నరేంద్ర మోదీ: జమ్ములో పర్యటిస్తున్న ప్రధాని కశ్మీర్ ఎందుకు వెళ్లడం లేదు

ఫొటో సోర్స్, ANI
- రచయిత, రియాజ్ మస్రూర్
- హోదా, బీబీసీ ఉర్దూ, శ్రీనగర్
జమ్ములో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు రెండు రోజుల ముందు సుంజ్వాన్‌లోని మిలిటరీ కంటోన్మెంట్ ఏరియాలో దాడి జరిగింది. ఆదివారం 'జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని' పురస్కరించుకొని సాంబాలోని పల్లి గ్రామంలో ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. సుంజ్వాన్ సైనిక శిబిరం, పల్లి గ్రామానికి కేవలం 17 కిలో మీటర్ల దూరంలో ఉంది.
దాడి తర్వాత ఇక్కడ భద్రతను మరింత పెంచారు. 2019లో జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దయిన తర్వాత తొలిసారిగా ఇక్కడకు వస్తున్న మోదీ, తన పర్యటనను కేవలం జమ్ముకు పరిమితం చేయడంతో రాజకీయ, సామాజిక వర్గాలు నిరాశ వ్యక్తం చేశాయి. ఈ పర్యటనలో కశ్మీర్‌కు సంబంధించి రాజకీయ పరంగా ఎలాంటి కీలక ప్రకటనలు ఆయన నుంచి రావని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, MOHIT KANDHARI/BBC
జమ్ములో దాడి ఎందుకు జరిగింది?
జమ్ము అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) ముకేశ్ సింగ్ చెబుతున్న ప్రకారం.. జమ్ము సరిహద్దు జిల్లా సాంబాలోని సుంజ్వాన్ సైనిక శిబిరానికి సమీపంలో ఒక బస్సుపై శుక్రవారం వేకువజామున సాయుధ తీవ్రవాదులు దాడి చేశారు. మార్నింగ్ షిఫ్టు కోసం వస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) బలగాలు ఈ బస్సులో ఉన్నాయి. తీవ్రవాదులు, బస్సుపై కాల్పులు జరపడంతో పాటుగా గ్రెనెడ్లను విసిరారు.
ఈ దాడిలో సీఐఎస్‌ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్పీ పాటిల్ చనిపోయారు. తొమ్మిది మంది పారామిలిటరీ సైనికులు గాయపడ్డారు. సుదీర్ఘంగా సాగిన ఈ ఆపరేషన్‌లో ఇద్దరు తీవ్రవాదులను కాల్చి చంపినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. వారి నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఆపరేషన్ ముగిసిన అనంతరం జమ్ములో రిపోర్టర్లతో ముకేశ్ సింగ్ మాట్లాడారు. ''ప్రధాని రాకముందే ఏదైనా భారీ ఆపరేషన్ చేపట్టాలని తీవ్రవాదులు ప్రణాళికలు వేసుకుంటున్నట్లుగా మాకు ముందే సమాచారం అందింది. అందుకే, అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే బదులు తీర్చుకున్నాయి'' అని అన్నారు.
ఈ దాడిని, ఆత్మాహుతియత్నంగా జమ్ముకశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్‌బాగ్ సింగ్ వర్ణించారు. దీన్ని ధ్రువీకరిస్తూ ముకేశ్ సింగ్ ఇలా అన్నారు. ''వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, సామగ్రిని బట్టి చూస్తే... తీవ్రవాదులు, ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకే వచ్చినట్లుగా అనిపిస్తోంది'' అని చెప్పారు.
జమ్ముకశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా దీని గురించి మాట్లాడుతూ ఈ దాడికి పాకిస్తాన్‌దే బాధ్యత అని ఆరోపించారు. ''పాకిస్తాన్ ఉద్దేశాలను మా సైనికులు భగ్నం చేశారు'' అని అన్నారు.
మరోవైపు, ప్రధాని పర్యటనకు ముందే కశ్మీర్‌లోనూ తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

ఫొటో సోర్స్, MOHIT KANDHARI/BBC
జమ్ములో దాడికి కొన్ని గంటల ముందు, ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలో గురువారం సాయంత్రం జరిగిన ఘర్షణలో ముగ్గురు తీవ్రవాదులు మరణించారు. ఐదుగురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు.
ఈ ఘర్షణలో లష్కరే తోయిబా తరఫున గత 22 ఏళ్లుగా క్రియాశీలంగా పనిచేస్తోన్న కమాండర్ యూసుఫ్ కాంట్రో మరణించినట్లు పోలీసులు చెప్పారు. ఆయన, పోలీసుల వాంటెడ్ లిస్టులో ఉన్నట్లు తెలిపారు.
జమ్ముకు చెందిన విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు తరుణ్ ఉపాధ్యాయ్ సుంజ్వాన్ దాడి గురించి మాట్లాడారు. ''నిజానికి ఈ దాడి, మోదీ ప్రభుత్వ ప్రకటనకు వ్యతిరేకంగా తీవ్రవాదుల స్పందన. 2019 తర్వాత నుంచి జమ్ముకశ్మీర్‌లో అంతా బావుందని, ఇప్పుడే ఇక్కడ అభ్యుదయం మొదలైందని మోదీ ప్రభుత్వం ప్రకటించింది'' అని ఆయన అన్నారు.
తీవ్రవాదం బతికి ఉన్నంతకాలం, తీవ్రవాదులు తమ ఉనికి చాటుకుంటూనే ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. ''అందుకే, ప్రధాని మోదీ పర్యటనకు ముందు, వారు తమ ఉనికిని చాటుకున్నారు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కశ్మీర్ పర్యటన సందర్భంగా కూడా దాడులు జరిగాయి. 2019 ఆగస్టు నుంచి ఇక్కడ అంతా మారిపోయిందని, ఈ నేలపై పాల నదులు పారుతున్నాయని అంటున్నారు. ఈ ప్రకటనకు వ్యతిరేకంగా తీవ్రవాదుల స్పందన ఇది. ఇందులో నిజం లేదని, ఇక్కడి పరిస్థితుల్లో ఇప్పటికీ మారలేదని తాజా దాడుల ద్వారా తీవ్రవాదులు చెప్పారు'' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, ANI
ప్రధాని, జమ్ములో ఏం చేస్తారు?
అధికారులు చెప్పినదాని ప్రకారం, జమ్ముకశ్మీర్‌లో ప్రధాని మోదీ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహించాలని అనుకుంటున్నారు. ఏటా ఏప్రిల్ 24న 'జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం' జరుపుకొంటారు.
ఆదివారం పల్లి గ్రామంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ, దేశంలోని పంచాయతీ అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా సౌరశక్తితో నడిచే పవర్ ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నారు. రూ. 2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ పవర్ ప్లాంటు ద్వారా కనీసం 350 ఇళ్లకు విద్యుత్‌ను అందించవచ్చు.
శుక్రవారం తీవ్రవాద దాడి జరిగిన సుంజ్వాన్ ప్రాంతానికి పల్లి గ్రామం సమీపంలోనే ఉండటంతో అక్కడ భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశారు. అనుమానాస్పద ఘటనలను గుర్తించడానికి వేదికకు చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ప్రత్యేక డ్రోన్లు, హెలికాప్టర్లను మోహరించామని బీబీసీతో ఒక భద్రతా అధికారి చెప్పారు.
జమ్ములో హిందువుల సంఖ్య ఎక్కువ. 2014 నుంచి ఇక్కడ బీజేపీ పాపులారిటీ పెరుగుతోంది.

ఫొటో సోర్స్, BJP
మోదీ కశ్మీర్‌లో ఎందుకు పర్యటించడం లేదు?
మోదీ పర్యటన ఖరారు కాగానే, ఆయన కశ్మీర్‌లో కూడా పర్యటిస్తారని, అక్కడ కొన్ని ప్రధాన రాజకీయ రాయితీలను ప్రకటిస్తారనే ఊహాగానాలు వచ్చాయి. కానీ, మోదీ పర్యటన జమ్ముకే పరిమితమని గత వారం ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. అభివృద్ధి, శ్రేయస్సు విషయంలో జమ్ముకశ్మీర్‌ను దేశం మొత్తానికి ఒక నమూనాగా మార్చాలని మోదీ అనుకుంటున్నారని జమ్ములోని చాలామంది బీజేపీ నేతలు అంటున్నారు.
జమ్ము బీజేపీకి చెందిన ఒక నేత బీబీసీతో మాట్లాడారు. ఆయన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ''కశ్మీర్ సమస్యను చూపిస్తూ గత 70 ఏళ్లుగా కశ్మీర్‌లోని రాజకీయ నేతలు కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. తనదైన రీతిలో ఈ సమస్యను పరిష్కరించాలని మోదీ అనుకుంటున్నారు. అభివృద్ధి, శ్రేయస్సులో సాధారణ పౌరుల్ని భాగం చేస్తూ పాకిస్తాన్‌కు దాని మద్దతుదారులకు మంచి గుణపాఠాన్ని నేర్పాలని మోదీ భావిస్తున్నారు'' అని ఆయన అన్నారు.
అటల్ బిహారి వాజ్‌పేయి తరహాలో కశ్మీర్ విషయంలో సయోధ్య వైఖరిని అనుసరించాలని కశ్మీర్‌లోని రాజకీయ వర్గాలు చాలా ఏళ్లుగా మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాయి.
గతంలో బీజేపీతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి నయీమ్ అక్తర్ మాట్లాడుతూ... ''వాజ్‌పేయి, శ్రీనగర్ నుంచి ఇండో-పాక్ చర్చలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మోదీ పర్యటన కూడా అదే రీతిలో సాగితే, మంచి రోజులు వస్తాయని ఆశించవచ్చు'' అని అన్నారు.

ఫొటో సోర్స్, BJP
కశ్మీర్ విషయంలో మోదీ వైఖరి, గత ప్రభుత్వాలకు భిన్నంగా ఉందనే అభిప్రాయం పెరుగుతోంది. మోదీ ప్రభుత్వం, కశ్మీర్ విషయంలో సంప్రదాయేతర విధానాన్ని అవలంబిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
కశ్మీర్ విషయంలో మోదీ వైఖరి గురించి జర్నలిస్టు, విశ్లేషకులు హారూన్ రెషీ మాట్లాడారు. ''2015 నవంబర్‌లో శ్రీనగర్‌లోని ఒక ర్యాలీలో మోదీ ప్రసంగించారు. ఆయన ప్రసంగించడానికి ముందు అప్పటి కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్... కశ్మీర్‌లో ప్రశాంతంగా ఎన్నికలు జరగడాన్ని పాకిస్తాన్ వైపు నుంచి ఒక సంజ్ఞగా అర్థం చేసుకొని, పొరుగు దేశంతో చర్చలు జరపాలి అని మోదీకి సూచించారు. ముఫ్తీ చెప్పిన తర్వాత మోదీ ప్రసంగిస్తూ...కశ్మీర్ విషయంలో తనకు ఎవరి సలహాలు, విశ్లేషణలు అవసరం లేదని అన్నట్లు'' హారూన్ వివరించారు.
కశ్మీర్ విషయంలో కశ్మీర్ నేతల ప్రమేయాన్ని ఏ స్థాయిలోనూ మోదీ ప్రభుత్వం కోరుకోవట్లేదని హారూన్ చెప్పారు.
''పాకిస్తాన్‌లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఏదో ఒక స్థాయిలో పాకిస్తాన్‌తో సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు భారత్ ప్రయత్నించవచ్చు. కానీ, ఇది కశ్మీర్ పరిస్థితిని మార్చుతుందో లేదో అనేది ఇప్పుడే చెప్పడం తొందపాటు అవుతుంది'' అని కొందరు పరిశీలకులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- పుట్టిన బిడ్డకు గుండెలో రంధ్రం ఉంటే ఎలా గుర్తించాలి? చికిత్స ఏమిటి
- ఒకే వ్యక్తికి మూడు వయసులు - కొరియాలో పుడితే అంతే
- హైదరాబాద్: ‘గుడికి వచ్చిన భక్తురాలిని రాడ్డుతో కొట్టి చంపిన పూజారి.. శవం వాసన రాకుండా అగరబత్తుల ధూపం వేశాడు’
- ఈ నిధి ఎవరి దగ్గరుంటే వారికి భవిష్యత్తులో తిరుగుండదు
- శ్రీలంకలో ‘ఆర్యులు రావటానికి ముందునుంచీ ఉన్న తొట్టతొలి ఆదివాసీ ప్రజల్లో‘ మిగిలిన చిట్టచివరి జనం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











