‘‘సారీ అమ్మ.. ఫీజు కట్టలేదని పరీక్ష రాయనివ్వలేదు’’.. 14 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య

ఫొటో సోర్స్, iStock
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''క్షమించు అమ్మ.. పరీక్ష రాయనివ్వలేదు'' అని సూసైడ్ నోట్ రాసి 14 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌లోని మల్కాజిగిరికి చెందిన సాయిదీప్తి (14) స్థానిక జ్యోతి మోడల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది.
"నన్ను పరీక్ష రాయనివ్వలేదు. నన్ను క్షమించు అమ్మ" అని సూసైడ్ నోట్ రాసిన సాయిదీప్తి ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయింది.
గురువారం జరిగిన ఈ ఘటనపై మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సాయి దీప్తి బాబాయి సురేశ్ ఈ ఘటనపై బీబీసీతో మాట్లాడుతూ, ''స్కూల్లో అందరి ముందు కులం పేరుతో మా అమ్మాయిని టీచర్ తిట్టారని తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేశాం. అయితే, ఇప్పటి వరకు బాధ్యులను అరెస్టు చేయలేదు'' అని అన్నారు.
‘టీచర్ కులం పేరుతో దూషించారని చెప్పింది‘
బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న సాయిదీప్తి అక్క సాయిలత బీబీసీతో మాట్లాడుతూ.. ''ఆ రోజు (గురువారం) నేను ఇంట్లోనే ఉన్నా. మౌను (సాయిదీప్తి) స్కూల్ నుంచి 10.30 గం లకే ఇంటికి వచ్చింది. ఏమైంది అని అడిగితే ఫీజు కట్టకపోవడంతో పరీక్ష రాయనివ్వలేదని చెప్పింది. మీ కులం వాళ్లు అందరూ ఇంతే, ఎప్పుడూ ఫీజు కట్టరు అని ఒక టీచర్ అన్నట్టుగా చెల్లి నాతో చెప్పి బాధపడింది.
అమ్మకు చెప్పనా అని అడిగితే, ఇప్పుడు వద్దు సూపర్ మార్కెట్‌లో పని ఒత్తిడిలో ఉంటుంది ఇంటికి వచ్చాక చెబుదాం అని అంది. కొద్దిసేపు యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ డ్యాన్స్ కూడా చేసింది. ఆ తర్వాత డబ్బులు తీసుకోవడానికి నేను బ్యాంకు వెళ్లి తిరిగి వచ్చేసరి ఉరి వేసుకుని కనిపించింది. స్కూల్ వార్షిక ఫీజు రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఉండొచ్చు'' అని చెప్పారు.
సాయి దీప్తి తండ్రి బాలకిషన్ ప్రైవేటు ఉద్యోగి కాగా, తల్లి సునీత సూపర్ మార్కెట్‌లో పని చేస్తున్నారు.
సాయిదీప్తి ఆత్మహత్యపై స్కూల్ ప్రిన్సిపల్‌ను ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.

ఫొటో సోర్స్, iStock
'అట్రాసిటీ కేసు నమోదు చేశాం'
సాయిదీప్తి సూసైడ్‌నోట్ ఆధారంగా జ్యోతి మోడల్ స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశామని మల్కాజ్‌గిరి ఇన్స్‌పెక్టర్ కొమురయ్య బీబీసీకి తెలిపారు.
''ఘటనపై తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. సూసైడ్‌కి సంబంధించిన సెక్షన్లతో పాటూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేశాం. బాధ్యులను అరెస్ట్ చేస్తాం'' అని తెలిపారు.
‘ప్రభుత్వమే బాధ్యత వహించాలి‘
హైదరాబాద్ పేరెంట్స్ స్కూల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కె. వెంకట్ సాయినాథ్ ఈ ఘటనపై బీబీసీతో మాట్లాడుతూ... ''ప్రైవేటు స్కూల్‌ను నియంత్రించడంలో ప్రభుత్వం ఏ విధంగా విఫలమవుతుందో చెప్పడానికి సాయిదీప్తి ఆత్మహత్య ఒక ఉదాహరణ.
కార్పొరేట్ స్కూల్లే కాదు చిన్నస్థాయి ప్రైవేటు స్కూల్లు కూడా ఫీజులు వసూలు చేయడంలో దారుణమైన పద్ధతులను అవలంభిస్తున్నాయి. సాయిదీప్తి స్కూల్లో ఆమెతో పాటు మరో ఏడుగురిని ఫీజు కట్టలేదని బయట నిలబెట్టారు. సాయి దీప్తిని కులం పేరుతో టీచర్ దూషించినట్లు ఆమె పేరెంట్స్ చెబుతున్నారు.
సరైన వసతులు లేకుండానే ప్రభుత్వం ఇలాంటి స్కూల్‌లకు అనుమతి ఇస్తోంది. స్కూల్ యాజమాన్యాల దోపిడీకి అడ్డుకట్ట పడకపోతే రైతు ఆత్మహత్యల మాదిరిగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది.
బేటీ పడావో అని ప్రభుత్వాలు అంటున్నాయి కానీ, విద్యార్థినులు కనీసం చదువుకునే వాతావరణం కూడా ఉండటం లేదు. సాయిదీప్తి మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి'' అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








