అసాని తుపాను: ఉత్తరాంధ్రలో వానలు... విశాఖకు రావల్సిన 10 విమానాలు రద్దు

ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం దిశగా పయనిస్తున్న అసాని తుపాను

ఫొటో సోర్స్, IMD

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

అసాని తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వానలు పడుతున్నాయి. సముద్ర తీరాల్లో అలలు ఎక్కువ వేగంతో ఎగిసి పడుతున్నాయి. వాతావరణం అనుకూలించక పోవడం వల్ల వైజాగ్ రావాల్సిన విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చెన్నై విభాగం తెలిపింది.

అసాని తీవ్ర తుపాను గంటకు 7 కి.మీ. వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదులుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తెలిపారు.

అసాని తుపాను ప్రస్తుతం కాకినాడకు 330, విశాఖపట్నానికి 350, పూరీకీ 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఈరోజు ఉదయం 6:30 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించారు.

ఈరోజు రాత్రికి తుపాను క్రమంగా ఉత్తరాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చి అనంతరం దిశమార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ వాయువ్య బంగాళాఖాతం వైపుగా వెళ్లే అవకాశం ఉందని అంబేడ్కర్ తెలిపారు.

రానున్న 12గంటల్లో అసాని క్రమంగా తీవ్ర తుపాను నుంచి సాధారణ తుపానుగా బలహీనపడుతుంది.

అసాని తుపాను

ఈరోజు, రేపు వానలు

తుపాను ప్రభావంతో ఈరోజు, రేపు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.

ఇప్పటికే ఉత్తరాంధ్ర తీరం వెంట గంటకు 40-60 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, ఇది రెండు రోజుల పాటు ఉంటుందని వివరించారు.

ప్రధానంగా ఉత్తరాంధ్రతో పాటు తూర్పు గోదావరి జిల్లాపై ఈ తుపాను ప్రభావం కనిపిస్తుందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెప్పారు.

అధికారుల అప్రమత్తం

విశాఖ నుంచి తుని వరకు వాతావరణం సోమవారం ఉదయం నుంచి చల్లబడింది. కొన్ని చోట్ల చినుకులు పడుతున్నాయి. గాలుల ప్రభావం కనిపిస్తోంది. సముద్రంలో అలల తీవ్రత క్రమంగా పెరుగుతోంది.

తీరం వైపు ఎవరినీ రానివ్వకుండా పోలీసులు ఎక్కడికక్కడ బారికెడ్లు ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. 0891-2590100, 101, 102 నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు. అలాగే విశాఖ రెవెన్యూ సిబ్బంది అందరినీ క్షేత్రస్థాయిలో అలెర్ట్‌గా ఉండాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ ఆదేశాలు జారీ చేశారు.

అసాని తుపాను

‘‘విశాఖపైనే ఎక్కువ ప్రభావం’’

ఏపీ వెదర్ మ్యాన్ పేరుతో వాతావరణ సమాచారం అందించే ప్రముఖ వెదర్ బ్లాగర్ సాయి ప్రణీత్‌తో కూడా అసాని తుపాను సమాచారం కోసం బీబీసీ మాట్లాడింది.

“అసాని తుపాను ప్రభావం విశాఖపట్నంపైనే ఎక్కువగా ఉంటుందని నేను అంచనా వేస్తున్నాను. ఎందుకంటే అక్కడి తీరంలో కర్వ్ కారణంగా అక్కడ దీని ప్రభావం కనిపించే అవకాశాలున్నాయి”అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, సైక్లోన్ ఆంఫన్: తుపాను హెచ్చరికలకు అర్థమేంటి?

విశాఖ నుంచి కాకినాడ వరకు...

“నేటి నుంచి 12వ తేదీ వరకు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తుని, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముంది. అలాగే విశాఖ నుంచి కాకినాడ వరకు అతిభారీ వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి” అని సాయి ప్రణీత్ తెలిపారు.

అలాగే గుంటూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడతాయి. తుపాను ప్రభావిత ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి వర్షాలు పడతాయిని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, రాకాసి దుమ్ము తుపాను ఎక్కడి నుంచి వచ్చింది?

రంగంలోకి తూర్పు నౌకదళం

అసాని తుపాను ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల మధ్య ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో... దీనిని ఎదుర్కొనేందుకు తూర్పు నౌకాదళం సిద్ధమైంది.

తుపాను సమయంలో ఏదైనా ఆకస్మిక పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఐసీజీఎస్ వీర, 20 మంది కోస్ట్ గార్డ్ సిబ్బందితో ఐదు విపత్తు సహాయ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు తూర్పు నౌకాదళం అధికారులు తెలిపారు.

ఇంకా సముద్రంలోనే వేటలో ఉన్న మత్స్యకారులను వెనక్కి రమ్మన్ని నావికా దళ సిబ్బంది హెచ్చరికలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)