టిస్ ఆందోళన: ‘ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకోవద్దా?’

ఫొటో సోర్స్, Naveen Kumar K/BBC
- రచయిత, బళ్ళా సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ - టిస్‌లో ఆందోళన వారం రోజులు దాటింది. ఫీజులు చెల్లించాలంటూ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు యాజమాన్యం నోటీసులు ఇవ్వడంతో మొదలైన గొడవ రోజురోజుకూ ముదురుతోంది.
మరోవైపు యూజీసీ నుంచి రావాల్సిన నిధులు, వేర్వేరు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదల కావాల్సిన స్కాలర్‌షిప్ బకాయిలు ఆగిపోవడమే సమస్యకు కారణమంటోంది యాజమాన్యం.
టిస్‌లో చదివే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఇస్తుంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం, యూజీసీలు టిస్‌కి కొన్ని నిధులు ఇస్తాయి. వాటివల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తక్కువ ఫీజుతో ఉన్నత విద్య చదివే అవకాశం దక్కుతుంది.
కానీ గత కొద్దికాలంగా టిస్‌కి ఆ సహాయం తగ్గుతూ వస్తోంది. దీంతో విద్యార్థులే ఆ భారం మోయాల్సి వస్తోంది.

ఫొటో సోర్స్, Naveen Kumar K/BBC
టిస్‌ను 1936లో ఏర్పాటు చేశారు. టాటాలు ఏర్పాటు చేసిన ఈ సంస్థ భారత ప్రభుత్వ సహకారంతో నడుస్తోంది. టిస్‌కు ముంబై, తుల్జాపూర్, హైదరాబాద్, గువహాటిలలో క్యాంపస్‌లు ఉన్నాయి. భారతదేశంలో సామాజిక శాస్త్రాల్లో ఉన్నత విద్య అందిస్తోన్న అతి కొద్ది సంస్థల్లో టిస్ ఒకటి.
2017-18 సంవత్సరంలో టిస్‌కు నిధులు తగ్గడంతో ఫీజులు కట్టాలని యాజమాన్యం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను కోరింది. దీంతో విద్యార్థులు రోడ్డెక్కారు. విద్యార్థులు ఇక్కడ చేరుతున్నప్పుడు వారికి స్కాలర్‌షిప్ వస్తుందన్న భరోసా ఉండేది. కానీ ఏడాది మధ్యలో ఫీజులు కట్టాలనడంతో పేద విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
యాజమాన్య వైఖరికి నిరసనగా టిస్ నాలుగు క్యాంపస్‌లలోనూ విద్యార్థులూ ఆందోళనలు చేపట్టారు. చివరకు ఫిబ్రవరి 27న జరిగిన చర్చల తరువాత, ఈ ఏడాది మాత్రం ఫీజుల సమస్య ఉండబోదని యాజమాన్యం హామీ ఇచ్చింది. దీంతో విద్యార్థులు ఆమరణ దీక్ష విరమించారు కానీ, ఆందోళన కొనసాగిస్తున్నారు.

ఫొటో సోర్స్, Shivangi Anand/BBC
నిధుల లేమి
ఈ ఆందోళనపై హైదరాబాద్ క్యాంపస్ స్టూడెంట్స్ ప్రొటెక్షన్ సెల్ చైర్మన్ మురళీకృష్ణతో మాట్లాడింది.
''టిస్‌లో చదివే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు ఇస్తుంటాయి. ఈ స్కాలర్‌షిప్‌లు సుమారు రూ. 12 వేల నుంచి రూ. 30 వేల వరకూ ఉంటాయి. వాస్తవానికి టిస్‌లో ఒక విద్యార్థికి ఏడాదికి సుమారు 90 వేల రూపాయల ఖర్చు అవుతుంది. స్కాలర్‌షిప్ పోగా మిగిలిన రూ. 70 వేల లోటును యాజమాన్యమే భరించేది. యూజీసీ ఇచ్చే మెయింటెనెన్స్ గ్రాంట్ ఇతరత్రా నిధుల నుంచి దానిని సర్దుబాటు చేసుకునే వాళ్లం. కానీ కొంతకాలంగా యూజీసీ గ్రాంట్ బాగా తగ్గిపోయింది. దానికి తోడు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్ బకాయిలూ రూ. 22 కోట్లు దాటేశాయి'' అని ఆయన వివరించారు.
‘‘ఓబీసీలకు 2015 నుంచి స్కాలర్‌షిప్ ఆపేశారు. అంతేకాదు 2015 నుంచీ ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు టిస్‌లో చదివే ఓబీసీలకే కాకుండా, ఎస్సీ, ఎస్టీలకు కూడా స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం ఆపేశాయి. ఇక మిగిలిన రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీలకు 2015 తరువాత నుంచి స్కాలర్‌షిప్‌లు నేరుగా విద్యార్థుల ఎకౌంట్లలో వేస్తున్నారు. దీంతో ఆ స్కాలర్‌షిప్‌లను మాకు ఇవ్వాలని విద్యార్థులను కోరాం. కొందరు ఇచ్చారు. కొందరు ఇవ్వలేదు. ఇంకొందరికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అసలు స్కాలర్‌షిప్‌లే రాలేదు’’ అని మురళీకృష్ణ పేర్కొన్నారు.
''2017-18 సంవత్సరం నుంచి హాస్టల్, డైనింగ్ బిల్లు విద్యార్థులే చెల్లించాలని 2017 మేలో ఆదేశాలు వచ్చాయి. అప్పటికి అడ్మిషన్ల ప్రక్రియ మధ్యలో ఉంది. దీంతో ఆ నిబంధన తమ బ్యాచ్‌కి వర్తించదని 2017లో చేరిన విద్యార్థులు కోరారు. వారి డిమాండ్ న్యాయబద్ధమైనదని గుర్తించి ఒప్పుకున్నాం. బయటి నుంచి ఫండ్స్ తెచ్చి విద్యార్థులకు అందివ్వాలనుకున్నాం. కానీ మా దగ్గర ఉన్న నిధులు 30 శాతం ఫీజులకు మాత్రమే సరిపోయాయి. మిగిలిన మొత్తాన్ని విద్యార్థులు స్కాలర్‌షిప్ నుంచి చెల్లించాలన్నాం'' అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Naveen Kumar K/BBC
హైదరాబాద్ క్యాంపస్ కష్టాలు
2011లో టిస్ హైదరాబాద్ క్యాంపస్ ఏర్పాటైంది. గచ్చిబౌలి, రాజేంద్రనగర్ - రెండు చోట్ల టిస్ నడుస్తోంది. వీటిల్లో దాదాపు 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సొంత క్యాంపస్ లేకపోవడంతో హాస్టళ్లలో సౌకర్యాలు, అమ్మాయిల భద్రత వంటి సమస్యలు విద్యార్థులను వేధిస్తున్నాయి.
ముంబైలో యాజమాన్యానికి, విద్యార్థి సంఘానికీ మధ్య జరిగిన చర్చల్లో హైదరాబాద్ క్యాంపస్ డిమాండ్లను యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపిస్తూ విద్యార్థులు ఫిబ్రవరి 27 నుంచి నిరవధిక దీక్షకు దిగారు. ప్రస్తుతం ఫీజుల ఆందోళనతో పాటు తమ క్యాంపస్ సమస్యలు తీర్చాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
దీంతో ముంబై నుంచి టిస్ ప్రస్తుత యాక్టింగ్ డైరెక్టర్ శాలిని భరత్ హైదరాబాద్ వచ్చి విద్యార్థులతో చర్చలు జరిపారు. వాటి ఫలితంగా దీక్ష విరమించిన విద్యార్థులు ఆందోళన మాత్రం కొనసాగిస్తున్నారు.

ఫొటో సోర్స్, Bibin Thomas
విద్యార్థుల ఆందోళనతో 2017-18 విద్యా సంవత్సరంలో చేరిన వారి ఫీజుల సమస్య తీరింది. కానీ తరువాత బ్యచ్‌ల వారు పూర్తి స్థాయి ఫీజులు చెల్లించాలి.
"ఉన్నత విద్య ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నాం. మేం మా ఒక్కరి ఫీజుల గురించే మాట్లాడడం లేదు. భవిష్యత్తు తరాల గురించి మాట్లాడుతున్నాం. 2015లో ఓబీసీలకు ఆర్థిక సహాయం నిలిపేశాక ముంబై క్యాంపస్‌లో చేరే ఓబీసీల సంఖ్య బాగా తగ్గిపోయింది. రేపు ఎస్సీ, ఎస్టీల విషయంలో కూడా ఇదే జరగవచ్చు. అలా కాకూడదనే మా పోరాటం’’ అని శివంగి ఆనంద్ అనే టిస్ విద్యార్థిని బీబీసీతో పేర్కొన్నారు.
‘‘ఇప్పుడు మా బ్యాచ్ ఫీజుల సమస్య తీరిపోయిందని ఆందోళన మానేస్తే భవిష్యత్తులో వచ్చే విద్యార్థుల పరిస్థితి ఏంటి?" అని ఆమె ప్రశ్నించారు.
"కేంద్ర ప్రభుత్వం, యూజీసీ సామాజిక శాస్త్రాలకు ఇచ్చే నిధులు తగ్గిస్తోంది. ఆ క్రమంలో టిస్ మొదటి బాధితురాలు. భారతదేశ సామాజిక సమస్యలకు పరిష్కారం చూపడంలో సామాజిక శాస్త్రాలు కీలక పాత్ర పోషిస్తాయి. టిస్‌లో చదివే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం సహకారం అందించాలి" అని మురళీకృష్ణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








