"మనల్ని కాపాడేది ప్రకృతి మాత్రమే. కానీ, ముందు మనం దానిని కాపాడాలి" - ఐపీసీసీ నివేదికలో 5 ముఖ్యమైన అంశాలు

పర్యావరణం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మాట్ మెక్‌గ్రాత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో వాతావరణ మార్పులకు కారణాలు, ప్రభావాలు, పరిష్కారాలను సూచించింది.

పెరుగుతున్న భూతాపం, భూమి మీద జీవరాశులన్నింటినీ ప్రభావితం చేస్తోందని ఈ నివేదికలో సూచించారు.

ఐపీసీసీ నివేదికలో అయిదు ముఖ్యాంశాలివి.

వీడియో క్యాప్షన్, పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బిల్డింగ్ బ్లాక్స్‌తో పగడాలను కాపాడుతున్నారు ఇలా..

1. మనం ఊహించిన దానికన్నా పరిస్థితులు దిగజారాయి

గ్రీన్‌లాండ్ మంచు ఫలకం కరగడం నుంచి, కోరల్ దిబ్బల విధ్వంసం వరకు శాస్త్రవేత్తలు ఊహించిన దాని కన్నా ఎక్కువ స్థాయిలో వాతావరణ మార్పుల ప్రభావాలు ఉన్నాయి. గతంలో ఐపీసీసీ అంచనా వేసిన దానికన్నా వేగంగా భూమి మార్పులకు లోనవుతోంది.

ప్రపంచంలో 40 శాతం జనాభాకు వాతావరణ మార్పుల వలన కలిగే "ముప్పు అధికంగా" ఉంది. అయితే, ఈ సమస్య తలెత్తడానికి ఎక్కువ కారణం కాని వారిపైనే అధిక భారం పడనుంది.

"ఆఫ్రికాలో మొక్కజొన్న సాగు చేసే భూముల్లో 30 శాతం నిస్సరమైపోతాయి. బీన్సుకు ఇది 50 శాతం. అంటే ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా ఆఫ్రికాలో ప్రాంతాలు నివాసయోగ్యం కాకుండా పోతాయి. మనకు ఎక్కువ సమయం లేదు. ఈ మార్పును నిరోధించడానికి చర్యలను తక్షణమే చేపట్టాలని ఐపీసీసీ నివేదిక పేర్కొంది" అని గ్లోబల్ సెంటర్ ఆన్ అడాప్టేషన్ సీఈఓ పాట్రిక్ వెర్కూయిజెన్ బీబీసీతో చెప్పారు.

2. హాని, నష్టం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు

ధనిక దేశాలు హాని, నష్టాలను తీవ్రంగా పరిగణించేలా చేయాలని చాలా సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఉదారణకు సముద్ర మట్టం పెరుగుదల లాంటి వాటిని, మెల్లగా జరిగేవి.

అయితే చాలా కాలంగా ఇది వివాదాస్పదంగా ఉంది. ఎందుకంటే, ఇది దీర్ఘకాల కర్బన ఉద్గారాలతో ముడిపడి ఉంది.

ఈ విషయంలో తమను కోర్టుకు లాగుతారని, తమ విధానాల వలన వర్తమానంలో, భవిష్యత్తులో జరిగే హాని, నష్టాలకు నిరవధికంగా జరిమానా చెల్లించాల్సి వస్తుందని ధనిక దేశాలు భయపడుతున్నాయి.

హాని, నష్టాలకు ప్రత్యేక నిధుల సౌకర్యాన్ని అమెరికా, యూరోపియన్ యూనియన్ నిరోధించడంతో గ్లాస్గోలో జరిగిన కాప్ 26 సమావేశంలో ఈ అంశంలో రాజకీయ పురోగతి నిలిచిపోయింది.

ఫలితంగా, "ప్రకృతి, ప్రజలపై విస్తృతమైన ప్రతికూల ప్రభావాలు, నష్టాలు" ఉంటాయని ఐపీసీసీ స్పష్టపరిచింది.

పర్యావరణం

ఫొటో సోర్స్, Getty Images

3. సాంకేతికతే అడ్డంకి

భూతాపాన్ని పరిమితం చేయడానికి లేదా కర్బన ఉద్గారాలను తగ్గించడానికి రూపొందించిన కొన్ని టెక్నాలజీల వల్ల పరిస్థితులు మెరుగుపడడం అటుంచి, మరింత దిగజారిపోతాయని ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది.

"వాతావరణం నుంచి CO2ను తొలగిస్తే మరో రూపంలో అది వాతావరణంలోకి వస్తుంది. సముద్రాలు, భూ రిజర్వాయర్ల నుంచి వాయువులు బయటకు వస్తాయి" అని హెన్రిచ్ బాల్ ఫౌండేషన్‌కు చెందిన లిండా ష్నైడర్‌ అన్నారు. లిండా ఐపీసీసీ చర్చల్లో అబ్జర్వర్‌గా ఉన్నారు.

4. నగరాలపై ఆశ ఉంది

పెద్ద పెద్ద నగరాలు వాతావరణ మార్పులకు హాట్‌స్పాట్‌లు అయినప్పటికీ, వాతావరణ ప్రభావాలను తగ్గించడానికి అవి కొంత సహాయపడవచ్చు.

నగరాలు విస్తరిస్తున్న కొద్దీ పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ రవాణా, గ్రీన్ భవనాలను పెంపొందించవచ్చు. ఇది కొంతవరకు పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకుంటుంది.

వీడియో క్యాప్షన్, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వచ్చే లావా సముద్రంలో కలిస్తే ఏం జరుగుతుంది?

5. ఎక్కువ సమయం లేదు

పరిస్థితులు దిగజారుతున్నప్పటికీ, మనం వెంటనే స్పందిస్తే విధ్వంసాన్ని అరికట్టవచ్చని నిపుణులు అంటున్నారు.

ఈ అవకాశం ఈ దశాబ్దంలో మాత్రమే ఉంటుందని, తక్షణమే చర్యలు చేపట్టకపోతే వచ్చే దశాబ్దం చాలా ఘోరంగా ఉంటుందని ఐపీసీసీ హెచ్చరించింది.

"అంతర్జాతీయ స్థాయిలో చర్యలు ఎంత ఆలస్యమైతే, అంత త్వరగా మనం విధ్వంసానికి చేరువవుతాం."

కర్బన ఉద్గారాలను వీలైతే త్వరగా తగ్గించాలి. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించడమే కాకుండా విద్య, వైద్య సదుపాయాలు, సామాజిక న్యాయం మెరుగుపరచడం కూడా అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ మార్పుల పట్ల అవగాహన పెంచడానికి ఇవన్నీ తోడ్పడతాయని వారు భావిస్తున్నారు.

ప్రకృతిని కాపాడడంపై దృష్టి పెట్టడం కూడా చాలా ముఖ్యం.

"మనల్ని కాపాడేది ప్రకృతి మాత్రమే. కానీ, ముందు మనం దాన్ని కాపాడాలి" అని ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రాం హెడ్ ఇంగర్ ఆండర్సన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)