Nonuplets: ఒకే కాన్పులో జన్మించిన తొమ్మిది మంది ఏడాది తరువాత ఇప్పుడు ఎలా ఉన్నారు

ఫొటో సోర్స్, SALOUM ARBY
ప్రపంచంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ మాలి దేశంలో ఒకే తల్లి కడుపున, ఒకేసారి తొమ్మిది మంది పిల్లలు జన్మించారు. ఈ నెల 4న వాళ్లకు ఏడాది నిండింది. పిల్లలంతా చక్కగా ఆడుకుంటున్నారని ఈ తొమ్మిదిమంది పిల్లల తండ్రి అబ్దేల్ కాడర్ అర్బీ బీబీసీతో అన్నారు.
''వాళ్లలో కొందరు ఇప్పుడిప్పుడే పాకుతున్నారు. మరికొందరు లేచి నిలబడాలని చూస్తున్నారు. ఇంకొందరు ఏదో ఒకటి పట్టుకుని నడవడానికి ప్రయత్నిస్తున్నారు'' అని అర్బీ చెప్పారు.
అర్బీ మాలి సైన్యంలో పని చేస్తున్నారు. పిల్లలంతా ఇప్పటికీ మొరాకోలోని వారు జన్మించిన క్లినిక్ సంరక్షణలోనే ఉన్నారు. తల్లి హలీమా సిస్సే (26) కూడా ఆరోగ్యంగా ఉన్నారని అర్బీ తెలిపారు.
''వీళ్లందరి బాగోగులు చూడడం చిన్న విషయం కాదు. చాలాసార్లు అలసిపోతాం. కానీ, వీళ్లు ఆరోగ్యంగా అటూ ఇటూ పరుగులు పెడుతుంటే అన్ని బాధలు మర్చిపోతాం'' అని అర్బీ అన్నారు.
అర్బీ ఆరు నెలల తర్వాత మొదటిసారిగా మొరాకో వచ్చారు. అర్బీ, సిస్సే దంపతులకు ఈ తొమ్మిది మంది పిల్లల కన్నా ముందు ఒక కూతురు ఉంది. మూడేళ్ల వయస్సున్న ఆ బాలిక పేరు సౌదా.

ఫొటో సోర్స్, SALOUM ARBY
రికార్డ్ సృష్టించారు
''ఇంత పెద్ద కుటుంబాన్ని పొందినందుకు సంతోషంగా ఉంది. నా పిల్లలు, భార్యను చూస్తే ఆనందంగా ఉంది'' అన్నారు అర్బీ. ఈ తొమ్మిది మంది పిల్లలకు ఆసుపత్రిలోని నర్సులు చిన్న బర్త్‌డే పార్టీ ఏర్పాటు చేశారని అర్బీ వెల్లడించారు.
''ఒక ఏడాది గడిచింది. ఈ సంతోషకరమైన క్షణాలన్నీ ఒక జ్ఞాపకంలా ఉంటాయి'' అన్నారాయన.
ఒకే కాన్పులో తొమ్మిది మంది పుట్టి మనుగడ సాగిస్తున్న వారిగా వీరంతా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.
2021 మే 4న వీరు జన్మించడానికి ముందు స్పెషల్ కేర్ కోసం తల్లి సిస్సేను మాలి ప్రభుత్వం మొరాకోకు తరలించింది.
ఒకే కాన్పులో ఎక్కువమంది పిల్లలు జన్మించడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి నాలుగు పిండాలను కలిగి ఉన్న తల్లులు గర్భాన్ని తొలగించుకోవాలని అబార్షన్ చట్టబద్ధమైన దేశాలలో వైద్యులు సలహా ఇస్తుంటారు.

ఫొటో సోర్స్, Saloum Arby
ఒకేసారి ఎక్కువమంది సంతానంతో సమస్యలు
ఇలాంటి సందర్భాలలో కొంతమంది పిల్లలు నెలలు నిండకుండానే పుట్టడం, వారిలో సెప్సిస్, సెరిబ్రల్ పాల్సీ వంటి సమస్యలు రావడం లాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి.
సిస్సే, ఆమె పిల్లలు ప్రస్తుతం కాసాబ్లాంకాలోని ఐన్ బోర్జా క్లినిక్ యాజమాన్యానికి చెందిన ''మెడికలైజ్డ్ ఫ్లాట్'' లో నివసిస్తున్నారని పిల్లల తండ్రి అర్బీ వెల్లడించారు.
"ఇక్కడ నర్సులు ఉన్నారు, పిల్లలను చూసుకోవడంలో నా భార్యకు సాయం చేస్తున్నారు. క్లినిక్ వారికి ఒక మెనూ ఇచ్చింది. 24 గంటల్లో పిల్లలు తినడానికి ఎప్పుడు ఏమివ్వాలో అందులో ఉంటుంది'' అన్నారాయన.
పిల్లల్లో ఐదుగురు బాలికలు కాగా నలుగురు బాలురు. వాళ్లంతా 30 వారాల వయసులో జన్మించారు. బరువు 500 గ్రాముల నుంచి 1 కేజీ వరకు ఉండేదని ఐన్‌బోర్జా క్లినిక్ మెడికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ యూసఫ్ అలౌయి వారు జన్మించినన రోజున ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు. శస్త్రచికిత్స చేసి కాన్పు చేశారు.

ఫొటో సోర్స్, Saloum Arby
ప్రభుత్వం ఆదుకుంది
''వాళ్లు ఒక్కొక్కళ్లు ఒక్కో ప్రత్యేక లక్షణాలను ప్రదర్శిస్తున్నారు. కొందరు నిశ్శబ్దంగా ఉంటారు, మరికొందరు గొడవ చేస్తుంటారు. మరికొందరు ఏడుస్తుంటారు. ఇంకొందరు తమను ఎప్పుడూ ఎత్తుకుని ఉండాలని మారం చేస్తుంటారు'' అన్నారు అర్బీ.
తనకు సాయం చేసినందుకు మాలీ ప్రభుత్వానికి అర్బీ కృతజ్ఞతలు తెలిపారు.
''మాలి ప్రభుత్వం మాకు చేయాల్సినంత సాయం చేసింది. ఇంతమంది పిల్లలను పెంచడం అంత సులభం కాదు. ప్రభుత్వ సాయం మాకెంతో ఊరటనిచ్చింది'' అన్నారు అర్బీ.
''మేం మాలికి ఇంకా వెళ్లలేదు. కానీ, ఇప్పటికే వీరంతా మా దేశంలో ఫేమస్ అయ్యారు. మా కుటుంబం, స్నేహితులు, మా గ్రామం, మొత్తం దేశమంతా వారిని చూడటానికి చాలా ఆసక్తిగా ఉంది'' అని అర్బీ వ్యాఖ్యానించారు.
''పిల్లలు కలగలేదని బాధపడకండి. దేవుడు అందరికీ సంతానాన్ని ఇస్తాడు. మాలాగే తొమ్మిదేసి మంది పిల్లల్ని కనే సమయం కూడా రావచ్చు'' అన్నారు అర్బీ
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: 111 జీవో రద్దు ఎవరి కోసం... ఫామ్‌హౌస్‌ల స్థానంలో ఆకాశహర్మ్యాలు వస్తాయా?
- శ్రీలంక: సమైక్య నిరసనల వెనుక ఎందుకీ విభజన రేఖలు?
- టీవీ9 వర్సెస్ విష్వక్సేన్: సహనం కోల్పోయింది ఎవరు
- యాదగిరిగుట్టలో కుంగిన రోడ్డు, పాతబస్తీ వీధుల్లో పడవలు - భారీ వర్షాలకు ప్రజల ఇబ్బందులు
- ‘సిగ్గులేకుండా మా అమ్మ పాటను కాపీ చేశారు’ అంటున్న పాకిస్తాన్ గాయని
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












