ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య కౌగిలింతలు, కరచాలనాలు ముగిశాయా? ఇకపై ఏం జరుగుతుంది?

ఉత్తర కొరియా
    • రచయిత, జీన్ మెకెంజీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ తమ దేశ ఆయుధాలను అత్యవసరంగా పరీక్షిస్తున్నారు. దక్షిణ కొరియాలో కొత్త నాయకుడు అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు.

కొన్నేళ్లుగా ప్రతిష్టంభన, ఇరు దేశాల మధ్య అణు చర్చలు విఫలమైన నేపథ్యంలో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.

"గొడ్డలిని తీసుకోవాలనుకున్నా. కానీ, దాన్ని పట్టుకుని తిరగడం కష్టమని కత్తి తీసుకున్నా."

ఆ రాత్రి కాక్‌టెయిల్ బార్‌లో మసక వెలుతురులో కూర్చున్న జెన్, తను ఎలా తప్పించుకోవాలనుకున్నారో వివరంగా చెప్పారు.

నార్త్ కొరియా దాడి చేస్తే ఏం చేయాలో సౌత్ కొరియా రాజధాని సియోల్‌లో నివసిస్తున్న జెన్‌కు కచ్చితంగా తెలుసు. ముందు ఆయుధాలు చేతికొచ్చాయి. తరువాత రెండు మోటార్ బైక్స్ అందాయి. ఒకటి ఆమెకు, మరొకటి ఆమె సోదరుడికి. వాళ్ల అమ్మ, నాన్నలను వెనక కూర్చోబెట్టుకున్ని అక్కాతమ్ముళ్లిద్దరూ పారిపోయేందుకు ప్లాన్ చేశారు. ఇలా నగరంలోని నదిని సులువుగా, వేగంగా దాటేయొచ్చు. నార్త్ కొరియా బాంబు దాడి చేసి వంతెలను ధ్వంసం చేయకముందే తప్పించుకోవచ్చు. పోర్టును నాశనం చేయకముందే తీరం చేరుకోవచ్చు. ఈ దిశలో ఒక సాయంత్రం అక్కాతమ్ముళ్లిద్దరూ కూర్చుని మ్యాపు గీశారు.

ఇదంతా అయిదేళ్ల కిందటి మాట. ఆ సమయంలో నార్త్ కొరియా తీవ్రంగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది. సిద్ధాంతపరంగా ఇవి అమెరికా మీద అణు బాంబులు సంధించగల సామర్థ్యం ఉన్న క్షిపణులు. నార్త్ కొరియా చర్యలకు గట్టిగా జవాబు చెబుతామని అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిస్పందించారు కూడా.

అందరికన్నా తాను కొంచం ఎక్కువగా భయపడినట్టు జెన్ ఒప్పుకున్నారుగానీ, చాలామంది సౌత్ కొరియన్లు ఇదే స్థాయిలో భయపడ్డారు. 70 ఏళ్ల క్రితం నార్త్ కొరియాతో యుద్ధం ముగిసిన తరువాత ఈ స్థాయిలో యుద్ధ భయం కలగడం అదే మొదటిసారి.

అప్పుడే ఒక విశేషం జరిగింది. కిమ్ జోంగ్ ఉన్‌ను కలవడానికి ట్రంప్‌ను ఒప్పించారు సౌత్ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్. ఆయన అప్పుడే కొత్తగా ఆ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

పదవిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు, నార్త్ కొరియా అధ్యక్షుడిని కలవడం చరిత్రలో అదే మొదటిసారి. తరువాత పలు సదస్సులు జరిగాయి. దాంతో, నార్త్ కొరియా క్షిపణి పరీక్షలు నిలిపివేస్తుందని, రెండు కొరియాల మధ్య శాంతి నెలకొంటుందనే ఆశలు చిగురించాయి.

కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, Getty Images

షేక్ హ్యాండ్స్...

ప్రెసిడెంట్ మూన్, నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌ చేరుకుని, తన ప్రత్యర్థి చేయి పట్టుకుని కిక్కిరిసిన స్టేడియంలోకి అడుగు పెట్టడంతో ఉత్కంఠ నెలకొంది. ప్రేక్షకులకు ఎలా స్పందించాలో పాలుపోలేదని ప్రొఫెసర్ మూన్ చుంగ్-ఇన్ గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఆయన సౌత్ కొరియా అధ్యక్షుడికి సలహాదారుగా వ్యవహరించేవారు.

ఈ వ్యక్తి వాళ్లకు శత్రువు అని నూరిపోశారు. ఆయనే ఇప్పుడు వాళ్ల నేలమీద నిలబడి శాంతి స్థాపనను ప్రతిపాదిస్తున్నారు. ఒక్కసారిగా 1,50,000 మంది నార్త్ కొరియన్లు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.

"చూడ్డానికి అద్భుతంగా అనిపించింది. నన్ను చాలా కదిలించిన సన్నివేశం అది" అని ప్రొఫెసర్ మూన్ చుంగ్-ఇన్ చెప్పారు.

అయితే, ఆ సంవత్సరం ప్రెసిడెంట్ మూన్ పదవీ విరమణ చేయడంతో ఆశలు చితికిపోయాయి. 2019లో అమెరికా, ఉత్తర కొరియాల మధ్య కుదిరిన అణు ఒప్పందం విఫలమైనప్పుడు, రెండు కొరియాల మధ్య చర్చలు కూడా చతికిలబడ్డాయి.

ఈలోగా నార్త్ కొరియా క్షిపణి పరీక్షలు, విధ్వంసం సృష్టించగల ఆయుధ పరీక్షలు కొనసాగించింది.

తరువాత, కరోనా మహమ్మారి విజృంభించడం, ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం దృష్టి మళ్లింది.

సౌత్ కొరియా ప్రభుత్వం విఫలమైందా అని ప్రొఫెసర్ మూన్ చుంగ్ ఇన్ అడిగితే లేదని అన్నారు.

"లేదు, అలా నేను అనుకోవట్లేదు. యుద్ధం వచ్చిందా? లేదు, కదా" అన్నారాయన.

ప్రెసిడెంట్ మూన్ అయిదేళ్ల పాలనలో శాంతిని పెంపొందించడానికే కృషి చేశారని, ముఖ్యంగా కొరియన్ల మధ్య సంబంధాలలో అతిపెద్ద సంక్షోభం నెలకొన్న ఆ సమయంలో ఆయన తన కర్తవ్యం నిర్వర్తించారని ప్రొఫెసర్ మూన్ చుంగ్ ఇన్ అభిప్రాయపడ్డారు.

నార్త్ కొరియా చర్చలకు దిగాలంటే ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలో కూడా ఆయన పాలన చూపించింది. కానీ, నార్త్ కొరియా సంధానకర్తలు రిక్తహస్తాలతో తిరిగివెళ్లారు. ఇది ప్రభుత్వానికి సంకటం తెచ్చిపెట్టింది. ఇది దాదాపు శిక్షార్హమైన నేరమని కూడా ప్రొఫెసర్ మూన్ చుంగ్ ఇన్ అభిప్రాయపడ్దారు.

నార్త్ కొరియన్లను చర్చలకు రప్పించడానికి ప్రెసిడెంట్ మూన్ చేయగలిగినదంతా చేశారు. కానీ, అలా చేయడం ద్వారా ప్రపంచంలోని అత్యంత క్రూరమైన నియంతలలో ఒకరిని తృప్తిపరిచే ప్రయత్నాలు చేశారనే ఆరోపణలను ఎదుర్కొన్నారాయన.

వీడియో క్యాప్షన్, ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ కన్నా ఆయన సోదరి 'కిమ్ యో జోంగ్' మరీ డేంజరా?

'కిమ్ జోంగ్ ఉన్ పాలనలో మానవ హక్కులు అత్యంత బలహీనంగా మారాయి'

"వాళ్లిద్దరూ చేతులు పట్టుకుని నవ్వుతూ నిల్చున్న ఫొటో చూస్తే వెన్నులో వణుకు పుట్టింది" అని హన్నా సాంగ్ గుర్తుచేసుకున్నారు. ఆమె సియోల్‌లో 'డాటాబేస్ సెంటర్ ఫర్ నార్త్ కొరియన్ హ్యూమన్ రైట్స్' సంస్థలో పనిచేస్తున్నారు.

ఈ సంస్థ గత రెండు దశాబ్దాలుగా నార్త్ కొరియాలో మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలను నమోదు చేస్తుంది. అయితే, గత కొన్నేళ్లల్లో ఈ పని అంత సులువు కాలేదు.

కిమ్ జోంగ్ ఉన్ పాలనలో మానవ హక్కులు అత్యంత బలహీనంగా మారాయని హన్నా అన్నారు. ఈ డాటా నార్త్ కొరియా పాలకుడిని అసౌకర్యానికి గురి చేస్తుందనే ఉద్దేశంతో ప్రెసిడెంట్ మూన్ "వాటిని పరుపు కింద దాచిపెట్టారని" ఆమె అభిప్రాయపడ్డారు.

నార్త్ కొరియా నుంచి తప్పించుకుని వచ్చినవారు మొదటి మూడు నెలలు హనావాన్‌లోని పునరావాస కేంద్రాల్లో ఉండాలి. హన్నా పనిచేస్తున్న సంస్థ, అలా పారిపోయి వచ్చిన వారిని ఇంటర్వ్యూ చేస్తుంది. ఆ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలను నమోదు చేయడానికి వారి సాక్ష్యాలు కీలకం.

అయితే రెండేళ్ల క్రితం, సౌత్ కొరియా ప్రభుత్వం ఈ సంస్థకు పునరావాస కేంద్రంలోకి ప్రవేశ అనుమతులు నిలిపివేసింది. దాంతో, వాళ్లకు డేటా సేకరించే అవకాశం లేకపోయింది.

ఆ తరువాత, ఉత్తర కొరియాలో తమ అనుభవాల గురించి బహిరంగంగా మాట్లాడకూడదని అక్కడి నుంచి పారిపోయి వచ్చినవారిపై ఒత్తిడి తెస్తునారని హన్నాకు తెలిసింది. పోలీసులు ఫోన్ చేసి "అలా మాట్లాడడం కరక్టేనా, ఓసారి ఆలోచించుకోండి" అని చెప్పడం లాంటి ఘటనలు కూడా ఉన్నాయి.

హన్నా దీనిపై గొంతెత్తారు. ప్రభుత్వాన్ని సవాలు చేశారు.

"సాక్ష్యాలు సేకరించకుండా అడ్డుకోవడం ద్వారా మీరు సాధించేదేమిటి? అంతర్జాతీయ సమాజం ముందు కిమ్ జోంగ్ ఉన్ తలదించుకోకుండా ఉండేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాల ఫలితమేమిటి?" అంటూ ఆమె సౌత్ కొరియా ప్రభుత్వాన్ని నిలదీశారు. కానీ, ఆమె ప్రశ్నలకు జవాబు రాలేదు.

"ఇప్పుడు యుక్రెయిన్‌లో జరుగుతున్నది దారుణం. అయితే, కనీసం మనకు దాని గురించి సమాచారం అందుతోంది" అన్నారు హన్నా.

ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, నార్త్ కొరియాలో ప్రస్తుత పరిస్థితులెలా ఉన్నాయో తెలుసుకునే అవకాశం లేదు. కరోనావైరస్ నిబంధనలతో ఆ దేశ బోర్డర్లు మూసివేయడంతో పౌరులు బయటకు రాలేకపోతున్నారు. అలాగే, అక్కడి సమాచారం అందట్లేదు.

కిమ్ జోంగ్ ఉన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయడం కొనసాగిస్తున్నారన్నది స్పష్టం. ఎన్ని అంతర్జాతీయ ఆంక్షలు విధించినా, వారి ప్రయత్నాలను ఆపలేకపోయాయి. ఆయుధాలు మరింత అధునాతనంగా, ప్రమాదకరంగా తయారవుతున్నాయి.

మార్చిలో ఆ దేశం తొలి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఈ క్షిపణి గత క్షిపణుల కంటే ఎక్కువసేపు, ఎక్కువ దూరం ప్రయాణించింది.

కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, Getty Images

కౌగిలింతలు, కరచాలనాలు ముగిశాయి

మరోపక్క, రెండు కొరియా దేశాల మధ్య కౌగిలింతలు, కరచాలనాలు ముగిశాయి. సౌత్ కొరియాలో కొత్త అధ్యక్షుడు పదవిలోకి రాబోతున్నారు. రాజకీయ అనుభవం లేని వ్యక్తి, మాజీ న్యాయవాది, కఠినమైన, రాజీపడని వ్యక్తిత్వం ఉన్న యూన్ సుక్-యోల్ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారు.

ఆయన ఈమధ్య ఇచ్చిన ఇటర్వ్యూలో నార్త్ కొరియాను "ప్రధాన శత్రువు"గా పేర్కొన్నారు. ఆ దేశం సైనికపరంగా కొనసాగిస్తున్న విధానాల పట్ల కఠినంగా స్పందిస్తామని చెప్పారు.

అణ్వాయుధాల విస్తరణ నిలిపివేయడం పట్ల నార్త్ కొరియా ఆసక్తి చూపిస్తేనే పొరుగుదేశంతో చర్చలకు సిద్ధమవుతానని ఆయన స్పష్టం చేశారు.

అయితే, నార్త్ కొరియాకు అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవని నిపుణులు భావిస్తున్నారు. అలాంటప్పుడు ఇరు దేశాల అధ్యక్షుల మధ్య సంధి కుదిరే అవకాశమే లేదని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ కన్సల్టెంట్ క్రిస్ గ్రీన్ అన్నారు. యుద్ధాలను నిలువరించే దిశగా ఈ సంస్థ పనిచేస్తుంది.

అధ్యక్ష ప్రచారంలో భాగంగా యూన్ మాట్లాడుతూ, నార్త్ కొరియా దాడికి ఉపక్రమిస్తున్నట్టు వార్తలు వస్తే, దాని ఆయుధాలను నాశనం చేయడానికి ఆ దేశంపై ముందస్తు దాడికి కూడా వెనుకాడమని చెప్పారు.

యూన్ చెప్పిన మాట చాలా కాలంగా దక్షిణ కొరియా రక్షణ వ్యూహంలో భాగంగా ఉంది. కానీ, దీని గురించి బయటకు మాట్లాడితే నార్త్ కొరియాకు మంట పుడుతుందనే ఉద్దేశంతో, ఇంత బహిరంగంగా ఎప్పుడూ చెప్పలేదు.

ఇప్పుడు యూన్ తన ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన తీసుకురావడంతో నిజంగానే నార్త్ కొరియాకు మంట పుట్టింది.

గత నెలలో వీధుల్లో క్షీపణుల పరేడ్ నిర్వహించింది. తన బలం చూపించుకోవడానికి ఈ పనిచేసింది.

కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, Getty Images

కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరికలు

కిమ్ జోంగ్ ఉన్ తెల్లటి మిలటరీ యూనిఫాం ధరించి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కొరియాను బెదిరించే ఏ శక్తులయినా "తమ అస్తిత్వం కోల్పోతాయని" హెచ్చరించారు. ఇది సౌత్ కొరియా కొత్త అధ్యక్షుడికి గురి పెట్టిన హెచ్చరికేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

నార్త్ కొరియా షార్ట్ రేంజ్ క్షిపణులను అభివృద్ధి చేస్తోంది. ఈ క్షిపణులను వ్యూహాత్మక అణ్వాయుధాలను తీసుకువెళ్లడానికి ఉపయోగించవచ్చని గత నెలలో మొదటిసారిగా సూచించింది. యుద్ధం వస్తే, సౌత్ కొరియాపై ఈ క్షిపణులను ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అణుబాంబులలో ఒకదానిని పరీక్షించబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

అయితే, ఇప్పటికీ నార్త్ కొరియా ప్రధాన లక్ష్యం తన మనుగడ కొనసాగించడమేనని క్రిస్ గ్రీన్ విశ్వసిస్తున్నారు.

"ఏ పరిస్థితుల్లోనైనా అణ్వాయుధాలను ఉపయోగిస్తే, కిమ్ జోన్ పాలన ముగిసినట్టేనన్న సంగతి ఆ దేశానికి బాగా తెలుసు" అని ఆయన వివరించారు.

బదులుగా, ఇరు దేశాల మధ్య ఆయుధ పరీక్షల పోటీ పెరుగుతుందని క్రిస్ గ్రీన్ అంచనా వేస్తున్నారు.

అయితే, ఈ చర్యలు యుద్ధానికి దారితీయకూడదు. కానీ, పరస్పరం తప్పుడు అంచనాలకు దారితీయవచ్చని, అదే ఇప్పుడు పొంచి ఉన్న పెను ప్రమాదమని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు, నార్త్ కొరియా లక్ష్యం అమెరికా అని చాలామంది సౌత్ కొరియన్లు భావిస్తున్నారు. అందుకే వాళ్లు ఆ దేశంపై పెద్దగా దృష్టి పెట్టరు.

సౌత్ కొరియాకు చెందిన సి-యోల్ కూడా ఇన్నాళ్లు ఇదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆయన తప్పనిసరి సైనిక సేవలను కూడా ప్రారంభించబోతున్నారు. రెండు కొరియాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఆయనలో భయం చోటుచేసుకుంది.

"కిమ్ జోంగ్ ఉన్ మిస్సైల్ పరీక్ష నిర్వహించినప్పుడల్లా ఆందోళన కలుగుతుంది. మా దేశంలో కొత్త ప్రభుత్వం విధానాలు ఘర్షలను రేకెత్తిస్తాయనే భయం కూడా ఉంది" అని సి-యోల్ అన్నారు.

యుక్రెయిన్ యుద్ధం భయాన్ని మరి కొంచం పెంచిందని లీ జియోన్-ఇల్ అన్నారు. తమ దేశంలో కూడా అలాంటి పరిస్థితి రావచ్చనే ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, ఆయన తమ కొత్త అధ్యక్షుడి విధానాలను సమర్థిస్తున్నారు. ఇలాగే గట్టింగా స్పందించాలని భావిస్తున్నారు.

ప్రొఫెసర్ మూన్ చుంగ్-ఇన్ మాత్రం "భవిష్యత్తు అంధకారంగా ఉంది. బయటపడే మార్గం కనిపించట్లేదు. మేం మాకొచ్చిన అవకాశాలను జారవిడుచుకున్నాం" అని అన్నారు.

ప్రస్తుతం ప్రపంచం దృష్టి ఇతర అంశాల వైపు మళ్లినా, నార్త్ కొరియాను విస్మరించడం కష్టమే.

వీడియో క్యాప్షన్, చరిత్రలో 70 ఏళ్ల పాటు సాగిన ఆ యుద్ధంలో ఇప్పటికీ విజేతలెవరో తేలలేదు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)