది'' అని గ్లాస్గో యూనివర్సిటీకి చెందిన అమ్మాన్ చెస్కిన్ వ్యాఖ్యానించారు.
అయితే, విక్టరీ డే వేడుకలలోనే అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటిస్తారన్న వాదనలను ప్రభుత్వం తిరస్కరించింది. రష్యా ఒక ప్రత్యేక తేదీ కోసం కృత్రిమంగా సైనిక చర్యలు చేపట్టదని విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు.
2014లో రష్యా క్రైమియాను స్వాధీనం చేసుకున్నాక, తాము ఫాసిజంపై విజయం సాధించామని అధ్యక్షుడు పుతిన్ విక్టరీ డే రోజున రెడ్ స్క్వేర్‌లో ప్రకటించారు. ఆ తర్వాత ఆయన బ్లాక్ సీ నౌకా కేంద్రం సెవాస్టొపోల్‌లో కొన్ని వేలమంది సమక్షంలో క్రైమియా ఆక్రమణ విజయోత్సవాలను నిర్వహించారు.
''వాస్తవానికి ఈ సంవత్సరం విక్టరీ వేడుకల్లో ఫిబ్రవరిలోనే సాధించాల్సిన విజయాన్ని ప్రకటించాల్సి ఉంది'' అని ఎర్నెస్ట్ విసిజ్‌కివిజ్ అన్నారు. ఆయన సెంటర్ ఫర్ పోలిష్-రష్యన్ డైలాగ్ అండ్ అండర్‌స్టాండింగ్‌లో పని చేస్తున్నారు.
''వాళ్లు సోమవారం నాడు పబ్లిక్ రిలేషన్స్ స్టంట్ నిర్వహించబోతున్నారు. ప్రజలు మాత్రం ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ ఎంత వరకు వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారు'' అని విసిజికివిజ్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఈపాటికి యుక్రెయిన్‌లో ప్రభుత్వాన్ని కూలదోసిన వేడుకలను జరుపుకోవాల్సి ఉండగా, కేవలం మరియుపోల్‌లో చాలా భాగం స్వాధీనం చేసుకోగలిగామని చెప్పుకునే పరిస్థితిలో ఉంది రష్యా. తాము యుక్రెయిన్ డీనాజిఫికేషన్ చేశామని పదే పదే ప్రకటించుకుంటోంది ఆ దేశం.
''రష్యా నగరాలు, వివిధ ప్రాంతీయ రాజధానుల్లో విక్టరీ డే సింబల్స్ కనిపిస్తున్నాయి. సాధారణంగా విక్టరీ డే రోజు మే 9, 1945 అని రాస్తారు. కానీ, ఈ సంవత్సరం 1945/1922 అని రాస్తున్నారు. దీని ద్వారా తాము నాజీలతో ఇప్పటికీ పోరాడుతున్నామని ప్రజలకు చెప్పదలచుకున్నారు'' అని రిడిల్ రష్యా అనే ఎనాలిసిస్ గ్రూప్ సహ వ్యవస్థాపకురాలు ఓల్గా ఇరిసోవా అన్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా మరియుపోల్‌లో విక్టరీ డే వేడుకలను రష్యా నిర్వహించడం లేదు.
''దోన్యస్క్‌లాగా విముక్తం అయ్యే వరకు మరియుపోల్‌లో విక్టరీ వేడుకల కోసం వేచి చూస్తాం'' అని ఈ ప్రాంతంలో రష్యా అనుకూల నేత డెనిస్ పుషిలిన్ అన్నారు.
మరియపోల్‌లో ఏవైనా ప్రత్యేక కార్యక్రమాలుంటే, అవి తప్పకుండా రష్యా అధికార టీవీలో కనిపిస్తాయి. ఇప్పటికే రష్యా అనుకూల టీవీ వ్యాఖ్యాత వ్లాదిమిర్ సొలొవ్యోవ్, ప్రెసిడెంట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సెర్గెయ్ కిరెయెన్కో బృందంతో కలిసి మరియుపోల్ నగరాన్ని సందర్శించి వచ్చారు.
ఇవి కూడా చదవండి:
- ఇన్వర్టర్ను ఎలా ఎంచుకోవాలి... ప్రమాదాలను నివారించడానికి పాటించాల్సిన 8 సూత్రాలు
- ప్రమోద్ మహాజన్ హత్య: ఎందుకు చేశారు? ఆ రోజు ఆయన ఇంట్లో అసలేం జరిగింది?
- డ్రోన్లు భారత వైద్య పరిశ్రమలో పెనుమార్పులు తెస్తాయా?
- చైనా: రోజుకు రూ.1,14,000 సంపాదిస్తున్న డెలివరీ బాయ్స్.. నిజమేనా?
- CIA: అమెరికా గూఢచార సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా భారతీయ అమెరికన్ నంద్ మూల్‌చందనీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












