హీట్‌వేవ్: మండే ఎండలకు తల్లడిల్లిపోతున్న పేదలు

- రచయిత, ఆయుషి షా
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌లో ఎండలు మండిపోతున్నాయి. దేశమంతా ఇదే పరిస్థితి. ముఖ్యంగా, దేశంలోని పేద ప్రజలు మండుటెండలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంబయి నగరంలో చిన్న చిన్న పనులు చేసుకునే పేదల పరిస్థితి గురించి బీబీసీ ప్రతినిధి ఆయుషి తెలుసుకున్నారు.
సులాచనా యెవాలె కూరగాయలు అమ్ముతుంటారు. హోల్‌సేల్ మార్కెట్ నుంచి నిమ్మకాయలు, పాలకూర తీసుకొచ్చి ఆమె మార్కెట్‌లో అమ్ముతారు. ఎండ కారణంగా అవి వాడిపోకుండా, తాజాగా ఉంచడం కోసం ఆమె వాటిపై నిరంతరం నీటిని చల్లుతూనే ఉన్నారు. అయినా, పెద్దగా ప్రయోజనం లేదు.
నీళ్లు చల్లుతున్నప్పటికీ విపరీతమైన వేడి కారణంగా అవి పాడయ్యాయి. అమ్మడానికి పనికిరాని విధంగా తయారయ్యాయి.
ఎన్నో ఏళ్లుగా ఆమె అదే ప్రదేశంలో కూర్చొని కూరగాయలు అమ్ముతున్నారు. కానీ, ఇంతలా తన సరుకు నష్టపోవడం ఇదే తొలిసారి అని ఆమె చెప్పారు. 70 రూపాయల విలువైన కూరగాయలు పాడైనట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకి 800 రూపాయలు సంపాదించే వారికి 70 రూపాయల నష్టం అంటే పెద్దమొత్తమే.
పరిస్థితి ఇలాగే ఉంటే, భవిష్యత్ ఏంటని ఆమె ఆందోళన చెందుతున్నారు. తన కుటుంబానికి కూరగాయల దుకాణమే ఆధారమని చెప్పారు. ఆమెకు వితంతువు అయిన కోడలితో పాటు మనవరాలు ఉన్నారు.
''నాకు నిస్సహాయంగా అనిపిస్తుంది'' అని కన్నీటితో చెప్పారు.
హీట్‌వేవ్ కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో దేశంలోని లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత 100 ఏళ్లలో ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలు.
గత వారాల్లో రికార్డ్ బ్రేకింగ్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అయితే, వాయువ్య భారతంలో ఈ వారం ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. అయితే ఈ ఉపశమనం కొంత కాలమే అని, కొద్దిరోజుల తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

భారత్‌లోని పేదలే ఇలాంటి వాతావరణ పరిస్థితుల కారణంగా చిక్కులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన వాతావరణం కారణంగా సంభవించే నష్టాన్ని సలాచనా యెవాలె వంటి అమ్మకందారులే భరిస్తున్నారు. పరిమిత ఆదాయం, తక్కువ వనరులతో వేడిని తట్టుకొని మనుగడ సాగించడానికి సతమతం అవుతున్నారు.
ప్రమీలా వాలికర్ ఒక మత్స్యకార మహిళ. తాము పట్టుకొచ్చిన చేపలను తాజాగా ఉంచడమే భారంగా మారిందని ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ ప్రమీలా చెప్పారు.
''నేను సంపాదించే దానిలో ఎక్కువ భాగం ఐస్ కోసమే ఖర్చు చేస్తా. చేపలను తాజాగా ఉంచాలంటే మంచు కావాలి. ఇన్నేళ్లలో ఎప్పుడూ కూడా చేపలు ఇలా పాడవ్వలేదు. ఈమధ్య ఒక్కోరోజు 2000 రూపాయల విలువ చేసే చేపలు పాడవుతున్నాయి. ఆ మేరకు నష్టపోవాల్సిందే'' అని ఆమె తెలిపారు.
ఐస్ ధరలు కూడా పెరిగిపోవడంతో ఆమె రెండు వైపులా ఈ భారాన్ని మోయాల్సి వస్తోంది.
''పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేసవికి అనుగుణంగా మత్స్యకారులకు సహాయపడేందుకు ప్రభుత్వం ఐస్‌తో పాటు అవసరమైన సామగ్రిని అందించాలి'' అని ఆమె కోరారు.

దేశంలో విస్తారంగా ఉన్న అసంఘటిత రంగంలో పనిచేస్తోన్న లక్షలాది మంది బాధలకు ఈ ఇద్దరు మహిళల కథలు అద్దం పడతాయి. ఇలాంటి వ్యక్తులకు జీవనోపాధి కోసం ఎండల్లో పనిచేయడం తప్ప మరో మార్గం లేదు.
హీట్‌వేవ్స్ తరచుగా వస్తుండటంతో వ్యవసాయం, నిర్మాణ రంగం వారికి ఈ ఎండలు ప్రమాదకరంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కేవలం ప్రజారోగ్యం, భద్రతకు సంబంధించిన విషయమే కాదు. శ్రామిక రంగంపై ఆధారపడే దేశానికి తీవ్రమైన ఆర్థిక సమస్య కూడా. నేచర్ కమ్యూనికేషన్స్ నివేదిక ప్రకారం హీట్ కారణంగా భారతదేశం ప్రతీ ఏడాది 101 బిలియన్ డాలర్లు (రూ. 7,73,064 కోట్లు) కోల్పోతుంది. ప్రపంచంలో ఇదే అత్యధికం.
పెరుగుతున్న వేడి, ఉక్కపోత కారణంగా కోల్పోయిన శ్రమ గంటలు 2030 నాటికి సుమారు 2.5-4.5% జీడీపీని ప్రమాదంలో పడేస్తాయని 2020 మెకిన్సే నివేదిక పేర్కొంది. బయట పనిచేయడానికి సురక్షితం కాని పగటి పని గంటల సంఖ్య 2030 నాటికి సుమారు 15 శాతం పెరుగుతుందని ఈ నివేదిక తెలిపింది.
పాండురంగ్ గిర్హే వయస్సు 76 ఏళ్లు. ఆయన తోపుడు బండిని లాగుతారు. రోజులో అత్యధిక వేడి నమోదయ్యే సమయంలో బరువుతో కూడిన తోపుడు బండిని వంతెనపై తీసుకెళుతుంటారు.
60 కిలోల బరువు ఉండే ఆ తోపుడు బండి ఎండలో లాగుతున్నప్పుడు మరింత బరువుగా అనిపిస్తుంది. 200 రూపాయల భత్యం కోసం వంతెనపైకి బండిని లాక్కెళ్లడం కష్టమైన పనే. మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నప్పటికీ ఆయనకు అది తప్ప ఇంకో మార్గం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో నమోదైన హీట్‌వేవ్ చాలా తీవ్రమైనది. ఇది ఇక్కడితో ముగిసిపోదని నిపుణులు అంటున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్ది భవిష్యత్‌లో ఇలాంటి హీట్‌వేవ్ సంఘటనలు సర్వసాధారణంగా మారతాయని హెచ్చరిస్తున్నారు.
గిర్హే వంటి శ్రామికులకు హీట్ వేవ్ అంటే అర్థం ఏంటి? దీని వెనుక కారణాలు ఏంటి? అనే విషయాలు అర్థం కావు. వారికి తెలిసిందల్లా కుటుంబాలను పోషించుకోవడం కోసం హీట్‌వేవ్ ఉన్నా లేకపోయినా రోజూ కష్టపడి పనిచేయాలి అంతే.
''ముఖ్యంగా ఈ సంవత్సరం బాగా వేడిగా ఉంది. కానీ, నేను పనిచేయకపోతే, నా కడుపు ఎలా నిండుతుంది?'' అని గిర్హే ప్రశ్నించారు.
నగరాల్లో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం వల్ల ప్రజల జీవితం మరింత కష్టతరంగా మారిందని నిపుణులు అంటున్నారు. శుభ్రమైన, ఉచితంగా లభించే తాగునీరు పరిమితంగా ఉంటుంది. కాసేపైనా సేద తీరడానికి, ఎండ నుంచి తప్పించుకోవడానికి శ్రామికుల కోసం ఎలాంటి వసతులు లేవు.
డేటా-ఆధారిత వాతావరణ కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేయడం ద్వారా నగరాలు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సి40 సిటీస్ సౌత్ అండ్ వెస్ట్ ఏషియా రీజినల్ డైరెక్టర్ శ్రుతి నారాయణ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మృత్యు మార్గం: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్డు మీద ప్రయాణం ఎలా ఉంటుందంటే...
- ఉస్మానియా యూనివర్సిటీ: రాహుల్ గాంధీని రావద్దనడం కరెక్టేనా... విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండాలా?
- ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న దళిత యువకుడిని నడిరోడ్డుపై చంపిన యువతి అన్న
- భారత్‌లో కోవిడ్ మరణాలు ప్రపంచంలోనే అత్యధికం - ప్రపంచ ఆరోగ్య సంస్థ
- చార్ధామ్ యాత్ర: తెలుగు యాత్రికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












