వడదెబ్బను ప్రకృతి విపత్తుగా చూస్తారా? చనిపోతే నష్టపరిహారం ఇస్తారా?

వడగాలులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తుపానులు, వరదలు, భూకంపాలు వంటి వాటి వల్ల చనిపోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది. ఇది మనకు తెలిసిందే. కానీ మండుతున్న ఎండల వల్ల వడదెబ్బ తగిలి చనిపోతే పరిహారం ఇస్తారా?

ఆంధ్రప్రదేశ్‌లో రూ.లక్ష... తెలంగాణలో రూ.50 వేలు

జాతీయస్థాయిలో వడదెబ్బ మరణాలకు నష్టపరిహారం చెల్లించే పాలసీ లేదు కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం పరిహారం చెల్లిస్తున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.

'ఆపద్బంధు' పథకం ద్వారా వడదెబ్బతో చనిపోయిన వారికి పరిహారం అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే లక్ష రూపాయలు, తెలంగాణలో అయితే రూ.50 వేలు చెల్లిస్తున్నారు. ఇది దారిద్ర్యరేఖకు దిగువున ఉండే వారికి మాత్రమే వర్తిస్తుంది.

నష్టపరిహారం ఎలా చెల్లిస్తారు?

ఒక వ్యక్తి వడదెబ్బతో చనిపోయారో లేదో తెలుసుకునేందుకు వైద్యులు పోస్టు మార్టం చేస్తారు. ఆ తరువాత పీహెచ్‌సీ వైద్యుడు, తహశీల్దార్, ఎస్‌ఐలతో కూడిన కమిటీ ఆ మరణాన్ని ధ్రువీకరిస్తుంది. అప్పుడు మాత్రమే ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుంది. పోస్ట్‌మార్టం చేయకుంటే నష్టపరిహారం అందదు.

వీడియో క్యాప్షన్, ఉష్ణోగ్రతలు పెరిగితే మన శరీరంలో జరిగే మార్పులివే

ఇంకా గుర్తించని కేంద్రం

జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం-2005 కింద వడదెబ్బను ప్రకృతి విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ఇంకా గుర్తించలేదు. అందువల్ల జాతీయ స్థాయిలో మృతులకు నష్టపరిహారం చెల్లించే విధానమంటూ లేదు. కానీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధుల నుంచి 10శాతం ఇందుకు ఖర్చు చేసేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతిచ్చింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్నాటక, రాజస్థాన్, ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు వడగాలులను లోకల్ డిజాస్టర్‌గా ప్రకటించాయి. ప్రస్తుతం తుపాను, కరవు, భూకంపం, అగ్నిప్రమాదం, వరదలు, సునామీ, వడగళ్ల వాన, క్లౌడ్ బరస్టింగ్ , కొండ చరియలు విరిగిపడటం, హిమపాతం,పెస్ట్ అటాక్, తీవ్రమైన చలి గాలులను మాత్రమే ప్రకృతి విపత్తులుగా కేంద్రం చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ పిడుగుపాటు, వడగాలులను కూడా ప్రకృతి విపత్తుగా ప్రకటించింది.

అధిక ఉష్ణోగ్రతలు

ఫొటో సోర్స్, Getty Images

వేటిని వడగాలులు అంటారు?

మనిషి శరీరం భరించలేని స్థాయిలో గాలి వేడిగా ఉంటే దానిని వడగాలి అంటారు. ఉష్ణోగ్రతలు మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీలు, కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీల కంటే ఎక్కువ నమోదు అయినప్పుడు తీవ్రమైన వేడితో గాలులు వీస్తాయి.

సాధారణంగా వేసవిలో అంటే మార్చి నుంచి జూన్ మధ్య వడగాలులు వస్తుంటాయి. మే నెలలో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

9 నుంచి 23కు

అధిక స్థాయిలో వడగాలులు వీచే రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2015లో 9గా ఉన్న ఈ సంఖ్య 2020 నాటికి 23కు పెరిగింది. 2015లో సగటున 7.4 రోజుల పాటు వడగాలులు నమోదు కాగా 2019 నాటికి 32.2 రోజులకు పెరిగింది. 2018లో ఇది 9.8 రోజులుగా ఉంది. అంటే ఒక్క 2019లోనే ఇది సుమారు 3 రెట్లు పెరిగింది.

మండిపోతున్న ఎండలు

ఫొటో సోర్స్, Getty Images

'తెలుగు రాష్ట్రాల్లోనే మరణాలు అధికం'

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 2021 మేలో సుమారు వారం రోజుల పాటు వరుసగా 40 డిగ్రీలకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత నాలుగు దశాబ్దాలలో చూస్తే గాజువాకలో తొలిసారి 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అయినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది.

చివరిసారి 1978లో ఇక్కడ 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత 121 సంవత్సరాలలో అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదైన అయిదో సంవత్సరంగా 2021 నిలిచినట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

వడదెబ్బ తగలడం, వడదెబ్బతో చనిపోవడం అనేది ఇటీవల కాలంలో పెరుగుతోంది. 2010-2019 మధ్య వడదెబ్బతో 6,000 మందికిపైగా చనిపోయారు. ఇందులో 90శాతం మరణాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, వెస్ట్ బెంగాల్‌లో చోటు చేసుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడమే కాదు అధిక ఉష్ణోగ్రతల వల్ల చనిపోయే వారు కూడా ఎక్కువగానే ఉంటున్నారు. 2015లో దేశవ్యాప్తంగా 2,081 చోటు చేసుకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 1,422 మంది చనిపోయారు. తెలంగాణలో ఈ సంఖ్య 584.

వీడియో క్యాప్షన్, మంచు తుపాన్లు వచ్చే కెనడాలో వడగాడ్పులు..

ఇది 2019లో ఏపీలో 128 మంది, తెలంగాణలో 156 మంది వడదెబ్బ వల్ల చనిపోయినట్లు ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు చెబుతున్నాయి.

ఇక 1971-2019 మధ్య తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల దేశవ్యాప్తంగా 1,41,308 మంది చనిపోయారని కేంద్ర భూవిజ్ఞానశాస్త్ర కార్యదర్శి ఎం.రాజీవన్ విడుదల చేసిన పరిశోధనా పత్రం చెబుతోంది. ఆ రిపోర్ట్ ప్రకారం వడగాలుల వల్ల 17,362 మంది చనిపోయారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలలో ఎక్కువ మరణాలు చోటు చేసుకున్నట్లుగా ఆ పరిశోధన చెబుతోంది.

ఆంధ్రాలో 148... తెలంగాణలో 8

ఆంధ్రప్రదేశ్‌లోని 670 మండలాల్లో 148 మండలాలు వేసవిలో తీవ్రమైన వేడి గాలులను చవి చూస్తున్నాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్సటెన్షన్ మేనేజ్‌మెంట్, లాల్ బహుదుర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉమ్మడిగా 2020లో రూపొందించిన నివేదిక చెబుతోంది.

ఈ నివేదిక ప్రకారం 410 మండలాల్లో పరిస్థితి మధ్యస్థంగా ఉండగా 112 మండలాల్లో సాధారణంగా ఉంది.

ఇక తెలంగాణలోని 589 మండలాల్లో 8 మండలాలకు మాత్రమే వడగాలుల సమస్య తీవ్రంగా ఉంది. 75 మండలాల పరిస్థితి క్రిటికల్‌గా ఉండగా 163 మండలాలు సెమీ క్రిటికల్ జోన్‌లో ఉన్నాయి. 20 మండలాలు సేఫ్ కేటగిరిలో ఉన్నాయి. తెలంగాణలో 589 మండలాలకుగాను 8 మండలాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.

మొత్తం మీద 20 మండలాలు మాత్రమే సేఫ్ కేటగిరిలో ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, సహారా ఎడారిలో 50 డిగ్రీల మండుటెండలో జీవితం ఎలా ఉంటుందంటే...

మరణాల నమోదుకు కేందీకృత వ్యవస్థ లేదు

వడగాలుల మరణాలను రికార్డు చేసేందుకు కేంద్రీకృత వ్యవస్థ లేదని గతంలో నాటి కేంద్ర అటవీ, పర్యావరణశాఖ సహాయక మంత్రి బాబుల్ సుప్రియో పార్లమెంటుకు తెలిపారు. కొద్ది సంవత్సరాలుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని ఐడీఎస్‌పీ మరణాలను రికార్డు చేస్తున్నట్లు వెల్లడించారు.

మరొక వైపు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసే డేటాలో కూడా వడదెబ్బతో చనిపోయే వారి డేటా దొరుకుతోంది.

దాహం

ఫొటో సోర్స్, Getty Images

కేసులు సరిగ్గా రిపోర్ట్ కావడం లేదా?

జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద వడగాలులను విపత్తుగా గుర్తించక పోవడంతో బాధితులకు పరిహారం అందడం లేదని ఇండియా స్పెండ్‌ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ ఎన్విరాన్‌మెంట్, సస్టైనబిలిటీ, టెక్నాలజీ సీఈఓ చంద్ర భూషణ్ అన్నారు. జాతీయ లేదా రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధుల నుంచి మాత్రమే విపత్తుల వల్ల కలిగే మరణాలకు నష్టపరిహారం అందించగలరని ఆయన తెలిపారు.

అలాగే 10శాతం మరణాలు మాత్రమే అధికారికంగా రిపోర్టు అవుతున్నాయని, 90శాతం మరణాలు రికార్డు కావడం లేదని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ మవలాంకర్ అన్నారు.

2016లో తొలిసారి యాక్షన్ ప్లాన్

2015 వరకు వడగాలులకు సంబంధించి దేశంలో ప్రత్యేకంగా ఒక విధానమంటూ లేదు. కానీ 2016లో తొలిసారి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చారు. 'ప్రిపరేషన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్-ప్రివెన్షన్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ హీట్ వేవ్' ద్వారా వడగాలులను ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు ఎలాంటి సూచనలు చేయాలో కేంద్రం గైడ్ లైన్స్ విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)