అశోకవనంలో అర్జున కల్యాణం రివ్యూ: విశ్వక్ సేన్ రూటు మార్చాడు.. హిట్టు కొట్టాడా?

ఫొటో సోర్స్, facebook/ShreyasGroup
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
పెళ్లి చాలా విచిత్రమైనది. అయ్యేంత వరకూ ఎప్పుడు? ఎప్పుడు? అనే ఆరాటం. అయిపోయిన తరవాత... `పెళ్లంటే ఇంతేనా` అంటూ జ్ఞానోదయం.
ఓ వయసొచ్చాక.. `పెళ్లి` ఇంకా బాగా ఇబ్బంది పెడుతుంది. పెళ్లెప్పుడు? ఇంకా చేసుకోలేదా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? బ్రహ్మచారి ముదిరినా, బెండకాయ ముదిరినా పనికిరావు.. ఇలా.. ఎన్నో డైలాగులు వినాల్సివస్తుంది. వాళ్లందరికీ సమాధానం చెప్పడానికైనా సరే, పెళ్లి చేసేసుకోవాలనిపిస్తుంది.
అలాంటి ఓ కుర్రాడి కథే `అశోకవనంలో అర్జున కల్యాణం`. నిజానికి ఇది అర్జున్ కథ మాత్రమే కాదు... పెళ్లీడు వచ్చి, దాటేస్తున్న ప్రతీ అబ్బాయి కథ. మరి.. ఆ అశోకవనం ఏమిటి? ఆ అర్జునుడు ఏం చేశాడు? అనేది తెలియాలంటే... కథలోకి వెళ్లాల్సిందే.
తెలంగాణ అబ్బాయి - ఆంధ్రా అమ్మాయి
సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేసుకునే అల్లం అర్జున్ కుమార్ (విశ్వక్‌సేన్)కి 33 ఏళ్లొచ్చినా పెళ్లి కాదు. తెలంగాణలో అసలు సంబంధాలే కరువైపోతాయి. దాంతో.. ఒకే కాస్ట్ కాకపోయినా సరే, ఆంధ్రాలోని అమ్మాయిని చూసి, ఇష్టపడి, నిశ్చితార్థానికి కుటుంబంతో సహా ఓ బస్సులో బయల్దేరతాడు. ఆ అమ్మాయి పేరు.. మాధవి (రుక్సాన్ థిల్లాన్).
నిశ్చితార్థం అయిపోయాక... తిరిగి బయల్దేరుతుంటే, డొక్కు బస్సు కాస్త మొరాయిస్తుంది. దాంతో.. తప్పని పరిస్థితుల్లో పెళ్లి కూతురు ఇంట్లోనే ఉండిపోవాల్సివస్తుంది. ఆ తరవాత.. కరోనా, లాక్ డౌన్ ల పరంపర మొదలవుతుంది.
వరుసగా ఇరవై రోజుల పాటు.. పెళ్లి కూతురి ఇంట్లోనే, పెళ్లి కొడుకు కుటుంబం మొత్తం తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎలాగూ కలిసే ఉన్నాం కదా.. ఆ పెళ్లి తంతు కూడా జరిగిపోతే బాగుంటుందన్నది ఇరు కుటుంబ పెద్దల అభిప్రాయం. దాంతో.. పెళ్లి కూడా ఫిక్స్ చేసేసుకుంటారు.
కానీ తెల్లారేసరికి.. పెళ్లి కూతురు మాయం అవుతుంది. పెళ్లెప్పుడు జరుగుతుందా? అని వేయికళ్లతో ఎదురు చూసిన అర్జున్ కుమార్‌కి అది పెద్ద షాక్. ఆ ఇంట్లో వాళ్లకూ అంతే. ఆ తరవాత ఏం జరిగింది? అర్జున్ కుమార్ పెళ్లి ప్రయాణం ఎంత వరకూ వెళ్లింది? అనేదే మిగిలిన కథ.

ఫొటో సోర్స్, facebook/ShreyasGroup
తెలంగాణ అబ్బాయికీ, ఆంధ్రా అమ్మాయికీ లింకు పెట్టి - లాక్ డౌన్‌తో ఇంకో గట్టి ముడి వేయడం బాగుంది. నిజానికి రెండూ తెలుగు రాష్ట్రాలే. కానీ సాంస్కృతిక పరమైన వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా విందు.. వినోదాలలో.
విస్తర్లో వడ్డించిన మీల్ మేకర్‌ని చూసి..`మటన్ లేదా?` అని వికారంగా చూస్తాడు.. పెళ్లి కొడుకు తరపున బంధువు. ప్రధానంగా ఆంధ్రాలో శుభకార్యాల్లో వెజ్ ఉంటుంది. తెలంగాణలో శుభకార్యం అంటే నాన్‌వెజ్ ఉంటుంది.
నిజానికి చాలా చిన్న విషయంలా అనిపించినా, పెళ్లిళ్లలో జరిగే పెద్ద పెద్ద గొడవలకు బీజం... ఇలాంటి వంటా - వార్పు విషయాల్లోనే వస్తుంది.
`ఏంటి.. ఊప్మా విసిరికొడుతున్నావ్.. ఇంకో రెండు రోజులు మీ ఇంట్లో ఉంటే మొఖాన కొడతావా` అంటూ నిలదీస్తాడు పెళ్లి కొడుకు మావయ్య. ఇలా.. చాలా చిన్న చిన్న విషయాలనే అయినా, దర్శకుడు బలంగా పట్టుకోవాలని చూశాడు. కానీ వాటిని మధ్యలోనే వదిలేశాడు.
పెళ్లింట్లో చాలారకాలైన క్యారెక్టర్లు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని... కాదంబరి కిరణ్, గోకరాజు రమణ.. లాంటి పాత్రలు. కాదంబరి కిరణ్‌ని అమ్మాయిల తరపు వేశారు. ఏ విషయమైనా గట్టిగా చెప్పి, హడావుడి చేసే పాత్ర అది. అలాంటి వాళ్లుంటేనే పెళ్లికి సందడి అన్నట్టుంటుంది.
ఇక గోపరాజు రమణని.. అబ్బాయిల తరపు బంధువు బ్యాచ్‌లో కలిపారు. చిన్న విషయానికైనా రాద్ధాంతం చేసి, మగపెళ్లి వాళ్లం అనే అహంకారం చూపించే ఈ టైపు క్యారెక్టర్లు ప్రతీ పెళ్లిలోనూ తగులుతూ ఉంటారు. అందుకే ఆయా పాత్రలు అంత లైవ్లీగా సాగుతాయి.
ప్రధమార్థంలో వినోదం పంచడానికి స్కోప్ చాలా ఎక్కువే ఉన్నా, దర్శకుడు మొహమాటం కొద్దీ తక్కువే తీసుకొన్నాడు. ముఖ్యంగా హీరోని అండర్ ప్లే చేయించడం వల్ల... హీరో క్యారెక్టర్ చాలా స్లో పేస్ లో సాగుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. వినోదం పండించే బాధ్యత సైడ్ క్యారెక్టర్లు తీసుకోవాల్సివచ్చింది.

ఫొటో సోర్స్, facebook/RuksharDhillon
తలచినదే జరిగినదా?
లాక్ డౌన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఈ సినిమాలో కనిపిస్తాయి. వాటి వల్ల ఫన్ సృష్టించే ఛాన్స్ ఉంది. కాకపోతే.. లాక్ డౌన్, ఆ తాలుకూ చేదు అనుభవాల్ని సరదాగా గుర్తు చేసుకుని, నవ్వుకునే రోజులు కూడా వెళ్లిపోయాయి.
హీరో అక్క క్యారెక్టర్, తను గర్భవతి కావడం.. తను కూడా నిశ్చితార్థానికి రావడం.. ఇవన్నీ చూస్తుంటే.. సెకండాఫ్‌లో ఆ పాత్రతో దర్శకుడు ఏం చేయిస్తాడో ముందే అర్థమైపోతుంది. అలా.. స్క్రీన్ ప్లేని దర్శకుడు తనకు తానుగా స్లో చేసుకున్నాడు.
పతాక సన్నివేశాల్లో ఏం జరుగుతుందో, కథ ఎటువైపు వెళ్తుందో ప్రేక్షకుడు ముందే ఊహించేస్తాడు. కాబట్టి.. వాటిలో కొత్తదనం ఏమాత్రం కనిపించదు. ఇంట్రవెల్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకూ కథలో వేగం కనిపించలేదు. చూసిన సీనే చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
పెళ్లి కూతురు చెల్లెలు అంత సడన్ గా హీరో ప్రేమలో ఎందుకు పడిపోతుందో అర్థం కాదు. కావాలని దర్శకుడు తీసుకున్న లిబర్టీ తప్ప.. అందులో ఏం ఉండదు. రెండు మూడు సీన్లు మాత్రం.. కాస్త జోష్ ఇస్తాయి.
అందులో ఒకటి.. ఫొటోలు తీయడం ఎంత ఈజీయో... కాదంబరి కిరణ్, ఫొటోగ్రాఫర్‌కి వివరించే సన్నివేశం. అది అచ్చమైన గోదావరి ఎటకారంలో సాగి, నవ్వులు పంచుతుంది. ఇక రెండోది.. హీరో మందు కొట్టి, తనలోని కోపాన్ని అంతా కక్కేయడం.
ఈ రెండు సన్నివేశాలకూ కథకూ ఎలాంటి సంబంధమూ ఉండదు. వీటి వల్ల కథలో మార్పులూ జరగవు. కాకపోతే.. అప్పటి వరకూ భారంగా సాగిన ఫీలింగ్.. ఈ సన్నివేశాలతో కాస్త తగ్గుతుంది. చివర్లో వెన్నెల కిషోర్‌ని దింపి కామెడీ చేయడానికి ట్రై చేశారు. కానీ వర్కవుట్ కాలేదు.
పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? ఎవర్ని చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలో? చెబుతూ చివర్లో హీరోతో ఓ డైలాగ్ చెప్పించారు ఈసినిమాలో. ఈ సినిమా కంటెంట్ అంతా ఆ డైలాగ్ పై ఆధారపడి ఉంటుంది.
ఓ రకంగా చెప్పాలంటే.. పెళ్లికి ఈ సినిమాతో కొత్త నిర్వచనం ఏమీ ఇవ్వలేదు. కాకపోతే.. ఉన్న నిర్వచనాన్నే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. అమ్మాయిల్ని కాపాడుకోవాలని, లేదంటే పెళ్లి కోసం పక్క దేశాలకు కూడా పరుగెట్టాల్సివస్తుందని హీరోతో చెప్పించడం బాగుంది.

ఫొటో సోర్స్, facebook/ShreyasGroup
విశ్వక్ సేన్ ఎలా చేశాడంటే..
ఏ పాత్రకైనా నటీనటుల్ని ఎంచుకోవడం కత్తిమీద సామే. కానీ ఈ సినిమా విషయానికొస్తే.. ఏ పాత్రకు ఎవరు కావాలో.. ఎవరు సరిపోతారో వాళ్లనే ఆచి తూచి ఎంచుకున్నట్టు స్పష్టం అవుతుంది.
విశ్వక్ సేన్‌కి ఇది కొత్త తరహా పాత్ర. ఇంత సెటిల్డ్ గా విశ్వక్‌ని చూస్తారని ఎవరూ అనుకొని ఉండరు. తనది కాని జోనర్‌లో ఓ సినిమా చేయాలనుకోవడం మెచ్చుకోదగిన విషయం. అయితే.. అది కూడా విశ్వక్‌ని కాస్త ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే.. తనలోని పూర్తి నటుడ్ని బయటకు రానివ్వకకుండా సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్.. కట్టిపడేసింది.
రుక్సార్, రితిక.. ఇద్దరూ పాత్రలకు తగినట్టు చేశారు. ఇద్దరిలో రితికకే ఎక్కువ స్పేస్ ఉంది. రుక్సార్‌కి డైలాగులు కూడా తక్కువే. పెళ్లి కొడుకు బంధుగణం, పెళ్లి కూతురి ఇంట్లో చుట్టాలు.. వీళ్లలో ఎవరికి తగ్గ పాత్రలు వాళ్లకు పడ్డాయి.
ముఖ్యంగా కాదంబరి కిరణ్ కి చాలా కాలం తరవాత గుర్తుండిపోయే పాత్ర పడింది. తన బాడీ లాంగ్వేజ్‌కి సూటయ్యే డైలాగులతో కాదంబరి ఆకట్టుకున్నారు. పెళ్లి కూతురి తండ్రి పాత్రలో పీడీ ప్రసాద్.. సగటు మధ్యతరగతి భర్తగా, తండ్రిగా మెప్పించారు.
పాటలు కథలో భాగంగా వచ్చాయి. అన్నీ మెలోడీ ప్రధానంగా సాగే పాటలే. డ్యూయెట్లు లేకపోవడం, పేథోస్ సాంగ్ జోలికి వెళ్లకపోవడం ఉపశమనం కలిగించాయి.
మాటలు మరీ గుర్తుపెట్టుకునే స్థాయిలో లేకపోయినా.. సహజంగా ఉన్నాయి. `ఉండాల్సినవాళ్లు వచ్చేంత వరకూ.. వచ్చినవాళ్లు వెళ్లిపోతూనే ఉంటారు` అనే డైలాగులో చాలా డెప్త్ కనిపిస్తుంది.
నేపథ్య సంగీతం, కెమెరా పనితనం ఆకట్టుకుంటాయి. గోదారి అందాల్ని బాగానే చూపించారు.
పెళ్లి చుట్టూ తిరిగే కథ ఇది. పెళ్లి ఎందుకు, ఎప్పుడు, ఎవరిని చేసుకోవాలి? అనే పాయింట్ చెబుతూనే, అక్కడక్కడ నవ్విస్తూ, మధ్యమధ్యలో కాస్త ఎమోషన్‌ని మిక్స్ చేస్తూ తీశారు.
కాకపోతే.. అటు నవ్వులూ, ఇటు ఎమోషన్ రెండూ పతాక స్థాయిలో లేకపోవడం.. ద్వితీయార్థంలో ఎక్కడా వేగం కనిపించకపోవడం... ఈ కల్యాణ వైభవాన్ని తగ్గించేశాయి.
(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














