రఫేల్ విమానాలు: అవినీతి ఆరోపణలు మళ్లీ ఎందుకు వినిపిస్తున్నాయి... తెర వెనుక ఏం జరిగింది?

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP VIA GETTY IMAGES
దాదాపు 60,000 కోట్ల రూపాయల విలువైన రఫేల్ ఒప్పందంపై మరోసారి వివాదం మొదలైంది. ఓ భారతీయ మధ్యవర్తికి రఫేల్ తయారీ సంస్థ దసో 10 లక్షల యూరోలు ( సుమారు రూ. 8.62 కోట్లు) ఇచ్చిందని, ఈ డబ్బు ఒప్పందంలో భాగం కాదంటూ 'మీడియా పార్ట్' అనే ఫ్రెంచ్ వెబ్‌సైట్ సంచలన వార్తను ప్రచురించింది.
రక్షణ ఒప్పందాల విషయంలో దేశ భద్రతను ఫణంగా పెట్టారంటూ ఈ కథనంపై కాంగ్రెస్ స్పందించగా, ఇవన్నీ ఆధారం లేని కథనాలని అధికార పార్టీ స్పష్టం చేసింది.
'రఫేల్ పేపర్స్: ఎ మ్యాటర్ ఆఫ్ స్టేటస్ బరీడ్' అనే శీర్షికతో మీడియా పార్ట్ వెబ్‌సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. " ఈ వివాదాస్పద ఒప్పందంలో దసో ఓ మధ్యవర్తికి 10 లక్షల యూరోలు చెల్లించింది. అతని మీద ఇప్పటికే మరో కుంభకోణం(అగస్టా హెలీకాప్టర్ స్కామ్) లో భారతదేశంలో దర్యాప్తు జరుగుతోంది." అని వెల్లడించింది.
ప్రత్యేకంగా జరిగిన ఈ చెల్లింపు వ్యవహారం ఫ్రాన్స్ దేశపు యాంటీ కరప్షన్ బ్యూరో నిర్వహించే ఆడిట్ సందర్భంగా బైటపడిందని, డబ్బు చెల్లింపు వ్యవహారాన్ని అప్పట్లో డాసో సంస్థ ప్రభుత్వానికి వెల్లడించలేదని బ్యూరో గుర్తించినట్లు 'మీడియా పార్ట్' కథనం పేర్కొంది. ఒక రకంగా ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని దాచిందని ఆ కథనం వెల్లడించింది.
అయితే తాము రఫేల్ ప్లేన్‌లకు 50 మోడళ్లను తయారు చేసేందుకు ఈ మొత్తాన్ని మధ్యవర్తి సంస్థకు ఇచ్చామని దసో వెల్లడించినట్లు ఈ కథనం పేర్కొంది.
ఒక్కో మోడల్ కోసం 20,000 యూరోలను ఆ మధ్యవర్తికి చెల్లించినట్లు డాసో కంపెనీ వెల్లడించింది. అయితే ఈ ధరను ఎలా నిర్ణయించారని యాంటీ కరప్షన్ బ్యూరో ప్రశ్నించింది.

ఫొటో సోర్స్, AFP
స్వతంత్ర దర్యాప్తుకు డిమాండ్
'మీడియా పార్ట్' ప్రచురించిన కథనంపై సోమవారం కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.
"దేశంలో అతిపెద్ద రక్షణ ఒప్పందంలో అవినీతి వ్యవహారాలు మరోసారి బైటికి వచ్చాయి. రాహుల్ గాంధీ గతంలోనే ఈ కొనుగోళ్లపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడది నిజమైంది" అని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా అన్నారు.
అయితే అధికార భారతీయ జనతా పార్టీ ఈ వార్తను ఖండించింది. ఈ నివేదికను నిరాధారమైందని న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

ఫొటో సోర్స్, AFP
రఫేల్ వివాదం ఏంటి?
రెండేళ్ల కిందట రఫేల్ విమానాల వ్యవహారం భారతదేశంలో తీవ్ర కలకలం రేపింది. మోదీ ప్రభుత్వానికి ఇది అతిపెద్ద సంక్షోభంగా చాలామంది భావించారు.
2018లో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇవ్వడంతో ఈ వివాదం సద్దుమణిగింది.
మళ్లీ ఏడాది తర్వాత ప్రభుత్వానికి ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్.కె.కౌల్, కె.ఎం. జోసెఫ్‌లు సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ముగ్గురు సభ్యులు.
పదవీ విరమణ చేసిన కొద్ది నెలల తర్వాత రంజన్ గొగోయ్ రాజ్యసభ సభ్యుడు అయ్యారు.
ఫ్రెంచ్ డిఫెన్స్ గ్రూప్ దసో నుంచి 36 రఫేల్ జెట్ ఫైటర్లను కొనుగోలు చేయడానికి 2016లో భారత్, ఫ్రాన్స్‌ల మధ్య 7.8 బిలియన్ యూరోల ఒప్పందం కుదిరింది. అయితే దీనిపై అనేక వివాదాలు నడిచాయి.
126 విమానాలను కొనడానికి ఒప్పందమని చెప్పి తర్వాత దాన్ని 36 విమానాలకు ఎందుకు మార్చారు అన్నది తొలి వివాదం.
రెండోది దాని ధర. దసో ఏవియేషన్ వార్షిక రిపోర్ట్ 2016లో పేర్కొన్న వివరాల ప్రకారం, 2016 డిసెంబర్ 31 వరకు రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన 20,03,23,000 యూరోల పాత ఆర్డర్లుండగా, 2015 డిసెంబర్ 31 నాటికి 14,01,75,000 యూరోల ఆర్డర్లే ఉన్నాయి.
2016లో భారత్‌తో 36 రఫెల్ విమానాల కొనుగోళ్ల ఒప్పందం కుదిరిన తర్వాత ఈ వృద్ధి కనిపించిందని దసో వెల్లడించింది.
ఇక మూడో వివాదం పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సంస్థ గురించి. రిలయన్స్ డిఫెన్స్ ప్రొఫైల్, సంస్థ యోగ్యతలపై చాలా సందేహాలు వినిపించాయి.
సరిగ్గా అదే సమయంలో, రఫేల్ ఒప్పందానికి అనిల్ అంబానీ సంస్థను ఆఫ్‌సెట్ భాగస్వామిగా భారత్ తమపై రుద్దిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలెండ్ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది.
ఇప్పుడు ఫ్రెంచ్ మీడియా సంస్థ లేవనెత్తిన సందేహాలు భారత్‌లో మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎవరిని సంప్రదించారు
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








