డ్రోన్లు భారత వైద్య పరిశ్రమలో పెనుమార్పులు తెస్తాయా?

ఫొటో సోర్స్, Getty Images
డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా వైద్య సేవలను అందించగలిగే డ్రోన్లు భారతీయ వైద్య పరిశ్రమలో పెను మార్పులు తెస్తాయని భావిస్తున్నారు. గత ఏడాది భారత్ లో డ్రోన్ల కున్న నిబంధనలను సడలించినప్పటి నుంచి కొంత మంది ఆపరేటర్లు డ్రోన్ల పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు.
వైద్య రంగంలో డ్రోన్ల భవిష్యత్తు ఎలా ఉంటుందనే అంశాన్ని బీబీసీ ప్రతినిధి ఆండ్రూ క్లారెన్స్ పరిశీలించారు.
ఈ నెల మొదట్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ నుంచి 72 కిలోమీటర్ల దూరంలోనున్న నోయిడా కు డ్రోన్ల ద్వారా రక్త నమూనాలను పంపించారు.
ఇవి చేరేందుకు ఒక గంటకు పైగా సమయం పట్టింది. మధ్యలో బ్యాటరీ మార్చేందుకు ఒకసారి డ్రోన్‌ను ఆపాల్సి వచ్చింది. రోడ్డు మార్గంలో ఈ దూరం చేరేందుకు రెండు గంటలకు పైగా సమయం పడుతుంది.
ఒక డయాగ్నస్టిక్ ల్యాబ్ మానవ రహిత ఏరియల్ విధానాన్ని ఉపయోగించి నమూనాలను పంపడం ఒక సరికొత్త విధానం అని చెప్పొచ్చు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ట్రయల్స్ లో భాగంగా చాలా మంది డ్రోన్ల తయారీదారులు ఔషధ సరఫరా, పెథాలజీ నమూనాలు, రక్తం యూనిట్లను చేర్చేందుకు వాటిని వాడుతున్నారు.
డ్రోన్ల లాజిస్టిక్స్ సంస్థ స్కై ఎయిర్ మొబిలిటీ ఈ డ్రోన్ ను నిర్మించి నోయిడాకు వెళ్లే ఏర్పాట్లు చూసింది.
ఇప్పటి వరకు 1000కి పైగా సార్లు డ్రోన్ల ద్వారా 3500 కేజీలకు పైగా బరువున్న వివిధ రకాల వస్తువులను సరఫరా చేసింది. గత ఏడాది నవంబరు నుంచి డ్రోన్ల ద్వారా వాణిజ్య సరఫరాల నుంచి మొదలుకొని రక్తపు నమూనాల వరకు చాలావాటిని పంపించారు.
"సాధారణ రవాణా మార్గాలతో పోల్చి చూస్తే ఈ డ్రోన్ల ద్వారా చేసిన సరఫరాల వల్ల 48% సమయం ఆదా అవుతున్నట్లు డ్రోన్ల నుంచి సేకరించిన సమాచారం చెబుతోంది" అని స్కై ఎయిర్ మొబిలిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంకిత్ కుమార్ చెప్పారు.
ఈ డ్రోన్ సంస్థ గురుగ్రామ్‌లో కూడా భారతదేశంలో ప్రముఖ డయాగ్నస్టిక్ సంస్థ ఎస్‌ఆర్‌ఎల్ డయాగ్నస్టిక్స్ కోసం ఒక ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ శాంపిళ్లను ముందు ల్యాబ్ నిపుణులు సేకరించి, డ్రోన్ కు జతగా ఉన్న ఉష్ణోగ్రతలను నియంత్రించే క్యారియర్ లో అమర్చారు. ఈ నమూనాలను ఒక ప్రైవేటు ఆస్పత్రి నుంచి ల్యాబ్ కు పంపించగా ల్యాబ్ నిపుణులు నమూనాలను సేకరించారు. ఈ మొత్తం ప్రక్రియకు రోడ్డు మార్గంలో పట్టే సమయం కంటే మూడొంతుల తక్కువ సమయం పట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
ల్యాబ్ ఆపరేషన్లు సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఈ ప్రక్రియ తోడ్పడుతుందని ఎస్ ఆర్ ఎల్ డయాగ్నస్టిక్ సిఈఓ కే ఆనంద్ చెప్పారు. "కీలకమైన వైద్య ఫలితాలను వేగంగా వెల్లడించడం ద్వారా రోగికి ప్రయోజనం చేకూరుతుంది" అని అన్నారు.
కానీ, డ్రోన్లను వైద్య సేవల్లో ప్రభావవంతంగా ఉపయోగించేందుకు చాలా తక్కువ ఉదాహరణలు ఉన్నాయని ప్రజారోగ్య నిపుణులు అంటున్నారు.
"దీనికయ్యే ఖర్చును కూడా పరిగణన లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదింకా పరీక్షించే దశలోనే ఉండటంతో ఇవి ప్రభావవంతమైనవని చెప్పలేం. దీనికి చేయాల్సింది చాలా ఉంది" అని పుణెలో ఉన్న కెమ్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ లో ప్రజారోగ్య పరిశోధకురాలు రుతుజా పాటిల్ అన్నారు.
ఆమె గత సంవత్సరం ఒక ప్రజారోగ్య ప్రాజెక్టుకు నేతృత్వం వహించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్ర లోని మారు మూల ప్రాంతాల్లో ఉన్న ప్రజారోగ్య కేంద్రాలకు అత్యవసర ఔషధాలను తీసుకుని వెళ్లేందుకు డ్రోన్లను ఉపయోగించారు.
"ప్రస్తుతం ఒక వాహనం, సాఫ్ట్ వేర్, ఆటోమేషన్ ఒకదానితో ఒకటి సంప్రదించగలవని చూపించారు" అని ఆమె అన్నారు.
అయితే, ఈ విధానం అందుబాటు ధరల్లోకి రావాలంటే సాంకేతికత స్థాయి మరింత పెరగాలని అంటారు.
"2-8 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల్లో వ్యాక్సిన్లు, ఔషధాలను పంపించాల్సి రావడం మరింత సవాలుగా మారే అవకాశముంది" అని ఆమె అన్నారు.
భారతదేశంలో డ్రోన్లను విపత్తు సమయాల్లో సహాయక చర్యల్లో భాగంగా వాడుతున్నారు. కుంభ మేళా సమయంలో ఉత్తర్ ప్రదేశ్ లో డ్రోన్లను వాడారు. ఈశాన్య భారతంలో మారు మూల ప్రాంతాలకు కోవిడ్ వ్యాక్సిన్లను పంపేందుకు కూడా డ్రోన్లను వాడారు.
అయితే, డ్రోన్ల ద్వారా సరఫరాలు చేయడం గతంలో ఇంత సులభంగా ఉండేది కాదు. డ్రోన్లను విపరీతంగా నియంత్రించేవారు. ప్రైవేటు నిర్వాహకులు డ్రోన్లను వాడాలంటే చాలా నిబంధనలను పాటించాల్సి వచ్చేది. దీనికి తోడు వారు ఏదైనా వస్తువును సరఫరా చేయాలంటే లైసెన్స్ కూడా ఉండాలి.
కానీ, గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వం డ్రోన్ల నియమ నిబంధనలను సడలించింది. వాణిజ్య డ్రోన్లను నిర్వహించేందుకు లైసెన్సులను, ఫీజును తగ్గించింది.

ఫొటో సోర్స్, Directorate General of Civil Aviation
కొత్త నిబంధనల్లో నిర్వాహకులు దరఖాస్తులు నింపే ప్రక్రియను కూడా సరళీకరించింది. డ్రోన్ల నిర్వహణకు చెల్లించాల్సిన రుసుమును కూడా గణనీయంగా తగ్గించింది.
ప్రభుత్వం దేశ ఎయిర్‌స్పేస్ మ్యాప్‌ను కూడా విడుదల చేసింది. దీని ప్రకారం గగన తలాన్ని ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో మూడు విభాగాలుగా విభజించింది.
డ్రోన్ ఆపరేటర్లు డ్రోన్లను ఎక్కడ ఎగరవేయవచ్చు, ఎగరవేయకూడదో కూడా ఈ మ్యాప్ సూచిస్తుంది.
ముఖ్యంగా గ్రీన్ జోన్లలో డ్రోన్లను నిర్వహించేందుకు ఎటువంటి అనుమతులు అవసరం లేదు. ఇవి సముద్ర మట్టం నుంచి 400 అడుగుల ఎత్తులో ఉంటాయి.
మైక్రో, నానో డ్రోన్లకు లైసెన్సులు ఇచ్చింది. నానో డ్రోన్లు 250 గ్రాముల బరువుండి మానవ రహితంగా ఉంటే.. మైక్రో డ్రోన్లు 2 కేజీల వరకు బరువు ఉంటాయి.
భారతీయ డ్రోన్ల పరిశ్రమ 3 లక్షల కోట్ల రూపాయల విలువ వరకు పెరిగే అవకాశముందని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ చెబుతోంది. దీని వల్ల రానున్న మూడేళ్ళలో కనీసం 10,000 ఉద్యోగాలు కల్పించవచ్చని చెబుతోంది.
డ్రోన్ల భవిష్యత్తు ఆశాజనకంగా ఉందని కుమార్ లాంటి పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు.
"ఈ ఏడాది చివరి నాటికి వివిధ పనులకు ఉపయోగపడే విధంగా 20కి పైగా కేంద్రాల్లో 100కి పైగా డ్రోన్లను ప్రవేశపెడతాం" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్కిటిక్ ప్రాంతంపై హక్కులెవరికి ఉన్నాయి? అక్కడ ఆయిల్, గ్యాస్ ఎవరైనా తవ్వుకోవచ్చా
- ఎవరెస్ట్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ శిఖరంపై యుక్రెయిన్ యుద్ధ ప్రభావం
- మనకు తగినంత విటమిన్-డి అందాలంటే ఏ సమయంలో, ఎంతసేపు ఎండలో ఉండాలి
- 7 లక్షల జనాభా ఉన్న చిన్న దేశంతో చైనా ఒప్పందం: భయపడుతోన్న ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా...
- మెన్స్ట్రువల్ కప్: నెలసరి సమయంలో దీనిని ఎలా వాడాలి? ఇక శానిటరీ ప్యాడ్ల అవసరం ఉండదా? 5 ప్రశ్నలు, సమాధానాలు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














