శ్రీలంక: సమైక్య నిరసనల వెనుక ఎందుకీ విభజన రేఖలు?

శ్రీలంకలో నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రీలంకలో నిరసనలు
    • రచయిత, నిక్ మార్ష్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"ఇక్కడ చూడండి ముస్లింలు, హిందువులు, కేథలిక్స్ మతాలకు చెందిన వాళ్లం ఉన్నాం. అందరిదీ ఒకటే రక్తం. ఇదే నిజమైన శ్రీలంక." లక్షణ్ వట్టుహేవా కొలొంబో సముద్ర తీరం దగ్గర ప్రతి రోజూ గుమిగూడే వేలాది మంది ప్రదర్శనకారుల వైపు చూస్తున్నారు. నిరసనకారుల్లో ఆయన కూడా ఒకరు.

శ్రీలంకలో ప్రస్తుత ఆర్ధిక సంక్షోభం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా దారి తీస్తున్న నిరసనలు కొన్ని దశాబ్దాలుగా అనేక వర్గాలను దెబ్బ తీసిన జాతి, మతపరమైన హింసకు అంతం పలుకుతాయేమోనని ఆయన ఆశిస్తున్నారు.

అక్కడకు దగ్గర్లో ఉన్న ఒక బౌద్ధ సన్యాసి ఆయన మాటలతో ఏకీభవించారు. "ఈ పోరాటంలో పాలు పంచుకునేందుకు ప్రజలు తమ మత, జాతిపరమైన విభేదాలను పక్కన పెట్టారు. శ్రీలంక ప్రజలు ఒకటయ్యారు" అని ఆయన అన్నారు.

వీరిద్దరూ సింహళీయులే. దేశ జనాభాలో సింహళీయులు మూడొంతుల మంది ఉంటారు. తమిళ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు దేశంలో మైనారిటీలుగా ఉన్నారు.

కొన్ని వారాల నుంచి ప్రజలు 'గోటా గో బ్యాక్" అని నినాదాలు చేస్తూ వీధుల్లో నిరసనలు నిర్వహిస్తున్నారు.

శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్సను పదవి నుంచి తప్పుకోమని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు. శ్రీలంకలో ఈస్టర్ బాంబు దాడుల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన గెలిచారు.

ఇప్పుడు ఆయన పట్ల కనిపిస్తున్న సానుకూలత తగ్గుతోంది. ఆయనకు ఓటు వేసిన వారే ఇప్పుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్ధిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించలేకపోవడంతో పాటు ఆయన పాలనలో జాతి వివక్ష కనిపిస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

దేశంలో ఎప్పటి నుంచో ఉన్న జాతి, మతపరమైన ఉద్రిక్తతలను ఆయనకు అనుగుణంగా మలచుకున్నారని విమర్శకులు అంటారు.

శ్రీలంకలో నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రీలంకలో నిరసనలు

"నేను సింహళీయుల ఓట్ల వల్లే ఈ ఎన్నికల్లో గెలిచాను" అని రాజపక్స ప్రమాణ స్వీకార సమయంలో అన్నారు.

సింహళీయుల ఆధిపత్య రాజకీయాలు శ్రీలంకలో కొత్త కాదు. చారిత్రకంగా తమిళులను తరచుగా లక్ష్యంగా చేసుకుంటూనే ఉన్నారు.

2009లో శ్రీలంక ప్రభుత్వం కొన్నేళ్ల పాటు వేర్పాటువాద ఎల్‌టీటీఈ తో జరిగిన అంతర్యుద్ధాన్ని దారుణంగా అణిచివేసిన సమయంలో గొటాబయ రాజపక్స శ్రీలంక రక్షణ కార్యదర్శిగా పని చేశారు.

అప్పుడు సింహళీయులు ఆయనను హీరో అని కూడా కీర్తించారు. కానీ, యుద్ధ సమయంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనకు ఆయన బాధ్యత వహించాలని కూడా చాలా మంది డిమాండ్ చేశారు.

తమిళ సమాజాన్ని ఎప్పుడూ రెండవ తరగతి పౌరుల మాదిరిగానే చూశారని విమర్శకులు అంటారు. కానీ, ఈస్టర్ రోజు బాంబు దాడి జరిగినప్పటి నుంచి ముస్లింలు కూడా వివక్షకు గురికావడం మొదలైంది.

వీడియో క్యాప్షన్, శ్రీలంక: ఎమర్జెన్సీ విధించడానికి ముందు ఏం జరిగింది?

"ముస్లింల ఇళ్లను, జీవనోపాధిని లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో హింస జరగడం చూశాం. మేము గౌరవంగా బ్రతికే హక్కు మీద కూడా దాడి చేశారు" అని ముస్లిం హక్కుల ఉద్యమకారిణి ష్రీన్ సరూర్ అన్నారు.

"మూకుమ్మడి దాడులతో పాటు సింహళ బౌద్ధులు ముస్లింల వ్యాపారాలను బహిష్కరించడం కూడా మొదలుపెట్టారు. ముస్లిం మతంలో నిషేధించే శవ దహనాన్ని కోవిడ్ మహమ్మారి సమయంలో నిబంధనల పేరుతో బలవంతంగా అమలు చేసిన విధానం ముస్లింలకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యవస్థాగత చర్యలను బహిరంగం చేసింది" అని సరూర్ అన్నారు.

కొలొంబోలో గాల్ ఫేస్ గ్రీన్ తీరంలో జరుగుతున్న నిరసనలకు మద్దతు తెలుపుతున్న వారిలో అన్ని జాతుల వారు ఉన్నారు.

ఇదంతా రాజపక్స విభజించి పాలించే విధానాల పట్ల ప్రతిఘటన. కానీ, ఇదొక దృక్కోణం మాత్రమే అని విశ్లేషకులు అంటున్నారు.

"ఇది తప్పకుండా ఒక విలక్షణమైన క్షణం" అని కొలంబోలోని సెంటర్ ఫర్ పాలసీ ఆల్ట్రనేటివ్స్ సీనియర్ రీసెర్చర్ భవాని ఫోన్సెకా చెప్పారు.

శ్రీలంకలో నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రీలంకలో నిరసనలు

"అయితే, ఈ నిరసన నిజమైన మార్పు వైపు ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. ఒకప్పుడు ఈ ప్రభుత్వానికి మద్దతిచ్చిన వారే దానికి వ్యతిరేకంగా పోరాడటం చూస్తుంటే, మైనారిటీ వర్గాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది" అని అన్నారు.

కొలొంబోలో శాంతియుత నిరసనలు జరుగుతున్నప్పటికీ, దేశంలో ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి వేరేగా ఉంది. శ్రీలంకలో తమిళ జనాభా ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటారు. ఈ ప్రాంతాల్లో చారిత్రకంగా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత నాటుకుపోయి ఉన్నప్పటికీ, బయటకు మాత్రం నిరసనలు కనిపించడం లేదు.

భద్రతా దళాలు కొలొంబోలో నిరసనకారుల పట్ల వ్యవహరించినట్లుగా ఇక్కడి నిరసనకారులపై వ్యవహరించరని తమిళ ఉద్యమకారులు భయపడుతున్నారు.

"ఈ ప్రాంతాల్లో ప్రదర్శనలను ప్రభుత్వం ఎప్పుడూ హింసతోనే ఎదుర్కొంది" అని జాప్నాకు చెందిన తమిళ పౌర హక్కుల ఉద్యమకారిణి అనుషాని అళగరాజయ చెప్పారు.

"ఇక్కడ నిరసనకారులను రెండు రకాలుగా చూస్తారు. అది మీరెవరు, ఎక్కడున్నారు అనే దాని పై ఆధారపడి ఉంటుంది" అని అన్నారు.

ఇప్పటి వరకు శ్రీలంకలోని ఒక చిన్న పట్టణం రామ్ బుక్కన లో నిరసనల కారణంగా ఒకరు చనిపోయారు. పోలీసులు బహిరంగంగా కాల్పులు జరపడంతో 14 మందికి గాయాలు కాగా, ఒక సింహళ బౌద్ధ మతానికి చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

ఇలాంటి దారుణమైన సంఘటన సింహళ సమాజం పై తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. ఇప్పటి వరకు దేశంలో దశాబ్దాలుగా అణచివేతకు గురైన వారిలో మైనారిటీలే ఎక్కువగా ఉన్నారు.

కానీ, ఇన్నేళ్ల పాటు తాము చేసిన నిరసనల కంటే కూడా నేడు సింహళీయులు చేస్తున్న నిరసనలు అంతర్జాతీయ సమాజపు దృష్టిని ఆకర్షించడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిసినప్పటి నుంచి చాలా మంది తమిళులు కనిపించకుండా పోయారు. వీరి లెక్క కూడా తెలియదు. యుద్ధ నేరాల విచారణ చేయాలనుకున్న అంతర్జాతీయ సమాజపు ప్రయత్నాలను శ్రీలంక ప్రభుత్వాలు అడ్డుకుంటూనే ఉన్నాయి.

తమిళ పోరాటదారుల కోసం నిర్వహించే స్మారక సభలను ఎప్పటికప్పుడు నిషేదిస్తూనే ఉంటారు. చాలాసార్లు ఇవి ఒత్తిడితో జరుగుతూ ఉంటాయి. స్థానిక రాజకీయ నాయకులను నిర్బంధంలోకి తీసుకుంటారు. గత ఏడాది జాప్నా మేయర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు దారుణంగా హింసిస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

శ్రీలంక ఉత్తర ప్రాంతంలో ఇప్పటికీ భద్రతా దళాల కాపలా ఎక్కువగానే ఉంటుంది. "మేం న్యాయం, జవాబుదారీతనం గురించి మాట్లాడటం మొదలుపెడితే ఈ నిరసనల మధ్యలో మేమెలా సురక్షితంగా ఉండగలం? అని అళగరాజయ ప్రశ్నించారు.

దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఒక హిందూ దేవాలయాన్ని నాశనం చేసి బౌద్ధ జెండాలు, చిహ్నాలు ఏర్పాటు చేసిన ఉదాహరణను అళగరాజయ గుర్తు చేశారు.

ఇక్కడకు పూజలు చేసేందుకు వచ్చే హిందువుల పై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఇక్కడ సన్యాసులు జాతిపరమైన వేధింపులను కూడా చేస్తూ ఉంటారు.

"ప్రస్తుతం మార్పు కోసం బౌద్ధ సన్యాసులు కూడా నిరసనలు చేస్తున్నారు. కానీ, ఉత్తర ప్రాంతంలో బౌద్ధ సన్యాసులే భక్తులు హిందూ దేవాలయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు" అని అన్నారు.

శ్రీలంకలో నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రీలంకలో నిరసనలు

కొలొంబోలో ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ ముందు బౌద్ధ సన్యాసులు ప్రదర్శనలు చేస్తున్నారు. వారి వెనుకే క్యాథలిక్ నన్‌లు ఉన్నారు. వీరంతా కలిసి భిన్న మతాల మధ్య ఐక్యతను ప్రదర్శిస్తున్నారు.

"ఇలాంటి ఉద్యమాలు చూడటానికి బాగానే కనిపించినప్పటికీ చేయాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా సింహళ సమాజం" అని నిరసన ప్రదర్శనలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న అమలిని డీ సైరా అన్నారు.

"సింహళ, తమిళ కొత్త సంవత్సరాన్ని కలిసి జరుపుకోవడం చాలా గొప్పగా ఉంది. మేం ఇఫ్తార్ విందులు కూడా నిర్వహించాం.

"నిజమైన, దీర్ఘకాలం ఉండే ఐక్యతను సాధించిన క్షణమంటూ ఏదైనా ఉందంటే, అది ఈ క్షణమే" అని అన్నారు. తమిళులను, ముస్లిం లను రెండవ తరగతి పౌరులుగా చూసే తీరుకు ఇకనైనా ముగింపు పలకాలి" అని అన్నారు.

వీడియో క్యాప్షన్, శ్రీలంక దక్షిణ ప్రాంతంలోనే ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి

ప్రస్తుతానికి నిరసనకారులందరికి ఒకే రకమైన అవసరాలున్నాయి. వారంతా తమ కుటుంబాలకు కావల్సిన ఆహారం, ఇంధనం, ఔషధాలు దొరకాలని చూస్తున్నారు" అని నిరసనకారుల్లో ఒకరైన లక్షణ్ వట్టుహేవా అన్నారు.

వృత్తిపరంగా స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసే ఈయన దేశ చరిత్రలో కొత్త అధ్యాయం వస్తుందని ఆశిస్తున్నారు.

"మా దేశంలో 30 ఏళ్ల పాటు యుద్ధం కొనసాగింది. మేమంతా చాలా ఇబ్బందులు పడ్డాం. మాకిప్పుడు శాంతియుత దేశం కావాలి" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)