ఇన్వర్టర్‌ను ఎలా ఎంచుకోవాలి... ప్రమాదాలను నివారించడానికి పాటించాల్సిన 8 సూత్రాలు

విద్యుత్ కోత

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, రాజేశ్ పెదగాడి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వేసవిలో విద్యుత్ డిమాండ్‌కు సరఫరాకు మధ్య అంతరం అనివార్యంగా పెరుగుతుంటుంది. ఏసీలు, కూలర్ల వినియోగం పెరగడంతో విద్యుత్ అవసరాలు మరింత పెరుగుతాయి. దాంతో, చాలా చోట్ల కరెంట్ కోతలు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో పవర్ కట్ నుంచి ఉపశమనం కలిగించే ఇన్వర్టర్లకు డిమాండ్ పెరుగుతోంది.

ఇంతకీ ఇన్వర్టర్లు ఎలా పనిచేస్తాయి? మన ఇంటి అవసరాలకు తగిన ఇన్వర్టర్లను ఎంచుకోవడం ఎలా? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చూద్దాం.

ఇన్వర్టర్

ఫొటో సోర్స్, Facebook/Exide Batteries

1. ఇన్వర్టర్లు ఎలా పనిచేస్తాయి?

ఇన్వర్టర్లలో చాలా బ్రాండ్లు, మోడల్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో మనకు సరిపడా ఇన్వర్టర్లను ఎంచుకోవడం కాస్త కష్టమే. అయితే, వీటి గురించి తెలుసుకుంటే సులువుగానే మనకు సరిపడా ఇన్వర్టర్లను ఎంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇన్వర్టర్లు బ్యాకప్ పవర్ డివైజ్‌లు. ఇవి బ్యాటరీల్లోని లోవోల్టేజీ డైరెక్ట్ కరెంట్‌ను మన గృహోపకరణాలకు సరిపడే ఆల్టర్నేటింగ్ కరెంట్‌గా మారుస్తాయి. కరెంటు కోతల సమయంలో ఇవి మన ఇంట్లో ఎలక్ట్రిక్ పరికరాలకు విద్యుత్‌ను సరఫరా చేస్తాయి.

‘‘డీజిల్ జెనరేటర్లలా ఇవి పెద్దపెద్ద శబ్దాలు చేయవు. వీటి కోసం మనం డీజిల్‌ను కొనాల్సిన అవసరం కూడా ఉండదు’’అని అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్‌కు చెందిన ఆమరాన్ బ్యాటరీస్ సీనియర్ ఇంజినీర్ లోకేంద్ర ఝా చెప్పారు. ఇన్వర్టర్‌లు కొనుగోలు చేసేటప్పుడు ఏ అంశాలు దృష్టిలో పెట్టుకోవాలో ఆయన బీబీసీతో మాట్లాడారు.

‘‘వీటిని కొనుగోలు చేసేటప్పుడు మన ఇంట్లో విద్యుత్ ఎంత అవసరం పడుతుందో మొదట లెక్కవేసుకోవాలి’’అని ఆయన వివరించారు. మన ఇంటి విస్తీర్ణం ఎంత? ఇంట్లో ఎన్ని ఎలక్ట్రిక్ పరికరాలు ఉన్నాయి? ఇవి ఎంత విద్యుత్ ఉపయోగిస్తున్నాయి? లాంటి అంశాలను మొదట మనం అంచనా వేసుకోవాలని చెప్పారు.

ఈ లెక్కలకు అనుగుణంగానే మనకు అవసరమైన సామర్థ్యమున్న ఇన్వర్టర్‌ను ఎంచుకోవాలని ఆయన అన్నారు.

బ్యాటరీ

ఫొటో సోర్స్, Facebook/Exide Batteries

2. ఎంత విద్యుత్ అవసరం అవుతుంది?

మన ఇంట్లో ఒక్కో ఎలక్ట్రిక్ పరికరానికి ఎంత విద్యుత్ అవసరం అవుతుందో విడివిడిగా మనం తెలుసుకోవాలి. దాని ప్రకారం మొత్తం విద్యుత్ అవసరాన్ని గణించాలి.

‘‘ఉదాహరణకు ఇంట్లో మూడు ఫ్యాన్లు, మూడు ట్యూబ్‌లైట్లు, ఒక టీవీని వాడుతున్నాం అనుకోండి. సగటున ఒక ఫ్యాన్‌కు 70 వాట్‌లు, ఒక ట్యూబ్‌లైట్‌కు 60 వాట్‌లు, టీవీకి 120 వాట్‌లు చొప్పున విద్యుత్ అవసరం అవుతుంది. మొత్తంగా మీకు 510 వాట్‌ల విద్యుత్ అవసరం అవుతుంది’’అని లోకేంద్ర చెప్పారు.

‘‘ఇలాంటి పరిస్థితుల్లో 1000 వాట్‌ల కంటే ఎక్కువ సామర్థ్యముండే ఇన్వర్టర్లను మాత్రమే కొనుగోలు చేయాలి’’అని ఆయన అన్నారు.

ఎప్పుడైనా మనకు అవసరమయ్యే లోడ్‌కు రెట్టింపు పవర్‌నే ఎంచుకోవాలని ఆయన సూచించారు.

బ్యాటరీ

ఫొటో సోర్స్, Facebook/Exide Batteries

3. బ్యాటరీని ఎంచుకోవడం ఎలా?

ఇన్వర్టర్ బ్యాటరీల విషయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలని మైక్రోటెక్ ఇంటర్నేషనల్‌కు చెందిన ఇన్వర్టర్ల నిపుణుడు గౌరవ్ కొచ్చర్ అన్నారు.

‘‘ఇక్కడ రెండు విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్వర్టర్ కెపాసిటీ అంటే ఒక సమయంలో ఇన్వర్టర్ అందించగలిగే మొత్తం విద్యుత్ కెపాసిటీ. బ్యాటరీ కెపాసిటీ అంటే బ్యాటరీ స్టోర్ చేయగలిగే విద్యుత్ సామర్థ్యం’’అని ఆయన అన్నారు.

మన ఇన్వర్టర్ ఎంతసేపు పనిచేస్తుంది అనేది బ్యాటరీ సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు.

‘‘బ్యాటరీ కెపాసిటీని యాంపియర్ అవర్స్‌లో కొలుస్తారు. ఎంతసేపు ఇన్వర్టర్ పనిచేయాలి అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బ్యాటరీని మనం ఎంచుకోవాలి’’అని గౌరవ్ చెప్పారు.

‘‘బ్యాటరీ కెపాసిటీని ఎలా గణించాలంటే.. అవసరమైన పవర్(వాట్లలో)ను అవసరమైన సమయం(గంటలు)తో గుణించాలి. ఈ మొత్తాన్ని బ్యాటరీ వోల్టేజీ(12 వోల్టులు)తో భాగించాలి’’అని ఆయన చెప్పారు.

‘‘ఉదాహరణకు 510 వాట్ల విద్యుత్ మూడు గంటలపాటు వినియోగించాలి అనుకోండి. మనకు 127 యాంపియర్ అవర్స్‌ (ఏహెచ్) బ్యాటరీ అవసరం అవుతుంది’’అని ఆయన వివరించారు.

‘‘కొన్ని ఇన్వర్టర్లలో రెండేసి బ్యాటరీలు ఉంటాయి. కరెంట్ కోతలు ఎక్కువైనప్పుడు ఇలాంటివి ఎంచుకుంటే మేలు’’అని ఆయన సూచించారు.

విద్యుత్ కోత

ఫొటో సోర్స్, AP

4. డ్రై అండ్ ఓపెన్ ప్లేస్‌లోనే పెట్టాలా?

ఎలక్ట్రిక్ ఉపకరణాలకు అవసరమయ్యే విద్యుత్‌ను అందించే ఇన్వర్టర్లు త్వరగా వేడెక్కుతుంటాయి. అందుకే వీటిని

డ్రై అండ్ ఓపెన్ ప్లేస్‌లలో స్టోర్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

‘‘ఈ వేడిని చల్లబరిచేందుకు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇన్వర్టర్లు దెబ్బతినే ముప్పుంటుంది’’అని లోకేంద్ర చెప్పారు.

‘‘గాలి సరిగా తగలని ప్రాంతాల్లో మనం ఇన్వర్టర్లను పెడితే ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశముంటుంది’’అని ఆయన వివరించారు.

కోయంబత్తూరులో మార్చి 16న 50ఏళ్ల మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు ఇలానే ఇన్వర్టర్ నుంచి వచ్చిన మంటలు, పొగ వల్ల మరణించారనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

విద్యుత్ కోత

ఫొటో సోర్స్, Getty Images

5. తరచూ ఉపయోగించాలి

ఇన్వర్టర్‌లోని బ్యాటరీలను తరచూ వాడుతూ ఉండాలి. విద్యుత్ కోతలు లేవు కదా అని వాటిని పక్కన పెట్టేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

‘‘మీకు పవర్ కట్‌లు లేకపోయినా ఇన్వర్టర్ బ్యాటరీ పవర్ రీసైక్లింగ్ చేయాలి. అంటే దీనిలో విద్యుత్‌ను పూర్తిగా ఉపయోగించి మళ్లీ ఛార్జింగ్ పెట్టుకోవాలి’’అని గౌరవ్ చెప్పారు.

పవర్ రీసైక్లింగ్ అనేది నెల రోజులకు ఒకసారైనా చేస్తే మేలని ఆయన సూచించారు. అయితే, అప్పుడు పూర్తిగా ఛార్జింగ్‌ను వాడేసి మళ్లీ ఛార్జింగ్ పెట్టుకోవాలని ఆయన అన్నారు.

రీసైక్లింగ్ చేయకపోతే బ్యాటరీ డెడ్ అయ్యే ముప్పుంటుందని ఆయన వివరించారు.

6. వాటర్ లెవల్ చూసుకోవాలి

ఇన్వర్టర్‌లోని రసాయన చర్యలకు సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే, కాలం గడిచేకొద్దీ ఈ యాసిడ్ చిక్కబడుతుంది. ముఖ్యంగా లోపల నీరు తగ్గిపోవడం వల్ల ఇలా జరుగుతుంది.

‘‘వాటర్ లెవల్ తగ్గిపోతే ఇన్వర్టెర్ సామర్థ్యం కూడా తగ్గుతుంది. అందుకే ఈ యాసిడ్‌ను మళ్లీ సాధారణ స్థితిలోకి తీసుకొచ్చేందుకు నీటిని పోస్తుండాలి’’అని లోకేంద్ర చెప్పారు.

అయితే, సాధారణమైన నీటిని బదులు డిస్టిల్డ్ వాటర్‌ను మాత్రమే ఇన్వర్టెర్‌లో వేయాలని ఆయన సూచించారు.

‘‘సాధారణంగా నీటిలో అయాన్లు ఉంటాయి. ఇవి బ్యాటరీలోని ఎలక్ట్రోడ్‌కు అతుక్కుపోతాయి. ఫలితంగా బ్యాటరీలో రసాయన చర్యలకు అవరోధాలు ఎదురవుతాయి. అదే డిస్టిల్డ్ వాటర్‌లో ఎలాంటి అయాన్లూ ఉండవు’’అని ఆయన చెప్పారు.

బ్యాటరీలు సాఫీగా పనిచేయడంలో వాటర్ లెవల్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవడం చాలా ముఖ్యమని సూచించారు. కనీసం ఆరు నెలలకు ఒకసారి వాటర్ లెవల్ చెక్‌చేసుకోవాలని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, భారత్‌లో బొగ్గు వినియోగాన్ని తగ్గిస్తే విద్యుత్‌ డిమాండ్‌ సమస్యను అధిగమించగలమా?

7. తరచూ శుభ్రం చేయాలి

ఇన్వర్టర్లను తరచూ శుభ్రం చేస్తుండాలి. దుమ్మూధూళి వల్ల కూడా ఇన్వర్టర్ సామర్థ్యంపై ప్రభావం పడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

‘‘కాటన్ క్లాత్‌తో ఇన్వర్టర్ బ్యాటరీలను ఎప్పటికప్పుడు తుడుస్తుండాలి. టెర్మినళ్లను శుభ్రం చేసేటప్పుడు పెట్రోలియం జెల్లీని కూడా ఉపయోగించొచ్చు’’అని ఇన్వర్టర్లకు మరమ్మతులు నిర్వహించే విశాఖపట్నానికి చెందిన ఎం. రవి కుమార్ వివరించారు.

‘‘ఇన్వర్టర్ బ్యాటరీని తుడిచేటప్పుడు లేదా ఏవైనా మరమ్మతులు చేసేటప్పుడు ఇన్వర్టర్ నుంచి దాన్ని డిస్కనెక్ట్ చేయాలి. లేదంటే షాక్ కొట్టే ముప్పుంటుంది’’అని ఆయన చెప్పారు.

2018లో ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీలో 24ఏళ్ల ఎలక్ట్రిషియన్ ఇలానే ఇన్వర్టర్ బ్యాటరీకి మరమ్మతులు చేస్తుంటే షాక్ కొట్టి మరణించారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంక్షోభం మొదలైందా

8. బ్యాటరీ దెబ్బతింటే అప్రమత్తం కావాలి

కొన్నిసార్లు బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది. దీన్ని వెంటనే మనం గుర్తించి అప్రమత్తం కావాలని నిపుణులు చెబుతున్నారు.

‘‘సాధారణం కంటే త్వరగా బ్యాటరీలో చార్జింగ్ అడుగంటిపోతోందంటే అప్రమత్తం కావాలి. అలాంటి బ్యాటరీలను పక్కన పెట్టేయాలి’’అని లోకేంద్ర అన్నారు.

అలా దెబ్బతిన్న బ్యాటరీలు వెంటనే మార్చేయాలి, వీటి వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు.

ఈ సూచనలు పాటిస్తూ ఇన్వర్టర్లను ఉపయోగిస్తే, వీటి మన్నిక పెరుగుతుందని, అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)