రాజ్యాంగం చెబుతున్నా IIMలు రిజర్వేషన్లు పాటించవా?

ఫొటో సోర్స్, IIM-A
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
భారత్ 69వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న వేళ దేశంలోని కొన్ని సంస్థలు ఇప్పటికీ రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను అలవోకగా విస్మరిస్తున్నాయి.
అణగారిన వర్గాలకు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగం చెబుతున్నా కొన్ని విద్యాసంస్థలు ఆ విధానాన్ని పాటించడం లేదు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) సంస్థలే అందుకు ఉదాహరణ.
దేశంలో విద్యావ్యవస్థకు సంబంధించి భారత మణిహారాల్లో ఒకటిగా వీటిని పిలుస్తుంటారు.
అయితే, పూర్వ విద్యార్థులే ఇప్పుడు ఐఐఎంల తీరుపై విసుగు చెంది సమస్యల పరిష్కారానికి హైకోర్టును ఆశ్రయించారు.

ఫొటో సోర్స్, IIM-B
''ఐఐఎంలలో అధ్యాపక సిబ్బంది నియామకంలో సామాజిక న్యాయం పాటించడం లేదు. ప్రజాస్వామ్య గణతంత్ర దేశ విధానాన్ని ఇది ప్రతిబింబించడం లేదు. నిజం చెప్పాలంటే ఇది నాటి వర్ణ వివక్షను పోలి ఉంది'' అని సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ, ఐఐఎం బెంగళూరుకు చెందిన దీపక్ మల్ఘాన్ బీబీసీకి చెప్పారు.
దేశంలోని అన్ని ఐఐఎంలలో నియామకాల విషయంలో సామాజిక న్యాయం ఎంతవరకు పాటిస్తున్నారనే అంశంపై దీపక్, అతని సహచరులు సిద్ధార్థ్ జోషీ ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించారు. వాళ్ల పరిశీలనలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
''ఐఐఎంలలో దాదాపు 97 శాతం మంది శాశ్వత సిబ్బంది ఒకే కులానికి చెందినవాళ్లు. దేశ జనాభాలో ఆ కులం వాళ్లు కేవలం 5 లేదా 6 శాతం మాత్రమే. స్వయం ప్రతిపత్తి సంస్థల పేరుతో స్వలాభం కోసం మనం ఇష్టారాజ్యంగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాం'' అని దీపక్ అన్నారు.
వీరి అధ్యయనం ప్రకారం దేశంలోని 13 ఐఐఎంలలోని 642 సిబ్బందిలో ఒకరు షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు, నలుగురు షెడ్యూల్డ్ కులస్తులు కాగా, వెనకబడిన తరగతులకు చెందిన వాళ్లు 17 మంది మాత్రమే ఉన్నారు.

ఫొటో సోర్స్, IIM-A
"ప్రత్యేకంగా అగ్ర వర్ణాల వారికే కేంద్రాలుగా ఐఐఎంలు తయారవుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా లింగ వైవిధ్యం మీదే దృష్టిసారిస్తున్నారు కానీ, సామాజిక వైవిధ్యం పాటించడం లేదు" అని అనిల్ వాగ్డే అన్నారు.
ఐఐఎం పూర్వ విద్యార్థుల సంఘం సభ్యుల్లో ఈయన ఒకరు. ఐఐఎం అహ్మదాబాద్‌లో పీహెచ్‌డీ ప్రవేశాల్లో రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయకపోవడంపై గుజరాత్ హైకోర్టులో అనిల్ పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ విధానం ప్రకటించకుండానే ఐఐఎం అహ్మదాబాద్ పీహెచ్‌డీ ప్రవేశాలకు ప్రకటన జారీ చేయడంతో వివాదం హైకోర్టుకెక్కింది.
''ఫెలోషిప్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌పీఎం)లో పీహెచ్‌డీ ప్రవేశాలకు ఐఐఎం అవకాశం కల్పిస్తోంది. కానీ, ఐఐఎంలో అధ్యాపకులుగా నియమితులు కావాలంటే కచ్చితంగా డాక్టరేట్ అయి ఉండాలి. ఎంబీఏ ప్రవేశాల్లో ఐఐఎంలు రిజర్వేషన్ విధానం పాటిస్తున్నాయి. కానీ, ఇక్కడ కూడా కొన్ని విషయాల్లో వివక్ష ఉంది'' అని పేరు బయట పెట్టడానికి ఇష్టపడని ఓ విద్యార్థి బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, IIM-I
''ఐఐఎంలలో మీరు ఎంబీఏలో చేరితే ప్రతిభావంతుల సీటును లాక్కొని ద్రోహం చేసినట్లుగా ఇక్కడి వారు చూస్తారు. అప్పుడు రెండు రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకటి ఎఫ్‌పీఎంలో ప్రవేశం పొందడం, మరోటి ఎంబీఏలో చేరినా మీకు సరైన సాన్నిహిత్యం దొరక్కపోవడం'' అని దీపక్ చెప్పారు.
''బెంగళూరు, ఇండోర్ ఐఐఎంలు మాత్రమే 2018-19 సంవత్సరానికిగాను ఎఫ్‌పీఎంలో ప్రవేశాలకు రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయడానికి అంగీకరించాయి. ఐఐఎం తిరుచ్చి కూడా వీటిని అసుసరించే అవకాశం ఉంది'' అని దీపక్ పేర్కొన్నారు.
గతంలో ఎఫ్‌పీఎం ప్రవేశాల్లో రిజర్వేషన్లు పాటించకపోవడంపై మాట్లాడటానికి ఐఐఎం బెంగళూరు డైరెక్టర్ ప్రొఫెసర్ జి. రఘురాం నిరాకరించారు.
''గతంలో రిజర్వేషన్లు ఎందుకు పాటించలేదు అనే విషయం నేను చెప్పలేను. కానీ, ఇప్పుడు చాలా ప్రవేశాల్లో రిజర్వేషన్ విధానాన్ని పాటించాలని మేం గ్రహించాం. కేంద్ర మానవ వనరుల శాఖ కూడా ఇదే విషయాన్ని గతంలో ఒకసారి ప్రస్తావించింది. వాళ్ల నుంచి అనుమతి వస్తే తప్పకుండా పాటిస్తాం. రిజర్వేషన్లు అమలు చేస్తూనే ఐఐటీలు ఎలా విజయవంతం అవుతున్నాయో కూడా మేం పరిశీలిస్తాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం'' అని ప్రొఫెసర్ రఘురాం చెప్పారు.
ఇవి కూడా చదవండి
- అసలీ కర్ణి సేన ఏమిటి? అదేం పని చేస్తుంది?
- గిరుల మీది గంగను ఊరికి తరలించిన గిరిజనులు!
- తిరుమలలో తన మతం గురించి సోనియా ఏం చెప్పారు?
- హెచ్సీయూ మళ్లీ రగులుతోందా?
- హైదరాబాద్లో జరగాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎందుకు వాయిదా పడింది?
- అక్కడ మహిళలు చెప్పులు తీసి చేతిలో పట్టుకోవాల్సిందే!
- ’టాటూ లేని వారిని అంటరానివారిగా చూస్తారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








