తెలంగాణ: యాదగిరిగుట్టలో కుంగిన రోడ్డు, పాతబస్తీ వీధుల్లో పడవలు - భారీ వర్షాలకు ప్రజల ఇబ్బందులు

యాదాద్రిలో కుంగిన రోడ్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, యాదాద్రిలో కుంగిన రోడ్
    • రచయిత, సురేఖ అబ్బూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి.

భారీ వర్షాలకు హైదరాబాద్ సహా తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

తీవ్రమైన ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఈ వర్షం తొలుత ఉపశమనంలా అనిపించినప్పటికీ రెండు గంటలకు పైగా ఏకధాటిగా కురవడంతో ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్ నగరంలోని కొన్ని కాలనీలు నీట మునగడంతో జనజీవనంపై తీవ్ర ప్రభావం పడింది.

చెట్లు కూలడంతో కొన్ని చోట్ల రాకపోకలకు అవాంతరం ఏర్పడింది, కరెంటు సరఫరా నిలిచిపోయింది.

పాతబస్తీలో ఇలా

పాతబస్తీలోని యాకత్‌పురాలో వరద నీట్లో బైక్‌లు కొట్టుకుపోయిన వీడియోలు, నీట మునిగిన ఇళ్లలో ఉన్నవారిని బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి.

జీడిమెట్ల, సూరారం, బషీర్‌బాగ్ తదితర ప్రాంతాలలోనూ కొన్నిచోట్ల నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

యాదగిరి గుట్ట ఆలయ ప్రాంతంతా జలమయమైంది. అక్కడ గుట్టపై నుంచి కిందికి వెళ్లేందుకు కొత్తగా నిర్మించిన రోడ్ కుంగిపోయింది.

యాదాద్రి రోడ్డు కుంగడంతో కాలినడకన వెళ్తున్న భక్తులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, యాదాద్రి రోడ్డు కుంగడంతో కాలినడకన వెళ్తున్న భక్తులు

యాదగిరిగుట్టలో కుంగిపోయిన ఘాట్ రోడ్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అభివృద్ధి చేసిన యాదగిరిగుట్టలో వర్షం కారణంగా తీవ్ర నష్టమేర్పడింది.

కొత్తగా నిర్మించిన ఘాట్ రోడ్డు కొన్ని ప్రాంతాల్లో కుంగిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

భక్తులు కాలినడకన వెళ్లాల్సివచ్చింది. క్యూ లైన్లలోనూ వర్షం నీరు చేరింది. బస్ స్టాండ్‌లో పెద్దఎత్తున వర్షం నీరు చేరింది.

వీఐపీ ఘాట్ రోడ్డు కుంగిపోవడంతో అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం బయటపడిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆలయ అభివృద్ధికి కోట్లు ఖర్చుచేసినా పనుల్లో నాణ్యత లోపించిందన్న ఆరోపణలు వస్తున్నాయి.

యాదాద్రి మార్గంలో నిలిపిపోయిన బస్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, యాదాద్రి మార్గంలో నిలిపిపోయిన బస్

ఈ అంశాలపై యాదగిరిగుట్ట ఈవో కార్యాలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ విలేకరులతో మాట్లాడారు.

‘‘భారీ వర్షం వల్ల కలిగిన నష్టంపై ఆర్ అండ్ బి, ఆలయ అధికారులతో సమీక్షించాం. మూడో ఘాట్ రోడ్ వద్ద కేబుల్ వేసే పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా రోడ్డు పక్కనే గోతులు తవ్వారు , అనుకోకుండా భారీ వర్షం రావడం తో అందులోకి నీరు చేరి మట్టి కూలింది. దాంతో ఘాట్ రోడ్డు కుంగింది’’ అని ఆయన చెప్పారు.

క్యూ లైన్లలో నీరు చేరడంపై ఆయన మాట్లాడుతూ... కిటికీలు తెరవడం వల్లే నీరు చేరిందని చెప్పారు.

అనంతరం ఆలయ ఈవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మూడో ఘాట్ రోడ్డు కుంగిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

వర్షాలకు కూలిన చెట్లు

ఫొటో సోర్స్, ugc

జిల్లాలలో..

మంచిర్యాల, జగిత్యాల , యాదాద్రి భువనగిరి , మేడ్చల్ - మల్కాజిగిరితో పాటు మరికొన్ని జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది.

అకాల వర్షం కారణంగా రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. ధాన్యం తడిసి ముద్దవడంతో నష్టపోయామని రైతులు చెబుతున్నారు.

రంగారెడ్డి, కొమురం భీం ఆసిఫాబాద్, వికారాబాద్ , సంగారెడ్డి, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం , జైశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలలోనూ వర్షం ప్రభావం కనిపించింది.

ఈ జిల్లాలో మరో నాలుగు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

వీడియో క్యాప్షన్, యాదాద్రి: అలనాటి అనుభూతిని కలిగించే ఆధునిక నిర్మాణం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)