Colorado: మంచుతో వ్యవసాయం చేస్తున్న రైతులు.. ఇక్కడ ఏం పెరుగుతుందంటే..

స్విట్జర్లాండ్ ఆఫ్ అమెరికా

ఫొటో సోర్స్, Margaret Hedderman

    • రచయిత, మార్గరెట్ హెడెర్‌మ్యాన్
    • హోదా, బీబీసీ ట్రావెల్

యూరే.. "స్విట్జర్లాండ్ ఆఫ్ అమెరికా"గా ప్రఖ్యాతి గాంచింది. మంచు పర్వతాలను అధిరోహించేందుకు ఇక్కడికి పర్యటకులు పెద్దయెత్తున వస్తుంటారు. ఇక్కడ మంచు జలపాతాలను కృత్రిమంగా సృష్టిస్తుంటారు. ఆ విశేషాలేమిటో చూద్దాం.

ప్రారంభానికి ముందే కొంతమంది పర్యటకులు పార్క్‌లోకి ప్రవేశించారని ఒక వదంతి అక్కడ వ్యాపిస్తోంది. దీంతో విచారణ చేపట్టడానికి కొలరాడోలోని యూరే ఐస్ పార్క్‌లో ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న పీట్ డేవిస్ హుటాహుటిగా బయలుదేరారు. నేను కూడా ఆయన వెంట వెళ్లాను.

మా కాళ్ల కింద కొండ చరియలు, గడ్డకట్టిన మంచు పలకలు ఉన్నాయి. ఇక్కడకు వచ్చిన పర్యటకులు, సిబ్బంది అందరూ పార్క్‌‌ను ఎప్పుడు ప్రారంభిస్తారా అంటూ ఎంతో ఆత్రుతగా చూస్తున్నారు. కానీ ఈ పార్క్ ప్రారంభం మరో మూడు రోజులు వాయిదా పడింది.

అన్‌కాంపాగ్రే నది తీరంలో ఈ యూరే ఐస్ పార్క్ ఉంటుంది. అమెరికాలో నైరుతి భాగంలో విస్తరించివున్న రాకీ పర్వతాల అంచున, ఎంతో అందమైన పకృతి సోయగాల నడుమ యూరే అనే చారిత్రక మైనింగ్ పట్టణం ఉంది. అవుట్ డోర్ వినోద కేంద్రంగా ఇది ప్రఖ్యాతి గాంచింది. దీనినే "స్విట్జర్లాండ్ ఆఫ్ అమెరికా" అని కూడా పిలుస్తారు.

స్విట్జర్లాండ్ ఆఫ్ అమెరికా

ఫొటో సోర్స్, Margaret Hedderman

పైకి ప్రవహించే మంచు..

మేం లోయలోకి వెళ్లినప్పుడు, అక్కడ ఉన్న సిబ్బంది పార్క్ ప్రారంభించడానికి ముందు చేయాల్సిన ప్రాజెక్ట్ పనులు చేస్తూ హడావుడిగా పరిగెడుతూ కనిపించారు. దారి ఎటువైపో చూపించే సైనేజ్ బోర్డులు అక్కడ ఉన్నాయి. మంచు పార్క్‌ కోసం ఒక కొత్త వంతెన కూడా నిర్మించారు. దీని కోసం మరింతగా మంచు గట్టిపడాల్సిన అవసరముంది. యూరే ఐస్ పార్క్‌లోని అన్ని జలపాతాలు పూర్తిగా మనుషులు సృష్టించినవే. వీటి కోసం "మంచు రైతుల" బృందం పనిచేస్తోంది.

కొండ అంచున ఉన్న నీటి పైపులు, నీటిని వెదజల్లే స్ప్రింక్లర్లను ఆయన నాకు చూపించారు. అక్కడ 200కుపైగా స్ప్రింక్లర్లు ఉన్నాయి. ఇవి నేరుగా పెద్ద రాతి బండలపై నీళ్లు చల్లుతాయి. ఇవి100కు పైగా మంచు గోడలను సృష్టిస్తున్నాయి.

నవంబరు నెలలో ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు, మంచు రైతులు రాళ్లపై నీళ్లు ప్రవహించేలా చేస్తారు. ఇవి జలపాతాలను సృష్టించేదుకు అనువైన పరిస్థితులను కల్పిస్తాయి.

మంచు గడ్డ కట్టే వాతావరణంలో, అతి భయంకరమైన చలిలో, ఎంతో శారీరక శ్రమతో ఇక్కడ సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే, ఇక్కడ మంచు పెంచడాన్ని ఒక కళగా డేవిస్ అభివర్ణించారు.

"ఎందుకంటే ఇవి సహజ సిద్ధంగా ఏర్పడ్డ మంచు కొండలు, జలపాతాలు కావు కాబట్టి ". మీకు తెలుసా, ఇక్కడ పర్వత మంచు పైకి ప్రవహిస్తూ ఉంటుంది.

స్విట్జర్లాండ్ ఆఫ్ అమెరికా

ఫొటో సోర్స్, Margaret Hedderman

రెండు విధాలుగా..

సాధారణంగా అయితే, జలపాతాలు గడ్డకట్టడం లేదా పెద్ద పెద్ద బండ రాళ్ల పైనుంచి నీరు ప్రవహించడంతో పైకి ఎక్కేందుకు అనువైన మంచు జలపాతాలు ఏర్పడతాయి. ఈ పార్కులో ఇలాంటి రెండు రకాల మంచు జలపాతాలనూ సృష్టించారు.

ఇక్కడ రెండేళ్ల నుంచీ మంచు రైతుగా పనిచేస్తున్న స్టీవ్ ఇమాఫ్ మాతో మాట్లాడారు. ''ఇక్కడ పైప్ వాల్వ్‌లు సక్రమంగా పని చేసే విధంగా చూడటం, పర్యటకులను ఉల్లాస పరిచే విధంగా పార్క్‌ను సృష్టించడమే మా పని''అని ఆయన చెప్పారు.

"ఇక్కడకు పర్యటకులు వచ్చే ముందే, నీటిని ఆపివేయడం మా మెదటి పని" అని ఇమాఫ్ చెప్పారు.

ఇక్కడ ఐస్ ఫార్మర్‌గా విధులు నిర్వహిస్తున్న వారిలో సగం మంది పార్కులో ఐస్ గోడలు, జలపాతాలు సృష్టిస్తుంటారు.. మిగిలిన సగం మంది నీటి పైపుల నిర్వహణ, మరమ్మత్తు లాంటి పనులు చేస్తుంటారు.

స్విట్జర్లాండ్ ఆఫ్ అమెరికా

ఫొటో సోర్స్, Margaret Hedderman

పర్వత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పైపులు మంచుతో గడ్డకట్టి, విరిగిపోయే అవకాశం ఉంటుంది. గత ఏడాది, చెట్ల మధ్య పర్వతాలపై ఏర్పాటు చేసిన 150 అడుగుల పైప్ లైన్‌లో మంచు గడ్డకట్టి రెండు సార్లు నీళ్లు రాకుండా స్తంభించాయి. వాటిని తొలగించడానికి పైపులు మరమ్మత్తు చేయడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియకు దాదాపు నాలుగు రోజుల సమయం పట్టింది.

చాలా సీజనల్ ఉద్యోగాల మాదిరిగానే, పార్కు మూసివేసినప్పుడు మంచు వ్యవసాయం ముగుస్తుంది. ఈ సీజన్ అయిపోయాక కొంత మంది రైతులు యూరే నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్లి పని చేస్తుంటారు. సారా గుడ్‌నో ఒక మంచు రైతు. ఆమె సంవత్సరంలో ఆరు నెలలు మంచు రైతుగా, ఆ తర్వాత వైల్డ్‌ల్యాండ్ ఫైర్‌ఫైటర్‌గా పని చేస్తుంటారు. ఆమె నిజంగా ఒక సంవత్సరాన్ని అగ్ని కాలంగా, మంచు కాలంగా విభజించుకొని ఉద్యోగం చేస్తుంటారు. సంవత్సరంలో ఆ రెండు ఉద్యోగాలు చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు.

ఇతర రైతులు రోప్ యాక్సెస్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. పార్క్‌లో పూర్తి కాలపు బాధ్యత‌లు స్వీక‌రించ‌క ముందు డేవిస్ పురావస్తు శాస్త్రవేత్తగా పని చేశారు.

డేవిస్, నేను ఒక మైలు పొడవైన పార్క్ మెత్తం పరిశీలిస్తూ చివరి వరకు వెళ్లాం. అక్కడ అక్రమంగా ప్రవేశించిన పర్వత అధిరోహకులు ఎవరూ కనిపించలేదు. అప్పుడే అదొక వదంతి అని నాకు అనిపించింది.

స్విట్జర్లాండ్ ఆఫ్ అమెరికా

ఫొటో సోర్స్, Margaret Hedderman

పరిస్థితులు అనుకూలించలేదు...

పార్క్ ప్రారంభించాల్సిన సమయం దగ్గర పడుతుండటంతో డేవిస్ మంచును సంరక్షించడంలో చాలా అప్రమత్తంగా ఉన్నారు. కానీ డేవిస్‌కు వాతావరణం అనుకూలించడం లేదు. ఈ శీతాకాలం ఎప్పుడూ లేని విధంగా చాలా వెచ్చగా ఉంది. అంతేకాదు డిసెంబర్ నెలలో కూడా ఉష్ణోగ్రతలు మంచు గడ్డలు కట్టేందుకు తగినంత చల్లగా లేవు. దానికి తోడు పార్క్ ప్రారంభించడానికి ఒక రోజు ముందు భారీ వర్షం కురిసింది. దీంతో మంచు రైతుల 30% కృషి వృథాగా పోయింది.

"కృత్రిమంగా భారీ స్థాయిలో మంచును నిర్మించడం ప్రతి సంవత్సరం సాధ్యం కాకపోవచ్చు, కానీ ఐస్ పార్క్ నిర్మించగలిగే సంవత్సరాలలో ప్రజలు చాలా ఆంనదాన్ని పొందుతారు. చాలా మందికి జీవనోపాధి కూడా దొరుకుతుంది'' అని ప్రొఫెసర్ తెలిపారు.

ఎట్టకేలకు పార్క్ గేట్లు తెరిచారు. గతంలో కంటే ఎక్కువగా పర్యటకుల రద్దీతో పార్క్ సందడిగా మారింది. మంచు పర్వతాన్ని ఎప్పుడెప్పుడు ఎక్కుదామా అని ఎదురు చూస్తున్నా వారిని తీసుకెళ్ళడానికి ఆ రోజు ఉదయమే మంచు రైతులు వచ్చారు.

మెత్తంగా ఈ సీజన్‌లో 20,000 మందికి పైగా పర్యటకులు వచ్చే అవకాశం ఉంది. మంచు అధిరోహణపై రోజురోజుకు ప్రజలలో ఆదరణ పెరుగుతోందని యూరే ఐస్ పార్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీటర్ ఓ నీల్ తెలిపారు.

"ఇది అందరికీ అందుబాటులో ఉండటం వలన క్రీడారంగం అభివృద్ధికి సహాయపడుతుంది" అని ఓ నీల్ చెప్పారు. మా కాలంలో స్కీయింగ్, స్నోబోర్డింగ్ కోసం ఎన్నో గంటల పాటు కాలినడక నడవాల్సి వచ్చేది"అని ఆయన వివరించారు.

స్విట్జర్లాండ్ ఆఫ్ అమెరికా

ఫొటో సోర్స్, Margaret Hedderman

లీకేజీలతో జలపాతాలు..

1980లో అన్‌కాంపాగ్రే జార్జ్‌ నదిలోని జలవిద్యుత్ పైపులలో కొన్ని లీకేజీల వల్ల నగరానికి సమీపంలో జలపాతాలు ఏర్పడ్డాయని కొందరు పర్యటకులు కనుగొన్నారు. అక్కడ మంచు రైతులు మంచు తయారుచేయడం ప్రారంభించటంతో యూరేలో మంచు అధిరోహణ కల సాకారమైంది. అయితే కొంత మంది అధిరోహకులు మంచు గొడ్డళ్లతో పైప్ లైన్లను నరికి వేసి కొత్త జలపాతాలను సృష్టించినట్లు కథనాలు కూడా వచ్చాయి.

90వ దశకం మొదట్లో ఇక్కడ మంచు వ్యవసాయం ప్రారంభమైనప్పటికీ, 1997లో ఈ పార్క్ అధికారికంగా లాభాపేక్ష లేని సంస్థగా మారింది. ఈ సంవత్సరం, ఇది మూడు ప్రధాన మంచు అధిరోహణ కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వబోతోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి అథ్లెట్లను ఆకర్షించే విధంగా పోటీలు నిర్వహించనున్నారు. వీటితో పాటు ఇతర ఎత్తైన హిమాలయాల్లాంటి యాత్రలకు సిద్ధమవుతున్న అధిరోహకులు, శిక్షణ పొందడానికి కూడా ఇక్కడకు వచ్చే అవకాశం కల్పిస్తున్నారు.

కొన్ని వారాల తర్వాత కొంతమంది మంచు అధిరోహకుల గ్రూప్‌తో తిరిగి ఈ పార్క్‌కు వచ్చాను. 20 మంది కంటే ఎక్కువే ఉన్న మేం లోయలో ఎంతో ప్రశాంతంగా ఉండేచోట చిన్న గూడారాన్ని ఏర్పాటు చేసుకున్నాం.

మా ముందే 90 అడుగుల ఎత్తులోని గోడలపై లేత నీలం రంగులో మంచు మెరుస్తూ ఉంది.

ఇక్కడ "కాలీఫ్లవర్" అని పిలిచే పెద్ద ఉబ్బెత్తు మంచు ప్రాంతాలు ఉన్నాయి. మంచు గొడ్డళ్ల సాయంతో పర్యటకులు మంచు కొండలు ఎక్కుతున్నారు. షాన్డిలియర్స్ వంటి శిఖరాల నుండి కొత్తగా ఏర్పడిన మంచు గడ్డలు వేళాడుతున్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మంచు చెప్పుకోదగ్గ స్థాయిలో కనపడటం లేదు. పర్వతారోహకులకు మంచు శిఖరాలు ఎక్కడానికి మంచు గొడ్డళ్లు, క్రాంపన్స్ అనుమతిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, ఈ ఊరిలో పుష్ప, ఆచార్య సహా ఎన్నో సినిమాలు చిత్రీకరించారు

నేను వెచ్చని జాకెట్, బేల్ వేసుకొని మంచు కొండలు ఎక్కడానికి సిద్ధం అవుతున్నప్పుడు, పార్క్‌ నిర్వహకులు పార్క్ మెత్తం పెట్రోలింగ్ చేస్తూ కనిపించారు. పార్క్‌కు వస్తున్న అధిరోహకులకు సిబ్బంది స్వాగతం పలుకుతున్నారు. అన్ని సదుపాయాలు కల్పిస్తూ ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండేలా చూసుకుంటున్నారు.

అధిరోహకులు కొండలు ఎక్కుతున్నప్పుడు వారు ఎలాంటి భయన్ని, ఆనందన్ని పొందుతున్నారో, అదేవిధంగా ఎలాంటి భావోద్వేగాలకు గురి అవుతున్నారో చాలా చక్కగా ట్రెస్ బార్బాటెల్లీ వివరించారు. మీరు కూడా మంచు పర్వతాలు ఎక్కేటప్పుడు అలాంటి అనుభూతులను పొందుతారని చెప్పారు.

ఐస్ క్లైంబింగ్‌తోపాటు అక్కడి అందమైన ప్రకృతి సౌందర్యం గురించి సిబ్బంది తరుచుగా వివరిస్తున్నారు. ఇది కచ్చితంగా మంచి భావోద్వేగ అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ మంచు కొండలు ఎక్కిన మహిళల్లో ఒకరు మాట్లాడుతూ.. ఇలాంటి మంచుతో కూడిన ఎత్తైన గోడలను చీల్చుకుంటూ ఎక్కడం చాలా సంతోషంగా ఉందంటూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. తను ఇలాంటి మంచు కొండలు అధిరోహించగలనని ఎప్పుడూ అనుకోలేదని ఆమె అన్నారు.

ఎట్టకేలకు సూర్యుడు సుదూర ప్రాంతం నుంచి పచ్చని చెట్లను, పర్వతాలను చీల్చుకుంటూ మంచు కొండలను తాకి ఎంతో అందమైన రంగులను వెదజల్లుతున్నాడు. ఆ లోయలో ఆహ్లాదకరమైన చల్లటి గాలి వీచడం ప్రారంభమైంది.

రాత్రి భోజనం చేయడానికి మేం యూరే నగరానికి వెళ్లాం. నగరంలోని ప్రధాన రహదారి హైవే విక్టోరియన్ ఇటుక భవనాలతో అందంగా ఉంది. పర్వతా అధిరోహకులు తమ బూట్లు తీసుకొని రెస్టారెంట్లు వదిలి వెళ్లిపోతున్నారు.

వీడియో క్యాప్షన్, విదేశాలను తలదన్నే ఎన్నో టూరిస్ట్ స్పాట్‌లు విశాఖ జిల్లాలో.. చూశారా మీరు..

ఈ సీజన్‌లో ఇక్కడి స్థానిక వ్యాపారుల షాపులు మూసివేసి ఉన్నాయి. వీరు మరింత లాభదాయకమైన వేసవి నెలల కోసం వేచి చూస్తున్నారు. కొన్ని ప్రాంతాలు చాలా నిశ్శబ్దంగా ఉన్నాయి. చిన్న పిల్లలు ప్రధాన వీధులలో మంచుతో ఆడుకుంటున్నారు.

ఐస్ పార్క్ ప్రభావం స్కీ రిసార్ట్‌‌పై ఎక్కువగా ఉంటుంది. యూరే ఐస్ పార్క్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రెసిడెంట్ లోరా స్లావిట్స్‌కాతోనూ నేను మాట్లాడాను. ఆమె కుటుంబం 50 ఏళ్లుగా యూరేలో ఒక హోటల్ కూడా నడుపుతున్నారు.

స్లావిట్స్‌కా అధిరోహకురాలు కాదు. కానీ ఆమె ఐస్ పార్క్ బోర్డులో చేరారు. ఇక్కడ ఐస్ పార్క్ పోషిస్తున్న ముఖ్య పాత్రను తాను ముందే గ్రహించి బోర్డులో సభ్యురాలిగా చేరానని ఆమె తెలిపారు.

"ఐస్ రైతులు, ఈ ఐస్ పార్క్‌కు పర్యటకులను తీసుకువచ్చే సంస్థలు లేకపోతే.. ఈ రోజు ఇక్కడ ఐస్ పార్క్ ఉండేది కాదు. నిజానికి ఇప్పుడు ఈ ప్రాంతం ఇలా పర్యటకులతో సందడిగా ఉందటే దానికి కారణం వారే''అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)