డాన్స్ వ్యాధి: 16వ శతాబ్దపు ఐరోపాలో వేలాది మంది ప్రాణాలు తీసిన ఈ వింత వ్యాధి ఏంటి?

- రచయిత, జాన్ వాలర్, "ఎ టైమ్ టు డ్యాన్స్: ఎ టైమ్ టు డై" రచయిత
- హోదా, బీబీసీ కోసం
ఇది 16వ శతాబ్దపు నాటి మాట. 1518 జూలైలో ఒకరోజు, స్ట్రాస్‌బర్గ్ నగరంలో ఒక మహిళ వీధిలోకొచ్చి డాన్స్ చెయ్యడం ప్రారంభించారు. అది ఆ రోజుతో ఆగిపోలేదు. చాలా రోజులు ఆమె అలా డాన్స్ చేస్తూనే ఉన్నారు. ఒక వారంలో ఈ వ్యాధి చాలామందికి అంటుకుంది. సుమారు 100 మంది వ్యక్తులు డాన్స్ చేయకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేశారు.
ఇదొక ప్లేగు వ్యాధి. ఈ వ్యాధి సోకినవారు డాన్స్ చేయాలన్న కోరికను ఆపుకోలేరు. అలా రోజుల తరబడి డాన్స్ చేస్తూనే ఉంటారు.
అయితే, రాత్రీ, పగలూ డాన్స్ చేయడమే ఈ వ్యాధికి మందు అని అధికారులు విశ్వసించారు. అలా చేస్తేనే వారు కోలుకుంటారని భావించారు.
అందుకని, ఈ వ్యాధి సోకినవారిని వేరు చేసి డాన్స్ హాల్లో పెట్టారు. వేణువు, డ్రమ్స్ వాయించే సంగీతకారులను నియమించారు. వారు వాయిస్తూ ఉంటే వీళ్లు డాన్స్ చేస్తూనే ఉండేలా ప్లాన్ చేశారు. అలాగే, కొందరు ప్రొఫెషనల్ డాన్సర్లను కూడా నియమించారు.
అయితే, కొద్ది రోజుల్లోనే బలహీనమైన గుండె కలవారు మరణించడం మొదలైంది. 1518 ఆగస్టు చివరికల్లా సుమారు 400 మందికి ఈ పిచ్చి అంటుకుంది. వాళ్లందరిని వ్యాన్లు ఎక్కించి వైద్య శిబిరాలకు తీసుకెళ్లారు.
మెల్లగా సెప్టెంబరు మొదటి వారాల్లో ఈ మహమ్మారి అదృశ్యం కావడం మొదలైంది.
కాగా, యూరప్‌లో ఈ డాన్స్ వ్యాధి సోకడం అదే మొదటిసారి కాదు. 1518కి ముందు దాదాపు పది సార్లు ఈ అంటువ్యాధి విజృంభించిన ఘటనలు ఉన్నాయి.
1374లో ప్రస్తుత బెల్జియం, ఈశాన్య ఫ్రాన్స్, లక్సెంబర్గ్‌లోని అనేక నగరాలను ఈ వ్యాధి కబళించింది. అయితే, 1518లో దీని గురించి విపులంగా రికార్డు చేశారు. యూరప్‌లో ఈ వ్యాధి వ్యాపించడం అదే చివరిసారి.

ఈ వింత వ్యాధిని ఎలా వివరించగలం?
ఈ వ్యాధి పట్ల పలు రకాల సిద్ధాంతాలు, అంచనాలు ఉన్నాయి.
అప్పట్లో బాగా పాపులర్ అయిన ఒక ఆలోచన ఏంటంటే, రై (ఒక రకమైన తృణధాన్యం) మీద పెరిగే ఎర్గాట్ అనే ఫంగస్ వీరి ఆహారంలో కలిసి ఉండవచ్చు. కానీ, అలా జరిగే అవకాశం చాలా తక్కువ.
ఎర్గాటిజం వలన భ్రమ, భ్రాంతి, కండరాల సంకోచం కలగవచ్చు. అలాగే, నాళాల చివర్లకు రక్తం సరఫరా కాకపోవచ్చు. దానివలన మనిషి కదలికల్లో సమన్వయం లోపిస్తుంది. కానీ, డాన్స్ పిచ్చి పట్టే అవకాశాలు తక్కువ.
ఇలా డాన్స్ చేస్తున్నవారంతా ఒక భిన్నమైన మతానికి లేదా విశ్వాసానికి కట్టుబడినవారు అయ్యుండవచ్చన్నది మరొక ఊహ.
కానీ, ఇదీ నిజం కాదు. ఎందుకంటే బాధితులు డాన్స్ చేయాలని అనుకోలేదని, డాన్స్ ఆపలేని నిస్సహాయతను వెల్లడిస్తూ సహాయం కోసం అర్థించేవారని సమకాలీనులు ధృవపరిచారు.
ఇది మాస్ హిస్టీరియాలో భాగమని చాలామంది భావించారు. దీనికి కొంత అవకాశం ఉంది. ప్రత్యేకించి 1518 నుంచి స్ట్రాస్‌బర్గ్‌లోని పేదలు ఆకలి, వ్యాధులు, మూఢనమ్మకాల బారినపడ్డారు. అయితే, వాళ్లు డాన్స్ ఎందుకు చేయాలనుకుంటారు? దీన్ని ఈ సిద్ధాంతం వివరించలేదు.

ట్రాన్స్‌లోకి వెళ్లారా?
డాన్సర్లు ట్రాన్స్‌లో ఉండి ఉంటారన్నది నా ప్రతిపాదన. లేకుంటే అన్ని రోజులు డ్యాన్స్ చేయలేక పోయేవారు.
విపరీతమైన మానసిక వేదనలో ఉన్నవారు ట్రాన్స్‌లోకి వెళిపోతారని మనకు తెలుసు. దెయ్యం పట్టిందనో, దేవుడు పూనాడనో అనుకుంటారు కూడా. 1518 స్ట్రాస్‌బర్గ్ ఘటనలో ఇవన్నీ కనిపిస్తున్నాయి.
ఒకటి, ఆ నగరంలో పేదలు కరువు, వ్యాధుల బారిన పడి కష్టాలు అనుభవిస్తున్నారు. రెండు, వారంతా సెయింట్ విటస్ అనే బాబాను నమ్మేవారు. ఈ బాబా వాళ్ల మెదళ్లను నియంత్రిస్తూ, నిరవధిక డాన్సుకు పురికొల్పి ఉండవచ్చు. దాంతో, వాళ్లంతా ట్రాన్స్‌లోకి వెళ్లి ఉండవచ్చు. ఒకసారి డాన్స్ మొదలుపెట్టాక వాళ్లు ఆపలేకపోయరు.
క్రమంగా మూఢనమ్మకాలు తొలగిపోవడంతో డాన్సింగ్ ప్లేగు కూడా తగ్గిపోయింది.
మరికొద్ది కాలానికి స్ట్రాస్‌బర్గ్ లాంటి పట్టణాలు క్రైస్తవంలో ప్రొటెస్టంట్ శాఖకు మారిపోయాయి. దాంతో, ఆ బాబా లాంటి వాళ్లని నమ్మడం మానేశారు.
ఆధునిక విజ్ఞానం, హేతువాదం అభివృద్ధి చెందడంతో మధ్య యుగాల నాటి అంధవిశ్వాసాలకు తెర పడింది. పిచ్చి పట్టినట్టు డాన్స్ చేసే వ్యాధులు అంతమైపోయాయి.
ఇది జరిగి శతాబ్దాలు గడచినప్పటికీ, మానవ మెదడు చేసే వింత చేష్టలకు గుర్తుగా నిలిచింది ఈ ఘటన.
ఇవి కూడా చదవండి:
- ‘నేను ఎదురుగానే ఉన్నా చనిపోయానని మా అబ్బాయి అందరికీ చెబుతున్నాడు’
- ‘ఈ ప్రాంతం పగలు మనుషులది.. రాత్రి చిరుతపులులది, ఒకర్ని చూసి ఒకరు భయపడరు’
- లేడీ సింగం: కాబోయే భర్తపై కేసు పెట్టి జైలుకు పంపిన ఎస్ఐ
- ‘ఆ నటుడితో నాకు అఫైర్’ ఉందనే అనుమానంతో నా భర్త నన్ను తన్నాడు’
- టంగ్-టై అంటే ఏంటి? పిల్లల్లో పెరుగుతున్న ఈ కొత్త సమస్యను గుర్తించడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












