కశ్మీర్‌లో 1200ఏళ్ల ప్రాచీన హిందూ దేవాలయంలో పూజలు ఎందుకు వివాదాస్పదం అయ్యాయి?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, రియాజ్ మస్రూర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో పురాతన సూర్యుడి దేవాలయం శిథిలాలలో భిన్న రాష్ట్రాలకు చెందిన 100 మంది హిందూ బ్రాహ్మణులు రెండు రోజులపాటు పూజలు చేశారు.
ఈ పూజలకు సీనియర్ అధికారులతోపాటు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా హాజరయ్యారు. బాడీగార్డులు, పటిష్ఠమైన భద్రత నడుమ వారు అక్కడికి చేరుకున్నారు.
భారత పురావస్తు శాఖ పర్యవేక్షణలోనున్న 3,650 పురాతన ప్రాంతాల్లో ఈ సూర్యుడి దేవాలయం కూడా ఒకటి. దీన్ని ‘‘ప్రొటెక్టెడ్’’ ప్రాంతంగా భారత ప్రభుత్వం గుర్తించింది.
జాతీయ ప్రాధాన్యమున్న ఇలాంటి సున్నిత, ప్రాచీన ప్రాంతాల్లో పూజలు చేయకుండా నిషేధం అమలులో ఉంది.
ఇలాంటి పురాతన ప్రాంతాల పరిరక్షణకు 1958లో భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దేవాలయాలు, చర్చ్‌లు, మసీదులు, బౌద్ధారామాలకు దీనిలో నిబంధనలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, ANI
ప్రాచీన శిథిలాలలో పూజలు చేయొచ్చా?
అనంతనాగ్ మట్టన్ ప్రాంతంలోని ఈ ప్రాచీన శిథిలాల్లో రాజస్థాన్ కరావలీకి చెందిన హిందూ సంస్థ ‘‘రాష్ట్రీయ అన్హద్ మహాయోగ పీఠ్’’ పూజలు నిర్వహించింది.
ఈ పూజల గురించి అనంతనాగ్ జిల్లా మేజిస్ట్రేట్ డా.పియూష్ సింఘ్లాకు సమాచారం అందించామని మహాయోగ పీఠ్ అధిపతి మహారాజ్ రుద్రనాథ్ మహాకాల్.. బీబీసీకి చెప్పారు. ‘‘మేం జిల్లా మేజిస్ట్రేట్‌కు మెయిల్ పంపించాం. కానీ మాకు ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో మేం ముందుగా నిర్ణయించిన సమయానికే పూజలు నిర్వహించాం’’అని ఆయన వివరించారు.
‘‘పూజలు జరిగేటప్పుడు, జిల్లా పరిపాలనా విభాగం.. పోలీసులు, సాయుధ బలగాలను మోహరించింది’’అని ఆయన వివరించారు.
ఈ అంశంపై మేం సింఘ్లాను సంప్రదించేందుకు ప్రయత్నించాం. కానీ, ఎలాంటి స్పందనా రాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఆదివారం ఇక్కడ జరిగిన పూజలకు జమ్మూకశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, డాక్టర్ సింఘ్లా కూడా హాజరయ్యారు.
‘‘మహంత్ శంకరాచార్య జయంతిని పురస్కరించుకొని ఆ పూజలు నిర్వహించాం. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, ఇక్కడ శాంతిని నెలకొల్పాలనే లక్ష్యంగా ఈ పూజలు నిర్వహించాం’’అని మహరాజ్ రుద్రనాథ్ చెప్పారు.
పురావస్తు చట్టాలను ఉల్లంఘించడంపై అడిగిన ప్రశ్నలకు జమ్మూకశ్మీర్ పురావస్తు విభాగం కూడా స్పందించలేదు.
అయితే, ఇలా పూజలు చేపట్టడం పురావస్తు చట్టాన్ని ఉల్లంఘించడమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై స్థానిక పురావస్తు విభాగం అధికారి ఒకరు మాట్లాడారు.
‘‘పురావస్తు ప్రాంతాలు రెండు రకాలు. వీటిలో మొదటిది లైవ్ మాన్యుమెంట్స్. దిల్లీలోని జామా మసీదును దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీన్ని కూడా పరిరక్షించాల్సిన ప్రాంతంగా గుర్తించారు. కానీ, ఇక్కడ రోజూ పూజలు జరుగుతుంటాయి. రెండోది నాన్ లైవ్ మాన్యుమెంట్. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మార్తాండ్ సూర్య మందిర్ దీని కిందకు వస్తుంది. చట్టాన్ని రూపొందించిన సమయంలో ఇక్కడ ఎలాంటి పూజలూ చేయడం లేదు’’అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, ANI
మార్తాండ్ దేవాలయం చరిత్ర
అనంతనాగ్‌లోని ఈ మార్తాండ్ సూర్య దేవాలయాన్ని వేల ఏళ్ల క్రితం పాండవ వంశానికి చెందిన రాజు రామ్‌దేవ్ నిర్మించారు. ఆ తర్వాత, కశ్మీర్‌లో బౌద్ధమతం వ్యాప్తిచెందింది.
‘‘బౌద్ధమతం ప్రభావం తగ్గిన తర్వాత మహంత్ శంకరాచార్య ఇక్కడకు వచ్చారు. మళ్లీ ఏడో శతాబ్దంలో ఇక్కడ హిందూ మతానికి పునరుజ్జీవం పోసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఎనిమిదో శతాబ్దం మొదట్లో హిందూ రాజు లలితాదిత్య ఇక్కడి మార్తాండ్ దేవాలయాన్ని పునరుద్ధరించారు. దీంతో మళ్లీ ఇక్కడ పూజలు ప్రారంభమయ్యాయి’’అని ప్రముఖ చరిత్రకారుడు జరీఫ్ అహ్మద్ చెప్పారు.
సువిశాల ప్రాంగణంలో 84 రాతి స్తంభాల నడుమ ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ సూర్యుడి విగ్రహంతోపాటు 37 చిన్నచిన్న విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవాలయంలో లలితాదిత్య ‘‘రాజ దర్బార్’’ను కూడా నిర్వహించారని జరీఫ్ అహ్మద్ వివరించారు.
‘‘14వ శతాబ్దంలో ఇస్లామిక్ విప్లవం వచ్చినప్పుడు, ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని సుల్తాన్ శికందర్ షా ఆదేశాలు జారీచేశారు. దీంతో ఈ ఆలయం శిథిలమైంది’’అని జరీఫ్ అహ్మద్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘మార్తాండ్ దేవాలయాన్ని ధ్వంసం చేసేందుకు సుల్తాన్ శికందర్ ఆదేశాలు జారీచేశారు. ఈ దేవాలయం చాలా పెద్దది. దీన్ని ధ్వంసం చేసేందుకు రోజుల సమయం పట్టింది’’అని ఆయన వివరించారు.
‘‘శికందర్ తర్వాత అదే వంశానికి చెందిన చాలా మంది రాజులు వచ్చారు. కానీ, వారెవరూ దేవాలయాలను ధ్వంసం చేయలేదు’’అని ఆయన చెప్పారు.
‘‘శికందర్ నాటి పరిస్థితులపై పరిశోధన చేపట్టాల్సి అవసరం ఉంది. అయితే, కొన్ని సంస్థలు చరిత్రను రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు ఉపయోగించుకుంటున్నాయి. అలాంటివారిని అసలు ప్రోత్సహించకూడదు’’అని ఆయన వివరించారు.
భారత్‌లోని ఇతర పురాతన ప్రాంతాల్లానే ఇక్కడికి కూడా పర్యటకులు వస్తుంటారని జరీఫ్ వివరించారు. అయితే, ఇక్కడికి సమీపంలోని ఒక దేవాలయంలో మాత్రమే పూజలు జరుగుతుంటాయని ఆయన చెప్పారు.
భారత ప్రభుత్వం ముఖ్యమైనవాటిగా గుర్తించిన కట్టడాలు, ప్రాంతాల్లో ముందుస్తు అనుమతులు లేకుండా ఎలాంటి పూజలు చేపట్టకూడదని గత నెలలలో పురావస్తు విభాగం ఒక ఆదేశం జారీచేసింది.

ఫొటో సోర్స్, Getty Images via Universal History Archive
హిందువుల కోసం
కొన్ని దశాబ్దాలుగా కశ్మీర్‌లోని భిన్న ప్రాంతాల్లో హిందూ పురాతత్వ కట్టడాలు, ప్రాంతాలపై హిందూ జాతీయవాద సంస్థలు చర్చలకు తెరతీస్తున్నాయి. కశ్మీర్‌ను మళ్లీ హిందూ ప్రాంతంగా మార్చాలని కూడా చెబుతున్నాయి.
మార్తాండ్ సూర్య దేవాలయంలో పూజలకు హాజరైన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దీనిపై ట్విటర్‌లో చాలా జాగ్రత్తగా స్పందించారు. ‘‘ప్రాచీన ప్రాంతాలను సందర్శించినప్పుడు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే పర్యటకులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించాను’’అని ఆయన ట్వీట్ చేశారు.
పూజ సమయంలో సూర్యుడి ఫోటోతోపాటు కాషాయ జెండా, భారత జెండా కనిపించాయి. హరహర మహాదేవ్ నినాదాలు కూడా చేశారు.
ఆనంది, హైదర్ లాంటి బాలీవుడ్ సినిమాలను మార్తాండ్ సూర్య దేవాలయ శిథిలాల్లో చిత్రీకరించారు.
‘‘హిందూ, బౌద్ధ కట్టడాల్లో భారీగా రాయిలను ఉపయోగించారు. వీటికి వేల ఏళ్లనాటి చరిత్ర ఉంది. దీనికి భిన్నంగా ఇస్లామిక్ కట్టడాల్లో కలపను ఉపయోగిస్తుంటారు. ఇవి వరదలు, అగ్ని ప్రమాదాలకు ఎక్కువగా దెబ్బతింటుంటాయి’’అని జరీఫ్ చెప్పారు.
‘‘రెండు వేల ఏళ్ల క్రితం ఇక్కడ ప్రజలు పెద్దయెత్తున బౌద్ధమతాన్ని స్వీకరించారు. ఆ తర్వాత మళ్లీ ఇక్కడ హిందూమతం ప్రభావం పెరిగింది. ఆ తర్వాత ఇస్లాంలోకి ప్రజలు మతం మారారు. దీంతో ఇక్కడ మూడు మతాల కట్టడాలూ కనిపిస్తాయి’’అని జరీఫ్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్.. ఏ కేసులో అరెస్ట్ చేశారు? తెరవెనుక ఏం జరిగింది?
- యుక్రెయిన్-రష్యా యుద్ధంతో ఈ దేశం సంపద ఎందుకు పెరుగుతోంది?
- ఎండలు పెరగడంతో మండిపోతున్న గోదుమ పిండి ధర
- హీట్ వేవ్, బొగ్గు కొరతతో భారత్‌లో కరెంట్ కష్టాలు మరింత తీవ్రమవుతాయా?
- అసాని తుపాను: ఉత్తరాంధ్రలో వానలు... విశాఖకు రావల్సిన 10 విమానాలు రద్దు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














