అంబర్ హెర్డ్-జానీ డెప్: ‘ఆ నటుడితో నాకు అఫైర్’ ఉందనే అనుమానంతో నా భర్త నన్ను తన్నాడు’

అంబర్ హెర్డ్

ఫొటో సోర్స్, Getty Images

సహ నటుడు జేమ్స్ ఫ్రాంకోతో తనకు సంబంధం ఉందన్న అనుమానంతో 2014లో తన మాజీ భర్త జానీ డెప్ తనపై దాడి చేశారని అంబర్ హెర్డ్ ఆరోపించారు.

జానీ డెప్ డ్రగ్స్ మత్తులో, అసూయతో తనను బాగా ఇబ్బంది పెట్టారని లక్షల డాలర్ల పరువు నష్టం కేసు విచారణ సందర్భంగా అంబర్ చెప్పారు.

డెప్ చేతిలో వేధింపులకు గురైనట్లు అంబర్ ఆరోపించడంతో ఆయన 5 కోట్ల డాలర్లకు(సుమారు రూ. 380 కోట్లు) ఆమెపై పరువు నష్టం దావా వేశారు. అందుకు ప్రతిగా అంబర్ 10 కోట్ల డాలర్లకు(సుమారు రూ. 760 కోట్లు) పరువు నష్టం దావా వేశారు.

జేమ్స్ ఫ్రాంకో వైపు తాను చూస్తున్నానని భావించడమే జానీ డెప్ కోపానికి కారణమని.. జేమ్స్ ఫ్రాంకో అంటే జానీ డెప్‌కు ద్వేషమని అంబర్ గురువారం ఆరోపించారు.

ఫ్రాంకో, అంబర్‌లు 'ది పైనాపిల్ ఎక్స్‌ప్రెస్', 'ది అడెరల్ డైరీస్'లో కలిసి నటించారు.

ఆ అసూయ, కోపంతో రగిలిపోతున్న డెప్ బోస్టన్ నుంచి లాస్ ఏంజెలెస్‌కు విమానంలో వెళ్తున్నప్పుడు తనను పదేపదే ప్రశ్నించడంతో పాటు తన్నారని అంబర్ చెప్పారు.

డెప్ తనను వెనుక నుంచి తన్నడంతో తాను నేలపై పడిపోయానని అంబర్ అన్నారు.

''డెప్ నన్ను నడుముపై తన్నినప్పుడు ఎవరూ ఏమీ అనలేదు, ఎవరూ ఆపలేదు. విమానంలో సూది పడినా వినిపించేంత నిశ్శబ్దం అలముకుంది' అని ఆనాటి ఘటనను వివరించారు అంబర్.

డ్రగ్స్ మత్తులో ఉంటూ జానీడెప్ విమానంలో కేకలు వేసినట్లుగా అంబర్ హెర్డ్ చెబుతున్న రికార్డింగ్‌ను కోర్టు విన్నది.

ఆ ఘటన తరువాత డెప్ తనకు క్షమాపణలు చెప్పడానికి... తాను మత్తులో కాకుండా తెలివితోనే ఉన్నానని నిరూపించుకోవడానికి, మారుతానని చెప్పడానికి న్యూయార్క్‌లో తనను కలిశారని అంబర్ చెప్పారు.

జేమ్స్ ఫ్రాంకో, అంబర్ హెర్డ్

ఫొటో సోర్స్, TAYLOR HILL

ఫొటో క్యాప్షన్, జేమ్స్ ఫ్రాంకో, అంబర్ హెర్డ్

విమానంలో జరిగిన ఘటనకు సంబంధించిన రికార్డులను న్యాయనిపుణులు పలుమార్లు విన్నారు. అంతేకాకుండా.. డెప్ ఇచ్చిన వాంగ్మూలంలో కూడా ఆయన అంబర్‌ను దూరం పెట్టడం కోసం ఆక్సికోడోన్ మాత్రలువేసుకుని నిద్రపోయినట్లు చెప్పారు.

మరోవైపు అంబర్ వాంగ్మూలం ఇచ్చే సమయంలో డెప్ కళ్లు మూసుకుంటూ, సన్ గ్లాసెస్ పెట్టుకుంటూ కనిపించారు. ఓ సందర్భంలో మాత్రం మెల్లగా తల ఊపారు.

డెప్ 14 ఏళ్ల కుమార్తె లిలీ రోజ్ విషయంలో తాను ఆయనతో వాదన పెట్టుకున్న తరువాత ఆయన తనతో పోట్లాట పెట్టుకున్నారని అంబర్ ఆరోపించారు.

లిలీ రోజ్ ఇంకా చాలా చిన్న అమ్మాయని, ఆమెకు రక్షణగా ఉండాలనిపించిందని అంబర్ అన్నారు.

జానీ డెప్ తల్లికి చెందిన లివింగ్ రూమ్‌లో తమ పెళ్లినాటి ప్రమాణాల గురించి కూడా అంబర్ గుర్తుచేశారు.

'ఇది చాలా సంక్లిష్టంగా ఉన్నప్పటికీ అప్పట్లో ఆయనే నా జీవితం'' అంటూ ఆయన్ను పెళ్లి చేసుకోవాలనే కోరిక కలగడం గురించి చెప్పారు అంబర్.

పెళ్లి ముందు ఒప్పందాల గురించి మాట్లాడుతూ... చావు తప్ప మనల్ని ఏదీ విడదీయలేదని జానీడెప్ చెప్పారని ఆమె గుర్తుచేశారు.

''నేనేదీ పట్టించుకోలేదు కానీ పెళ్లి నాటి ఒప్పందాలు అనుమానాలను తొలగిస్తాయని భావించాను. ఆ ఒప్పందం అంతా సవ్యంగా సాగేలా చేస్తుందని అనుకున్నాను'' అన్నారామె.

అంతకుముందు జరిగిన విచారణలో డెప్... తాను అంబర్‌ను కానీ ఇంకే మహిళను కానీ కొట్టలేదని చెప్పారు.

ఆమె తరచూ తనను తానే తిట్టుకుంటుందని, సంఘర్షణ కోరుకుంటుందని డెప్ చెప్పారు.

జానీ డెప్, అంబర్ హెర్డ్

మరోవైపు అంబర్ తన వాంగ్మూలంలో డెప్ తన కెరీర్‌ను నియంత్రించేందుకు ప్రయత్నించారని, కొత్త పాత్రలను వెతుక్కోవడానికి తాను చేసిన ప్రయత్నాలపై కోపగించుకున్నారని అనేకసార్లు ఆరోపించారు.

అలాంటి సందర్భాలలో ఇద్దరం వాదులాడుకున్న తరువాత డెప్ తనను కొట్టడం కానీ ఇంట్లో వస్తువులను ధ్వంసం చేయడం కానీ చేస్తారని... చివరకు క్షమాపణ చెబుతారని అంబర్ తెలిపారు.

తాను వర్క్ చేయడానికి వెళ్లినప్పుడంతా ఆయన దుర్భాషలు, వేధింపులు ఎక్కువయ్యేవని ఆమె ఆరోపించారు.

రెడ్ కార్పెట్ ఈవెంట్లలో పాల్గొనేటప్పుడు దుస్తులు ధరించే ముందు తన శరీరంపై ఏవైనా గాయాలు బయటకు కనిపిస్తున్నయేమో అని చూసుకునేదాన్నని చెప్పారామె.

జ్యూరీ సభ్యులకు చూపించిన ఒక క్షమాపణ ఈమెయిల్‌లో డెప్... తనను తాను క్రూరుడిగా పేర్కొంటూ తాను చేసిన పనులకు చింతిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఇలంటి క్షమాపణలు డెప్‌కు సాధారణమేనని అంబర్ అన్నారు.

కొన్నిసార్లు ఆయన నన్ను ఎంతగా హింసించారో ఆయనకే అర్థం కాలేదనుకుంటాను అన్నారామె.

2018 డిసెంబరులో వాషింగ్టన్ పోస్ట్‌కు రాసిన ఓ కథనంలో అంబర్ తాను వేధింపుల బాధితురాలినని చెప్పారు. కానీ, ఆమె అందులో జానీ డెప్ పేరు చెప్పాలేదు.

అయితే, ఆ కథనం డెప్ కెరీర్‌ అవకాశాలను చెప్పలేనంతగా దెబ్బతీసిందని ఆయన తరఫు లాయర్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)