భారత్‌లో కోవిడ్ మరణాలు ప్రపంచంలోనే అత్యధికం - ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సౌతిక్ బిస్వాస్
- హోదా, బీబీసీ ఇండియా
భారతదేశంలో 47లక్షల మంది కోవిడ్ బారిన పడి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక చెబుతోంది. ఇది భారత ప్రభుత్వం చెబుతున్న లెక్కల కంటే పది రెట్లు ఎక్కువ.
కోవిడ్ మరణాల లెక్కింపులో ప్రపంచ ఆరోగ్య సంస్థ అవలంబించిన విధానం సరైంది కాదని భారత ప్రభుత్వం ఖండిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా మరణాలను నమోదు చేసే వరల్డ్ మోర్టాలిటీ డేటా సెట్‌లోని అధ్యయనకారులు 2020 నవంబరులో భారత అధికారులను కోవిడ్ మరణాలకు సంబంధించిన డేటా ఇమ్మని కోరారు.
అయితే, ‘ఈ సమాచారం అందుబాటులో లేదు’ అని భారత్‌లోని ప్రధాన గణాంక కార్యాలయం సమాధానం చెప్పిందని ఈ డేటా సెట్‌ను తయారు చేసిన ఏరియల్ కార్లిన్స్కీ అనే శాస్త్రవేత్త చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా 2020 నుంచి 2021 వరకు చోటుచేసుకున్న మరణాలను అంచనా వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన అడ్వైజరీ గ్రూప్‌లో ఏరియల్ కార్లిన్స్కీ సభ్యుడు.
మునుపటి సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుత ఏడాదిలో అదనంగా చోటు చేసుకున్న మరణాల ఆధారంగా ఈ అంచనా వేస్తారు. అయితే, మొత్తం మరణాల్లో కోవిడ్ మరణాలెన్ని అనేది చెప్పడం కష్టమైనప్పటికీ ఒక విధంగా అది మహమ్మారి స్థాయిని, మరణాలను అంచనా వేసేందుకు ఉపయోగపడుతుంది.
ఇప్పటి వరకు భారతదేశంలో అధికారికంగా సుమారు 5 లక్షల మరణాలు చోటుచేసుకున్నట్లు ప్రకటించింది. 2020 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 వరకు మొత్తం 4,81,000 మంది కోవిడ్‌తో మరణించినట్లు భారత్ పేర్కొంది.
కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన లెక్కలు భారత్ చెబుతున్న లెక్కల కంటే పదింతలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్త కోవిడ్ మరణాల్లో మూడొంతులు ఒక్క భారతదేశంలోనే చోటుచేసుకున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది.
80 శాతం ఒక్క భారత్‌లోనే చోటుచేసుకున్నాయని ఈ డేటా చెబుతోంది.

ఫొటో సోర్స్, Reuters
భారత్‌లో అందుబాటులో ఉన్న జాతీయ గణాంకాలు మాత్రం అన్ని కారణాలతో చోటుచేసుకున్న మరణాలను పొందుపరిచాయి.
ఈ అంచనాల కోసం రాష్ట్రాల స్థాయిలో లభ్యమైన సివిల్ రిజిస్ట్రేషన్ డేటా, ప్రైవేటు సంస్థలు రిపోర్ట్ చేసిన మరణాలు, ఈ మహమ్మారి వల్ల పడిన అంతర్జాతీయ భారం, ఇతర కోవిడ్ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నారు.
ఈ వారం మొదట్లో ప్రభుత్వం విడుదల చేసిన సివిల్ రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం 2020లో 81 లక్షల మరణాలు నమోదయ్యాయి. ఇది 2019తో పోలిస్తే 6 శాతం ఎక్కువ.
అయితే, అధికారులు ఈ లెక్కలను తక్కువగాచూపిస్తూ అదనంగా చోటుచేసుకున్న 4,74,806 మరణాలను కోవిడ్ మరణాలని తేల్చలేం అని అన్నారు.
భారత్‌లో అధికారిక లెక్కల ప్రకారం 2020లో సుమారు 1,49,000 మంది కోవిడ్ బారిన పడి మరణించారు.
సెప్టెంబరు 2021 నాటికి భారతదేశంలో అధికారికంగా నమోదైన మరణాల కంటే ఆరు నుంచి ఏడు రెట్లు అధికంగా మహమ్మారి సమయంలో మరణాలు చోటు చేసుకున్నట్లు మూడు అధ్యయనాలు పేర్కొన్నాయి. ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అనే స్వతంత్ర గ్లోబల్ హెల్త్ రీసెర్చ్ సెంట్రల్ 12 రాష్ట్రాల్లో మరణాల డేటాకు సంబంధించిన పత్రం లాన్సెట్‌లో ప్రచురితమయింది.
ఈ అంచనాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన అంచనాలకు దగ్గరగా ఉన్నాయి.

అయితే, మరణాలను లెక్కించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అవలంబించిన విధానాన్ని భారత్ కొట్టిపడేసింది.
ఈ అంచనాలు సరైన సమాచారం లేకుండా తప్పు దారి పట్టించేవిగా ఉన్నాయని అధికారులు ఆరోపిస్తున్నారు.
"ప్రపంచ ఆరోగ్య సంస్థ అవలంబించిన విధానాలు, శాంప్లింగ్ పరిమాణాలు లోపభూయిష్టంగా ఉన్నాయని అన్నారు. మరణాలను తక్కువ చేసి చూపించడం చాలా తక్కువ స్థాయిలో ఉండి ఉండవచ్చు" అని అన్నారు.
"ఒకవేళ సమాచారమంతా అందుబాటులో ఉన్నప్పటికీ దానిని బయటపెట్టేందుకు ప్రభుత్వం సంకోచిస్తూ ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఈ అంచనాలు ప్రభుత్వ అంచనాలకు విరుద్ధంగా ఉన్నాయి" అని కార్లిన్స్‌కీ అన్నారు.
నిజానికి, మహమ్మారి సమయంలో చోటు చేసుకున్న మరణాల డేటాను చెప్పేందుకు చాలా దేశాలు ఇబ్బందిపడ్డాయి.
చాలా మందికి వైరస్ పరీక్షలు కూడా జరగలేదు. మరణాల నమోదులో చాలా అవకతవకలు చోటు చేసుకున్నాయి. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అన్ని రకాల కారణాలతో జరిగిన మరణాలను రిపోర్ట్ చేయడంలో జాప్యం జరిగింది.
భారతదేశం కూడా మరణాలను నమోదు చేసి ప్రచురించడంలో జరిగిన ఆలస్యంలో అమెరికా, రష్యాల తర్వాత స్థానంలో ఉంది.
చైనాలో కోవిడ్ మరణాలకు సంబంధించి కచ్చితమైన లెక్కలు లేవు.
జనాభా విషయంలో భారతదేశానికి చైనాతో పోలిక ఉంది. కానీ, చైనాలో అధికారులు 2020-2021లో ఏర్పడిన అన్ని రకాల మరణాలకు సంబంధించిన డేటాను విడుదల చేశారని కార్లిన్స్కీ చెప్పారు.
భారత్ మాదిరిగా పాకిస్తాన్ కూడా డేటా షేర్ చేయలేదు. భారతదేశంలో మరణాలను లెక్కించడం అంత సులభమైన విషయమేమి కాదు. భారత్‌లో ముఖ్యంగా గ్రామాల్లో సగం మరణాలు ఇళ్ల దగ్గరే జరుగుతుంటాయి.
ఏటా చోటుచేసుకునే సుమారు కోటి మరణాల్లో 70 లక్షల వరకు మరణాలకు వైద్య ధ్రువీకరణ ఉండదని, 30 లక్షల మరణాలను నమోదు కూడా చేయరని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.
మహిళల మరణాలు కూడా లెక్కల్లోకి చేరవు. ఉత్తర్ ప్రదేశ్, బిహార్ లాంటి రాష్ట్రాల్లో మహిళల మరణాల నమోదు బాగా తక్కువగా ఉంది.
"భారత్‌లో మహమ్మారి సమయంలో డేటా లభించకపోవడం, స్పష్టత లేకపోవడం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఈ డేటా నాణ్యతను పెంచేందుకు, లభ్యమయ్యేటట్లు చేయడంలో నిర్లక్ష్య ధోరణిని అవలంబించారు" అని మిషిగన్ యూనివర్సిటీలో ఎపిడెమియాలజిస్ట్ భ్రమర్ ముఖర్జీ చెప్పారు.
భారత్ మహమ్మారికి సంబంధించిన అధికారిక డేటాను విడుదల చేయడంలో చూపించిన మొండి వైఖరి చాలా అయోమయానికి గురి చేసింది. కొన్ని రాష్ట్రాల్లో అధికారిక అంచనాల కంటే కోవిడ్ పరిహారం కోసం దరఖాస్తు చేసిన వారి క్లెయిమ్‌లు ఎక్కువగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: 111 జీవో రద్దు ఎవరి కోసం... ఫామ్‌హౌస్‌ల స్థానంలో ఆకాశహర్మ్యాలు వస్తాయా?
- శ్రీలంక: సమైక్య నిరసనల వెనుక ఎందుకీ విభజన రేఖలు?
- టీవీ9 వర్సెస్ విష్వక్సేన్: సహనం కోల్పోయింది ఎవరు
- యాదగిరిగుట్టలో కుంగిన రోడ్డు, పాతబస్తీ వీధుల్లో పడవలు - భారీ వర్షాలకు ప్రజల ఇబ్బందులు
- ‘సిగ్గులేకుండా మా అమ్మ పాటను కాపీ చేశారు’ అంటున్న పాకిస్తాన్ గాయని
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













