ఉస్మానియా యూనివర్సిటీ: రాహుల్ గాంధీని రావద్దనడం కరెక్టేనా... విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండాలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వరికూటి రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాజకీయ కార్యకలాపాలకు యూనివర్సిటీలు వేదిక కాకూడదా? రాహుల్ గాంధీ విషయంలో ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఈ చర్చను మరొకసారి ముందుకు తీసుకొచ్చింది. యూనివర్సిటీల వ్యవహార శైలిని కూడా ఇది ప్రశ్నిస్తోంది.
రాజకీయ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకోవడం వల్లే రాహుల్ గాంధీని అనుమతించడం లేదని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డి. రవీందర్ చెబుతున్నారు.
"రాజకీయ కార్యక్రమాలను యూనివర్సిటీలో అనుమతించకూడదని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయించింది. ఆ విషయాన్నే అఫిడవిట్ ద్వారా కోర్టుకు తెలియజేశాం" అని ప్రొఫెసర్ డి. రవీందర్ బీబీసీతో అన్నారు.
కానీ, పోయిన ఏడాది నవంబరులో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరిగిన 'తెలంగాణ మాక్ అసెంబ్లీ' కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆయన రాజకీయ విమర్శలు కూడా చేశారు.
యూనివర్సిటీలో ప్రవేశించడానికి ఒక పక్షాన్ని అనుమతించడం, మరొక పక్షాన్ని నిరాకరించడం సరైన పద్ధతి కాదని ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు.
'అధికారంలో ఉన్న వారిని అనుమతించే యూనివర్సిటీలు ప్రతిపక్షాల విషయంలో పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయి. రాష్ట్ర, కేంద్ర మంత్రులు యూనివర్సిటీలకు వస్తుంటారు. విద్యార్థులతో మాట్లాడుతుంటారు. అక్కడ లేని రాజకీయం ప్రతిపక్షాల విషయంలో ఎందుకు?’’ అని హరగోపాల్ బీబీసీతో అన్నారు.
‘‘తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్ పార్టీ, విద్యార్థులను ఉపయోగించుకుంది కదా!’’ అని ఆయన గుర్తు చేశారు.
అయితే, "కోవిడ్ అనంతరం అకడమిక్స్‌ను పునరుద్ధరించే చర్యలు చేపడుతున్నాం. పైగా, ఇప్పుడు పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైనందున రాజకీయ కార్యక్రమాలను అనుమతించడం సరికాదని భావించాం" అని ఓయూ వీసీ రవిందర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండాలా?
ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పాల్గొనే కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడంపై వేసిన పిటిషన్ విచారించిన సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ యూనివర్సిటీలకు సూచించింది.
క్యాంపస్‌లో రాజకీయ సమావేశాలు, సదస్సులు, కార్యక్రమాలు నిషేధించేలా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోరింది. విద్యార్థులకు జ్ఞానాన్ని పంచే యూనివర్సిటీల్లోకి బయటి వారికి అనుమతి ఉండకూడదని తెలిపింది.
ఉద్యమాల పేరుతో విద్యార్థులు భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యూనివర్సిటీల విద్యార్థులు నిరసనలకు దిగినప్పుడు ఈ వాదన బలంగా ముందుకు వచ్చింది.
అనవసరమైన రాజకీయాలకు విద్యార్థులు దూరంగా ఉండాలంటూ ఆయా సందర్భాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. సైద్ధాంతిక పరమైన ఆలోచన ఉండటం మంచిదేగానీ, వివాదాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నది ఆయన అభిప్రాయం.

ఫొటో సోర్స్, Rahul Gandhi/Facebook
యూనివర్సిటీలు రాజకీయాలకు దూరంగా ఎందుకుండాలి?
భిన్న భావజాలాలకు, ఆలోచనలకు యూనివర్సిటీలు వేదికలుగా ఉండాలని కొందరు విద్యావేత్తలు చెబుతున్నారు. ఆలోచనల సంఘర్షణ ద్వారానే భవిష్యత్తు నాయకులు రూపుదిద్దుకుంటారనేది వారి నమ్మకం.
రెచ్చగొట్టే, హింసను ప్రేరేపించే రాజకీయాలకు యూనివర్సిటీలు వేదికలు కాకూడదు. కానీ ఆరోగ్యకర వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలను అనుమతించాలని కోరుతున్నారు. భిన్న భావజాలం, సిద్ధాంతాలు కలిగిన వారిని యూనివర్సిటీలు ఆహ్వానించాలని అప్పుడే విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు రూపుదిద్దుకుంటాయని వారు చెబుతున్నారు.
క్యాంపస్‌లో రాజకీయాలనేవి కూడా భావప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తాయని ప్రొఫెసర్ జి.హరగోపాల్ అంటున్నారు.
'రాజకీయం కానిది ఏముంది. స్వాత్రంత్య పోరాటం కూడా రాజకీయమే. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీల ప్రొఫెసర్లు కూడా పాల్గొన్నారు. చాలామంది రాష్ట్ర, కేంద్ర మంత్రులు ఒకనాడు విద్యార్థి నాయకులుగా ఉన్నవారే కదా. జై పాల్ రెడ్డి వంటి వారు అలాగే వచ్చారు. కాబట్టి రాజకీయాల ప్రభావం నుంచి యూనివర్సిటీలను దూరంగా పెట్టలేం. రాజకీయాలు వద్దు అంటూ ఆంక్షలు పెట్టేకంటే భిన్న భావజాలాలను చర్చించే స్వేచ్ఛా వాతావరణాన్ని యూనివర్సిటీలు కల్పించాలి' అని ఆయన అన్నారు.
భారత స్వాతంత్ర్య పోరాటం నుంచి నిన్న మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు అనేక పోరాటాలకు యూనివర్సిటీలు కేంద్రంగా ఉంటూ వచ్చాయి కాబట్టి విద్యార్థులను రాజకీయాలను వేరు చేసి చూడలేమనేది ప్రొఫెసర్ హరగోపాల్ మాట.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ కార్యక్రమాలపై యూనివర్సిటీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
రాజకీయ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి యూనివర్సిటీల్లో అసలు నిబంధనలు కానీ, మార్గదర్శకాలు కానీ ఏమీ లేవని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ బాల కిషన్ బీబీసీతో అన్నారు.
'యూనివర్సిటీలలో రాజకీయ కార్యకలాపాలు చేపట్టాలనిగానీ, వద్దనిగానీ మేం చెప్పం. కొందరు దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటూ ఉన్నారు. రాజకీయ భావాలకు, ఆలోచనలకు వేదికగా ఉండాలని మేం కూడా కోరుకుంటున్నాం. కానీ ఇటీవల కాలంలో ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ విద్యార్థులు చీలి పోతున్నారు. కుల, మత వివాదాలు కూడా పెరుగుతున్నాయి. ఇది యూనివర్సిటీలో అనారోగ్యకరమైన వాతావరణానికి దారి తీస్తోంది. అందువల్లే మతపరమైన, రాజకీయ పరమైన కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వకూడదని గత ఏడాది జులైలో వైస్ ఛాన్సలర్ నిర్ణయం తీసుకున్నారు' అని ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, osmania.ac.in
"రాజకీయ నాయకులు యూనివర్సిటీకి వచ్చి సమావేశాలు పెట్టొద్దని అంటున్నాం. కానీ, బయట పెట్టుకునే మీటింగులకు విద్యార్థులను వెళ్లొద్దని మేం అనడం లేదు కదా" అని ప్రొఫెసర్ బాలకిషన్ ప్రశ్నించారు.
అధికార పార్టీ అయినా ప్రతి పక్షాలైనా అందరినీ వైస్ ఛాన్సలర్ సమానంగా చూస్తున్నారని, ఎవరినీ యూనివర్సిటీలోకి అనుమతించడం లేదని ఆయన తెలిపారు. విద్యార్థులు వేయి పూలుగా వికసించి, వారిలో వేయి ఆలోచనలు సంఘర్షించాలని తాము కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- భీమడోలు పోలీస్ స్టేషన్లో నిందితుడు మృతి - సీఐ, ఎస్సై సస్పెన్షన్, అసలు ఏం జరిగింది
- హైదరాబాద్: 111 జీవో రద్దు ఎవరి కోసం... ఫామ్‌హౌస్‌ల స్థానంలో ఆకాశహర్మ్యాలు వస్తాయా?
- శ్రీలంక: సమైక్య నిరసనల వెనుక ఎందుకీ విభజన రేఖలు?
- టీవీ9 వర్సెస్ విష్వక్సేన్: సహనం కోల్పోయింది ఎవరు
- యాదగిరిగుట్టలో కుంగిన రోడ్డు, పాతబస్తీ వీధుల్లో పడవలు - భారీ వర్షాలకు ప్రజల ఇబ్బందులు
- ‘సిగ్గులేకుండా మా అమ్మ పాటను కాపీ చేశారు’ అంటున్న పాకిస్తాన్ గాయని
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













