రాహుల్ గాంధీ: కాంగ్రెస్ అధ్యక్షుడు కాదు, మరి పార్టీ పంచాయితీలన్నీ ఆయన దగ్గరికే ఎందుకు?

ఫొటో సోర్స్, facebook/rahulgandhi
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన పార్టీ అధ్యక్షుడు కారు. కానీ, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏ గొడవ జరిగినా పరిష్కారం కోసం అంతా ఆయన దగ్గరికే వస్తున్నారు.
తాజా ఉదాహరణ ఛత్తీస్‌గఢ్. మంగళవారం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్, రాష్ట్ర ఆరోగ్యమంత్రి టి.ఎస్.సింగ్ దేవ్ రెండున్నర సంవత్సరాల ముఖ్యమంత్రి ఫార్ములా వివాదాన్ని రాహుల్ ఎదుట పరిష్కరించుకున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు రాహుల్‌కు తమ మనసులో మాటను చెప్పుకున్నాయి.
ఛత్తీస్‌గఢ్ లాగే పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య గొడవ నడుస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం, అమరీందర్ సింగ్‌ను పదవి నుంచి తొలగించాలంటూ 30మంది ఎమ్మెల్యేలు గ్రూపు కట్టారు.
ఇటీవల నవజ్యోత్ సింగ్ సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు. ఆయనతోపాటు మరో నలుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. దీంతో పంజాబ్ కాంగ్రెస్‌లో విభేదాలు సమసినట్లేనని అంతా భావించారు.
పంజాబ్ ఫార్ములా ప్రకారమే రాజస్థాన్‌లో సచిన్ పైలట్, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ల మధ్య వివాదాన్ని పరిష్కరిస్తారని అనుకున్నారు. కానీ, పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో గొడవలు సర్దుకున్నట్లే సర్దుకుని మళ్లీ మొదలయ్యాయి.
రాజస్థాన్‌లో సమస్య అలాగే కొనసాగుతుండగానే, ఇటు ఛత్తీస్‌గఢ్‌లో కూడా విభేదాలు బైటపడ్డాయి. ఒకపక్క జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ఫుల్‌టైమ్ అధ్యక్షుడు లేరు. ఈ పరిస్థితుల్లో నేతలంతా రాహుల్ గాంధీ దగ్గరకి ఎందుకు వెళుతున్నారు?

ఫొటో సోర్స్, PTI
'నిజమైన అధ్యక్షుడు'
సీనియర్ జర్నలిస్ట్ అపర్ణ ద్వివేది అభిప్రాయం ప్రకారం రాహుల్ గాంధీ ఫుల్‌టైమ్ అధ్యక్షుడు కానప్పటికీ ఆయన ఆ పాత్రను పోషిస్తున్నారు. మిగిలిన కాంగ్రెస్ నాయకులు కూడా ఆయన్ను ఆ పదవిలోనే చూస్తున్నారు.
స్వయంగా సోనియా గాంధీ కూడా రాహుల్‌ను నిజమైన అధ్యక్షుడిగానే పరిగణిస్తారు. రాహుల్ ఈ పాత్రను అధికారికంగా తీసుకోవాలనుకోవడం లేదు అంతే తేడా.
రాహుల్ అధ్యక్ష పదవిని తీసుకోకపోవడానికి కారణాలను అపర్ణ ద్వివేది వివరించారు. '' రాహుల్ గాంధీ ఇప్పటి వరకు పూర్తిస్థాయి విజయం సాధించలేదు. రెండోది, ఆయన కొత్త బృందంతో అధ్యక్షుడిగా మారదామనుకుంటున్నారు. కానీ ఆ అవకాశం కనిపించడం లేదు. అనుభవానికే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని సోనియా గాంధీ అనుకుంటున్నారు'' అన్నారు అపర్ణ.
సోనియా గాంధీ ఆరోగ్యం బాగా లేదని, ప్రియాంక ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాలలో బిజీగా ఉన్నారని, ఇప్పుడు రాహుల్ గాంధీ తప్ప ఈ అంతర్గత సమస్యలు పరిష్కరించడానికి పార్టీలో పెద్దలెవరూ లేరని కాంగ్రెస్ వార్తలను కవర్ చేసే పలువురు జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు.
''కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గానీ, గాంధీ కుటుంబాన్నిగానీ సవాల్ చేసే వ్యక్తి లేరు. అదే జరిగితే ఈ పాటికి కాంగ్రెస్‌కు గాంధీ కుటుంబం నుంచి కాకుండా వేరే వ్యక్తి అధ్యక్షుడు అయ్యేవారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అంతర్గత తగవులన్నీ ఆయన వద్దకే రావడం సహజం'' అని సీనియర్ జర్నలిస్ట్ సుస్మితా గుప్తా అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది సీనియర్ నాయకులు పార్టీ హైకమాండ్‌కు వ్యతిరేకంగా కూటమి కట్టినా వారు చివరకు సోనియా గాంధీకే లేఖ రాయాల్సి వచ్చింది. కాంగ్రెస్‌కు సమర్ధుడైన ఫుల్‌టైమ్ నాయకత్వాన్ని అందించాల్సిందిగా వారు ఆ లేఖలో కోరారు.
పార్టీ నాయకత్వంపై సీనియర్ నేతలు లేవనెత్తిన ప్రశ్నలు గాంధీ కుటుంబానికి పెనుసవాలేమీ కాదు. పైగా ఈ పరిణామం ఆ తిరుగుబాటుదారులకు నిరాశనే మిగిల్చిందని స్మితా గుప్తా అన్నారు. పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని స్మితా అభిప్రాయపడ్డారు.
''కాంగ్రెస్ పార్టీ నాయకులకు మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి, గాంధీ కుటుంబానికి విధేయంగా ఉండటం, రెండోది అధ్యక్ష పదవికి పోటీకి దిగటం, మూడోది పార్టీని విడిచి వెళ్లిపోవడం'' అన్నారు స్మితా.
పరిస్థితులను గమనిస్తే పార్టీ నేతలు చాలామంది మొదటి, మూడవ ఆప్షన్లనే ఎంచుకుంటున్నారు. మూడో మార్గంలో వెళుతున్నవారిలో జితిన్ ప్రసాద్, జ్యోతిరాదిత్య సింధియా, సుస్మితా దేవ్ వంటి వారు కనిపిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
అహ్మద్ పటేల్ లేని లోటు
కాంగ్రెస్ పార్టీలో అహ్మద్ పటేల్ లేకపోవడం వల్ల కూడా చాలా మార్పులు వచ్చాయి. పార్టీ సంస్థాగత నిర్మాణం మొత్తం కూలిపోయింది.
''తమకు న్యాయం చేయాలంటూ పార్టీలోని ప్రతి నాయకుడు రాహుల్, ప్రియాంక లేదా సోనియా ఆస్థానానికి రావాలని కోరుకుంటున్నారు. పార్టీలో సమస్యలు పరిష్కరించే హోదా, స్థాయిగల నాయకులు లేరు'' అని జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ అభిప్రాయ పడ్డారు.
"అహ్మద్ పటేల్ జీవించి ఉన్నప్పుడు సంస్థ ప్రధాన కార్యదర్శి హోదా భిన్నంగా ఉండేది. పార్టీలో ఎవరైనా ముందు అక్కడికి వెళ్లే వారు. ఆయన నిర్ణయాన్ని గౌరవించే వారు. ఆయన పరిష్కారానికి గాంధీ కుటుంబం ఆమోద ముద్ర వేసేది'' అన్నారు కిద్వాయ్.
కాంగ్రెస్‌లో అహ్మద్ పటేల్ స్థాయి నాయకులు మరొకరు లేరు. అహ్మద్ పటేల్ హోదాయే బీజేపీలో అరుణ్ జైట్లీకి ఉండేది. ఆయన చనిపోయిన తర్వాత బీజేపీ ఆ లోటును భర్తీ చేసుకుంది. కానీ, కాంగ్రెస్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
రాష్ట్ర ఇన్‌ఛార్జి వ్యవస్థలు పని చేయడం లేదు...
'' కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్‌లను ఎవరూ పట్టించుకోవడం లేదు. పంజాబ్ హరీశ్ రావత్, రాజస్థాన్‌లో అజయ్ మాకెన్, ఛత్తీస్‌గఢ్‌లో పి.ఎల్.పునియా పరిస్థితి ఎలా ఉందో చూడండి'' అన్నారు రషీద్ కిద్వాయ్.
''గతంలో రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లు, జనరల్ సెక్రటరీలు మ్యాచ్ రిఫరీ పాత్ర పోషించేవారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ వారు ముఖ్యమంత్రులు, రాష్ట్ర అధ్యక్షుల ఒత్తిడికి లోనయ్యారు. దీంతో ప్రతి సమస్య గాంధీల కోర్టులోకి వస్తోంది'' అన్నారు రషీద్

ఫొటో సోర్స్, AFP
‘ముఖ్యమంత్రుల స్థాయి పెరిగింది‘
కాంగ్రెస్‌కు మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు. జార్ఖండ్, తమిళనాడు, మహారాష్ట్రల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ మిత్రపక్షాల మధ్య పోరాటాలు వివిధ స్థాయిల్లో ఉన్నాయి.
ప్రభుత్వం లేనప్పటికీ పలు రాష్ట్రాలలో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో తరచూ విభేదాలు వస్తున్నాయి.
''రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ వ్యవహారాలు రాహుల్ కోర్టుకు చేరాయి. ఎందుకంటే ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా శక్తివంతులు. రాష్ట్రాలలో పార్టీని గెలిపించగలిగిన నాయకులు. పార్టీ కేంద్ర నాయకత్వానికి వనరుల కొరత ఉంది. ఆ వనరులతోపాటు, ఎన్నికల్లో విజయం కోసం ఆ ముఖ్యమంత్రుల మీద కేంద్ర నాయకత్వం ఆధారపడాల్సి వస్తోంది. దీని కారణంగా సీనియర్లు, జనరల్ సెక్రటరీలు ముఖ్యమంత్రుల మీద ఒత్తిడి చేయలేకపోతున్నారు'' అన్నారు రషీద్.
మరి ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎవరైనా ఉద్యమిస్తే వారు ఎవరికి కంప్లయింట్ చేయాలి? సహజంగా గాంధీ కుటుంబానికే చెప్పుకోవాలి. తన దగ్గరకు వచ్చి శరణు అన్న వారికి ఎలాంటి వరాలు లేకుండా పంపడం గాంధీ కుటుంబానికి అలవాటు లేదు.
అందువల్ల ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చివరకు గాంధీల ఆస్థానంలోనే దొరుకుతుంది.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు మరణశిక్షలు విధిస్తున్నారు - ఐరాస
- కరోనా వ్యాక్సీన్లను చేతికే ఎందుకేస్తారు?
- కాబుల్ నుంచి ఒక భారతీయ మహిళ ఎలా బయటపడింది? - ఏ నిమిషానికి ఏం జరిగింది?
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
- గూగుల్ సెర్చ్‌లో 'వివక్ష': రూ.136 కోట్లు జరిమానా
- 'దళితుల కోసం ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక పార్టీ'
- బడి చదువులోనే లింగవివక్ష నూరిపోస్తున్న పుస్తకాలు
- ఈ దళిత విద్యార్థి ఎందుకు గుజరాత్ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








