ప్రపంచంలో ఎక్కడా లేనన్ని ఇంటర్నెట్ షట్‌‌డౌన్‌లు ఒక్క భారతదేశంలోనే ఎందుకు?

ఇంటర్నెట్ షట్‌డౌన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంటర్నెట్ షట్‌డౌన్‌
    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతదేశం ఇప్పటి వరకు వరుసగా నాలుగో సంవత్సరం ఇంటర్నెట్‌ను నిషేధించి చరిత్రను సృష్టించింది. 2021 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా విధించిన182 ఇంటర్నెట్ పరిమితుల్లో 106 భారతదేశంలోనే చోటు చేసుకున్నాయి.

2016 -2021 మధ్యలో ప్రపంచవ్యాప్తంగా 937 ఇంటర్నెట్ ఆంక్షలు ఉంటే, అందులో 567 ఒక్క భారతదేశంలోనే జరిగాయని ఇంటర్నెట్ అంశాల పై అధ్యయనం చేసిన గ్లోబల్ థింక్-ట్యాంక్ యాక్సెస్ నౌ విడుదల చేసిన తాజా డేటా చెబుతోంది.

ఇంటర్నెట్ నిషేధించేందుకు 'నిరసనల అణచివేత నుంచి ఆన్‌లైన్ మోసాల నిరోధాన్ని' కారణాలుగా చెప్పినట్లు ఈ నివేదిక చెబుతోంది.

ఇంటర్నెట్ నిషేధాన్ని ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో విధించాలనే అంశం పై భారతదేశంలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది.

భారత రాజ్యాంగం ప్రకారం ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని పొందడం పౌరుల ప్రాథమిక హక్కు అని భారత సుప్రీంకోర్టు జనవరి 2020లో పేర్కొంది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

సుప్రీం కోర్టు పేర్కొన్న ప్రాధమిక హక్కు

అనురాధ భాసిన్ వెర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును విచారించిన సుప్రీం కోర్టు, ఇంటర్నెట్ వాడకంపై ప్రభుత్వం నిషేధం విధిస్తే, అది తాత్కాలికంగా, ఒక పరిధికి పరిమితం చేసి, చట్టబద్ధంగా ఉండాలని చెప్పింది.

డిసెంబర్ 2021లో, కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ, లోక్‌సభకు సమర్పించిన నివేదికలో, ఇంటర్నెట్ పరిమితుల పై ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించింది. మరింత పారదర్శకతతో కూడిన కచ్చితమైన డేటాను అందించాలని డిమాండ్ చేసింది.

"ఒక ప్రాంతంలో ఒక గంట ఇంటర్నెట్ నిషేధం వల్ల గంటకు 2.5 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని" భారతీయ సెల్యులార్ ఆపరేటర్లు తెలిపినట్లు ఈ నివేదిక పేర్కొంది.

"దేశంలో ఇంటర్నెట్ షట్‌‌డౌన్‌ చేయడానికి శాంతిభద్రతలు, భద్రతా సమస్యలు ముఖ్యమైన కారణాలు" అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

వీడియో క్యాప్షన్, ఇంటర్నెట్ ఎలా పుట్టింది? రెండు కంప్యూటర్ల మధ్య బదిలీ అయిన తొలి పదం ఏంటి?

"ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం పట్ల భారతదేశ నిబద్ధతను ఉల్లంఘిస్తాయని సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ పాలసీ డైరెక్టర్ ప్రాణేష్ ప్రకాష్, అభిప్రాయపడ్డారు. "వాటిని చట్టవిరుద్ధమైన చర్యలుగా ప్రకటించాలి" అని అన్నారు.

"అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి చేసిన సంయుక్త డిక్లరేషన్‌లో, ఇంటర్నెట్ పై విధించే పరిమితులను అనవసరమైనవని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని పేర్కొంది" అని ఆయన చెప్పారు.

"భారతదేశంలో లేదా మరెక్కడైనా ఏ వ్యక్తినైనా టెలీకమ్యూనికేషన్స్ లేదా సమాచారానికి దూరంగా ఉంచాలని చూడటం సరైంది కాదు" అని అన్నారు.

ఇంటర్నెట్ షట్‌డౌన్‌

జమ్మూ కశ్మీర్‌లో ఎక్కువగా బంద్

దేశంలో అత్యధికంగా ఇంటర్నెట్ నిషేధం విధించిన రాష్ట్రాల్లో జమ్మూ కశ్మీర్‌ ఉంది. ఆ తర్వాత జాబితాలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర ఉన్నాయి.

అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, జమ్మూ కశ్మీర్‌లో అత్యధికంగా ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు నమోదయ్యాయి.

2021 సంవత్సరంలో, దేశవ్యాప్తంగా జరిగిన 106 షట్‌డౌన్‌లలో, 85 ఒక్క జమ్ము కశ్మీర్‌లోనే ఉన్నాయి, ఇందులో పుల్వామా, శ్రీనగర్ కుల్‌గావ్ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి.

తీవ్రవాద కార్యకలాపాలు, అశాంతిని వ్యాప్తి చేసే ప్రయత్నాలు, దేశ వ్యతిరేక చర్యలను నిరోధించడం కోసమే ఇంటర్నెట్ ఆంక్షలు విధించడానికి ప్రధాన కారణం అని ప్రభుత్వం పేర్కొంది.

"ఇంటర్నెట్ షట్‌డౌన్ ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తున్నందు వల్ల ఇంటర్నెట్ షట్‌డౌన్‌ను సమర్ధించలేం" అని యాక్సెస్ నౌ సంస్థ కు చెందిన ఆసియా పసిఫిక్ పాలసీ కౌన్సిల్ నమ్రతా మహేశ్వరి అన్నారు.

భారత సుప్రీంకోర్టు కూడా 2020 సంవత్సరంలో ఇంటర్నెట్ యాక్సెస్‌ను ప్రాథమిక హక్కుగా పరిగణించింది.

ఇంటర్నెట్

ఫొటో సోర్స్, Getty Images

ఆర్థిక నష్టం

ప్రపంచంలో ఇంటర్నెట్ నిషేధాన్ని ఎక్కువగా అమలు చేయడం వల్ల ఆర్ధిక నష్టం కూడా జరిగింది.

ఒకవైపు ప్రభుత్వం ఆన్‌లైన్‌లో బ్యాంకింగ్, లావాదేవీలు, వ్యాపారం, విద్యను వేగవంతం చేసే ప్రక్రియను నిర్వహిస్తుండగా, మరోవైపు, ఇంటర్నెట్ షట్ డౌన్ వల్ల చాలా పనులు నిలిచిపోయాయి.

2021లో మొత్తం 8,920 గంటల పాటు ఇంటర్నెట్‌ పై నిషేధం విధించడంతో దాదాపు 13 మిలియన్ల మంది భారతీయ వినియోగదారులు ప్రభావితమయ్యారని బ్రిటన్‌కు చెందిన డిజిటల్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ రీసెర్చ్ గ్రూప్ 'టాప్-10 వీపీఎన్ ' నివేదిక చెబుతోంది. దీని వల్ల దాదాపు 20 వేల కోట్ల రూపాయల నష్టం కలిగింది.

భారతదేశంలో ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సీనియర్ న్యాయవాది అపర్ గుప్తా గత కొన్నేళ్లుగా 'ఇంటర్నెట్ ఫ్రీడమ్' కోసం వాదిస్తూ కోర్టుల ద్వారాలు తడుతున్నారు.

"ఇంటర్నెట్‌ను నిషేధించడం వల్ల హాని ఎక్కువ, ప్రయోజనం తక్కువ చేకూరుతుందనడంలో సందేహం లేదు. అలాంటి షట్‌డౌన్‌పై కోర్టు స్టే కూడా ఇచ్చింది. నమ్మకాన్ని పెంచడం అవసరం, దానిని తగ్గించడం కాదు" అని ఆయన అన్నారు.

భారతదేశంలో జర్నలిస్టుల స్వేచ్ఛ రోజు రోజుకీ తగ్గుతోందని, వారు తమ పనిలో అనేక పెను ప్రమాదాలను చవిచూడాల్సి వస్తోందని మంగళవారం రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ విడుదల చేసిన వార్షిక నివేదిక పేర్కొంది.

ఈ నివేదిక ప్రకారం, 2022లో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ - 180 దేశాలలో భారతదేశ స్థాయి ఎనిమిది స్థానాలు కిందకు పడిపోవడంతో పాటు 150వ స్థానానికి చేరింది. గత ఏడాది భారత్‍‌కు 142వ స్థానం దక్కింది.

వీడియో క్యాప్షన్, ఇంటర్నెట్ సేవల్ని పదే పదే నిలిపివేసే దేశాల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో భారత్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)