‘అమరావతి మనుగడనే జగన్ ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసింది‘ - చంద్రబాబు : ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, chandrababu naidu/fb
తెలుగు ప్రజలకు శాశ్వత ఆస్తి ఉండాలనే అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టానని, ఒక్క అవకాశం అంటూ రాజధాని మనుగడనే జగన్ ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
తాను ఏది చేసినా, సమాజం కోసం, భవిష్యత్తు తరాల కోసమేనన్నారు. ఏపీ, తెలంగాణలో టీడీపీ శాశ్వతంగా ఉండటం చారిత్రక అవసరమని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కొత్తగూడెం, ఆశ్వారావుపేట నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులతో గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు.
''రాష్ట్ర విభజన తర్వాత ప్రజలు నాపై నమ్మకంతో నవ్యాంధ్ర సీఎంని చేశారు. విభజన తర్వాత హైదరాబాద్ తరహాలో అమరావతికి శ్రీకారం చుట్టాం. కానీ ఇప్పుడు అమరావతి డైలమాలో పడింది. ఒక్క అవకాశం అంటూ అందలం ఎక్కి మూడునెలల్లోనే రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకెళ్లారు. అమరావతి కాన్సెప్ట్‌నే చంపేసే పరిస్థితికి వచ్చారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములిస్తే, వారి త్యాగాలను పట్టిచుకోకుండా అవమానిస్తున్నారు.
'ఇంత కష్టపడితే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా' అని తాను ఆలోచిస్తున్నానని చంద్రబాబు అన్నారు. జగన్ అమరావతిని దెబ్బతీయడంతో ఇప్పుడు అందరూ తిరిగి హైదరాబాద్‌కు వలస వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

కోటి చీరలు.. వంద డిజైన్లు
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని 1.02 కోట్ల మంది మహిళలకు ఉచితంగా చీరలను అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని ఈనాడు వెల్లడించింది. వచ్చే నెల 20 నుంచి పంపిణీ ప్రారంభం కానుంది. పూలపండుగ సెప్టెంబరు 28న ప్రారంభమవుతుండగా.. అంతకంటే ఒకరోజు ముందే పంపిణీని పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది.
బతుకమ్మ సందర్భంగా 18 ఏళ్లు దాటిన పేద మహిళలకు ప్రభుత్వం గత మూడేళ్లుగా చీరలను పంపిణీ చేస్తోంది. గత ఏడాది కంటే ఈ సారి అదనంగా ఉత్పత్తి చేసి అందజేయనున్నారు. రూ. 313 కోట్లతో చీరలను సిరిసిల్లలో నేత కార్మికులు తయారు చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఉత్పత్తి అయిన వాటిల్లో 50 లక్షల చీరలను జిల్లాలకు పంపించారు. మిగతావి నెలాఖరుకు పూర్తవుతాయి. జిల్లాలకు చేరిన వాటిని జిల్లా కేంద్రాల్లోని గోదాముల్లో నిల్వచేస్తున్నారు. అక్కడి నుంచి మండల కేంద్రాలకు చేరతాయి.
కలెక్టర్ల పర్యవేక్షణలో గ్రామస్థాయిలో వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, రేషన్ డీలర్లతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా పంపిణీ జరుగుతుంది. పట్టణాలు, నగరాల్లో పుర, నగర పాలక సంస్థల పరిధిలోని మహిళా సంఘాల ద్వారా వీటిని అందజేస్తారు.
ఇటీవల తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్లలో బతుకమ్మ చీరల ఉత్పత్తిపై సమీక్ష నిర్వహించారు. చీరల ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆదేశించారు.లబ్ధిదారులకు సకాలంలో పంపిణీ చేయాలని సూచించారని ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, jagan/fb
‘కాసుల కళ తగ్గింది’
వాణిజ్యపన్నుల ఆదాయంలో గత నాలుగు నెలల్లో అనుకున్నంత మేర వృద్ధి రాలేదని సంబంధిత శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారని ఈనాడు వెల్లడించింది.
ఉక్కు, ఇనుము ధరలు తగ్గటం ఆదాయంపై ప్రభావం చూపుతోందని చెప్పారు. సిమెంటు ధరలు తగ్గటంతో దానిపై వచ్చే పన్నురాబడి పడిపోయిందని పేర్కొన్నారు. ఆదాయార్జన శాఖలపై (వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా)ముఖ్యమంత్రి బుధవారం సమీక్షించారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి వచ్చే రాబడిపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాహనరంగంలో మందగమనం వల్ల జీఎస్టీ తగ్గిందని చెప్పారు. వాణిజ్య పన్నుల్లో 14 శాతం వృద్ధి నమోదు కావాల్సి ఉండగా 5.3 శాతమే వచ్చిందని, ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఈ ఆదాయాలన్నీ మెరుగుపడతాయని చెప్పారు.
జీఎస్టీ పరిహారం కింద వచ్చేనెల తొలి వారంలో రూ.597 కోట్లు రాష్ట్రానికి వస్తుందన్నారు.మద్యనిషేధం అమలు కోసం గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసు వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.
మద్యం నియంత్రణ, నిషేధం అమలుకు ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు విభాగాలను మరింత బలోపేతం చేయాలని, స్మగ్లింగ్ జరగకుండా, నాటుసారా తయారీ కాకుండా చూడాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వినియోగం గణనీయంగా తగ్గిందని ఎక్సైజ్ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2018-19లో 125 లక్షల కేసుల మద్యాన్ని విక్రయించగా, గొలుసు దుకాణాలను తొలగించటం వల్ల ఈ ఏడాది జులై వరకూ గతంకంటే 12లక్షల కేసుల వినియోగం తగ్గిందని అన్నారు.
ప్రస్తుతం ఉన్న దుకాణాల సంఖ్యను 4,380 నుంచి 3,500కు తగ్గించి..ఏపీఎస్‌బీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పారు. వ్యసన విముక్తి కేంద్రాల ఏర్పాటు, మద్య నియంత్రణ, నిషేధానికి వెచ్చించే మొత్తాన్ని రూ.500 కోట్లకు పెంచుతున్నామన్నారు. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి 503 దుకాణాలను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామన్నారని ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు గూగుల్ సిగ్నల్స్‌తో పరిష్కారం
హైదరాబాద్‌లోని ఒక జంక్షన్‌లో ఏ రహదారిలో ఎంత ట్రాఫిక్ ఉంది అనేది సాంకేతికంగా తెలిస్తే సిగ్నల్స్ సైకిల్‌లోనూ మార్పు తీసుకురావచ్చని ట్రాఫిక్ విభాగం భావించింది. దీని కోసం ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టంలో (ఐటీఎంఎస్) అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టం (ఏటీసీఎస్) విధానాన్ని వినియోగించాలని నిర్ణయించింది. దీని కోసం గూగుల్ సంస్థతో పోలీసు విభాగం ఓ కీలక ఒప్పందాన్ని చేసుకుందని సాక్షి పేర్కొంది.
కీలక మార్గాలు, జంక్షన్లతోపాటు ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీకి సంబంధించిన పూర్తి సమాచారం గూగుల్ వద్ద రియల్ టైమ్‌లో అందుబాటులో ఉంటోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆ సంస్థకు సంబంధించిన యాప్స్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు తమ లొకేషన్ తెలుసుకోవడానికి అనుమతి ఇస్తూ ఉంటారు.
దీంతో ఆయా ఫోన్లు ఉన్న లొకేషన్లు తెలుసుకునే అవకాశం గూగుల్ సంస్థకు కలుగుతోంది. వీటిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న ఆ సంస్థ ఏ సమయంలో, ఏ ప్రాంతంలో, ఏ రహదారిలో, ఏ దిశలో సెల్‌ఫోన్లు ఎక్కువగా ఉన్నాయనేది గుర్తిస్తోంది.
రహదారులపై ఉన్న సెల్‌ఫోన్లు సాధారణంగా వాహనచోదకులవే అయ్యి ఉంటాయి. ఇలా రోడ్లపై ఉన్న ట్రాఫిక్ వివరాలు ఎప్పటికప్పుడు గూగుల్ సంస్థకు చేరుతున్నాయి. వీటి ఆధారంగానే ఆ సంస్థ తమ మ్యాప్స్‌లో ట్రాఫిక్ రద్దీ ఉన్నరహదారుల్ని ఎరుపు రంగులో చూపిస్తుంటుంది.
ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసంధానించి ఉండే సర్వర్‌కు ఓ జంక్షన్‌లోని 4 రహదారుల్లో ఏ రహదారిలో ఎంత ట్రాఫిక్ ఉంది అనేది సాంకేతికంగా తెలిస్తే సిగ్నల్స్ సైకిల్‌లోనూ మార్పు తీసుకురావచ్చు.
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆ సంస్థకు సంబంధించిన యాప్స్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు తమ లొకేషన్ తెలుసుకోవడానికి అనుమతి ఇస్తూ ఉంటారు. దీంతో ఆయా ఫోన్లు ఉన్న లొకేషన్లు తెలుసుకునే అవకాశం గూగుల్ సంస్థకు కలుగుతోంది. దీంతో ట్రాఫిక్ రద్దీకి సంబంధించిన పూర్తి సమాచారం గూగుల్ వద్ద రియల్ టైమ్‌లో అందుబాటులో ఉంటోంది.
గూగుల్ వద్ద ఉన్న ఈ వివరాలను వాహన చోదకులు, ప్రజలకు ఉపయుక్తంగా వినియోగించాలని పోలీసు విభాగం యోచించింది. దీంతో ట్రాఫిక్ అప్‌డేట్స్‌తో కూడిన గూగుల్ సర్వర్‌తో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను కంట్రోల్ చేసే సర్వర్ అప్లికేషన్ ఇంటర్‌ఫేస్ (ఏపీఐ) ద్వారా అనుసంధానించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకుందని సాక్షి తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అక్కడేం జరుగుతోంది?
- ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్: రోజువారీ జీవితాల్లో భాగమైపోయిన ప్రచ్ఛన్న యుద్ధ కాలపు స్పై టెక్నాలజీ
- భారత 'రూపాయి' విలువ బంగ్లాదేశ్ 'టకా' కంటే తగ్గిందా? - Fact Check
- ‘మా నాన్న ఒక గ్యాంగ్‌స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
- రాజధాని నిర్మాణానికి 2.3 లక్షల కోట్లు... కొత్త ప్రాంతాన్ని ప్రకటించిన దేశాధ్యక్షుడు
- భారతదేశంలో జన్మించిన పాకిస్తాన్ 'ప్రథమ మహిళ' రానా లియాకత్ అలీ
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో... ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
- BODMAS: 8÷2(2+2) = ?.. ఈ ప్రశ్నకు మీ జవాబు ఏంటి?
- 1.. 2.. 3.. సంగతి సరే.. అసలు సున్నా ఎలా పుట్టింది? దీన్ని భారతీయులు ఎలా కనిపెట్టారు?
- గుండెజబ్బు నివారణకు నాలుగు ఔషధాలున్న ఒకే మాత్ర
- డార్జీలింగ్ టీ పొడి: కిలో లక్షా 30 వేలు.. ఈ తేయాకును పౌర్ణమి వెలుగులోనే కోస్తారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








