ఆంధ్రప్రదేశ్: భీమడోలు పోలీస్ స్టేషన్‌లో నిందితుడు మృతి - సీఐ, ఎస్సై సస్పెన్షన్, అసలు ఏం జరిగింది

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భీమడోలు పోలీస్ స్టేషన్‌లో ఓ నిందితుడు మరణించడం కలకలం రేపింది.
ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కస్టోడియల్ డెత్‌గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసులో భీమడోలు సీఐ సుబ్బారావు, ఎస్సై వీరభద్రరావులను సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు.

అసలు ఏం జరిగింది?
దెందులూరు మండలం పోతునూరు గ్రామానికి చెందిన మడిపల్లి అప్పారావు రజక వృత్తిలో ఉన్నారు. చేపల చెరువుల్లోనూ పనిచేస్తారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
38 ఏళ్ల అప్పారావు గతంలో కొన్ని కేసుల్లో అరెస్ట్ అయ్యారు. చెయిన్ స్నాచింగ్, చిల్లర దొంగతనాల కేసులో ఆయన మీద కేసులున్నాయి.
ఏప్రిల్ 29న భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చెయిన్ స్నాచింగ్ జరిగింది. నడిచి వెళుతున్న మహిళ మెడలోంచి బైకుపై వచ్చి గొలుసు దొంగిలించినట్టు మే 1న కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ నెం. 129/22 కింద నమోదైన ఈ కేసులో అనుమానితుడిగా అప్పారావుని అదుపులోకి తీసుకున్నారు.
మే 3న అరెస్ట్ చేసిన తరువాత విచారణలో ఆయన నేరం అంగీకరించినట్టు భీమడోలు పోలీసులు చెబుతున్నారు.
చోరీ చేసిన సొత్తు రికవరీ కోసం తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా మే 4న ఉదయం పోలీసు స్టేషన్ బాత్రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నట్టు ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ బీబీసీకి తెలిపారు.
"అప్పారావు ఉదయం స్నానం కోసం బాత్రూమ్‌కి వెళ్లారు. తర్వాత, స్నానం చేస్తున్న శబ్దం రాకపోవడంతో సెంట్రీ తలుపు తొలగించి లోపలికి వెళ్లారు. అక్కడ కొన ఊపిరితో ఉన్న అప్పారావుకు సీపీఆర్ చేశారు. ఆ తర్వాత ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై ఆర్డీవో దర్యాప్తు చేశారు. కస్టోడియల్ డెత్‌గా కేసు నమోదు చేశాం" అని ఎస్పీ వివరించారు.

"తలపై దెబ్బలు"
‘‘మావాడు కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని అనుకున్నాం. మేమంతా దూరంగా చేపల చెరువు దగ్గర ఉంటున్నాం. మా అబ్బాయి కనిపించడం లేదని కబురు అందింది. దెందులూరు పోలీస్ స్టేషన్‌కి ఫిర్యాదు చేద్దామని వెళ్లాం. కానీ అక్కడ లేడు. భీమడోలులో ఉన్నాడని పోలీసులు చెప్పారు. బుధవారం పొద్దున్న ఏలూరు ఆస్పత్రికి రమ్మని పోలీసులు కబురు పెడితే వెళ్లాం. తల మీద వెనుక వైపు దెబ్బలున్నాయి. కానీ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుకుంటున్నాం. అవమానంతో మాకు మొఖం చూపించలేక చనిపోయాడనుకుంటున్నాను’’ అని మడిపల్లి నాగేశ్వర రావు బీబీసీతో అన్నారు.మృతుడు అప్పారావు.. నాగేశ్వర రావుకు పెద్ద కుమారుడు.అప్పారావు మరణం తర్వాత నాగేశ్వరరావు భీమడోలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.
రజక సంఘం నాయకులతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు కూడా నిరసనలో పాల్గొన్నారు.
ఆ తర్వాత వారితో పోలీసులు చర్చలు జరిపారు. చర్చల తరువాత మా అనుమానాలన్నీ తీరిపోయాయని నాగేశ్వర రావు బీబీసీతో అన్నారు. తన కుమారుడిది ఆత్మహత్యగానే అనుకుంటున్నట్టు తెలిపారు.
విచారణ చేయాలి
అప్పారావు భార్య మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నాడు. పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నాడు. అప్పారావు మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. తమకు తోడు లేకుండా పోయిందని అప్పారావు భార్య రోదిస్తోంది.
‘‘అప్పారావు మృతి కేసు మీద సమగ్ర విచారణ జరగాలి. ఆర్డీవో దర్యాప్తు చేశారు. జ్యుడీషియల్ ఎంక్వయిరీ జరగాలి. కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తిని దొంగతనం కేసుల పేరుతో వేధించి చివరకు ప్రాణాలు పోవడానికి పోలీసులే కారణం. తలకు గాయాలున్నాయని కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. పంచనామా రిపోర్టులకు, పోలీసులు చెబుతున్న దానికి పొంతనలేదు. మూడు రోజుల నుంచి స్టేషన్లో నిర్బంధించడం అనుమానాలకు తావిస్తోంది. పూర్తి విచారణ అవసరం’’ అంటూ రజక జన సంఘం నాయకుడు చిలకలపల్లి కట్టయ్య డిమాండ్ చేశారు.కస్టోడియల్ డెత్ కి పోలీసులదే బాధ్యత అంటూ ఆయన ఆరోపించారు. బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

స్టేషన్లో నిందితులకు స్నానం చేసే అవకాశం ఉంటుందా
పోలీస్ స్టేషన్ లో నిందితుడు స్నానం చేస్తుండగా చనిపోయినట్టు పోలీసులు చెబుతున్న మాటలపై పౌరహక్కుల కార్యకర్తలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
"పోలీసు స్టేషన్లలో నిందితులకు స్నానం చేసే అవకాశం కూడా ఉంటుందా. సాధారణంగా తగిన టాయ్ లెట్ సదుపాయం కూడా ఉండదు. అలాంటిది స్నానం చేస్తుండగా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పడం నమ్మశక్యంగా లేదు. సీఐ, ఎస్సైని సస్ఫెండ్ చేయడంతో సరిపెట్టడం కాదు. సమగ్ర విచారణ జరగాలి. అనుమానితుల పేరుతో స్టేషన్లలో అనేక మందిని వేధిస్తున్న తీరుకి ఈ వ్యవహారం అద్దంపడుతోందిష" అంటూ పౌర హక్కుల సంఘం నాయకుడు పి సురేష్ అభిప్రాయపడ్డారు. భీమడోలు పోలీస్ స్టేషన్ లో జరిగినది లాకప్ డెత్ గా ఆయన అయన పేర్కొన్నారు. ఈ కేసుపై అన్ని కోణాల్లోనూ విచారణ జరగాలన్నారు.
ఇవి కూడా చదవండి:
- టీవీ9 వర్సెస్ విశ్వక్ సేన్: సహనం కోల్పోయింది ఎవరు
- భారత్‌లో ఉద్యోగాల్లో మహిళలు తగ్గిపోతున్నారా? కారణాలు ఏంటి?
- ఎలాన్ మస్క్: ట్విటర్ కొత్త యజమానిని ఇబ్బందుల పాలు చేసిన ఆరు సొంత ట్వీట్లు
- హీట్‌వేవ్: తెలంగాణకు ఎల్లో అలర్ట్.. వడదెబ్బ తగిలిందని ఎలా తెలుస్తుంది
- నాన్న ఆఫీస్‌కు వెళ్లాడని అమ్మ కారు తాళాలు తీసుకుని ఈ నాలుగేళ్ల పిల్లాడు ఏం చేశాడంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










