Summer: ఈసారి వడగాలులు ఎందుకింత తీవ్రంగా ఉన్నాయి? దీన్నుంచి కాపాడుకోవడం ఎలా

వేసవి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మీరెప్పుడైనా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎండలో బయటకు వెళ్లకూడదనే సూచనలను విన్నారా? ఈ నెలల్లో వేడి గాలులతో ఇబ్బందులు పడ్డారా?

మార్చి-ఏప్రిల్ నెలలో మీరు ఉతికిన బట్టలు కేవలం అరగంటలో ఆరిపోయాయా?

మార్చి-ఏప్రిల్ నెలలో బయట ఉన్న మీ మొక్కలు ఎండిపోవడం చూశారా?

గతంలో ఎప్పుడైనా మీకు మార్చి నెల నుంచే చల్లటి నీరు, నిమ్మరసం, మజ్జిగ తాగాలని అనిపించిందా? ఏసీ నుంచి అస్సలు బయటకు రాకూడదు అనిపించిందా?

మార్చి-ఏప్రిల్ నెలలలో ఎప్పుడైనా వడదెబ్బకు గురయ్యారా?

ఈ ప్రశ్నలకు లేదనే సమాధానం వస్తే ఆశ్చర్యానికి గురవ్వాల్సిన పనేమీ లేదు.

ఈ ఏడాది కనిపిస్తున్న ఉష్ణోగ్రతలు సాధారణం కాదు. 1901 నుంచి చూస్తే , 2022 మార్చిలో అత్యంత ఉష్ణోగ్రతలు కనిపించడం ఇది మూడో సారి.

ఈ ఏడాది మార్చిలో భారత్‌లో 26 రోజులపాటు వేడిగాలులు వీచాయి. తూర్పు, మధ్య, ఉత్తర భారత ప్రాంతాలకు వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది.

వేసవి

ఫొటో సోర్స్, Getty Images

కారణం ఏంటి?

ఈ రెండు నెలల్లో వానలు, ఉరుములతో కూడిన వర్షం, వడగళ్ల వానలు కురిసిన దాఖలాలు లేకపోవడమే ఈ అధిక ఉష్ణోగ్రతలకు ప్రధాన కారణం.

గతంలో ఈ నెలల్లో సగటు వర్షపాతం 30.4 మిల్లీ మీటర్లు ఉండగా, ఈ ఏడాది కేవలం 8.9 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది.

దేశంలోని పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చే గాలులు దక్షిణ, మధ్య భారతదేశ పవనాలను తాకినప్పుడు వర్షం, తుపానులు వస్తాయి. ఈసారి అది కూడా చాలా తక్కువ.

సాధారణంగా, వడగాలులు దశ ఏప్రిల్ చివరిలో ప్రారంభమై మే నెలలో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఈ ఏడాది మార్చి 11 నుంచే హీట్ వేవ్ కనిపించింది. ఇది హోలీ పండుగకు ముందే కనిపించింది.

మరోవైపు, వాతావరణ శాస్త్రవేత్తలు మార్చి, ఏప్రిల్‌లో వీచే బలమైన వేడి గాలులు అసాధారణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వాతావరణం నుండి కర్బన ఉద్గారాలను తగ్గించకపోతే, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేడి గాలులు వాతావరణంలో సాధారణంగా మారిపోయే అవకాశముందని అంటున్నారు.

వాతావరణ మార్పుల కారణంగా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి తీవ్రమైన హీట్‌వేవ్ ఉండవచ్చని ఇంపీరియల్ కాలేజ్ లండన్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన మరియం జకారియా, ఫ్రెడరిక్ ఒట్టో చేసిన పరిశోధన చెబుతోంది.

"ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడానికి మానవ చర్యలు కారణమవ్వడానికంటే ముందు, భారతదేశంలో మనం ఈ నెల ప్రారంభంలో చూసిన లాంటి ఉష్ణోగ్రతలను 50 ఏళ్ల క్రితమే అనుభవించాం. కానీ ప్రస్తుతం ఇది సాధారణ విషయంగా మారింది. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది" అని మరియం జకారియా అన్నారు.

వీడియో క్యాప్షన్, సహారా ఎడారిలో 50 డిగ్రీల మండుటెండలో జీవితం ఎలా ఉంటుందంటే...

వేడి గాలుల ప్రభావం

ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం అకస్మాత్తుగా, వేగంగా పెరిగింది.

ప్రస్తుతం భారతదేశంలో థర్మల్ పవర్ ప్లాంట్లలో అత్యధిక విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో బొగ్గు అవసరం విపరీతంగా పెరిగింది.

డిమాండ్ ఒక్కసారిగా పెరగడం వల్ల బొగ్గు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. బొగ్గు కొరత కారణంగా, రాబోయే రోజుల్లో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడవచ్చని దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

ఇదే జరిగితే మెట్రో రైళ్లు, ఆసుపత్రుల వంటి ముఖ్యమైన సేవలపై కూడా ప్రభావం చూపుతుందనేది ఆందోళన కలిగించే అంశం.

"వేడి పెరిగినప్పుడల్లా బొగ్గు సరఫరాపై ప్రభావం పడుతోంది. కానీ రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ వినియోగం, ఆ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి పెరగకపోవడం, డిమాండ్-సరఫరా మధ్య అంతరం పెరగడం సహజం" అని ఎన్‌టీపీసీ మాజీ జనరల్ మేనేజర్ బీఎస్ ముఖియా అన్నారు.

సుదీర్ఘ వేడిగాలులు, విద్యుత్ సరఫరా అంతరాయాలు ప్రధానంగా పారిశ్రామిక ఉత్పత్తి, పంటలపైనా ప్రభావం చూపిస్తాయి.

వేడిగాలుల కారణంగా ఉత్పన్నమవుతున్న విద్యుత్ సంక్షోభం గురించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. భారత్‌లో బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని దిగుమతి కూడా చేసుకుంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బొగ్గు ధరలు కూడా పెరిగాయి. బొగ్గుకు డిమాండ్ కూడా పెరిగింది.

వాతావరణపరంగా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే కొన్ని వారాలు పెద్ద సవాలుగా మారవచ్చు.

"హీట్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా బహిరంగ శీతలీకరణ ప్రాంతాలు, తక్కువ విద్యుత్ కోతలు, స్వచ్ఛమైన తాగునీరు, కార్మికుల పని వేళల్లో మార్పు ఉండేలా చూసుకోవాలి. మండుతున్న వేడిలో పని చేసే బడుగు బలహీన వర్గాల కోసం మనం ఈ చర్యలు తీసుకోవాలి" అని గుజరాత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రోగ్రామ్ మేనేజర్ అభియంత్ తివారీ చెప్పారు.

వేసవి

ఫొటో సోర్స్, Getty Images

వేడిని ఎలా ఎదుర్కోవాలి

ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచాలి: చాలా మందికి దీని గురించి తెలుసు. శరీరం 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో బాధపడుతుంటే, హీట్ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు పెరుగుతాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, తక్షణ వైద్య సహాయం అవసరం. వైద్య సహాయం వెంటనే అందని పరిస్థితుల్లో ఒక్కోసారి అపస్మారక స్థితికి దారి తీసి అవయవాలకు కూడా హాని కలగొచ్చు. కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోవచ్చు. చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినా కూడా ప్రమాద సంకేతాలే.

ఆహారం, నీరు: శరీరంలో నీటి కొరత ఏర్పడకుండా నీరు తాగుతూ ఉండాలి. నీరు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది.

సూర్యరశ్మికి దూరంగా: మీరు ఎంత ఎక్కువ ఇంటి లోపల ఉండగలిగితే అంత మంచిది. పగటిపూట వీలైతే, బయటకు వెళ్లవద్దు. వ్యాయామం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

దుస్తులు: మీరు బయటకు వెళ్లినప్పుడు మిమ్మల్ని మీరు కప్పి ఉంచుకోండి, కానీ మీరు కాటన్ దుస్తులు ధరించాలని గుర్తు పెట్టుకోండి. తలపై టోపీ పెట్టుకోవడం మంచిది.

చల్లదనం: ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు వాడటంతో పాటు చల్లని నీటితో స్నానం చేస్తూ ఉండాలి. గదిని చల్లగా ఉంచేందుకు కర్టెన్లు వేసి ఉంచుకోవాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)