భారతదేశంలో 'మినీ పాకిస్తాన్' ఏంటి... ఈ మాట ఎందుకు ఎక్కువగా వినిపిస్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
"నేను, నా తల్లిదండ్రులు ఇక్కడే పుట్టాం, పెరిగాం. ఇక్కడే పని చేశాం, ఇక్కడే చనిపోతాం. కానీ, చనిపోయే ముందు ఒక్క మాట వినాలనుకుంటున్నాం. మేం భారత్‌లోనే బతికాం, భారత్‌లోనే చనిపోతాం. మినీ పాకిస్తాన్‌లో కాదు.''
58 ఏళ్ల సాహిబా బీబీ ఈ మాటలు చెబుతుండగా, దిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో ఆమె నిల్చున్న ప్రాంతానికి సుమారు 150 మీటర్ల దూరంలో ఉన్న అనధికారిక భవనాన్ని బుల్‌డోజర్ కూల్చివేసింది.
ఒక అరంగట తరువాత, అదే ప్రాంతంలోని ఒక కాలనీలో సుదేశ్ కుమార్‌ను కలిశాను.
"రోడ్డుకు అవతలి వైపు మినీ పాకిస్తాన్ ఉంది. ఇప్పుడు అక్కడికి బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు కూడా వచ్చి స్థిరపడుతున్నారు. రాత్రి ఆలస్యంగా బయటకు వచ్చామంటే, అంతే సంగతులు. మీ మొబైల్ లాక్కోవడం ఖాయం" అని సుదేశ్ అన్నారు.
కొన్ని రోజుల కిందట ఈ ప్రాంతంలో మత హింస, ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం 'బలం'చూపిస్తోంది.
అక్కడి నుంచి తిరిగి వచ్చేసిన తరువాత కూడా నా చెవుల్లో 'మినీ-పాకిస్తాన్', 'బంగ్లాదేశ్ చొరబాటుదారులు' అనే పదాలు వినిపిస్తూనే ఉన్నాయి.
మనలో ఎంతమంది స్వాతంత్య్రానంతర భారతదేశంలో 'మినీ పాకిస్తాన్' లేదా 'బంగ్లాదేశీ కాలనీ' గురించి విని ఉంటారు? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పేర్లు విన్న జ్ఞాపకం ఉందా?
భారత స్వాతంత్ర్య పోరాటంలో దిల్లీకి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మేరఠ్ పట్టణం పోషించిన పాత్ర అద్భుతమైనది.
1857లో భారతదేశాన్ని పాలిస్తున్న ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా తొలిసారిగా తుపాకులు లేవనెత్తింది మేరఠ్ లోనే.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తరువాత, అదే మేరఠ్ లో కత్తెర్ల బజారు దగ్గర పనిచేస్తున్న రామ్ లాల్ తమ బంధువుల నుంచి తరచూ వినే మాటలు... ''నువ్వెందుకు రోజూ మినీ పాకిస్తాన్‌కు వెళతావు? ఇంత పెద్ద మేరఠ్‌లో నీకు మరెక్కడా పని దొరకలేదా?"
"ఇప్పుడు మేం చేతిపనులు చేసుకుంటున్నాం సార్. ముస్లింల దగ్గర పని చేస్తూ రోజు కూలీ తీసుకుంటున్నాం. వాళ్ల వీధుల్లోకి వెళ్లి పనిచేస్తే ఏం తేడా వస్తుంది? వాళ్ల వీధులని మినీ పాకిస్తాన్ అంటున్నారు. మా ఇళ్లల్లోకి లక్ష్మి అక్కడి నుంచే వస్తోంది" అన్నారు రామ్ లాల్ నవ్వుతూ.
రామ్‌లాల్ లాంటి వాళ్లకు ఎలాంటి పట్టింపూ లేనప్పుడు ఈ 'మినీ పాకిస్తాన్' లాంటి భావనలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి?
"పాకిస్తాన్ ఎందుకు ఏర్పడిందో, భారతదేశం భారతదేశంగానే ఎందుకు ఉందో తెలియనివారికి ఇదొక బహుమతిలా దొరికింది. మా చుట్టాలు కొందరు పాకిస్తాన్‌లో స్థిరపడ్డారు. వాళ్లు నాతో అంటుంటారు...సోదరా, నువ్వు లౌకికదేశంలో ఉన్నావు. మీకు అక్కడ అందరితో సమాన హోదా ఉంటుంది అని. కానీ, ఇప్పుడు వాళ్లకు నా పరిస్థితి దిగజారినట్టు కనిపిస్తుండవచ్చు" అని ప్రముఖ జర్నలిస్ట్, రచయిత సయీద్ నఖ్వీ అన్నారు.

ఫొటో సోర్స్, NITIN SRIVASTAVA/BBC
'మా వాళ్లు ', 'వాళ్ల వాళ్లు '
చరిత్రను పరిశీలిస్తే, భారత విభజన అంశం బ్రిటిష్ పాలనలోనే ఉధృతం కావడం స్పష్టంగా కనిపిస్తుంది. భారతదేశంలో ముస్లింల ప్రయోజనాలను కాపాడటానికి ముస్లిం లీగ్ స్థాపించారని చెబుతారు.
దేశంలోని అన్ని ప్రాంతాల్లో ముస్లింలకు 'ప్రత్యేక హక్కులు, రక్షణ కల్పించాలనే విషయంపై కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య ఒప్పందం కుదిరింది. అదే సమయంలో హిందూ మహాసభ ఏర్పాటయింది.
అయితే, ప్రాంతాలకు పేర్లు పెట్టడం లేదా 'బ్రాండింగ్' స్వతంత్రం రావడానికి ముందే మొదలైంది.
రాజకీయ విశ్లేషకురాలు నజీమా పర్వీన్, తన పుస్తకం కాంటెస్టెడ్ హోమ్‌ల్యాండ్స్: పాలిటిక్స్ ఆఫ్ స్పేస్ అండ్ ఐడెంటిటీలో, ప్రాంతాల మతపరమైన విభజన 'ఆధునిక విషయం' అంటారు. దానికి కారణాలనూ వివరించారు.
"భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం మతం ఆధారంగా ప్రాంతాలను గుర్తించింది. వారు మూడు రకాలుగా ప్రాంతాలను గుర్తించారు. హిందూ ప్రాంతం, ముస్లిం ప్రాంతం, మిక్స్‌డ్ జోన్. 1940లో విభజన స్వరం పెరుగుతూ వచ్చినప్పుడు, ఇదే ప్రాతిపదికన హిందూ దేశం లేదా పాకిస్తాన్ కావాలనే డిమాండ్ కూడా పెరిగింది.
దీనికి రాజధాని దిల్లీలోనే అతిపెద్ద ఉదాహరణ కనిపిస్తుంది.
దిల్లీలో కరోల్‌బాగ్, పహర్‌గంజ్, సబ్జీ మండి పరిసర ప్రాంతాలలో మైనారిటీలు నివసించేవారు. అయితే, పెద్ద సంఖ్యలో ముస్లిం జనాభా ఉండేది. విభజన తరువాత వాళ్లు అక్కడి నుంచి తరలి, తమ బంధువులు నివసిస్తున్న ప్రాంతాలకి వెళ్లాల్సి వచ్చింది.
మరోవైపు, పాకిస్తాన్ నుంచి వచ్చిన సిక్కు, హిందూ శరణార్థులకు నివసించే చోటు చూపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై పడింది.

ఫొటో సోర్స్, EPA/PRANABJYOTI DEKA
గమనించాల్సిన విషయం ఏమిటంటే, 'స్పెషల్ జోన్‌లు'గా పిలిచే ఈ ప్రాంతాలకు అప్పటి వరకు 'చట్టపరమైన చెల్లుబాటు' లేదు. ఎందుకంటే, వాటిని 'ఎమర్జెన్సీ' సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటుచేశారు.
భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత నెహ్రూ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ విభజనకు దాదాపు 24 ఏళ్ల ముందే రాబోయే రోజుల గురించి విచారం వ్యక్తం చేశారు. విభజన తరువాత "రెండు దేశాల్లో మైనారిటీల పరిస్థితి" గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇండియన్ పొలిటికల్ సైన్స్ జర్నల్‌లో ప్రచురించిన 'మౌలానా అబుల్ కలాం ఆజాద్: ఎ క్రిటికల్ అనాలిసిస్, లైఫ్ అండ్ వర్క్' వ్యాసంలో, 1923 కాంగ్రెస్ పార్టీ సెషన్‌లో మౌలానా ఆజాద్ ప్రసంగాన్ని ఉటంకించారు.
"మేఘాల మధ్య నుంచి ఒక దేవదూత వచ్చి.. భారతదేశానికి స్వతంత్రం వస్తుంది, కానీ, హిందూ, ముస్లింల మధ్య ఐక్యత పోతుంది అని చెప్తే, నేను హిందూ-ముస్లింల ఐక్యతనే కోరుకుంటాను. భారతదేశ స్వాతంత్ర్యాన్ని త్యజిస్తాను" అన్నారు మౌలానా ఆజాద్.
ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ ఇలా అంటారు.
"విభజన జరిగిన తరువాత, మావాళ్లు, వాళ్ల వాళ్లు అనే మాటలు వినిపించేవి. పాకిస్తాన్ నుంచి వచ్చిన సిక్కు, హిందూ జనాభా 'మావాళ్లు' అయ్యేవారు. పాకిస్తానీ ముస్లింలు 'వాళ్ల వాళ్లు ' అయ్యేవారు. యాంటీ-ఇండియా లేదా ప్రో-ఇండియా అలాగే, యాంటీ-పాకిస్తాన్ లేదా మినీ-పాకిస్తాన్ వంటి పదాలు ఇప్పుడు సర్వసాధారణంగా మారుతున్నాయి. కానీ, 1947 విభజనకు ముందు కూడా ముస్లిం లీగ్, హిందూ మహాసభల ప్రసంగాల్లో, చర్చల్లో ఇలాంటి పదాలు వినిపించేవి. సర్దార్ పటేల్, జవహర్‌లాల్ నెహ్రూ ఈ విషయాలపై చర్చించేందుకు గాంధీజీ వద్దకు వెళుతుండేవారు. తమ అభిప్రాయాలు వెలిబుచ్చేవారు'' అని హబీబ్ వివరించారు.

ఫొటో సోర్స్, NITIN SRIVASTAVA/BBC
అప్పుడు, ఇప్పుడు
2013 సంవత్సరానికొద్దాం..
ప్రపంచంలోని గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన సచిన్ టెండూల్కర్ ముంబైలో వెస్టిండీస్‌తో తన చివరి టెస్టు ఆడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ వారం మొత్తం సచిన్ రిటైర్మెంట్ హాట్ టాపిక్‌గా మారింది. క్రికెట్ మతాలను, కులాలను ఎలా ఏకం చేసిందో చెబుతూ విశ్లేషకులు వ్యాసాలు రాశారు.
టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు, ముంబైలోని ఓ స్థానిక వార్తాపత్రికలోని ఒక చిన్న వార్త పడింది.."ఛోటా పాకిస్తాన్, థానేలోని బంగ్లాదేశ్ పై దర్యాప్తు జరుగుతుంది" అన్నది దాని హెడ్‌లైన్.
ముంబై, థానే మధ్య ఒక ప్రాంతం ఉంది. దాన్ని నాలాసోపారా అని పిలుస్తారు. ఇక్కడ సుమారు 1000 మురికివాడలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ మంది ముస్లింలు నివసిస్తున్నారు. 2012-2013 మధ్యలో ఈ ప్రాంత వాసులకు కరెంటు బిల్లులు పంపించేటప్పుడు చిరునామా "ఛోటా పాకిస్తాన్" అని రాశారు.
కొన్ని రోజుల తరువాత, ముంబైలోని మీరా-భయందర్ ప్రాంతంలో ఉన్న గాంధీనగర్ కాలనీలో ఒక నవజాత శిశువు జనన ధ్రువీకరణ పత్రంపై "బంగ్లాదేశ్ మురికివాడ" అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ విషయాలు బయటకు పొక్కాయి. మీడియాలో దీని గురించి వార్తలు రావడం మొదలెట్టాయి. వెంటనే "కఠిన చర్యలు" తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
కానీ, ఈ రెండు ప్రాంతాలను వ్యవహారికంలో అలాగే పిలుస్తున్నారు. 2012-2013లో ప్రభుత్వ పత్రాల్లో "పొరపాటున" ఈ పేర్లు నమోదు చేశారు.
"నేను చిన్నతనంలో జౌన్‌పూర్, సుల్తాన్‌పూర్‌లోని కొన్ని ప్రాంతాలను ముస్లిం బస్తీ లేదా ముస్లిం కాలనీ అనడం విన్నాను. ముంబై వచ్చాక డ్రైవింగ్, రోడ్‌లను గుర్తించడంలో ఒక నెల అనధికారిక శిక్షణ తీసుకున్నా. ఆ సమయంలో.. ఇది లాడెన్ నగర్, అక్కడ ఛోటీ పాకిస్తాన్ గుండా వెళితే మీ పర్స్ కొట్టేస్తారు లాంటి మాటలు వినబడేవి. ఇప్పటికీ అదే మాట అంటున్నారు" అని మనీష్ అనే వ్యక్తి చెప్పారు.ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కు చెందిన మనీష్ యాదవ్ గత 15 ఏళ్లుగా ముంబైలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.
మరోవైపు, భారతదేశంలో "విభజన ద్వారా సాధించాలనుకున్నది పూర్తిగా సాధించలేకపోయాం" అనే ఆలోచన కూడా కొంతమందికి ఉంది.
రచయిత, జర్నలిస్ట్, మాజీ బీజేపీ ఎంపీ, ఉపాధ్యక్షుడు బల్బీర్ పుంజ్ ఏమంటారంటే.. పాకిస్తాన్ కావాలనే డిమాండ్ ఎక్కడ నుంచి వచ్చింది? పాకిస్తాన్‌లోని లాహోర్ లేదా పెషావర్ ప్రాంతాల నుంచి వచ్చింది కాదు. 90 శాతం డిమాండ్ ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల ముస్లింలు నుంచి వచ్చినదే. కానీ, విభజన తరువాత వారు అక్కడకు వెళ్లనే లేదు. వాళ్ల మైండ్‌సెట్ అలాగే ఉంది, మనుషులూ అలాగే ఉన్నారు. వాళ్లు రెండే పనులు చేశారు. ఇంటి ముందు ముస్లిం లీగ్ బ్యానర్ తీసేసి కాంగ్రెస్ బ్యానరు పెట్టుకున్నారు. రెండోది, 1930, 1940లలో కాంగ్రెస్‌ను ఎలా తిట్టేవారో ఇప్పుడు బీజేపీని అలా తిడుతున్నారు".
నిజానికి, బల్బీర్ పుంజ్ వాదన 2014 కు ముందు నుంచే రాజకీయ-సామాజిక వర్గాల్లో చర్చగా నడుస్తోంది.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశంలోని మైనారిటీ సమాజం ఒకింత 'అసౌకర్యానికి' గురవుతోందనే చర్చ జరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
మైనారిటీల ఆందోళన
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గోసంరక్షణ, గోహత్య కేసుల్లో చాలా మంది ముస్లింలు టార్గెట్ అవుతున్నారనే చర్చ జరుగుతోంది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోకి వచ్చినప్పటి నుండి, అది ఎన్నార్సీ, సీఏఏ లాంటి చట్టాలను తీసుకొచ్చింది. దాని ద్వారా 'జాతీయవాదం' అనే కొత్త స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నించింది.
మతపరమైన ఉద్రిక్తతలు, అల్లర్లు జరిగినప్పుడల్లా ''ముస్లింలను పాకిస్తాన్‌కు పంపండి'' లేదా ''బర్మా సరిహద్దుల అవతల ఉన్న రోహింగ్యా శరణార్థులను తరిమికొట్టండి" అనే మాట పదే పదే వినిపిస్తుంది.
ఈ పరిస్థితుల్లో దేశంలో నివసిస్తున్న 25 కోట్ల మందికి పైగా మైనారిటీలలో కూడా అశాంతి పెరిగింది.
''చొరబాటుదారులను పంపించివేసే ఎన్నార్సీ, మినీ పాకిస్తాన్ లాంటి వాటి విషయంలో మానవత్వం ముందుండాలి. ఆ తర్వాతే హిందూ-ముస్లిం అనే మాట రావాలి'' అంటారు ప్రొఫెసర్ అర్చన గోస్వామి. ఆమె వారణాసిలోని కాశీ విద్యాపీఠ్‌లో హిస్టరీ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
దేశ విభజన జరిగి యాభై ఏళ్లు గడుస్తున్నా, విభజన రాజకీయాలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయని ఆమె ప్రశ్నించారు. దీని వెనుక ప్రజల ఓట్లతో ప్రజాప్రతినిధులైన నేతలు ఉన్నారు. అలాగని సామాన్య ప్రజలను వీరికి మద్ధతు పలుకుతున్నారని వాదించడం అతిశయోక్తి అవుతుందని ఆమె అన్నారు.
'' సామాన్యుడు సంపాదించడానికి, తినడానికి నానా కష్టాలు పడుతున్నాడు. మినీ పాకిస్తాన్, గుడి మసీదు వివాదాలు రగిలించేబదులు, సామాజిక, ఆర్థిక సమస్యపై మరింత శ్రద్ధ అవసరం'' అన్నారామె.

ఫొటో సోర్స్, Getty Images
వాస్తవం ఏమిటంటే భారతదేశంలోని అనేక తరాలు 'మినీ-పాకిస్తాన్' లేదా 'బంగ్లాదేశ్ కాలనీ' వంటి ఆలోచనలను చూస్తూ, వింటూ పెరిగాయి.
మహారాష్ట్రలోని పెద్ద నగరాల్లో ఔరంగాబాద్ కూడా ఒకటి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇక్కడి జనాభాలో మైనారిటీ ముస్లింలు 31% ఉన్నారు. ఔరంగాబాద్‌కు హిందూ వర్సెస్ ముస్లిం, మరాఠా వర్సెస్ దళిత్ అల్లర్ల చరిత్ర ఉంది.
"నగరంలోని చాలా ప్రాంతాలు మతం, పని ఆధారంగా విభజించి ఉన్నాయి. నా చిన్నతనంలో ముస్లిం ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం ఉండేది కాదు.స్కూల్, ట్యూషన్, మార్కెట్, థియేటర్ ఇలా అన్నీ నేను ఉండే ప్రాంతంలోనే ఉండేవి. కాలేజీకి వెళుతున్నప్పుడు, మాత్రం ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చేది. అక్కడికి వెళ్లినప్పుడు నేను వేరే చోటికి వచ్చానని అనిపించేది. మరాఠీ భాషలో కాకుండా ఉర్దూలో పచ్చజెండాలు వేసి బోర్డులు ఉండేవి. పచ్చజెండాలు, చంద్రుడు నక్షత్రాలు పాకిస్తాన్ గుర్తులని ప్రచారం జరిగేది. కానీ, ఇది నిజం కాదు. ఈ రకమైన ఆలోచనలు ఎందుకు పుడతాయో అనిపిస్తుంది'' అని బీబీసీలో నా సహచరుడు, సీనియర్ జర్నలిస్ట్ ఆశిష్ దీక్షిత్ అన్నారు. ఆయన ఔరంగాబాద్‌లోనే పుట్టి పెరిగారు.
సమాజంలో మతపరమైన దూరాలు పౌర భాగస్వామ్యం ద్వారానే సాధ్యమవుతాయని ప్రొఫెసర్ అశుతోష్ వర్ష్నే అన్నారు. ఆయన
అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆయన "ఎత్నిక్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ సివిక్ లైఫ్:హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఇన్ ఇండియా" అనే పుస్తకం రాశారు.
''వ్యాపార సంస్థలు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, వృత్తిపరమైన సంస్థలు పౌరులలో భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రయత్నాలు చేస్తే కుల హింసను నిరోధించవచ్చు. అలా చేయడం వల్ల మతం కోసం హిందూ, ముస్లింల మధ్య వివక్ష చూపే శక్తివంతమైన రాజకీయ నాయకులను కూడా నిరోధించవచ్చు'' అని ఆయన పేర్కొన్నారు.
గుజరాత్‌ను ఉదాహరణగా తీసుకుంటే, ఇక్కడ అనేక మతపరమైన అల్లర్లు జరిగాయి. రాజధాని అహ్మదాబాద్‌లోని జుహాపురాలో 'మినీ-పాకిస్తాన్'గా పిలిచే ముస్లిం మెజారిటీ ప్రాంతం ఉంది. పక్కనే హిందువులు మెజారిటీగా ఉన్న వేజల్‌పూర్‌కు, జుహాపురా మధ్య ఉన్న రహదారిని 'వాఘా సరిహద్దు'గా స్థానికులు పిలుస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
చిరునామాలో పాకిస్తాన్
2015లో మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరు యువకులు ఇక్కడ పరస్పర ఘర్షణ పాడ్డారు. వారిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో వారి చిరునామా 'పాకిస్తాన్' అని రాసి ఉంది.
''ఫిర్యాదు నమోదు చేసే సమయంలో కొన్నిసార్లు ఫిర్యాదుదారు లేదా ఫైల్ చేసే వ్యక్తి పొరపాట్లు చేస్తుంటారు. ఆ లోపాన్ని వెంటనే సరిచేశాం' అని అప్పటి హోంశాఖ కార్యదర్శి జీఎస్ మాలిక్ అన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ లోని అజంగఢ్ జిల్లాలో సంజర్‌పూర్‌లో ఒక ప్రాంతం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం, ఆ ప్రాంతంలోని చాలా మంది యువకులపై జాతీయ భద్రతా చట్టం, పోటా వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు పెట్టారు. దీంతో అక్కడ చాలా ఆందోళనలు కూడా జరిగాయి.
ఈ కేసులు సంజర్‌పూర్‌లోని కొన్ని కుటుంబాలకు సంబంధించినవి. అయితే ఈ కేసుల కారణంగా ఆ ప్రాంతంలో ఉండే ఇతర ఇళ్లల్లో పెళ్లిళ్లు ఆగిపోయాయి. యువకులు వేరే నగరంలో ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే వేరే వేరే అడ్రస్ ఇస్తేనే వారికి ఇల్లు దొరికేది.

ఫొటో సోర్స్, Getty Images
'సంజర్‌పూర్ నుంచి పాకిస్తాన్‌లోని ఐఎస్‌ఐకి ఎప్పుడు వెళ్లామో తెలియడం లేదు' అని గ్రామానికి చెందిన నేత ఇమ్రాన్ కజ్మీ అన్నారు.
"ఇలాంటి వాదనలు చేయడం వల్ల కొన్ని కమ్యూనిటీలు సంక్షోభానికి గురవుతాయి. వారి ఉద్యోగాలు పోతాయి. ముస్లింలకు ఇల్లు అద్దెకు ఇవ్వడం ప్రమాదకరమని, రేపు తమకు ఏం ప్రమాదం వస్తుందోనని యజమానులు భయపడతారు'' అని చరిత్రకారుడు ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్ అన్నారు.
"దేశ రాజకీయ వ్యవస్థను నడపడంలో మతానికి స్థానం లేదని భారత రాజ్యాంగంలో రాసి ఉంది. అలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా మైనారిటీకి మాత్రమే కాకుండా మెజారిటీ జనాభాకు కూడా హాని కలిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే అప్పుడు అందరూ మతం చెప్పే మాటలే వింటారు. జ్ఞానం ఏం చెబుతుందో ఎవరు వింటారు'' అన్నారు హబీబ్.
ఇవి కూడా చదవండి:
- టీవీ9 వర్సెస్ విశ్వక్ సేన్: సహనం కోల్పోయింది ఎవరు
- భారత్‌లో ఉద్యోగాల్లో మహిళలు తగ్గిపోతున్నారా? కారణాలు ఏంటి?
- ఎలాన్ మస్క్: ట్విటర్ కొత్త యజమానిని ఇబ్బందుల పాలు చేసిన ఆరు సొంత ట్వీట్లు
- హీట్‌వేవ్: తెలంగాణకు ఎల్లో అలర్ట్.. వడదెబ్బ తగిలిందని ఎలా తెలుస్తుంది
- నాన్న ఆఫీస్‌కు వెళ్లాడని అమ్మ కారు తాళాలు తీసుకుని ఈ నాలుగేళ్ల పిల్లాడు ఏం చేశాడంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















